పూర్తి స్ధాయి రాష్ట్రం కాదు -ది హిందూ ఎడిట్ (విమర్శ)


(True translation to today’s The Hindu editorial: Not a full-fledged state)

*********

ఢిల్లీ కేవలం కేంద్ర పాలిత ప్రాంతం మాత్రమే అని స్పష్టం చేయడం ద్వారా ఢిల్లీ హై కోర్టు, జాతీయ రాజధాని ప్రాంతం (నేషనల్ కేపిటల్ రీజియన్) యొక్క రాజ్యాంగ ప్రతిపత్తికి సంబంధించిన కొన్ని ప్రధాన మరియు అపరిష్కృత ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. రాజ్యాంగం లోని ఆర్టికల్ ౨౩౯ రాష్ట్ర మంత్రివర్గంతో సంబంధం లేకుండా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలు కల్పిస్తుంది. ఢిల్లీకి సంబంధించి ఆర్టికల్ ౨౩౯ఎఎ ద్వారా పొందుపరిచిన ప్రత్యేక అవకాశాలు ఆర్టికల్ ౨౩౯ ప్రభావాన్ని వ్యతిరిక్తం చేయజాలవని కోర్టు స్పష్టం చేసింది. మరో మాటలో చెప్పాలంటే పాలనా నిర్ణయాలకు తీసుకోవటంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఏకీభావం తప్పనిసరి. సుప్రీం కోర్టు సరిగ్గా దీనికి వ్యతిరేకమైన నిర్ణయం ప్రకటిస్తే తప్ప, ఢిల్లీకి పాలకులు ఎవరన్న విషయంలో కేంద్రంతో యుద్ధం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ, మంత్రివర్గం సలహా సంప్రదింపులకు కట్టుబడి వ్యవహరించవలసిన అవసరం లేదన్న స్పష్టమైన కోర్టు రూలింగ్ కు నిబద్ధం కావలసి ఉంటుంది. ఎన్ డి ఎమ్ సి వర్సెస్ పంజాబ్ కేసులో సుప్రీం కోర్టు ఇలాంటి తీర్పునే ఇచ్చిన నేపధ్యంలో ఢిల్లీ హై కోర్టు తీర్పు ఆశ్చర్యకరం ఎమీ కాదు. అయితే పార్లమెంటు, విదేశీ రాయబార కార్యాలయాలు తదితర కీలక కేంద్ర ప్రభుత్వ సంస్ధలు నెలకొని ఉన్న ప్రాంతంపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ కలిగి ఉండవలసిన బాధ్యతకూ, ప్రజలు ప్రాతినిధ్య ప్రభుత్వం చేత పాలించబడాలన్న ప్రజాస్వామ్య సూత్రానికీ మధ్య సరైన సమతూకం పాటించబడుతోందా లేదా అన్న అంశంపైన ప్రజల్లో చర్చ కొనసాగుతూనే ఉంటుంది.

రాజకీయ స్ధాయిలో, తాజా పరిణామాలు అసెంబ్లీలో భారీ మెజారిటీ కలిగి ఉన్న ఎఎపి నేత, ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రాజకీయంగా ఎదురు దెబ్బగా ఎవరైనా భావించవచ్చు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తో కేజ్రీవాల్ అధికారాల యుద్ధంలో తలపడుతున్నారు; ఢిల్లీని పూర్తి స్ధాయి రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యానికి ఛాంపియన్ గా ఆయన అవతరించారు. భారతీయ జనతా పార్టి విషయానికి వస్తే, కేజ్రీవాల్ తన కార్యాలయానికి/అధికారానికి ఉన్న రాజ్యాంగ పరిమితులను ఆమోదించాలన్న తన వాదనకు సమర్ధనగా కోర్టు తీర్పును పేర్కొనవచ్చు. ఎన్నికల్లో గెలిచే పార్టీ ప్రాంతాన్ని పరిపాలించలేకపోతే ఇక ఎన్నికలు జరపడం ఎందుకని ఎఎపి ప్రశ్నిస్తోంది. ఆధిపత్యం కోసం జరిగే అలాంటి జగడం వ్యక్తిత్వాల ఘర్షణ ఫలితంగా, ముఖ్యంగా కేంద్రంలో, జాతీయ రాజధాని ప్రాంతం (నేషనల్ కేపిటల్ టెరిటరీ – ఎన్ సి టి) లో వైరి పార్టీలు అధికారాలు నెరుపుతున్నప్పుడు, ఉద్భవించే అవకాశాలు ఉన్నాయన్నది ఒక వాస్తవం. అయితే ప్రజల దృక్పధంలో కొన్ని ప్రశ్నలు నిలిచే ఉంటాయి. పరిపాలక వ్యవస్ధలో వాస్తవంగా ఏ పార్శ్వాన్ని/అంగాన్ని ఎవరు నడపాలన్న అంశంపై బహుళ అంచనాలు, నిర్ధారణలకు రాగల నిర్మాణాలను ఏర్పాటు చేయడం వివేకంతో చేసిన పనేనా? లెఫ్టినెంట్ గవర్నర్ కు దాదాపు పూర్తి వీటో అధికారం ఉన్నపుడు, ఢిల్లీ లాంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అయినప్పుడు ‘సలహా, సంప్రతింపుల’ అధికరణను పొందుపరచడం అవసరమా? సందేహాలకు తావులేని చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ నిర్మాణాన్ని కలిగి ఉండటం మరింత వివేకవంతమైన పని కాదా?

*******

ఎఎపి నేతృత్వం లోని ఢిల్లీ ప్రభుత్వం, బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఘర్షణను వ్యక్తిత్వాల మధ్య ఘర్షణగా, సూచన మాత్రంగానైనా సరే, పేర్కొనడం అత్యంత ఇరుకైన పరిశీలన. అటువంటి పరిశీలన ఢిల్లీ ప్రజల ప్రయోజనాలకు నేరుగా వ్యతిరేకంగా నిలబడుతుంది; గట్టిగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తున్న బడా దళారీ పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాల ప్రయోజనాలకు వంత పాడడమే. ద హిందూ పత్రిక ఇటీవల కాలంలో మరింత నగ్నంగా ఆధిపత్య వర్గాలకు కొమ్ము కాసేలా వెలువరిస్తున్న సంపాదకీయాల వెలుగులోనే ఈ సంపాదకీయం కూడా వెలువరించింది.

కేంద్ర ప్రభుత్వం/హోం మంత్రిత్వ శాఖ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ ఇప్పటివరకు నిలువరించిన, ఆటంకం కల్పించిన, రద్దు చేసిన ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాల జాబితాను పరిశీలిస్తే గనక ఇది వ్యక్తిత్వ వైరం కాకపోగా, పక్కా వర్గ వైరం అని స్పష్టం అవుతుంది. యుపిఏ హయాంలోనే మొదటి విడత ప్రభుత్వ పాలనలో ఎఎపి/కేజ్రీవాల్ ప్రభుత్వం కేంద్రమంత్రుల పైనా, అంబానీ కుటుంబం పైనా నమోదు చేసిన అవినీతి కేసులపై విచారణ జరగకుండా బిజెపి ప్రభుత్వం నిరోధించింది. ఢిల్లీ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం నుండి తప్పించి కేంద్ర ప్రభుత్వ/లెఫ్టినెంట్ గవర్నర్ అధికార పరిధిలోకి తెచ్చుకున్నారు.

అనగా ఢిల్లీ ఎసిబిని కేంద్ర ప్రభుత్వం అడ్డంగా, ఎలాంటి సిగ్గు ఎగ్గు లేకుండా స్వాధీనం చేసుకుంది. తద్వారా గత ఢిల్లీ ప్రభుత్వాల (బిజెపి, కాంగ్రెస్ లు రెండూ ప్రభుత్వాలు నడిపాయి) అవినీతిపైన ఎఎపి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కట్టుదిట్టం చేసింది. ఇది చేసి కూడా ‘అవినీతిని నిర్మూలిస్తాం’ అన్న వాగ్దానాన్ని ఎఎపి ప్రభుత్వం నెరవేర్చలేదన్న విమర్శించే తెంపరితనానికి, సిగ్గులేనితనానికి కేంద్ర సచివులు, బిజెపి నేతలు పాల్పడుతున్నారు.

ఢిల్లీ సివిల్ అధికారుల (డిఎఎన్ఐసిఎస్ – ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సివిల్ సర్వీసెస్) వేతనాలను పెంచుతూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, ఢిల్లీ ఎమ్ఎల్ఎల వేతనాల పెంపు నిర్ణయాన్ని కేంద్రం నిలుపుదల చేసింది. దశాబ్దకాలానికి పైగా పెండింగ్ లో ఉన్న డానిక్స్ అధికారుల వేతన పెంపు సమస్యను పరిష్కరించే అవకాశాన్ని కూడా మోడి ప్రభుత్వం రద్దు చేసేసింది. అసంఘటిత కార్మికులకు -అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు, నిర్మాణరంగ కార్మికులు, గృహాల పని మనుషులు, ఆటో మరియు ట్యాక్శీ డ్రైవర్లు, దారిద్ర రేఖ దిగువ కుటుంబాలు, రిక్షా కార్మికులు, హాకర్లు, చెత్తయేరు కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు- నిర్దేశించబడిన కనీస వేతనాలు చెల్లించడం లేదని ఫిర్యాదు అందిన తోడనే వారి వేతనాలు పెంచడమే కాకుండా తప్పనిసరిగా చెల్లించబడేలా తగిన చర్యలు తీసుకుంది. తనిఖీ బృందాలను, సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వ స్క్రూటినీని ఎదుర్కోవలసి వచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వాలన్నీ పోలీసు యంత్రాంగంపై నియంత్రణ కలిగి ఉండగా ఢిల్లీ ప్రభుత్వానికి అది లేకుండా పోయింది. దానితో పోలీసుల అరాచకాలను అడ్డుకుని చర్యలు తీసుకునే అధికారం, అవకాశం ఎఎపి ప్రభుత్వానికి రద్దయింది. పైగా ఎఎపి ఎంఎల్ఎ లపై పోలీసుల చేతనే మోడి ప్రభుత్వం వరుసగా తప్పుడు కేసులు నమోదు చేయిస్తూ వారిని ఆగమేఘాల పైన అరెస్టులు చేయించి జైళ్లకు పంపుతోంది. ఢిల్లీ ప్రభుత్వానికి సహకరించే సివిల్ సర్వీసు అధికారులపైన తప్పుడు అవినీతి కేసులు నమోదు చేయించడం ద్వారా, కేజ్రివాల్ ప్రభుత్వానికి సహకరించరాదన్న బెదిరింపులు చేస్తోంది.

మరో వైపు అంబాని కుటుంబంతో సహా బడా ధనిక వర్గాలు, కంపెనీలు పాల్పడుతున్న దోపిడి, అవినీతిలపై చర్యలు తీసుకోకుండా కేంద్రం ఆటంకాలు కల్పిస్తోంది. అనీల్ అంబానికి చెందిన విద్యుత్ పంపిణి కంపెనిలు తప్పుడు లెక్కలతో అధిక బిల్లులు మోదడంపై పెట్టిన కేసులపై విచారణ జరగకుండా అధికారాలు లాగేసుకుంది. రిలయన్స్ గ్యాస్ పంపిణీ, ధరలపై పెట్టిన అవినీతి కేసులకు అదే గతి పట్టింది. గ్యాస్ ధరల నిర్ణయంలో మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ తదితరులు పాల్పడిన అధిక ధరల కుంభకోణంపై విచారణకు ఆదేశించగా ఆ కేసునూ లాగేసుకుంది మోడి ప్రభుత్వం. ఢిల్లీ హై కోర్టు తీర్పు ఈ అధికారలను ఢిల్లి ప్రభుత్వం నుండి లాగేసుకుని మోడి ప్రభుత్వ ఆధిపత్యానికి, అనైతికతకు మద్దతుగా వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మనలేని పరిస్ధితిని ఈ తీర్పు కల్పించింది.

ఈ చర్యలను, పరిణామాలను వ్యక్తిత్వ ఘర్షణలుగా కొట్టిపారేయడం అంటే మోడి ప్రభుత్వం పాల్పడుతున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చర్యలకు సంపూర్ణ మద్దతు ఇవ్వడమే; పరిస్ధితి తీవ్రతను తక్కువ చేసి చెప్పడం; ధనికవర్గాల ప్రయోజనాలకు అడ్డంగా కొమ్ము కాయటం; ఈ ప్రభుత్వాలు, సో కాల్డ్ ప్రజాస్వామ్యం, ఎన్నికలు అన్నీ ఒట్టి బూటకం అనీ, జనాన్నీ మోసం చేసేందుకు ఉద్దేశించినవేననీ, ఇది అచ్చంగా దోపిడీ వర్గాల నియంతృత్వమే అనీ ఎటువంటి శషభిషలు లేకుండా నిర్ధారించడం.

ఎఎపి ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయాలు… సంస్కరణల గంజాయి వనంలో మొలుస్తున్న తులసీ మొక్కలు లాంటివి. ఇవి సఫలం అయితే సంస్కరణల నడకకు పెను ప్రమాదం పొంచి ఉన్నది. లాటిన్ అమెరికా దేశాలలో ఛావెజ్, లూలా, కాస్ట్రో, కొర్రియా తదితర నేతలు అనుసరించిన కార్మికవర్గ అనుకూల విధానాలకు నకలుగా వీటిని చెప్పవచ్చు. అనగా దోపిడీ వ్యవస్ధలోని ఆధిపత్య వర్గాల సంపదల పంపిణీలో ఎంతో కొంత అధిక భాగం కార్మికవర్గానికి తరలించేందుకు తోడ్పడే చర్యలు ఇవి. ఈ విధానాలకు ప్రజలు రుచిమరిగితే ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అవే విధానాలు డిమాండ్ చేస్తారని బిజెపి, కాంగ్రెస్ తదితర ఆధిపపత్య, పాలకవర్గ పార్టీలకు తెలుసు. ఆ ప్రమాదం రాకుండా ఆదిలోనే తుంచివేసే ప్రయత్నాలను బిజెపి సాగిస్తుండగా అందుకు కోర్టులు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి. తామూ ఆ తానులోని ముక్కలమే అని చాటుతున్నాయి.

ఇంతటి తీవ్ర పరిస్ధితిని ద హిందు ఎడిటోరియల్ తేలిక చేసి చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఇది తీవ్ర గర్హనీయం. నయా ఉదారవాద సంస్కరణల విధానాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించాక ప్రగతి ముసుగులో ప్రగతి నిరోధకత్వాన్ని పాఠకుల మెదళ్ళలోకి ప్రవేశపెట్టడానికి కూడా పత్రికలు వెనుదీయబోవని ద హిందు రుజువు చేస్తోంది.

3 thoughts on “పూర్తి స్ధాయి రాష్ట్రం కాదు -ది హిందూ ఎడిట్ (విమర్శ)

 1. విమర్శ):
  Delhi is not a full fledged state. It is national capital territory. (i.e;union territory) as per constitution of india. The demand for full fledged state may not be considered by goi due to the importance of delhi. Moreover delhi is a city not a state. So there is no valid arguement to convert into full fledged state.

 2. I am fully against the contents of this article . This article writer did not consider what happens when AAP is given full authority in centre . The article writer is an amateur in my opinion as he did not consider the facts that two knives can not sit in a Scabbard, this is too foolish to write.

 3. This comment by ‘PANI’ is vague, unspecific and a bit abusive.

  And this poor fellow doesn’t wish to respect people’s choice, and goes on to give sermons what is amateurish!

  “This article writer did not consider what happens when AAP is given full authority in centre.”

  What the hell is this? What is this strange elderly person meant by issuing such a sweeping statement? Who gave this fellow an extra-constitutional right to occupy a morally higher ground than the people’s, when they themselves have elected AAP to rule them?

  And how can somebody reject a political party it’s constitutionally sanctioned right to contest nationwide election and come to power at center even before it wishes do so?

  There is nothing valuable expression in this comment to consider responding specifically. Of course, two knives cannot sit in a Scabbard, so what? Can it be derived that “that’s why the AAP needs it’s own scabbard of state govt?”

  When one faces this type of comment, there is no other way to respond except ending up beating the bush. So sad this article has to attract such wayward, self-sanctioned righteous people.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s