“అహో! మొదట ఈ గందరగోళమునందేల ప్రవేశించవలే?! ప్రవేశించితిపో…!”
*********
ఇంతకీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నోరు తెరవడం కూడా మహా భాగ్యమే అన్నమాట!
దేశంలో చెలరేగుతున్న ఆందోళనలకు, మండుతున్న మంటలకు ప్రధాన మంత్రి స్పందన ‘ప్రధాని కూడా స్పందించారు’ అని చెప్పుకోవడానికా లేక ఆ స్పందన కార్యరూపం లోకి దాల్చుతుంది అని జనం నమ్మడానికా?
“ప్రధాని స్పందించారు. ఇంకేం కావాలి? స్పందనపై గొడవ చేయడం ఎందుకు?” అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ప్రశ్నిస్తుంటే ఈ అనుమానం కలుగుతోంది?
“ప్రధాని ఎందుకు నోరు విప్పరు?” అంటూ ప్రతిపక్షాలు, దళితులు, హిందూత్వ గూండాయిజం బాధితులు, గోరక్షణ ముఠాల అరాచకాల బాధితులు, పత్రికలు, ఛానెళ్లు రెండు సంవత్సరాల నుండి అడుగుతుంటే చివరికి మొన్నటికి గావాల, ప్రధాన మంత్రిగారు నోరు విప్పారు.
“కావాలంటే నన్ను షూట్ చెయ్యండి, నా దళిత సోదరులను ఎందుకు హింసిస్తారు?” అని ప్రధాన మంత్రిగారు నాటకీయంగా, అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. అక్కడికి మోడి గారి ప్రమేయం ఏమీ లేకుండానే ఇన్నాళ్లూ హిందూత్వ అరాచకాలు సాగిపోతున్నట్లు, ప్రధాని మోడి నిస్సహాయులై మిగిలి ఉన్నట్లు?!
కాశ్మీరు మొదలుకొని, దళితుల నుండి ఆవు దాకా మోడి నేతృత్వంలోని హిందూత్వ పరివారం విచ్ఛిన్నకర భావోద్వేగాలు రెచ్చగొట్టకుండానే దాడులు, హత్యలు, హింసలు, గూండాయిజాలు జరిగిపోయాయా? బిజెపి ఏలుబడిలోని రాష్ట్ర ప్రభుత్వాలు ఆవుని ముట్టుకోవడమే నేరంగా మార్చివేస్తూ చట్టాలు చేయకుండానే ‘గోరక్షణ ముసుగులోని సంఘ వ్యతిరేక శక్తులకు’ కొమ్ములు వచ్చేశాయా? అసలు ఈ రెండేళ్ల మోడి పాలనలో ఆవు పేరు మీద దళితుల మీద, ముస్లింల మీద జరిగినన్ని దాడులు ఎప్పుడన్నా జరిగాయా?
రోహిత్ ని ‘టెర్రరిస్టు’ గా, ‘జాతీయ వ్యతిరేకి’ గా, మహిషాసురుడిని పూజించే అసురులను (దళితులు, గిరిజనులను) ‘భ్రష్ట మనస్కులు’ గానూ సాక్షాత్తూ పార్లమెంటులోనే ఛీత్కరించినందుకు మంత్రి స్మృతి ఇరానీకి “సత్యమేవ జయతే” అంటూ మద్దతు పలికింది ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కాదా?
చివరికి ఒకటీ రెండూ స్ధానాల ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ముస్లిం బిజెపి ఆస్ధాన హిందూ సుప్రిమాసిస్టులు విద్వేషాన్ని విరజిమ్ముతూ, దళితుల ఆహార అలవాట్లను ఛీత్కరిస్తూ ప్రకటనలు, ప్రసంగాలు, హెచ్చరికలు జారీ చేసిన ఫలితంగానే దేశంలో ముస్లిం వ్యతిరేక, దళిత వ్యతిరేక వాతావరణం మిన్నుముట్టిన సంగతి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారికి తెలియనే తెలియదా?
మహమ్మద్ అఖ్లక్ ఇంటి లోపల ఉన్నది గొర్రె మాంసం అని తేల్చినా, ఇంటి బయట సో-కాల్డ్ గో రక్షక గుంపు తెచ్చి పడేసిన ఆవు మాంసానికి అఖ్లక్ కుటుంబాన్ని బాధ్యులుగా చేస్తూ యు.పి పోలీసుల చేత వారిపైనే అత్యంత ఘోరంగా తిరిగి ఎదురు కేసులు నమోదు చేయించారే? ఆ కేసు సంగతి ప్రధాని ఎందుకు ఎత్తరు? అఖ్లక్ కుటుంబంపై మోపిన తప్పుడు కేసును యు.పి ఎన్నికల్లో వాడబోరన్న హామీ ప్రధాని ఇవ్వగలరా?
మోడి చెప్పినట్లుగా ‘గో రక్షక ముసుగులో చేరిన సంఘ వ్యతిరేక శక్తులు, నేరగాళ్ళ’కూ ఆశ్రయం ఇస్తున్నదే హిందూత్వ. ఆ హిందూత్వ మోడికి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చే పరికరం. పబ్ లపైన దాడులు చేయకుండా, దళితులపై గో రక్షక నేరగాళ్ల దాడులు జరగకుండా, గుజరాత్ – ముజఫర్ నగర్ – ఢిల్లీ – వాయవ్య యు.పి లలో హిందూత్వ ప్రేరేపణతో మత మారణకాండలు జరగకుండా ఈ రోజు ప్రధానమంత్రి పీఠంపై నరేంద్ర మోడి కూర్చొని ఉండేవారే కాదు.
స్వార్ధపర ఎన్నికల ప్రయోజనాల కోసం ముస్లిం వ్యతిరేక, దళిత వ్యతిరేక, సెక్యులర్ వ్యతిరేక, గిరిజన వ్యతిరేక భావోద్వేగాలు రెచ్చగొట్టినందునే మోడి/బిజెపి/హిందూత్వ అధికారం చేపట్టింది. గుజరాత్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో మళ్లీ అదే అధికారం కోసమే, ఓటమి భయంతో తప్పనిసరై నరేంద్ర మోడి రెండేళ్ల తర్వాత “80 శాతం గో రోక్షక ముఠాలు నేరస్ధ గ్యాంగులు, సంఘ వ్యతిరేక శక్తులు” అని ప్రకటించారు తప్ప ఆయన ప్రకటనలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు.
80 శాతం కాదు గో రక్షక ముఠాల్లో 90 శాతం క్రిమినల్ గ్యాంగులనీ, సంఘ వ్యతిరేక శక్తులనీ కాస్త సవ్యంగా ఆలోచించే జనానికి ఎప్పుడో తెలుసు, మోడికి ఇప్పుడు తెలిసి వచ్చిందెమో గాని! ఆ మిగిలిన 10 శాతం కూడా ఎన్నికల ప్రయోజనం కోసం హిందూత్వ పోషణలో ఉనికిని కొనసాగిస్తున్న ముఠాలే తప్ప వారేమీ పులుగడిగిన ముత్యాలు కాదు!
అసలు జంతు హింస పైనా, జంతు సంరక్షణ పైనా నిజాయితీగా ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా జంతువుల నుండి ఆవును ఒక్కదాన్నే వేరు చేసి ప్రత్యేకంగా చూడరు. ఆవును మాత్రమే పూజ్యనీయంగా ప్రకటించి గేదెల్ని ‘బద్ధక జీవులు’గా ‘రక్షణ అవసరం లేని’ జీవులుగా కోర్టుల్లో వాదించరు. (ఆఫ్ కోర్స్, ఆవు మూత్రాన్ని తాగడం, నెత్తిమీద జల్లుకోవడం వారి ఇష్టం!) బహిరంగంగా ‘గో రక్షక సంఘాలు’ స్ధాపించి తెర వెనుక ఆవు మాంసం రవాణా చేస్తున్న ట్రక్కుల నుండి ఒక్కింటికి ౨౦,౦౦౦ చొ.న మామూళ్లు వసూలు చేయరు. (ఇండియా టుడే ఛానెల్ స్టింగ్ ఆపరేషన్)
గో రక్షణ పేరుతో దళితుల పైన దాడులు చేస్తున్న సంఘాల్లో 80 శాతం క్రిమినల్ ముఠాలుగా ప్రధాన మంత్రి ప్రకటించి మూడు రోజులైనా ఇంతవరకూ ఒక్క గో రక్షణ సంఘం కూడా ఎందుకు మూత పడలేదు? ఎందుకు పోలీసు విచారణ జరగడం లేదు? కేసులు ఎందుకు నమోదు కావడం లేదు? రాష్ట్ర ప్రభుత్వాలకు నామ మాత్ర డొజియర్లు పంపి చేతులు దులుపుకుంటే ఈ రెండేళ్లలో జరిగిన నేరాలకు బాధ్యత తీరిపోయినట్లేనా?
“ప్రతి గ్రామంలో, ప్రతి తాలూకాలో, జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా అందుకు ప్రధాన మంత్రిదే బాధ్యత అనడం సరికాదు. అలాగయితే స్ధానిక సంస్ధల అధికారాలు ఏం కావాలి?” అని మోడి అమాయకంగా ప్రశ్నిస్తున్నారు.
అయితే జిడిపి ఏ కాస్త పెరిగినా అది మోడి ఘనతే అనడం ఎంత వరకు సబబు? బిజెపిలో అనేకానేక నాయకులు -గల్లీ నుండి ఢిల్లీ వరకూ- బిజెపి విజయం కోసం కృషి చేస్తే అది మోడి ఘనతగా మాత్రమే ఎందుకు చాటుకోవడం? ఎఫ్.డి.ఐలు రావటం అటుంచి, ఎఫ్.డి.ఐ హామీలు లభించినా దానిని మోడి ఘనతగా చెప్పడం ఎందుకు? పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగినా మోడి ఘనతగా చాటుకోవడం ఎందుకు?
ఏ చిన్న సానుకూల పరిణామం జరిగినా దాన్ని మోడికి అంటగట్టడం, ఎంత పెద్ద ఘోరం జరిగినా మోడిని బాధ్యత నుండి తప్పించడం ఎంతవరకు సబబు? క్రెడిట్ అయితే మోడికీ, డెబిట్ అయితే కార్యకర్తలకూ, ఛోటా మోటా నాయకులకూ చెందుతుందా?
హిందూత్వ ఆధిపత్య, విచ్ఛిన్నకర భావజాలన్నీ త్యజించకుండా సంఘ్ పరివారం ఎన్ని కబుర్లు చెప్పినా అవి ఉట్టుట్టి మాటలే లవుతాయి!