గత ఏడెనిమిది నెలలుగా కాంగ్రెస్, బిజెపిల పదవీ రాజకీయాలకు కేంద్రంగా వార్తల్లో నిలిచిన అరుణాచల్ ప్రదేశ్, అనూహ్య సంఘటనను చవి చూసింది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో తిరుగుబాటుకు నేతృత్వం వహించి, అనంతరం బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి కలిఖో పల్, ముఖ్యమంత్రి నివాసంలో శవమై కనిపించాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు తెలియజేస్తున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి కలిఖో పల్ ఆత్మహత్య చేసుకున్నారని రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. ఆయన తాడుతో మెడకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులను ఉటంకిస్తూ పత్రికలు -ద హిందూ, స్క్రోల్, Economic Times, CNN-News18- తెలిపాయి.
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజ్ ఖోవ్, అసెంబ్లీ సమావేశాలపై తీసుకున్న నిర్ణయాలు ఆయన అధికారం పరిధిలో లేవని, కావున సదరు నిర్ణయంతో పాటు ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ చట్ట విరుద్ధం అని జులై 13 తేదీన సుప్రీం కోర్టు తీర్పు చెప్పడంతో కలిఖో ప్రభుత్వం రాజీనామా చేయవలసి వచ్చింది.
అనంతరం పాత కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టినప్పటికీ, ముఖ్యమంత్రి నబామ్ టుకీని కాంగ్రెస్ పార్టీ కొనసాగించలేదు. ఆయన చేత రాజీనామా చేయించడం ద్వారా కలిఖో పల్ సమీకరించిన ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి రప్పించుకుంది. వారితో పాటు కలిఖో పల్ కూడా కాంగ్రెస్ గూటికి తిరిగి వచ్చారు.
అందరికీ ఆమోదయోగ్యుడన్న పేరుతో పేమ్ ఖాండు ను కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. దరిమిలా నబామ్ టుకీ రాజీనామా చేయడం, పేమ్ ఖాండు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టం జరిగాయి.
అధికారం చేజారినప్పటికీ కలిఖో పల్ ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని ఖాళీ చేయలేదని తెలుస్తోంది. అధికార నివాసం లోనే కొనసాగుతున్న కలిఖో పల్, నేడు ఆ నివాసంలో శవమై కనిపించారని పోలీసులు తెలిపారు. ఆయన ముగ్గురు భార్యల్లో ఒకరు మొదట ఆయన చనిపోవడాన్ని కనుగొన్నారని పోలీసులు చెప్పారు. ముగ్గురు భార్యలకు భర్త అయిన కలిఖో పల్, నలుగురు పిల్లలకు తండ్రి. ఆయన వయసు 47 సంవత్సరాలు.
ఆత్మహత్యకు కారణాలు ఏమిటో తెలియలేదని పోలీసులు చెప్పారు. ఫలానా కారణం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పత్రికలు కూడా సూచించడం లేదు.
“కలిఖో పల్ లాంటి యువ నాయకుడు మనతో లేకపోవడం విచారకరం, నిజంగా దురదృష్టకరం” అని మాజీ ముఖ్యమంత్రి నబామ్ టుకీ అన్నారు. “ఆయనను కోల్పోవడం మొత్తం అరుణాచల్ రాష్ట్రానికి లోటు. కాంగ్రెస్ కుటుంబం ఆయన కుటుంబానికి తోడుగా ఉంటుంది” అని ఆయన అన్నారు.
సిఎన్ఎన్ – న్యూస్ 18 ఛానెల్ ప్రకారం కలిఖో పల్ డిప్రెషన్ తో బాధ పడుతున్నారు. ఆయన డిప్రెషన్ కు రాజకీయ పరిణామాలు కారణమా లేక మామూలుగానే ఆయన డిప్రెషన్ వ్యాధి పీడితుడా అన్నది తెలియలేదు.
అనేక యేళ్లుగా రాష్ట్ర మంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహించిన కలిఖో అంతలోనే డిప్రెషన్ వల్ల ఆత్మహత్య చేసుకోవడం ఆశ్చర్యకరం. ఎంతటి సున్నిత మనస్కులనైనా పాషాణులుగా మార్చగల భారత పదవీ రాజకీయాలలో గణనీయమైన దూరం ప్రయాణించి కూడా ఆత్మహత్యకు పాల్పడే సున్నితత్వాన్ని కలిగి ఉండడం ఒకింత ఆశ్చర్యాన్నీ, మరి కొంత బాధను కలిగిస్తోంది.
“మాజీ ముఖ్యమంత్రి ఆత్మహత్య చేసుకున్న గదిలో ఆత్మహత్య లేఖను కనుగొన్నాము. అందులోని విషయాలు వెల్లడి చేయడం మా అధికార పరిధిలో లేనందున చెప్పలేకపోతున్నాం” అని ఒక సీనియర్ పోలీసు అధికారిని ఉటంకిస్తూ సిఎన్ఎన్ తెలిపింది.
ఏదో పెద్ద మిస్టరీలా ఉంది.