రాజకీయాల్లో శాశ్వత శతృత్వం గానీ, శాశ్వత మిత్రత్వం గానీ ఉండదు అని చెబుతుంటారు. ఇది అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలకు కూడా వర్తిస్తుందని టర్కీ, రష్యా రుజువు చేస్తున్నాయి. నిన్నటి వరకూ ఉప్పు, నిప్పుగా ఉన్న టర్కీ, రష్యాల మధ్య స్నేహ బంధం క్రమంగా సుదృఢం అవుతోంది. అమెరికా నేతృత్వం లోని నాటో మిలట్రీ కూటమి ప్రయోజనాలకు విరుద్ధంగా ఇది జరుగుతుండడంతో అంతర్జాతీయ రాజకీయాలలో ఈ పరిణామం ప్రముఖ చర్చనీయాంశం అవుతోంది.
“టర్కీ, రష్యాల మధ్య త్వరలో స్నేహ చర్చలు జరుగుతాయి. ఈ చర్చలు టర్కీ-రష్యా సంబంధాలలో నూతన పేజీని లిఖించనున్నాయి” అని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ నిన్న (ఆదివారం, ఆగష్టు 7) ప్రకటించాడు. మంగళవారం, ఆగస్టు 3 న తాను చర్చల నిమిత్తం మాస్కో వెళ్తున్నానని ప్రకటించాడు. స్టేట్ విజిట్ గా పేర్కొంటున్న ఈ సందర్శనపై తాను భారి ఆశలు పెట్టుకున్నానని తన మాటల ద్వారా ఎర్డోగన్ చెప్పాడు. “ఇది చరిత్రాత్మకమైన సందర్శన. మా స్నేహితుడు పుటిన్ తో జరిగే ఈ చర్చల ద్వారా ఇరు దేశాల సంబంధాలలో నూతన పేజి తెరుచుకుంటుంది. మా రెండు దేశాలు కలిసి చేయవలసింది ఇంకా చాలా ఉన్నది” అని టాస్ (ఇరాన్) వార్తా సంస్ధకు ఇంటర్వ్యూ ఇస్తూ టర్కీ అధ్యక్షుడు ప్రకటించాడు.
టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ చాలా తరచుగా రష్యా పట్ల స్నేహ పూర్వక ప్రకటనలు జారీ చేస్తుండగా రష్యా మాత్రం ఆచి తూచి అడుగు వేస్తోంది. గత నవంబర్ లో రష్యా ఫైటర్ జెట్ విమానాన్ని టర్కీ మిలట్రీ కూల్చివేసిన దరిమిలా టర్కీ, రష్యాల మధ్య తీవ్ర శతృ వాతావరణం నెలకొన్నది. తమ జెట్ విమానాన్ని కూల్చివేసినందుకు టర్కీ అధ్యక్షుడు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేదా తగిన ఫలితం ఎదుర్కోవలసి ఉంటుందని అప్పట్లో రష్యా హెచ్చరించినప్పటికీ ఎర్డోగన్ లెక్క చేయలేదు.
ఫలితంగా టర్కీపై అనేక వాణిజ్య ఆంక్షలను రష్యా విధించింది. వాణిజ్య సంబంధాలను దాదాపు నిలిపివేసింది. ఎగుమతులు, దిగుమతులు నిలిపివేసింది. ముఖ్యంగా సరసమైన ధరలకు రష్యా నుండి లభించే చమురు, సహజవాయు దిగుమతులు బంద్ అయిపోయాయి. రష్యా నుండి ప్రతి యేటా పెద్ద సంఖ్యలో వచ్చే టూరిస్టులను రాకుండా రష్యా నిలుపుదల చేసింది. ట్రావెల్ ఏజన్సీలు టర్కీకి టూర్లు వేయకుండా నిరోధించింది. దానితో టర్కీకి ప్రధాయ ఆదాయ వనరు అయిన టూరిజం దెబ్బ తిన్నది.
మిలట్రీ పరంగా కూడా టర్కీపై రష్యా పలు చర్యలు తీసుకుంది. టర్కీలో ఆయుధ శిక్షణ పొందుతున్న ఇస్లామిక్ స్టేట్ సైన్యం సిరియాలో ప్రవేశించకుండా టర్కీ-సిరియా సరిహద్దులో వైమానిక బాంబు దాడులు ముమ్మరం చేసింది. ముఖ్యంగా ఇసిస్ ద్వారా సిరియా నుండి చమురు గ్యాస్ నిల్వలను టర్కీ దొంగిలిస్తున్న విషయాన్ని, శాటిలైట్ చిత్రాల ద్వారా బట్టబయలు చేసింది.
సిరియా చమురు క్షేత్రాల నుండి ట్యాంకర్లు పెద్ద మొత్తంలో సరిహద్దు దాటి టర్కీలో ప్రవేశిస్తున్న దృశ్యాల ఫొటోలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించాయి. ఈ అక్రమ చమురు వాణిజ్య రూట్లపై రష్యా బాంబు దాడులు నిర్వహించి నాశనం చేసింది. దానితో సిరియా చమురు, గ్యాస్ నిల్వలతో టర్కీ అక్రమ సంపాదన బంద్ అవడమే కాకుండా ఇసిస్ ప్రధాన, ఆకర్షణీయమైన ఆదాయ వనరు కూడా నాశనం అయింది. టర్కీ, అమెరికాలు అక్రమంగా, రహస్యంగా సిరియా వనరుల నుండి, టెర్రరిస్టుల ద్వారా లబ్ది పొందుతున్న సంగతి దీని ద్వారా వెల్లడి అయింది. పైకి చెబుతున్నట్లుగా టర్కీ, అమెరికాలు ఇసిస్ పై పోరాడడం లేదనీ, తామే ఇసిస్ కు మద్దతు ఇస్తున్నాయని ప్రపంచానికి వెల్లడి అయింది.
ఈ లోపు సిరియాలో టెర్రరిస్టు గ్రూపులు చావు దెబ్బ తింటున్న పరిస్ధితి ఏర్పడింది. రష్యా వైమానిక దాడులు, ఆయుధ సాయంల మద్దతుతో సిరియా ప్రభుత్వ సైన్యాలు, ఇరానీ సైనిక బలగాలు, లెబనాన్ హిజ్బోల్లా బలగాలు ఉమ్మడిగా పోరాడుతూ టెర్రరిస్టు గ్రూపులకు వరుస ఓటములు చవి చూపాయి. ఇసిస్ నుండి భూభాగాలు భారీ యెత్తున సిరియా ప్రభుత్వ కైవశం చేసుకుంది. ఈ నేపధ్యంలో సిరియాలో టెర్రరిస్టులకు మద్దతు ఇవ్వడం తనకు ఇక ఎంత మాత్రం క్షేమకరం కాదని ఎర్డోగన్ భావించక తప్పలేదు.
ఎర్డోగన్ ఇలాంటి అవగాహనకు రావడానికి పని చేసిన మరో ముఖ్యమైన అంశం కుర్దులకు అమెరికా ఇస్తున్న మద్దతు. కుర్దుల స్వతంత్ర ఆకాంక్షలు ఎర్డోగన్ కు ఒక పీడ కల. ఆ పీడకలను లేకుండా చేయడానికి దేనికైనా సిద్ధమే అన్నంతగా కుర్దుల పోరాటాన్ని ఆయన ద్వేషిస్తాడు. ఒట్టోమన్ సామ్రాజ్య వైభవాన్ని పునరుద్ధరించుకోవాలని కలలు గంటున్న ఎర్డోగన్ కు ఉన్న టర్కీ నుండి స్వతంత్ర కుర్దిస్తాన్ గా విడిపోవడానికి పోరాడుతున్న కుర్దులంటే మండిపడతాడు. అలాంటి కుర్దులకు అమెరికా మద్దతు ఇస్తోంది. సిరియాలో రొజావా పాలనకు అండదండలు ఇస్తున్న అమెరికా సిరియా, ఇరాక్ లలోని కుర్దు ప్రాంతాలతో స్వతంత్ర కుర్దిస్తాన్ ను ఏర్పాటు చేయాలని తద్వారా తన ప్రాబల్యంలో మరో కీలుబొమ్మ ప్రభుత్వం నిలపాలని ప్రయత్నాలు చేస్తోంది. అదే జరిగితే టర్కీలోని కుర్దు భూభాగాలను కూడా కుర్దిస్తాన్ లో కలిసిపోవడానికి ఎంతో కాలం పట్టదని ఎర్డోగన్ భయం.
దేశంలో అంతర్గతంగా ఎర్డోగన్ కు వ్యతిరేకత ప్రబలింది. ఇస్లామిక్ శక్తులు, మతతత్వ శక్తులు బలీయం అయినప్పటికీ వారి సంఖ్య లిబరల్-సెక్యులర్ వాదులతో పోల్చితే తక్కువే. లిబరల్ శక్తులు ఎర్డోగన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం చేశాయి. దానితో దేశీయంగా, విదేశీ విధానంలో ఎర్డోగన్ మార్పులు తలపెట్టాడు. అనుకున్నదే తడవుగా గత జనవరిలో రష్యాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటానని ప్రకటించాడు. ఓ వైపు దేశీయంగా నియంతృత్వ పద్ధతులను తీవ్రం చేస్తూ మరోవైపు విదేశీ విధానంలో అమెరికా నుండి రష్యా వైపుకు మళ్లాడు. ఈ కారణంతో టర్కీపై ఒత్తిడి తేవడానికి ఇసిస్, టర్కీలో వరుస టెర్రరిస్టు దాడులకు తెగబడింది. ఇసిస్ దాడుల ద్వారా టర్కీని వెనక్కి రప్పించుకోవడానికి అమెరికా ప్రయత్నం చేసిందని ఇక్కడ గుర్తించాలి.
మారిన విధానంలో భాగంగా రష్యాకు క్షమాపణలు ప్రకటించాడు. గత యేడు నవంబర్ లో రష్యా యుద్ధ విమానాన్ని కూల్చివేసినందుకు గాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ కు, రష్యా ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించాడు. తమ దేశంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరాడు. ఎర్డొగన్ విజ్ఞప్తి మేరకు ఆంక్షలు ఎత్తివేసే విషయాన్ని పరిశీలిస్తామని రష్యా ప్రకటించింది. క్షమాపణ చెప్పడంతోనే అంతా అయిపోలేదని టర్కీ క్రమానుగతంగా తీసుకునే చర్యలను బట్టి తమ చర్యలు ఉంటాయని పుటిన్ స్పష్టం చేశాడు. అప్పటి నుండీ రష్యా-టర్కీ సంబంధాలలో సానుకూల మార్పులు వస్తుండగా అమెరికా – టర్కీల మధ్య దూరం పెరుగుతో వస్తోంది.
ఈ నేపధ్యంలో గత నెలలో టర్కీలో చోటు చేసుకున్నట్లు చెబుతున్న మిలట్రీ కుట్ర (సైనిక తిరుగుబాటు) కు రష్యా పరోక్ష మద్దతు ఉన్నదన్న ఊహాగానాలు బయలుదేరాయి. మద్దతు అంటే కుట్రకు మద్దతు కాదు; కుట్ర పేరుతో ఎర్డోగన్ నాటకం ఆడితే, ఆ నాటకానికి రష్యా మద్దతు ఉన్నదని అర్ధం. పరోక్ష మద్దతు అంటే నాటకానికి ప్రత్యక్షంగా అండగా ఉండటం కాకుండా చూసీ చూడనట్లు గమ్మున ఉండటం. కుట్ర నిజమే అనీ, నిజమైన కుట్రకు అమెరికా మద్దతు ఉన్నదన్న వాదన ఎంత బలంగా ఉన్నదో కుట్ర నాటకం అనీ, ఆ పేరుతో ఎమర్జెన్సీ ప్రకటించి అధికారాలను తన చేతుల్లో కేంద్రీకరించుకోవడం ఎర్డోగన్ లక్ష్యం అన్న వాదన కూడా అంతే బలంగా వినిపిస్తోంది. నాటకం అయినా, కాకపోయినా కుట్రను అడ్డం పెట్టుకుని ఎర్డోగన్ శత్రువులుగా భావిస్తున్న అందరినీ జైళ్లకు పంపడం, నియంతృత్వాధికారాలు సంపాదించడం, దేశంలో అసమ్మతిని రూపుమాపే చర్యలు తీసుకోవడం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్న నిజాలు.
కుట్ర అనంతరం పదుల వేల సంఖ్యలో సైనికులు, అధికారులు, సివిల్ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, కాలేజిలు, పోలీసులను సస్పెండ్ చేయడమో, అరెస్టు చేసి కాన్సంట్రేషన్ క్యాంపులకు తరలించడమో, పూర్తిగా ఉద్యోగాల నుండి తొలగించడమో చేయగా ఆ చర్యలను అమెరికా, పశ్చిమ దేశాలు ఖండించాయి. రష్యా మాత్రం ఎలాంటి ఖండనా జారీ చేయలేదు. పైగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎర్డోగన్ కు మద్దతు ప్రకటించింది. ఇలాంటి మద్దతే అమెరికా, పశ్చిమ రాజ్యాలు ప్రకటించినప్పటికీ అది తప్పనిసరై ఇచ్చిన మద్దతు మాత్రమే అనీ, భౌగోళికంగా అటు మధ్యప్రాచ్యంలోనూ, ఇటు తూర్పు యూరప్ లోనూ అత్యంత కీలక స్ధానంలో ఉన్న టర్కీని దూరం చేసుకోలేకనే తప్పనిసరి మద్దతు అవి ఇచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా సిరియా కిరాయి తిరుగుబాటు సమస్యకు రష్యా సహాయం లేకుండా ఎలాంటి పరిష్కారం సాధ్యం కాదని ఎర్డోగన్ మారిన మనసుతో ప్రకటిస్తున్నాడు. “రష్యా లేకుండా సిరియా సంక్షోభానికి పరిష్కారం కనుగొనడం సాధ్యం కాదు. రష్యా సహకారంతో మాత్రమే సిరియా సంక్షోభం పరిష్కారం అవుతుంది. సిరియా శాంతి ప్రక్రియకు రష్యా హాజరు అత్యంత ముఖ్యం” అని టాస్ వార్తా సంస్ధతో మాట్లాడుతూ ఎర్డోగన్ అన్నాడు.
రష్యా సైతం ఇదే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. “ఇరువురు అధ్యక్షుల సమావేశంలొ సిరియా సంక్షోభం లోతుగా చర్చించబడుతుంది. టర్కీ మరింత నిర్మాణయుతంగా వ్యవహరిస్తుందని మేము ఆశిస్తున్నాము” అని పుటిన్ సహాయకుడు యూరి పుష్కోవ్ గత శుక్రవారం విలేఖరులతో అన్నాడని రష్యా టుడే తెలిపింది.
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పనిలో పనిగా యూరోపియన్ యూనియన్ ను విమర్శలలో ముంచెత్తడం విశేషం. ఈయూ ౫౩ సం.లుగా తమతో ఆడుకుంటోందని ఆయన ఆరోపిస్తూ తాము విసుగు చెందామని స్పష్టం చేశాడు. “గత 53 యేళ్లుగా ఈయు మాతో ఆడుకుంటోంది. మేము మా నిజాయితీని నిలకడగా రుజువు చేసుకుంటున్నాం. ఈయూ నుండి అదే స్పందన వస్తుందని ఆశించాం. ద్వంద్వ విధానాన్ని అది విడనాడాలి” అని ఎర్డోగన్ విమర్శించాడు.
ఈయు సభ్యత్వం ఇవ్వాలని టర్కీ అనేక యేళ్ళుగా కోరుతోంది. అయితే ఈయు ‘ఇదిగో, అదుగో’ అంటూ వాయిదా వేస్తూ వచ్చింది. సిరియా తిరుగుబాటు దరిమిలా టర్కీకి సభ్యత్వం ఇవ్వడం నుండి ఈయు మరింత దూరంగా జరిగింది. అయితే అది ఇసిస్ కు టర్కీ మద్దతు ఇస్తున్నందుకు కాదు. అమెరికా, ఈయూ ఆమోదం తోనే ఇసిస్ బలగాలకు టర్కీ భూభాగంపై శిక్షణ శిబిరాలు నిర్వహించారు. సిరియా యుద్ధం వల్ల తలెత్తిన శరణార్ధుల సమస్య, టర్కీ సభ్యత్వం వల్ల మరింతగా తమకు చేటు తెస్తుందని ఈయు దేశాలు భావిస్తున్నాయి.
ఒక్క సిరియా శరణార్ధులు మాత్రమే కాకుండా ఆఫ్రికా, ఆసియా దేశాల నుండి కూడా లక్షల సంఖ్యలో శరణార్ధులు టర్కీ ద్వారా ఐరోపా దేశాలకు తరలి వస్తుండటం సమస్యగా ఈయు దేశాలు పరిగణిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఆసియా, ఆఫ్రికా దేశాల నుండి -అమెరికా పనుపున- సౌదీ అరేబియా, కతార్ దేశాలు కిరాయి తిరుగుబాటుదారులను సమీకరించి టర్కీకి తరలిస్తూ వచ్చాయి. టర్కీలో అమెరికా, బ్రిటిష్, ఫ్రెంచ్ ఇంటలిజెన్స్ బలగాల చేత శిక్షణ పొందిన అనంతరం టెర్రరిస్టులు (ఇసిస్, ఆల్-నూస్రా మొ.) సరిహద్దు దాటి సిరియాలో ప్రవేశించేవారు.
అలాగే శరణార్ధులు కూడా ఇదే తరహాలో టర్కీ చేరి అక్కడి నుండి గ్రీసు, బాల్కన్ రాజ్యాల మీదుగా యూరోపియన్ దేశాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు, వెళ్తున్నారు. సి.ఐ.ఎ తదితర గూఢచార సంస్ధలు ఈ శరణార్ధులను పని గట్టుకుని ఐరోపా దేశాలకు తరలిస్తోంది. ఇలా వచ్చే శరణార్ధులను పరిమిత సంఖ్యలో అనుమతించడం ద్వారా శ్రామికుల కొరతను జర్మనీ తీర్చుకుంటోంది. ఇతర ఈయూ దేశాలు కూడా శరణార్ధులను అతి తక్కువ వేతనాల ఉద్యోగులుగా, కార్మికులుగా వినియోగిస్తూ లబ్ది పొందుతున్నాయి.
అయితే శరణార్ధుల అందరినీ స్వీకరించే ఉద్దేశం ఈయు దేశాలకు లేదు. శరణార్ధులకు వ్యతిరేకంగా స్ధానిక ప్రజలు ఉద్యమిస్తుండగా, వారందరికీ ఉపాధి ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వాలకు లేదు. (శరణార్ధుల చుట్టూ మరిన్ని భౌగోళిక రాజకీయ లక్ష్యాలు, సమస్యలు అల్లుకుని ఉన్నాయి. ఈ వ్యాసం పరిధిలో లేనందున ఇక్కడ చర్చించడం లేదు) అందువలన టర్కీలో పేరుకుపోయిన శరణార్ధులు టర్కీ సరిహద్దు దాటి రావడం ఈయు దేశాలకు ఇష్టం లేదు. టర్కీకి ఈయు సభ్యత్వం ఇస్తే గనక వీసా షరతులు రద్దైపోతాయి. టర్కీ నుండి పెద్ద ఎత్తున వలసలు జరుగుతాయి. ఆ పరిస్ధితిని తెచ్చుకోవడం ఇష్టం లేక టర్కీకి సభ్యత్వం ఇవ్వటానికి అనేక ఈయు సభ్య దేశాలు విముఖంగా ఉన్నాయి. ఈ విషయాన్నే ఎర్డోగన్ ప్రస్తావిస్తూ ఈయు దేశాలను దెప్పి పొడుస్తున్నాడు.
టర్కీ, రష్యాల స్నేహం దృఢం అయితే అది పశ్చిమ శిబిరానికి పెను సమస్య కావడం నిస్సందేహం. అమెరికాలో ఉన్న టర్కీ మత నాయకుడు గులెన్ ను అప్పగించాలని, టర్కీ ముఖ్యమో గులెన్ ముఖ్యమో తేల్చుకోవాలని ఎర్డోగన్ పదే పదే అమెరికాకు సవాలు విసురుతుండడంతో టర్కీ, అమెరికాల మధ్య చరిత్ర గతంలో ఎన్నడూ ఎరగని రీతిలో సంబంధాలు దెబ్బ తిన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమెరికా సైనికులు పెద్ద సంఖ్యలో కొలువు దీరిన ఇన్సిర్లిక్ సైనిక స్ధావరాన్ని పోలీసుల చేత దిగ్బంధనం కావించిన ఎర్డోగన్, స్ధావరానికి విద్యుత్ సరఫరాను సైతం బంద్ చేయించాడు. సైనిక స్ధావరం నుండి మరో సైనిక కుట్రను నివారించేందుకే ఇలా చేస్తున్నామని టర్కీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు మరింత కాక పుట్టిస్తున్నాయి.
ఈ పరిస్ధితుల్లో రష్యా పట్ల టర్కీ ప్రకటిస్తున్న స్నేహ భావన నిజమే అయితే భౌగోళిక రాజకీయాలలో మరో ముఖ్యమైన అడుగు పడినట్లే. టర్కీ సహకారం రష్యాకు అమితంగా లాభిస్తుంది. అమెరికా శిబిరానికి సైనికంగా, కొంతమేరకు ఆర్ధికంగా కూడా సవాలు విసురుతున్న రష్యాకు తాజా పరిణామం కొత్త ఊపిరిని ప్రసాదిస్తుంది. అయితే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ నియంతృత్వ పాలనకు పుటిన్ అభ్యంతరం చెప్పకపోవడం ఖండనార్హం. రష్యా, టర్కీల మధ్య చిగురిస్తున్న స్నేహం ఓ వైపు టర్కీ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడకపోవడం, మరో వైపు ప్రపంచ దేశాల ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాల ప్రజలకు సాపేక్షికంగా అమెరికా దుందుడుకు సైనిక-ఆర్ధిక-రాజకీయ విధానాల నుండి కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం కల్పించడం ఒక వింతయిన పరిస్ధితి. ఈ పరిస్ధితికి మొదటి కారణం టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అనడంలో సందేహం లేదు.
సిరియా చమురు క్షేత్రాల నుండి ట్యాంకర్లు పెద్ద మొత్తంలో సరిహద్దు ‘దాడి’ టర్కీలో ప్రవేశిస్తున్న దృశ్యాల ఫొటోలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించాయి.
‘దాటి’ బదులు ‘డి’ పడినట్టుంది,
“రష్యా మాత్రం ఎలాంటి ఖండనా జారీ చేయలేదు. పైగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎర్డోగన్ కు మద్దతు ప్రకటించింది. ఇలాంటి మద్దతే అమెరికా, పశ్చిమ రాజ్యాలు ప్రకటించినప్పటికీ …” అని రాసారు, అంటే వారు ఎలాటి మద్దతు ప్రకటించేరు? ఆ మద్దతు ‘అరెస్టులను’ ఖండించిన తరువాత ప్రకటిన్చారా? కొంచెం వివరించగలరా?
అంతర్జాతీయంగా ఆశావహమైన పరిస్థితి అని పూర్వాపరాలు చెప్తూనే “రష్యా, టర్కీల మధ్య చిగురిస్తున్న స్నేహం ఓ వైపు టర్కీ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడకపోవడం” అని కూడా మీరు రాయడం నాకు చాలా నచ్చింది. మొత్తంగా ఈ మీ పోస్టు నాకు చాలా విషయాలపై క్లారిటీ నిచ్చింది శేఖర్ గారూ, ధన్యవాదాలు.
కళ్యాణి గారు,
కుట్రకు రష్యా మద్దతు అన్న అంశంలో నా ఉద్దేశం సరిగా క్యారీ కాలేదు. అందుకని అక్కడ మరింత వివరణ చేర్చాను. ఈ వివరణ లేకపోవడం వల్ల మీకు ఆ అనుమానం రావటానికి ఆస్కారం ఏర్పడింది.
మళ్ళీ ఒకసారి ఆ భాగాన్ని చదవండి. ఇంకా అనుమానం మిగిలి ఉన్నట్లయితే చెప్పండి.
ఆఫీస్ లో ఖాళీ దొరికినప్పుడు కాస్త కాస్త చొప్పున (ఐ ప్యాడ్ లో) ఆర్టికల్స్ రాస్తున్నాను. తొందర తొందరగా రాస్తున్నాను కదా, తరచుగా అచ్చు తప్పులు దొర్లుతున్నాయి.
ధన్యవాదాలండీ, పూర్తిగా అర్ధమయింది.
ఎర్దోగన్ కోట్ ను అనువదించారనుకుంటాను, “… రష్యా సహకారంతో మాత్రమే సిరియా సమస్య ‘సంక్షోభం’ అవుతుంది” – అని రాసేరు. దానిని ఏ అర్ధం లో వాడేరో తెలియడం లేదు. (పరిష్కారమనే అర్ధమే అయితే ఆ మాట పైన రాసి ఉన్నారు),
అవును. ‘సంక్షోభం పరిష్కారం అవుతుంది’ అని ఉండాలి. Thanks, again.
ఎర్డోగన్ రష్యా స్నేహం గురించి ఆబ్సెసివ్ గా మాట్లాడుతున్నాడు. చెప్పిందే చెబుతూ వీలైనంత ఎక్కువగా పుటిన్ ని పొగుడుతూ, ‘నా ఫ్రెండ్’ అని పదే పదే చెబుతున్నాడు. రష్యా సహకారం కోసం ఆయన అంతగా పరితపిస్తున్నాడు. ఆయన ఆబ్సెషన్ ని రిఫ్లెక్ట్ చెయ్యడం కోసం ఆ కోట్ ఇచ్చాను. నేను మళ్ళీ చదివినా నాకా తప్పు కనపళ్లేదు. మీ శ్రద్ధ, ఆసక్తికి ధన్యవాదాలు.