
Abdel Hamid Abaaoud -Said to be mastermind behind Paris, Brussels terror attacks
అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, బ్రిటన్ తదితర దేశాలలో భారీ స్ధాయి టెర్రరిస్టు దాడులు జరిగినప్పుడల్లా పశ్చిమ దేశాలు, పత్రికలు, ఛానెళ్లు, రాజకీయ నేతలు హాహాకారాలు చేయడం మనం ఎరుగుదుము. వారి హాహాకారాలను మన పత్రికలు, ఛానెళ్లు కూడా తలకు ఎత్తుకుని వాళ్లవంతుగా మరిన్ని హాహాకారలు చేయడం కూడా మనం చూస్తూ ఉంటాము. ఇస్లామిక్ ఉగ్రవాదం పశ్చిమ దేశాలపై కక్ష కట్టిందని వాళ్లు చెబుతుంటే, మనమూ నమ్మి సహానుభూతి ప్రకటిస్తున్నాము.
అయితే ఆ టెర్రరిస్టులు అనేక యేళ్లుగా లేదా నెలలుగా పశ్చిమ దేశాల ప్రభుత్వాల, ఇంటలిజెన్స్ సంస్ధల పోషణలో ఉన్నాయని ఎవరన్నా చెప్పబోతే మాత్రం వాళ్లను పిచ్చివాళ్ల కింద జమకట్టడం కూడా ఒక ధోరణిగా, నమ్మకంగా, జ్ఞానంగా చెలామణి అవుతుండడం ఒక వాస్తవం. ముఖ్యంగా మిడి మిడి జ్ఞాన బుద్ధి జీవులకు ఇలా భావించడం ఒక ఫ్యాషన్. పశ్చిమ పత్రికలు అలాంటి వాస్తవాలను కుట్ర సిద్ధాంతాలుగా చెప్పడంవల్ల వారి మాటలనే వాస్తవాలుగా నమ్మేస్తూ అసలు వాస్తవాలను నమ్మలేని పరిస్ధితి నెలకొని ఉన్నది.
మరి ఆ పశ్చిమ పత్రికలే, సదరు టెర్రరిస్టులను పశ్చిమ ప్రభుత్వాలు పోషించాయని వెల్లడి చేస్తేనో?! ప్రభుత్వ సంక్షేమ పధకాల ద్వారా ఆ టెర్రరిస్టులకు ఫైనాన్స్ వనరులు సమకూర్చి పెట్టడమే కాకుండా, దాడులు జరిగే ముందు రోజు వరకూ వారిని సకల మర్యాదలతో పోషించారని పశ్చిమ పత్రిలే వెల్లడి చేస్తే మన మిడి మిడి జ్ఞాన బుద్ధి జీవులు నమ్ముతారా? అప్పుడన్నా వారి బుద్ధి వికసిస్తుందా? అప్పుడన్నా వారి కళ్లు తెరుచుకుంటాయా? అప్పుడన్నా అవి కుట్ర సిద్ధాంతాలు కాదని గ్రహిస్తారా?
వాల్ స్ట్రీట్ జర్నల్, అమెరికాలో పేరు మోసిన పత్రిక అని తెలియని వారు ఉండరు. ప్యారిస్, బ్రసెల్స్ లలో అత్యంత దారుణమైన రీతిలో భారీ టెర్రరిస్టు దాడులకు పాల్పడిన కరుడు గట్టిన ఇసిస్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులలో కనీసం ఐదు మంది బెల్జియం ప్రభుత్వ పోషణలో ఉన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడి చేసింది. ఈ విషయాన్ని ‘ఫలానా వెబ్ సైట్’ చెప్పడం వల్ల ఈ బ్లాగ్ లో చెప్పడం లేదు. (ఆఫ్ కోర్స్, ఆ వెబ్ సైట్ ఏమిటో నాకు తెలియదనుకోండి!) పేరు మోసిన అమెరికా పత్రిక ప్రచురించిన వార్త ఆధారంగా మాత్రమే రాయడం జరుగుతోంది.
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం ప్యారిస్, బ్రసెల్స్ లలో ఉగ్రవాద దాడులకు పాల్పడిన టెర్రరిస్టులలో కనీసం ఐదుగురు, దాడులకు మూడు వారాల ముందు వరకూ భారీ మొత్తంగా సంక్షేమ పధకాల నిధులు పొందారు. ఐదుగురు అనుమానితులు కలిసి కనీసం 50,000 యూరోలు (56,000 డాలర్లు లేదా దాదాపు 37 లక్షల రూపాయలు) సంక్షేమ పధకాల ముసుగులో బెల్జియం ప్రభుత్వం నుండి పొందారు. ప్రధాన నిందితుడు సలాహ్ అబ్దెసలామ్ కనీసం 19,000 యూరోలు (21,000 డాలర్లు) నిరుద్యోగ సంక్షేమ సాయం కింద నిధులు పొందాడు. ఇలా ఇవ్వబడిన మొత్తంలో గణనీయమైన భాగం పేలుడు పదార్ధాల సమీకరణకు ఖర్చు చేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పడం గమనార్హం.
ప్యారిస్ నగరంలో నవంబర్ 13, 2015 తేదీన జరిగిన వరుస బాంబు పేలుళ్లు, తుపాకి కాల్పులు, మానవబాంబు దాడులలో 130 మంది చనిపోగా 300 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ యేడు మార్చి నెల 18 తేదీన అబ్దెసలాం ను బెల్జియం పోలీసులు, ఇంటలిజెన్స్ వర్గాలు అరెస్టు చేయగా, ఆ అరెస్టు జరిగిన నాలుగు రోజులకే (మార్చి 22 తేదీన) బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో ఉగ్రవాద దాడులు జరిగాయి. బ్రసెల్స్ లో ఈయూ కార్యాలయాల సమీపంలోని మెట్రో స్టేషన్ లో, ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడిలో 35 మంది చనిపోగా డజన్ల మంది గాయపడ్డారు. ప్యారిస్ దాడిలో పాల్గొన్న మానవ బాంబులకు రవాణా, సరఫరా సౌకర్యాలను అబ్దెసలాం కల్పించాడని బెల్జియం ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
బ్రసెల్స్ పై దావా
దాడుల గురించి ముందే తెలిసినా నివారించలేదని ఆరోపిస్తూ ప్యారిస్ దాడుల బాధితులు బ్రసెల్స్ పై దావా వేసిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ప్యారిస్ దాడుల అనుమానితులు ఉగ్రవాద దాడులకు సిద్ధపడుతున్నట్లు బ్రసెల్స్ కు (బెల్జియం ప్రభుత్వానికి) ముందే తెలుసనీ, వారిపై అప్పటికే నిఘా పెట్టిన బెల్జియం గూఢచార సంస్ధలకు వారి ఏర్పాట్ల గురించి ముందే సమాచారం ఉన్నదనీ అయినప్పటికీ దాడులను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు బెల్జియం గూఢచార, పోలీసు, ప్రభుత్వ వర్గాలు తీసుకోలేదని ప్యారిస్ దాడుల బాధితులు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా దాడులు జరగడానికి సహకరించినందుకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతు గత మే నెలలో బాధితులు దావా దాఖలు చేశారు.
దాడుల సంగతి బెల్జియం ప్రభుత్వానికి ముందే తెలుసున్న విషయాన్ని రుజువు చేసేందుకు తగిన సాక్షాలను తాము సేకరించామని వారి లాయర్ పత్రికలకు చెప్పారు. సలాం అబ్దెసలాం, ఇబ్రహీం అబ్దెసలాం లతో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులపై బెల్జియం గూఢచార వర్గాల నిఘా పెట్టాయని, వారు పేలుళ్లకు అవసరమైన సామాగ్రి కొనుగోలు చేయడం, తగిన ఏర్పాట్లు చేసుకోవడం… మొ.న పరిణామాలన్నీ నిఘా వర్గాలకు తెలిసే జరిగాయని, నిఘా పనిముట్లు వారి కదలికలను ఎప్పటికప్పుడు రికార్డు చేశాయని ప్యారిస్ దాడుల బాధితుల కౌన్సెల్ పత్రికలకు వివరించాడు.
“సాయుధ దాడులకు వారు సిద్ధపడుతున్న కదలికలను నిఘా సేవలకు బాధ్యులైన అధికారులు ముందే పసిగట్టారు. వారు చూస్తుండగానే తుపాకులు, పరికరాలు, పేలుడు పదార్ధాలను వారు సేకరించారు. వాళ్లు రాడికలైజ్ కావడం కూడా వారికి తెలుసు. అయినా వారిని ప్రాసిక్యూట్ చేయడానికి బెల్జియం నిఘా వర్గాలు చర్యలు తీసుకోలేదు. దాని ఫలితం – వందల మంది అమాయకుల ఊచకోత అన్నది మీకు తెలిసిన విషయమే. ఈ నేపధ్యంలో మేము బెల్జియంపై దావా వేస్తున్నాము. తద్వారా ఇలాంటి వైఫల్యం ఇంకోసారి జరగకూడదని ఆశిస్తున్నాం” అని బాధితుల లాయర్ సామియా మక్తౌఫ్ ఆర్ టి ఎల్ స్టేషన్ తో మాట్లాడుతూ చెప్పారని స్పుత్నిక్ న్యూస్ తెలిపింది.

Paris shooting suspect, Salah Abdeslam, and suspected accomplice, Hamza Attou, are seen at a petrol station on a motorway between Paris and Brussels, in Trith-Saint-Leger, France in this still image taken from a November 14, 2015 video provided by BFMTV on January 11, 2016. REUTERS/BFMTV via Reuters TV
ప్యారిస్ పోలీసుల నివేదిక ప్రకారం దాడులకు ముందు సలాహ్ అబ్దెసలాం ఫేస్ బుక్ లో ఇసిస్ జెండాను పోస్ట్ చేశాడు. ఈ సంగతి బెల్జియం పోలీసులు, నిఘా శాఖకు తెలిసినప్పటికీ ఆ దేశం అప్రమత్తం కాలేదు. దాయిష్ (ఇసిస్) లో ప్రముఖ నేత అబ్దెల్ హమీద్ అబౌద్ ను ప్యారిస్ దాడి అనుమానితులు 2015 లో కలిసిన సంగతిని కూడా బెల్జియం నిఘా వర్గాలు నమోదు చేశాయి. ఐనప్పటికీ అనుమానితులను వాళ్లు ఎందుకు అరెస్టు చేయలేదు? ఎందుకు విచారించలేదు. దాడులు జరిగాక ఛానెళ్ళు, పత్రికల్లో కడవలు కడవలు కన్నీళ్ళు కార్చుతూ, ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తాం, అంతు చూస్తాం అంటూ ప్రతిజ్ఞలు చేసే పశ్చిమ నేతలు, ప్రభుత్వాలు దాడి సమాచారం పట్ల ముందే ఎందుకు స్పందించలేదు?
ఎందుకంటే దాడులు జరగడమే వారికి కావాలి కనుక. దాడులకు ఇస్లామిక్ తీవ్రవాదులను తయారు చేయడం, శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడం, పేలుడు సామాగ్రి అందజేయడం, ముహూర్తం నిర్ణయించడం, దాడులు సజావుగా జరిగేలా, సాధ్యమైనంత తీవ్ర నష్టం జరిగేలా చూడడం… ఇవన్నీ చేసేది వారే కనుక. దాడులు జరగాలి; జనం చావాలి; వీలైనంత ఎక్కువమంది దారుణంగా చావాలి; ప్రజల్లో ఆగ్రహావేశాలు మిన్ను ముట్టాలి; ఆ ఆవేశ గుండెలతో నిండిన జనం ప్రభుత్వాలకు సమస్త అధికారాలు కట్టబెట్టాలి; ఉగ్రవాదం అరికట్టే పేరుతో సిరియాపై మళ్ళీ సైనిక దాడి చేసినా ఒప్పుకోవాలి; లిబియాలో మరోసారి సైన్యాన్ని దించినా మద్దతు ఇవ్వాలి; దేశంలో ఎమర్జెన్సీ విధించినా, అది ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసమే గనక, మౌనంగా ఉండిపోవాలి; నల్ల చట్టాలకు మరింత పదును పెట్టినా భరించాలి; చివరికి ప్రభుత్వాల నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించే జనంపై ఆ నల్ల చట్టాలనే ప్రయోగించి అణచివేసే సౌకర్యం సమకూరాలి.
వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్, ఎన్ బి సి న్యూస్, ద గార్డియన్, మెయిల్ ఇత్యాది పశ్చిమ వార్తా సంస్ధలు ఉగ్రవాద దాడులకు పశ్చిమ ప్రభుత్వాలే మద్దతు సమకూర్చుతున్న విషయాన్ని వెల్లడి చేయడం ఇదే కొత్త కాదు. గతంలో జరిగిన అనేక దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులపై ముందే పోలీసు, గూఢచార నిఘా ఉన్న సంగతిని అవి ఆయా దాడులు జరిగిన తర్వాతి రోజుల్లో వెల్లడి చేశాయి. సిరియాలో ఇసిస్, ఆల్ నూస్రా తదితర ఉగ్రవాద గ్రూపులను ప్రవేశపెట్టింది పశ్చిమ దేశాలు, గల్ఫ్ దేశాలేనని వెల్లడి చేసిందీ ఆ పత్రికలే. 9/11 దాడులకు అమెరికా పాలకవర్గాల పనుపున సౌదీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన సంగతి చెప్పిందీ అవే.
అయితే ఈ వార్తలను పరిమిత పరిశోధనలుగా, అధ్యయనాలుగా మాత్రమే ఆ పత్రికలు ప్రచురిస్తాయి. సదరు వాస్తవాలు తమ ఎడిటోరియల్ విధానాలలోకి ప్రవేశించకుండా అవి జాగ్రత్త పడతాయి. రోజువారీ విశ్లేషణల్లొ అవి చొరబడకుండా శ్రద్ధ తీసుకుంటాయి. అనగా అప్పుడప్పుడూ కనిపించే వార్తా కధనాలుగా మాత్రమే అవి మిగిలిపోతాయి తప్ప ప్రధాన స్రవంతి విశ్లేషణల్లోకి ప్రవేశించవు. ఆ విధంగా అవి అనాధ కధనాలుగా, స్టోరీలుగా మిగిలిపోయి ప్రజల రోజువారి అవగాహనకు దూరంగా ఉండిపోతాయి. అలా మిగిలిపోవడమే పశ్చిమ పత్రికల ఎడిటోరియల్ పాలసీగా ఉంటుంది. ఆ పాలసీ పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద లక్ష్యాలు నెరవేరడం కోసమే అన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు.
అమెరికా అధ్యక్షపదవి పోటీదారుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే కదా ఇప్పుడు చెబుటున్నడు ఉగ్రవాదం పెరగడానికి హిల్లరీ(ప్రభుత్వం) కారణమని కుండబద్దలుకొట్టినట్లు చెప్పాక ఇంకా ఎవరికైనా సందేహాలుంటే వారిని నమ్మించడం కష్టం.