ఇస్లామిక్ స్టేట్ వ్యవస్ధాపకుడు ఎవరు? అమెరికా ఇన్నాళ్లూ చెప్పింది ఇరాకీ సున్నీ నేత అబూ ముసబ్ ఆల్-జర్కావి అని. ఐఎస్ నెలకొల్పిన ఇస్లామిక్ కాలిఫేట్ కు అబూ బకర్ ఆల్-బాగ్దాది అని ఒబామా ప్రభుత్వం, అమెరికన్ మీడియా చెవినిల్లు కట్టుకుని మరీ చెప్పాయి.
ఐఎస్ వ్యవస్ధాపకత్వం లోకి వెళ్ళే ముందు 9/11 దాడుల గురించి కొన్ని అంశాలు చెప్పుకోవాలి.
9/11 దాడులు జరిగినప్పుడు కొన్ని గంటల లోపే ఆ దాడులు చేసింది ఆల్-ఖైదా అనీ, చేయించింది ఒసామా బిన్-లాడెన్ అనీ అమెరికా, ఐరోపా పత్రికలు టాం టాం వేసి చెప్పాయి. “దాడి చేయించింది నేను కాదు; కానీ నేనే చేయించి ఉంటే సంతోషించేవాడ్ని” అని లాడెన్ చెప్పిన మాటల్ని ప్రచురించిన పశ్చిమ పత్రిక లేదు.
9/11 దాడులకు లాడెన్ ను బాధ్యుడిగా అమెరికా ప్రకటించిన తర్వాత రోజుల్లో బిన్ లాడెన్ ను పాకిస్తాన్ పత్రిక ఉమ్మత్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో దాడులకు తాను బాధ్యుడిని కాదని చెబుతూ ఎవరు బాధ్యులై ఉండవచ్చో కూడా లాడెన్ చెప్పాడు. ఇలాగ…
“నేను గానీ, మా సంస్ధ ఆల్-ఖైదా గానీ దాడులలో పాత్ర వహించలేదు. అమెరికాలోనే దాడికి బాధ్యులు ఉన్నారని అమెరికా ప్రభుత్వ సంస్ధలే కనుగొన్నాయి.
“దాడికి పాల్పడ్డవారు ఎవరైనా కావచ్చు, అమెరికా వ్యవస్ధలో భాగంగా ఉంటూనే దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలనుకున్నవారు కావచ్చు; లేదా ఈ శతాబ్దాన్ని ఇస్లాం, క్రైస్తవం మతాల యుద్ధ శతాబ్దంగా మార్చాలని భావించినవారు కావచ్చు.”
అమెరికా గూఢచారులు సాక్షాలు సంపాదించారని ఎత్తి చూపినపుడు,
“ఈ ప్రశ్న ఆ గూఢచార సంస్ధలనే అడగండి. యేటా బిలియన్ల కొద్ది డాలర్ల సొమ్ము వాళ్ళకు ఇస్తున్నారు గదా!
“మేము అమెరికా వ్యవస్ధకు వ్యతిరేకం. కానీ అమెరికన్లకు వ్యతిరేకం కాదు. అమాయక ప్రజలను, పురుషులను, స్త్రీలను, పిల్లలను.. చివరికి యుద్ధంలో ఐనా సరే చంపడానికి ఇస్లాం అనుమతించదు.”
ఇవే కాదు. అమెరికా గూఢచార పరిశోధనా సంస్ధలు, బ్రిటిష్ గూఢచార పరిశోధనా సంస్ధలు కూడా వివిధ సందర్భాలలో “9/11 దాడులకు బిన్ లాడేన్ బాధ్యుడు అని చెప్పేందుకు తగిన సాక్షాలు లేవు” అని అంగీకరించాయి. అయితే ఆ అంగీకారం ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లపై దురాక్రమణ దాడులకు తెగబడ్డాక మాత్రమే జరిగింది.
అమెరికా, బ్రిటన్ లు తమ వద్ద ఉన్నాయని చెబుతున్న సాక్షాలు మహా అయితే పరిస్ధితుల సాక్షాలు మాత్రమే. అవేవీ గట్టి సాక్షాలు కావు అని బిబిసి వార్తా సంస్ధ అక్టోబర్ 2001 నెలలోనే (ఆఫ్ఘన్ పై దాడికి మూడు రోజులు ముందే) చెప్పడం గమనించవలసిన విషయం.
ఎఫ్‌బిఐ వెబ్ సైట్ లో ‘మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్స్’ పేజీ ఒకటి ఉంటుంది. అందులో బిన్ లాడేన్ పేజీ కూడా ఉండేది. కానీ ఆయన ఎందుకు మోస్ట్ వాంటెడ్ అన్న నేరాల జాబితాలో 9/11 దాడులు పొందుపరచలేదు. “ఎందుకు పొందుపరచలేదు?” అని అడిగితే (2006లో) ఎఫ్‌బిఐ పబ్లిసిటీ చీఫ్ “ఎందుకంటే 9/11 దాడులతో బిన్ లాడెన్ కు సంబంధం ఉందని చెప్పే ఎలాంటి సాక్షమూ మా వద్ద లేదు కాబట్టి” అని చెప్పాడు.
*********
ఇప్పుడు ఐఎస్ విషయానికి వద్దాం.
డొనాల్డ్ ట్రంప్ పేరు వినే ఉంటారు కదా?! ఈ బ్లాగ్ లోనే ఆయన గురించి కొంత చెప్పుకున్నాం. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్షుడిగా ఆయన పోటీ చేస్తున్నాడు.
విచిత్రం ఏమిటంటే రిపబ్లికన్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు -వారిలో హేమా హేమీలు ఉన్నారు; సెనేటర్లు, హౌస్ సభ్యులు, సిఐఏ ఎఫ్‌బిఐ లాంటి సంస్ధల మాజీ అధిపతులు, మాజీ సైన్యాధిపతులు- డొనాల్డ్ ట్రంప్ ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు.
ట్రంప్ అధ్యక్ష పదవికి పనికి రాడనీ, వదరుబోతు అనీ, నాలెడ్జ్ లేదనీ, అంత స్ధాయి లేదనీ, దేశాన్ని యేలే సామర్ధ్యం లేదని… ఇంకా అనేక క్వాలిటీలు లేవనీ, ఉన్నాయనీ ఆరోపిస్తూ పత్రికల్లో, ఛానెళ్లలో దూషిస్తున్నారు. అమెరికన్ కార్పొరేట్ మీడీయా సైతం దాదాపు అందరూ ట్రంప్ పనికిరాడని తేల్చేస్తున్నారు.
వీళ్ళంతా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ సిరియా, లిబియా దేశాలతో పాటు మధ్య ప్రాచ్యం లోని ఇతర అరబ్, ముస్లిం దేశాలపై దాడులు, యుద్ధాలు నడిపించడంలో భాగస్వామ్యం వహించినవారే. అలాంటి వారు ‘ఇరాక్ నుండి సైనికుల్ని వెనక్కి రప్పిస్తాను” అని చెబుతున్న ట్రంప్ కి ఎందుకు మద్దతు ఇస్తారు?
మరో విశేషం ఏమిటంటే రిపబ్లికన్ పార్టీకి చెందిన అనేక నాయకులు, అధికారులు కూడా ట్రంప్ పై ద్వేషం ప్రకటిస్తూ హిల్లరీ క్లింటన్ కే మా వోటు అని ప్రకటించడం. ఇంతమంది బడా సంపన్నులు, వాల్ స్ట్రీట్ పోషకులు ట్రంప్ ని ద్వేషిస్తున్నారు అంటే సామాన్య జనానికి ఉపయోగపడే విషయం ఏదో ఒకటి ఆయనలో ఉన్నట్లే లెక్క.
అట్లాంటి డొనాల్డ్ ట్రంప్ “ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS) ని స్ధాపించింది బారక్ ఒబామాయే. క్రుక్డ్ హిల్లరీ క్లింటన్ వాస్తవానికి ఈ గ్రూపుకి సహ వ్యవస్ధాపకురాలు” అని స్పష్టం చేశాడు.
ఇసిస్ పై బాంబులు వేస్తున్నానని ఒబామా చెబుతున్నదంతా అబద్ధమే అని కూడా ట్రంప్ వివిధ సందర్భాల్లో స్పష్టం చేశాడు. “జార్జి.డబల్యు. బుష్ కాలం నుండీ పశ్చిమాసియా (మధ్య ప్రాచ్యం) లో అమెరికా అనుసరిస్తున్న విధానాల వల్లే అక్కడ మంటలు రగులుతున్నాయి. వీళ్ళ చర్యల వల్ల ఇరాక్ అధికార వ్యవస్ధలో ఖాళీ ఏర్పడింది. ఫలితంగా అస్ధిరత ప్రబలింది. అది కాస్తా ఇసిస్ కు తోడ్పడింది” అని ట్రంప్ ప్రకటించాడు.
ఎంత రాజకీయ పార్టీల మధ్య తేడాలు ఉన్నప్పటికీ ఏకంగా అధ్యక్షుడే ఒక టెర్రరిస్టు సంస్ధను స్ధాపించినట్లుగా ఎవరూ అంత త్వరపడి ఆరోపణ చెయ్యరు. కుక్కని చంపడానికి ‘పిచ్చి కుక్క’ అని ముద్ర వేసినట్లుగా ట్రంప్ చెబుతున్న వాస్తవాలని జనం నమ్మకుండా ఉండడానికి ట్రంప్ ని ‘అవివేకి’ అనీ ‘తెలివి హీనుడు’ అనీ, ఇంకా అనేక రకాలుగా మీడియా, రాజకీయ నేతలు నిందిస్తున్నారు.
well said