టర్కీ సైనిక కుట్ర: ఇండియా, మోడి కనెక్షన్!


[Disclaimer: టర్కీ సైనిక కుట్రకు, ఇండియా & మోడిలకూ మధ్య కనెక్షన్ ఉన్నదని చెప్పడం ఈ ఆర్టికల్ ఉద్దేశం కాదు.]

జులై 15, 16 తేదీల్లో టర్కీలో సైనిక కుట్ర చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జరిగింది కుట్ర కాదనీ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, అధికారాలను తన చేతుల్లో కేంద్రీకరింపజేసుకోవడానికి తనపై తానే కుట్ర చేయించుకుని ఆ నెపాన్ని విరోధులపై నెడుతున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజానికి కుట్ర అనంతరం జరిగిన, జరుగుతున్న పరిణామాలు రెండో అంశానికే ఎక్కువ మద్దతు వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇది ఒక విషయం.

17 యేళ్లుగా అమెరికాలో నివశిస్తున్న టర్కీ మత గురువు ఫెతుల్లా గులెన్ ను కుట్రకు సారధిగా ఎర్డోగన్ ఆరోపిస్తున్న నేపధ్యంలో కుట్రకూ, ఇండియాలోని గులెన్ సంస్ధలకూ సంబంధం ఉన్నదని టర్కీ ప్రభుత్వం తాజాగా ఆరోపిస్తోంది. జులై 20 తేదీన మొదటిసారి ఈ ఆరోపణలు చేసిన (ఇండియాలోని) టర్కీ రాయబారి సోమవారం అవే ఆరోపణలను పునరుద్ఘాటించాడు.

గులెన్ నిర్వహిస్తున్న మత సంస్ధలు దేశంలో అనేక చోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వాటన్నింటిని మూసివేయాలని భారత ప్రభుత్వాన్ని ఏకంగా డిమాండ్ చేశాడాయన. ముఖ్యంగా ముంబై లోని గులెన్ సంస్ధలు కుట్ర సందర్భంగా పాత్ర పోషించినట్లు పరిశోధనలో కనుగొన్నామని టర్కీ కన్సల్-జనరల్ ఎర్డాల్ సబ్రి ఎర్గెన్ తెలిపాడు. తమకు అందుబాటులో ఉన్న సాక్షాలను భారత ప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించామని ఎర్గెన్ చెప్పాడు.

‘సాక్షాలతో కూడిన పత్రాలను సమర్పించామం’టూ ఎర్గెన్ చెప్పిన మాటలను భారత ప్రభుత్వ అధికారి ఒకరు ధృవీకరించారని ద హిందు చెబుతోంది. “కేంద్ర హోమ్ శాఖను టర్కీ ప్రభుత్వం సంప్రదించింది. ప్రస్తుతం మేము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాం” అని సీనియర్ అధికారి చెప్పారని ఆ పత్రిక తెలిపింది.

గులెన్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాపితంగా ఉన్న గులెనిస్టు సంస్ధలు ఎర్డోగన్ వ్యతిరేక కుట్రలో భాగస్వామ్యం వహించాయని టర్కీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కుట్ర సఫలం అయి ఉంటే వివిధ దేశాల మద్దతును కుట్ర ప్రభుత్వానికి సమకూర్చిపెట్టడానికి కృషి చేసే పనిలో ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన గులెనిస్టు సంస్ధలు నిమగ్నం అయ్యాయని టర్కీ రాయబారి ఎర్గెన్ పరోక్షంగా సూచిస్తున్నాడు.

“టర్కీలో సైనిక కుట్ర జరిగిన అనంతర దినాల్లో కుట్రదారులకూ ముంబై-ఇండియాలకూ సంబంధం ఉన్నట్లు మేము కనుగొన్నాము. ఫెతుల్లా టెర్రర్ సంస్ధకు, ఇండియాతో సహా ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాల్లో నెట్ వర్క్ ఉన్నది. వాళ్ళు డబ్బు, మద్దతులను గులెన్ సంస్ధకు అందిస్తారు. అలాంటి ప్రతి ఒక్క సంస్ధనూ మూసివేయాలి” అని టర్కీ రాయబారి ఎర్గెన్ కోరాడు.

“వాటిని మైక్రోస్కోప్ కింద పెట్టి పరిశోధన చేయాలి. అపకార వ్యూహాలు మదిలో నింపుకున్న చట్ట విరుద్ధమైన నెట్ వర్క్ అది. నెట్ వర్క్ తో సంబంధం ఉన్న సంస్ధలు ముంబైలో ఉన్నాయి. భారత అధికారుల వద్ద ఇప్పటికే ఆ సమాచారం ఉన్నదని మేము భావిస్తున్నాం. మేము పెద్ద మొత్తంలో పత్రాలు, సాక్ష్యాలు ఇచ్చాము” అని ఎర్గెన్ సోమవారం పత్రికలతో మాట్లాడుతూ చెప్పాడు.

టర్కీలో ముస్లిం మతతత్వ పార్టీ అయిన ‘జస్టిస్ అండ్ డవలప్ మెంట్ పార్టీ’ కి పునాది అక్కడి ‘ముస్లిం బ్రదర్ హుడ్’ సంస్ధ. ఇండియాలో ఆర్‌ఎస్‌ఎస్ ఎలాగో టర్కీలో ‘ముస్లిం బ్రదర్ హుడ్’ అలాగ. ప్రాచీన భారత ఔన్నత్యం పేరుతో, హిందూ సంస్కృతి పేరుతో అగ్రకుల ఆధిపత్యంతో కూడిన కుల-వర్ణ వ్యవస్ధ వైభవాన్ని పునరుద్ధరించడానికి ఆర్‌ఎస్‌ఎస్ తపిస్తున్నట్లే, పాత ముస్లిం ఒట్టోమాన్ సామ్రాజ్య వైభవాన్ని పునరుద్ధరించడానికి ముస్లిం బ్రదర్ హుడ్ తపిస్తుంది.

స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనకపోగా, బ్రిటిష్ పాలకులతో అవగాహనతో పని చేసిన ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పుడు “మేమూ స్వతంత్రం కోసం పని చేశాం” అని రుజువు చేసుకోవడానికి తంటాలు పడుతున్నది. అలాగే టర్కీని ఐరోపా వలస ఆధిపత్యం నుండి విముక్తి చేసిన ఉద్యమానికి నాయకత్వం వహించి ఆధునిక సెక్యులర్ టర్కీ దేశ ఆవిర్భావానికి కృషి చేసిన అటా టర్క్ వారసత్వాన్ని నశింపజేసి టర్కీని తిరిగి ముస్లిం రాజ్యంగా నిలబెట్టడానికి ముస్లిం బ్రదర్ హుడ్ / జస్టిస్ అండ్ డవలప్ మెంట్ పార్టీ కృషి చేస్తోంది.

అయితే టర్కీలో ఇప్పటికీ సెక్యులర్ వాతావరణం సమసి పోలేదు. మతాతీత సెక్యులర్ వ్యవస్ధలకు ప్రజల మద్దతు కొనసాగుతుండడంతో అవింకా సజీవంగా ఉన్నాయి. సైన్యం, విద్యా వ్యవస్ధ, బ్యూరోక్రసీ, కోర్టులు మొ.న వ్యవస్ధలన్నీ సెక్యులర్ భావజాలంతో నిండి ఉన్నాయి.

‘సైనిక కుట్రను విజయవంతంగా అధిగమించిన(!)’ అనంతరం ఎర్డోగన్, సెక్యులర్ వ్యవస్ధలనే ప్రధానంగా టార్గెట్ చేశాడు. టీచర్లు, లెక్చరర్లు, పోలీసులు, సైనికులు, సైన్యాధికారులు, బ్యూరోక్రట్లు, జడ్జిలు, ప్రాసిక్యూటర్లు… లాంటి వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని ఏరి ఏరి అరెస్టు చేశాడు; సస్పెండ్ చేశాడు; ఉద్యోగం నుండి తొలగించాడు; టార్చర్ పెట్టాడు.

కుట్ర జరిగీ జరగడంతోనే పదుల వేల మందిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడం ఎలా సాధ్యం, ముందే వారి జాబితా సిద్ధం చేసుకుని ఉంటే తప్ప? ఈ చర్యలను ఎదుర్కొన్నవారిలో గులెన్ మద్దతుదారులు కూడా ఉన్నారని పత్రికలు చెబుతున్నాయి.

ఇంతకీ గులెన్ నెట్ వర్క్ ఏమిటి? ఫెతుల్లా గులేన్ సూఫీ మత గురువు. గులేన్, ఎర్డోగన్ ఇద్దరికీ పునాది సున్నీ ఇస్లాం మతమే. సెక్యులర్ ఆధారిటీకి వ్యతిరేకంగా నిలబడడం వారిద్దరి ఉమ్మడి ప్రయోజనం. ఆ విధంగా గులెన్, ఎర్డోగన్ లు పూర్వాశ్రమంలో మిత్రులుగా పని చేశారు. ఒకరినొకరు సహకరించుకున్నారు.

గులెన్ సంస్ధలు 1970 ల నుండే టర్కీ సెక్యులర్ రాజ్యాన్ని బలహీనపరచడానికి కృషి ప్రారంభించాయి. తన మద్దతుదారులను, అనుచరులను ప్రభుత్వ పోలీసు, సైనిక, న్యాయ, పాలనా వ్యవస్ధల్లోకి ప్రవేశపెడుతూ వచ్చాయి. తద్వారా రాజ్యంలోనే పోటీ రాజ్యం నిర్వహించే స్ధాయికి గులెన్ నెట్ వర్క్ అభివృద్ధి చెందింది.

ఎర్డోగన్ ది పోలిటికల్ ఇస్లాం గానూ, గులెన్ ది కల్చరల్ ఇస్లాం గానూ చెప్పడం టర్కీలో పరిపాటి. పేరుకు ‘కల్చరల్ ఇస్లాం’ అయినప్పటికీ తనకంటూ పార్టీ ఏదీ లేకుండానే రాజకీయ శక్తిని తన అనుచర వర్గం ద్వారా గులెన్ నెట్వర్క్ సంపాదించింది. ఈ నెట్ వర్క్ ద్వారా రాజకీయంగా ఎర్దోగన్ బాగా లబ్ది పొందాడు.

అయితే ఎర్డోగన్ క్రమంగా నియంతృత్వ పోకడలు సంతరించుకోవడం, అంతర్జాతీయంగా గులెన్ సంబంధాలకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో ఇరువురి మధ్య 2010 నుండీ తేడాలు మొదలయ్యాయి. 2012లో గులెన్ వర్గానికి చెందిన ప్రాసిక్యూటర్ ఒకరు ఎర్డోగన్ మంత్రుల అవినీతిని వెల్లడి చేసి, ఎర్డోగన్-ఇరాన్ సంబంధాలను అప్రతిష్టపాలు చేయడంతో ఇరువురి మధ్య పగ పరాకాష్టకు చేరింది. అవినీతి ప్రాసిక్యూషన్ వల్ల ఎర్దోగన్ ప్రభుత్వంలో అర డజను మంది మంత్రులు రాజీనామా చేయవలసి వచ్చింది.

గులెన్ 1999 నుండి అమెరికాలో నివాసం ఉండటం ఈ స్టోరీలో ఒక కీలకాంశం. ప్రభుత్వంలో దాదాపు సమస్త అంగాలలోకి చొరబడిన నెట్ వర్క్ కు అధిపతి/గురువు అయిన గులెన్ అమెరికాలో ఎందుకు నివాసం ఉంటున్నట్లు? ఆల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ లాంటి టెర్రరిస్టు సంస్ధలను పెంచి పోషించిన అమెరికా, గులెన్ కు ఎందుకు ఆశ్రయం ఇస్తున్నదో అర్ధం చేసుకోవడం కష్టం కాకూడదు.

గులెన్ నెట్ వర్క్ గురించి టర్కీ రాయబారి చెప్పిన ఈ మాటలు చూడండి: “పైకి అమాయకంగానూ, ప్రగతిశీలంగానూ కనిపించే వారి భావన (భిన్న మతాల మధ్య చర్చలు జరగాలని, శాస్త్రీయ దృక్పధం ఉండాలని గులెన్ ఉద్యమం అధికారికంగా ప్రభోధిస్తుంది) వెనుక మరింత అపకారం కలిగించే పధకం దాగి ఉన్నది. ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాల్లో విస్తరించిన సంస్ధల నెట్ వర్క్ ద్వారా కార్యకర్తలు, డబ్బు సమీకరించి తద్వారా ప్రభుత్వాలు, పాలనా వ్యవస్ధలలోకి చొరబడడం వారి లక్ష్యం” అని ఎర్గెన్ చెప్పాడు. (The Telegraph, Aug 9)

గులెన్ నెట్ వర్క్ భారత దేశంలో ప్రధాన నగరాలన్నింటా విస్తరించి ఉన్న సంగతిని టర్కీ ప్రభుత్వం అందించిన పత్రాలు వెల్లడి చేశాయి. ఉదాహరణకి న్యూ ఢిల్లీ లోని గ్రేటర్ కైలాస్ పార్ట్ II లో వులెన్ ఉద్యమం భారత కేంద్రం ఉన్నదని టర్కీ కన్సల్-జనరల్ వెల్లడించాడు. కలకత్తా లోని షేక్ స్పియర్ సరానిలోనూ, ముంబైలోని అంధేరి వెస్ట్ లోనూ, హైద్రాబాద్ లోని బంజారా హిల్స్ లోనూ, బెంగుళూరు లోని యాష్లీ రోడ్ లోనూ ‘సాంస్కృతికంగా చురుకైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న స్ధావరాలు ఉన్నాయని టర్కీ రాయబారి సమాచారం ఇచ్చాడు.

గులెన్, ఇజ్రాయెల్ దేశానికి మద్దతుదారుడు. ముస్లిం మతానికి చెందిన గురువు అయినప్పటికీ పాలస్తీనా అరబ్బులను సామూహికంగా హింస పెడుతున్న యూదు రాజ్యానికి మద్దతు ఇవ్వడం బట్టి గులెన్ ఉద్యమం యొక్క అమెరికా అనుకూలతను పట్టిస్తోంది. చివరికి గాజాను ముట్టడించి సరఫరాలు అందకుండా దిగ్బంధించిన ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సంస్ధలు చేపట్టిన ‘గాజా ఫ్లోటిల్లా’ ను సైతం గులెన్ వ్యతిరేకించి ఇజ్రాయెల్ కు తన విధేయతను ప్రకటించుకున్నాడు.

మన దేశం లోనూ యూదు జాత్యహంకారాన్ని గొప్పగా గుర్తించే సాంస్కృతిక సంస్ధ, రాజకీయ పార్టీ ఉన్నాయి. మొదటిది ఆర్‌ఎస్‌ఎస్ కాగా, రెండవది బి‌జే‌పి. మొదటి ఎన్‌డి‌ఏ ప్రభుత్వ కాలంలో ఆరంభం అయిన ఇజ్రాయెల్ – ఇండియా సంబంధాలు యూ‌పి‌ఏ ప్రభుత్వం లోనూ కొనసాగాయి. ఎన్‌డి‌ఏ – II హయాంలో మరింత దృఢతరం అయ్యాయి.

ముస్లింల తల టోపీ (స్కల్ కేప్) ధరించడానికి మర్యాదకు కూడా ఒప్పుకోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మొదటిసారి ముస్లిం నాయకులతో కలిసి వేదికను అలంకరించింది ఎప్పుడో గుర్తున్నదా? తన జీవిత కాల ప్రతిజ్ఞలు అతిక్రమించి ఇస్లాం మతాన్ని శాంతి మతంగా శ్లాఘించిన సందర్భం గుర్తున్నదా?

ఈ యేడు మార్చి 18 తేదీన ఢిల్లీలో జరిగిన ‘వరల్డ్ సూఫీ ఫోరం’ లో ప్రధాని నరేంద్ర మోడి మొదటిసారి ముస్లిం వేదికను ఎక్కారు. ఇస్లాం ను ‘శాంతియుత మతంగా’ ఆయన ఆ వేదిక పైనుండి ఖురాన్ ని ఉటంకిస్తూ శ్లాఘించారు. ఈ సభకు గులెన్ మద్దతుదారులు కూడా టర్కీ నుండి హాజరు కావడం గమనార్హం. ఇండియాలోని తన సంస్ధల ద్వారా ఈ సదస్సుకు గులెన్ ఉద్యమమే స్పాన్సర్ చేసిందన్న అనుమానాలు ఉన్నాయి.

కుట్రలో భారత్ లోని గులెన్ అనుచరులకు పాత్ర/మద్దతు ఉన్నదని జులై 20 తేదీన టర్కీ రాయబారి ఆరోపించినప్పుడు ఇక్కడి సూఫీల స్పందన ఏమిటి? “ఫెతుల్లా గులెన్ నక్షాబందీ సూఫీ స్కూల్ కు చెందిన అత్యున్నత స్ధాయి గురువు. సహజంగానే మేము ఆయన్ను ఎంతో ఉన్నతునిగా గౌరవిస్తాము. టర్కీ వ్యాఖ్యలను మేము పరిశీలించి తగిన విధంగా స్పందిస్తాము” అని సూఫీల నేత ఒకరు స్పందించారని ద హిందు తెలిపింది.

గులెన్ ఇజ్రాయెల్ మద్దతుదారు. బి‌జే‌పి/ఆర్‌ఎస్‌ఎస్ ఇజ్రాయెల్ మద్దతుదారు. ఇజ్రాయెల్ అమెరికా అనుచరి.  గులెన్ తలదాచుకుంటున్నది అమెరికాలో. మోడి అధికారం లోకి వచ్చాక ఇండియా వేగంగా అమెరికా వైపుకు జరుగుతోంది. (బ్రిక్స్ కూటమికి దూరం అవుతోంది.) ఏనాడూ ముస్లిం గడప తొక్కని మోడి మొదటిసారి గులెన్ మద్దతుతో నిర్వహించబడిన వరల్డ్ సూఫీ ఫోరం వేదికపై ప్రసంగించడమే కాకుండా ‘దండయాత్రీకులు’గా ఆర్‌ఎస్‌ఎస్ పరివారం నిందించే ముస్లింలను శాంతి ప్రభోధకులుగా కీర్తించారు. టర్కీ (ఎర్డోగన్), సైనిక కుట్రకు గులెన్, అమెరికాలను బాధ్యులను చేసింది. (టర్కీ/ఎర్డోగన్ అమెరికా-గులెన్ లకు వ్యతిరేకంగా మారడమే మనం ఇక్కడ తీసుకోవలసిన విషయం. కుట్ర నిజమా కాదా అన్నది వేరే చర్చ). అమెరికా-గులెన్ ను బాధ్యుల్ని చేస్తూ రష్యా శిబిరానికి టర్కీ దగ్గరవుతోంది.

‘టర్కీ సైనిక కుట్ర మరియు  మోడి-ఇండియాల కనెక్షన్’ శీర్షిక భావం ఏమిటో అర్ధం అయి ఉండాలి.

6 thoughts on “టర్కీ సైనిక కుట్ర: ఇండియా, మోడి కనెక్షన్!

  1. అనీల్ గారు, బ్రిక్స్ నుండి బైటికి రావడం లేదు. దూరం అవుతోంది. ఇలా దూరం కావడం అన్నది అమెరికాకు ఇండియా దగ్గర కావడం వల్ల జరుగుతోంది.

    ఎందుకంటే బ్రిక్స్ కూటమి ఏర్పడిందే అమెరికా పెత్తనాన్ని ఎదుర్కోవటానికి. భారత పాలకులు అమెరికాకి దగ్గరైతే బ్రిక్స్ లక్ష్యంలో అది ఎట్లా ఇముడుతుంది?

    ఐనా బైటికి వచ్చే పనికి భారత పాలకులు పూనుకోరు. చైనా వల్ల వచ్చే ద్రవ్య ప్రయోజనాలు కూడా వాళ్ళకి కావాలి. అమెరికా నీడనుండి బైటికి రాగాల ధైర్యం, లక్ష్యం వాళ్ళకు లేదు. కాబట్టి అనివార్యంగా ఇండియా-బ్రిక్స్ సంబంధాలు బలహీనం అవుతాయి.

    రష్యా విషయమూ అంతే. రష్యాను శత్రువుగా అమెరికా పాలకులు (ఒక సెక్షన్) భావిస్తున్నారు. అందువల్ల రష్యాతో బంధం గట్టిపరిచే సాహసం మనవాళ్ళకు లేదు.

  2. అమెరికాని విడిచి రావలసిన అవసరం ఇండియాకు లేదు. పాకిస్థాన్ ను నుంచి బెలూచ్,సింధ్,కాష్మీర్ ను వేరు చేసే పని పూర్తి అయ్యేవరకు భారత్ కు అమెరికా, బ్రిటన్ సహాయసహకారాలు అవసరము. ఇప్పటికే బ్రిటన్ మద్దతు పలికింది. రష్యా మద్దతు ఎలాగూ ఉంది. చైనా ఒక్కటే పాక్ కు మద్దతు ఇచ్చి చేయికాల్చుకొబోయే దేశం. ఈ కార్యక్రమం పూర్తి అయిన తరువాత అమెరికా తో సంభందాల గురించి తీరికగా పున: సమీక్షించు కోవచ్చు.

  3. జగదీష్ గారు, అన్నింటిలో అందరూ ఏకీభవించవలసిన అవసరం లేదు. వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు చాలా సహజం. అలాగే ఒకే వ్యక్తి ఎల్ల కాలం ఒక అంశం పై ఒకటే అభిప్రాయం కలిగి ఉండకపోవచ్చు. కొత్త విషయాలు తెలిసినపుడు, తెలుసు అనుకున్నవి తెలియదని తెలిసినపుడు పాత అభిప్రాయాలు మారవచ్చు, సవరించబడవచ్చు. మీరూ, నేనూ ఎవరూ అందుకు అతీతులం కాము.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s