డొనాల్డ్ ట్రంప్: ప్రపంచీకరణని తిరగదోడతాడా?


Trump

నవంబరు నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒక వింత పరిస్థితిని ప్రపంచ ప్రజల ముందు ఉంచుతున్నాయి. రెండు ప్రధాన పార్టీలైన రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు తమ సాంప్రదాయ రాజకీయార్ధిక, సామాజికార్ధిక ప్రాధామ్యాలను పక్కనబెట్టి ప్రత్యర్ధి ప్రాధామ్యాలను సొంతం చేసుకోవడమే ఆ వింత పరిస్ధితి!

సాధారణంగా అమెరికాలో రిపబ్లికన్ పార్టీ రాజకీయంగా, సామాజికంగా కన్సర్వేటివ్ భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆర్థికంగా ధనిక వర్గాలకు, కంపెనీలకు, ముఖ్యంగా వాల్ స్ట్రీట్ వర్గాల ప్రయోజనాలకు కట్టుబడి పని చేస్తుంది. డెమొక్రటిక్ పార్టీ, అందుకు విరుద్ధంగా, సామాజికంగా మరియు రాజకీయంగా లిబరల్ భావాలకు పేరు పొందింది. ఆర్ధికంగా సెంట్రిస్టు విధానాలకు, అనగా, సంక్షేమ విధానాలను అమలు చేసే పార్టీగా పండితులు, విశ్లేషకులు భావిస్తారు. కాని ప్రస్తుతం ట్రంప్, హిల్లరీల చుట్టూ అలుముకున్న వాతావరణం ఈ విశ్లేషణలను అయోమయంలో పడవేస్తోంది.

రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్, ప్రచారం సందర్భంగా గ్లోబలీకరణ విధానాలపై విరుచుకుపడటం అమెరికా బహుళజాతి కంపెనీలకు మింగుడు పడడం లేదు. అదే విధంగా అమెరికా సాగిస్తున్న యుద్ధాలకు, యుద్ధ ప్రయత్నాలకు విరుద్ధమైన విధానాలను ట్రంప్ వ్యక్తం చేస్తున్నాడు. మరో పక్క  డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్, అమెరికా ఆధిపత్యం కొనసాగవలసిన అవసరం గురించీ, వాల్ స్ట్రీట్ కంపెనీల విస్తరణ గురించీ తన ప్రచారంలో నిబద్ధత ప్రకటిస్తోంది.

దానితో వాల్ స్ట్రీట్ కంపెనీలు/బహుళజాతి కంపెనీలు/అమెరికా సామ్రాజ్యవాద వర్గాలు క్లింటన్ కు పెద్ద ఎత్తున నిధులు గుప్పిస్తూ , డొనాల్డ్ ట్రంప్ పైన విషం గుమ్మరిస్తున్నాయి. ఆయన పైన అనేక తప్పుడు పుకార్లు ప్రచారంలో పెడుతున్నాయి. సామ్రాజ్యవాద కంపెనీల ప్రయోజనాలకు కట్టుబడి పని చేసే పశ్చిమ కార్పొరేట్ మీడియా కంపెనీలు సదరు పుకార్లను పూర్తి స్ధాయిలో ప్రచారం చేసి పెడుతున్నాయి. ట్రంప్ అధికారంలోకి వస్తే అమెరికా సాధించిన అభివృద్ధి అంతా తల్లకిందులు అవడం ఖాయం అన్నట్లుగా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే ప్రయత్నాలను మీడియా సాగిస్తోంది.

ఉదాహరణకి, అమెరికా వాణిజ్య విధానాలు అమెరికన్ల ఉద్యోగాలను హరించివేస్తున్నాయని ట్రంప్ వాదిస్తున్నారు. ఐరోపా దేశాలతో పాటు, మెక్సికో లాంటి మూడో ప్రపంచ దేశాలతో అమెరికా ఏర్పాటు చేసిన వాణిజ్య కూటములు అమెరికా నుండి ఉద్యోగాలను తరలిస్తున్నాయని అమెరికా ప్రజలకు ఉపాధి అవకాశాలను తగ్గిస్తున్నాయని ట్రంప్ ప్రచారం చేస్తున్నాడు. 

ఐరోపా (యూరోపియన్ యూనియన్) దేశాలతో ట్రాన్స్-పసిఫిక్ పార్టనర్ షిప్ ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా, కెనడా-మెక్సికో లతో కలిసి రెండు దశాబ్దాలుగా నాఫ్తా (నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ -ఎన్ ఎఫ్ టి ఎ) స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం ద్వారా ఉమ్మడి మార్కెట్ ప్రయోజనాలు పొందుతోంది. ఆగ్నేయాసియా దేశాల వాణిజ్య కూటమి ‘ఆసియాన్’ తోనూ, లాటిన్ అమెరికా దేశాలతోనూ, పసిఫిక్ రిమ్ దేశాలతోనూ కూడా వివిధ స్ధాయిలలో స్వేఛ్చా వాణిజ్య ఒప్పందాలను అమెరికా కలిగి ఉన్నది.

ఇవన్నీ అమెరికా ప్రయోజనాలకు విరుద్ధం అని వాదిస్తున్న ట్రంప్, తాను అధికారం లోకి వస్తే ఈ విధానాలను సమీక్షిస్తానని హామీ ఇస్తున్నాడు. “మన రాజకీయ నాయకులు దూకుడుగా ప్రపంచీకరణ విధానాలను అమలు చే(యి)స్తున్నారు. ఫలితంగా మన ఉద్యోగాలు, మన సంపదలు, మన ఫ్యాక్టరీలు అన్నీ మెక్సికో తదితర విదేశాలకు తరలి పోతున్నాయి. రాజకీయ నాయకులకు విరాళాలు పంచిపెట్టే ఆర్ధిక ఉన్నత వర్గాలేమో ప్రపంచీకరణ వల్ల మరింతగా సంపదలు అర్జిస్తున్నారు. నేనూ వారిలో ఒకడిగా ఉన్నందుకు నా పైన నాకే ద్వేషం కలుగుతోంది” అంటూ ట్రంప్ జనాన్ని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Donald_Trump“దాదాపు ప్రతి వాణిజ్య ఒప్పందానికీ హిల్లరీ మద్దతు ఇచ్చింది. అమెరికా కార్మికులను నష్టపరిచే వాణిజ్య ఒప్పందాలకు అనుకూలంగా పని చేసింది. ఆమె విధానాలు అమెరికా ప్రజలకు వినాశకరంగా పరిణమించాయి” అని డొనాల్డ్ వివిధ ఎన్నికల సభల్లో విరుచుకుపడుతున్నారు. “ఈ విధానాల వల్ల లోతట్టు నగరాలు పేదరికంతో మగ్గుతున్నాయి; ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. ప్రత్యేక వర్గాల ప్రయోజనాలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి” అని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ప్రత్యేక ఆర్ధిక వర్గాలు అంటే ఉన్నత ఆర్ధిక (సూపర్ రిచ్) వర్గాలని ట్రంప్ భావం.

ట్రంప్ మాటలను ఉటంకిస్తూ హిల్లరీ క్లింటన్ సైతం జనాన్ని భయపెడుతోంది. “ఆయన నేతృత్వంలో అమెరికా ఆర్ధిక సామర్ధ్యం కుంటుబడుతుంది. ప్రపంచ ఆర్ధిక వ్యవహారాలను చక్కబెట్టడంలో అమెరికా సంపాదించిన శక్తి ప్రమాదంలో పడిపోతుంది” అని హిల్లరీ ప్రచారం చేస్తోంది. కార్పొరేట్ వర్గాలు హిల్లరీకి పూర్తి స్ధాయిలో వంత పాడుతున్నాయి. ట్రంప్ ని ఒక రాక్షసుడిగా, జాతి విద్వేషిగా, ముస్లిం విద్వేషిగా, తెలివి హీనుడిగా వాళ్ళు ముద్ర వేశారు. “ట్రంప్ ప్రతిపాదిస్తున్న వాణిజ్య విధానాల క్రింద అమెరికాలో ధరలు కొండెక్కుతాయి. ఉద్యోగాలు పడిపోతాయి. అమెరికా ఆర్ధికంగా బలహీనపడుతుంది. అమెరికా మళ్ళీ మాంద్యం లోకి జారిపోతుంది” అని వాణిజ్య కంపెనీల సంఘం ‘ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ప్రకటించింది. సాధారణంగా రిపబ్లికన్ పార్టీకి మద్దతు ఇచ్చే ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిపబ్లికన్ అభ్యర్ధిని తీవ్రంగా విమర్శించడం, హిల్లరీ క్లింటన్ కు ఓటు వేయాలని ప్రచారం చేయడం ఇక్కడ గుర్తించవలసిన సంగతి.

అమెరికాలోకి మెక్సికో నుండి వచ్చే వలసలను అరికట్టడానికి అమెరికా-మెక్సికో సరిహద్దు వెంబడి గోడ నిర్మిస్తానని, చైనాను కరెన్సీ మ్యానిపులేటర్ గా ప్రకటించి తదనుగుణంగా చర్యలు చేపడతానని, డబ్ల్యూటిఓలో చైనాకు వ్యతిరేకంగా కేసులు వేస్తామని ట్రంప్ హామీలు ఇస్తుండగా ఆ హామీలనే బెదిరింపు అస్త్రాలుగా ప్రయోగిస్తూ, క్లింటన్ జనాన్ని భయకంపితుల్ని చేస్తోంది. ట్రంప్ వాగ్దానాలకు సొంత అర్ధం ఇస్తూ వాటిని తనకు అనుకూలంగా వినియోగించుకుంటోంది. ఈ భయాలు, బెదిరింపుల నుండి ప్రజలు అప్రమత్తతగా ఉండాలని ట్రంప్ ప్రచార దళాలు హెచ్చరించే స్ధాయిలో క్లింటన్ ప్రచార దళాలు పుకార్లు వ్యాపింపజేస్తున్నాయి.

బహుళజాతి కంపెనీలను ట్రంప్ కూడా వదిలిపెట్టడం లేదు. ఫోర్డ్ లాంటి బడా బహుళజాతి మోటార్ కంపెనీలను, నబిస్కో లాంటి టెక్స్ టైల్స్ కంపెనీలను ఆయన టార్గెట్ చేస్తున్నాడు. ఈ కంపెనీలు అమెరికా మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలను విదేశాలకు తరలిస్తున్నాయని, తద్వారా అమెరికా ప్రజలకు ఉద్యోగాలు దూరం చేస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. తనకు అధికారం ఇస్తే మెక్సికో, చైనా నుండి వచ్చే దిగుమతులపై 35%  సుంకాలు వేస్తానని తద్వారా విదేశీ దిగుమతులు అరికట్టి స్వదేశంలో ఫ్యాక్టరీ కార్యకలాపాలు పెరిగేలా చూస్తానని హామీ ఇస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్!

ఎవరు ఎటు? ఏది నిజం!?

మొత్తంగా చూస్తే ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ స్ధానాన్ని డెమొక్రటిక్ పార్టీ ఆక్రమించగా, సాంప్రదాయకంగా డెమొక్రటిక్ పార్టీ పోషించే పాత్రను రిపబ్లికన్ పార్టీ చేతబుచ్చుకున్నది. కనీసం ఆ విధంగా అభిప్రాయం కలుగుతోంది. మతం, అబార్షన్ హక్కులు, స్వలింగ వివాహాలు మొ.న సామాజిక అంశాలలో రిపబ్లికన్ పార్టీ తన పాత కన్సర్వేటివ్ అభిప్రాయాలను కొనసాగిస్తున్నప్పటికీ, రాజకీయార్ధిక అంశాలలో మాత్రం కొత్తగా కార్మికుల జీతభత్యాల గురించీ, కార్మికుల హక్కుల గురించీ మాట్లాడుతోంది. మానవ హక్కుల గురించి కబుర్లు వినిపిస్తోంది.

ఇలా పాత్రల పోషణలో వచ్చిన మార్పులకు ఏమిటి కారణం? డెమొక్రటిక్ పార్టీలో వచ్చిన మార్పులే ప్రధాన చోదక శక్తిగా పని చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 1993-2001 నాటి బిల్ క్లింటన్ అధ్యక్షరికంలోనే సంక్షేమ విధానాల ముసుగును బహిరంగంగానే త్యజించి పచ్చి స్వేఛ్చా మార్కెట్ విధానాలను ప్రబోధించడం మొదలు పెట్టిన డెమొక్రటిక్ పార్టీ, బారక్ ఒబామా కాలం నాటికి రెండు పార్టీల మధ్య విభేదాలు అదృశ్యం అయ్యేంతగా మారిపోయింది. చారిత్రకంగా సంక్షేమ విధానాలకు గొడుగు పట్టవలసిన అవసరం పెట్టుబడిదారీ వ్యవస్ధకు తప్పిపోయిన నేపధ్యంలో డెమొక్రటిక్ పార్టీకి కూడా తన సంక్షేమ/ప్రగతిశీల/సెంట్రిస్టు ముద్ర కొనసాగించవలసిన అవసరం తప్పిపోయింది. దానితో అది పచ్చిగా, బహిరంగంగా, ఎలాంటి శషభిషలు లేకుండా కంపెనీల పక్షం వహిస్తోంది. పైగా క్లింటన్ కుటుంబం వాల్ స్ట్రీట్ వర్గాలకు సమీపం కావటాన హిల్లరీ క్లింటన్ వ్యక్తిగతంగా కూడా కంపెనీలను భుజాన వేసుకుంటోంది.

డెమొక్రటిక్ పార్టీలో వచ్చిన ఈ మార్పుతో కార్మికులు, పేదలు, మధ్య తరగతి వర్గాల తరపున మాట్లాడే రాజకీయ స్ధానం ఖాళీ అయింది. మరో పక్క తన సంప్రదాయ స్ధానాన్ని డెమొక్రటిక్ పార్టీ ఆక్రమించినందున ఆ స్ధానంలో నిలబడ లేని పరిస్ధితి రిపబ్లికన్ పార్టీకి ఎదురయింది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు కనుక మరో స్ధానాన్ని ఆ పార్టీ వెతుక్కోక తప్పని పరిస్ధితి ఏర్పడింది.

అమెరికా రాజకీయ యవనికపై రెండే రెండు స్ధానాలు ఉంటాయి. ఆ రెండింటికీ ప్రత్యామ్న్యాయంగా మరో స్ధానం (ఇండియాలో ధర్డ్ ఫ్రంట్ లాగా) అవతరించకుండా తగు జాగ్రత్తలు ఆ రెండు పార్టీలు తీసుకున్నాయి. ఉండటానికి ఒకటి రెండు ఇతర పార్టీలు ఉన్నప్పటికీ వాటికి ప్రాచుర్యం లభించకుండా పొలిమేరల్లోనే ఉండిపోయేలా కార్పొరేట్ మీడియా కంపెనీలు, సామ్రాజ్యవాద పాలకవర్గాలతో కుమ్మక్కై పని చేశాయి. నిజానికి మీడియా యజమానులు కూడా వాల్ స్ట్రీట్ కంపెనీలే గనక ప్రత్యేకంగా కుమ్మక్కు కావలసిన అవసరం లేదు. వాళ్లకు అప్పజెప్పిన పని వాళ్ళు చేస్తే సరిపోతుంది. ఈ నేపధ్యంలో రిపబ్లికన్ పార్టీ అనివార్యంగా, అవసరం కోసం ఈ ఎన్నికల్లో ‘కార్మికవర్గం పక్షాన చేరానని’ చాటుతోంది.

కనుక రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ఉద్యోగాల గురించీ, కార్మికుల హక్కుల గురించీ, కంపెనీల దోపిడీ గురించి చెబుతున్న కబుర్లు లేదా వాగ్దానాలు వాస్తవంలో అవసరం రీత్యా, గత్యంతరం లేని పరిస్ధితుల్లో, మర్మం గ్రహించి చెబుతున్నవే తప్ప ఆ పార్టీకి కొత్తగా కార్మికవర్గ ప్రయోజనాల పట్ల నిబద్ధత పెరిగింది ఏమీ లేదు. అమెరికా రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి మకుటం లేని మహరాజుగా వెలుగొందుతున్న డొనాల్డ్ ట్రంప్ కు కొత్తగా “నా పైన నాకే ద్వేషం కలిగింది” అనడంలో కొత్తగా జనం కళ్లు తెరిపించే అంశాలు లేవు. ఆయన జనం ఓట్లు కొల్లగొట్టే పనిలో కొత్త ఎత్తు వేస్తున్నాడంతే. రెండు ప్రత్యర్ధి పార్టీలు ఒకే ఓటు మంత్రం జపించి ఓట్లు కొల్లగట్టాలనుకుంటే అది సాధ్యం కాదు. తమ మధ్య తేడాలు ఉన్నాయని జనానికి చెప్పుకోవాలి. ఈ ప్రయోజనమే రిపబ్లికన్ పార్టీని ఖాళీ అయిన కార్మికవర్గ అనుకూల సంక్షేమ స్ధానానికి నెట్టివేసింది.

అయితే రెండు పార్టీల మధ్యా అసలుకే తేడాలు లేవని భావించడం సరి కాదు. పాలక ముఠాలు తమ ఆర్ధిక ప్రయోజనాల రీత్యా ఎప్పుడూ వైరుధ్యాలతో ఒకదానితో ఒకటి పోటి పడుతుంటాయి. ఒకరిని అణచివేయాలని మరొకరు తలపోస్తూ నే ఉంటాయి. మారిన పరిస్ధితులు రెండు పార్టీల స్ధానాలను తారుమారు చేసినట్లు కనిపించడం వెనుక వివిధ ముఠాలు అటు ఇటు మారిన పరిస్ధితి ఏర్పడి ఉన్నది. పెట్టుబడిదారీ వ్యవస్ధలలో నిర్దిష్ట కాలాల్లో సంపదలు చేతులు మారడం సహజం. అనగా పాత వ్యాపార సామ్రాజ్యాలు కుదేలై కొత్త సామ్రాజ్యాలు ప్రాణం పోసుకుంటూ ఉంటాయి. ఆ క్రమంలో అవి రాజకీయ విధేయతలు మార్చుకుంటూ ఉంటాయి.

ఉదాహరణకి బుష్ ఏలుబడిలో రిపబ్లికన్ పార్టీ యుధ్దోన్మాదంతో పరితపిస్తూ ఉండేది. బుష్ అనంతరం యుద్ధోన్మాదులను బారక్ ఒబామా చేరదీశాడు. లేదా తానే యుద్ధోన్మాదుల పక్షం చేరిపోయాడు. ఇప్పుడు ఒబామా పాత్రను హిల్లరీ క్లింటన్ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నది. ఒబామా మొదటి విడత అధ్యక్షరికంలో విదేశీ మంత్రిగా పని చేసిన హిల్లరీ తన యుద్ధ పిపాసను సమర్ధవంతంగా రుజువు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీలోని మెక్ కెయిన్ లాంటి యుద్ధోన్మాద గండరగండలను సైతం తాను ఏ మాత్రం తీసిపోనని ఆమె రుజువు చేసుకున్నది. తన ఎన్నికల ప్రచారంలో ఆమె అమెరికా ప్రత్యేకత (ఎక్సెప్షనలిజం) గురించి చెప్పని సందర్భం లేదు. ప్రపంచ రాజకీయ-ఆర్ధిక వ్యవస్ధను నడిపించడంలో అమెరికా ఇన్నాళ్ళూ ప్రదర్శించిన సామర్ధ్యాన్ని కొనసాగించవలసిన అవసరం ఎంతగా ఉన్నదో చెప్పని ప్రసంగం లేదు.

క్లింటన్ మాటలకు అర్ధం ప్రపంచంపై అమెరికా ఆధిపత్యం కొనసాగాలని చెప్పడమే. ఒబామా పేర్కొన్న ఆసియా-పివోట్ వ్యూహాన్ని కొనసాగిస్తానని చెప్పటమే. ఒకప్పుడు (మొదటి విడత ఎన్నికల ప్రచారంలో) రష్యా, ఇరాన్, క్యూబా తదితర వైరి దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం గురించి అదే పనిగా మాట్లాడిన ఒబామా అధ్యక్ష పదవి చేపట్టాక ఆ దేశాలతో మరింత ఘర్షణ వైఖరి చేపట్టాడు. ఆఫ్ఘనిస్ధాన్ నుండి సైనికుల్ని వెనక్కి తెస్తానని చెప్పి తీరా అధికారం చేపట్టాక అదనంగా 30,000 మంది సైన్యాన్ని తరలించాడు. రష్యాతో సంబంధాలు రీ-సెట్ చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ దేశాన్ని సైనికంగా చుట్టుముట్టాడు. తూర్పు యూరప్ దేశాలను నాటోలో చేర్చుకుని రష్యా తూర్పు సరిహద్దు పొడవునా నాటో సైన్యాలను, క్షిపణి వినాశక వ్యవస్ధలను, అణు క్షిపణులను మొహరించాడు. చైనాను ఆర్ధికంగా మిత్ర దేశంగా పేర్కొని ఇప్పుడు ఆ దేశం లక్ష్యంగా దక్షిణ చైనా సముద్రాన్ని ఉద్రిక్తతల సముద్రంగా మార్చివేశాడు. ఫిలిప్పైన్స్, జపాన్ లను రెచ్చగొట్టి చైనా మీదికి ఉసిగొల్పాడు. ఒబామా చేపట్టిన ఈ చర్యలన్నింటినీ కొనసాగిస్తానని హిల్లరీ క్లింటన్ అమెరికా పాలకవర్గాల లోని యుద్ధోన్మాద గుంపుకు హామీ ఇచ్చింది. ఫలితంగా వాల్ స్ట్రీట్ కంపెనీల నుండి, మిలటరీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నుండి ఆమెకు నిధులు వరదలా ప్రవహించాయి, ఇంకా ప్రవహిస్తున్నాయి.

అమెరికా యుద్ధాలను, వివిధ యుద్ధ ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నవారు కూడా అమెరికా పాలకవర్గాలలో గణనీయ పలుకుబడి కలిగి ఉన్నారు. అమెరికా ప్రజల్లో పాతుకు పోయిన తీవ్ర యుద్ధ వ్యతిరేకత వారికి పునాది. వరుస సంక్షోభాలవల్ల బాగా చితికి పోయిన కార్మిక, మధ్యతరగతి వర్గాలు కూడా వారికి పునాదిగా మారే పరిస్ధితి కనిపిస్తోంది. ఆ వర్గాలు ప్రైమరీలలో డెమొక్రటిక్ పార్టీ తరపు అభ్యర్ధిత్వం కోసం పోటి పడిన బెర్నీ శాండర్స్ పక్షాన చేరగా ఆయనకు అభ్యర్ధిత్వం దక్కని సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సెక్షన్ ను ఆకర్షించేందుకు ట్రంప్ వర్గం లక్ష్యం చేసుకుంది.

ట్రంప్ వర్గానికి అమెరికా ఆధిపత్యం కావాలి గానీ అది యుద్ధాలతో కాకుండా పరస్పర ప్రయోజనాల ద్వారా జరగాలి. ఉదాహరణకి రష్యాతో ఘర్షణ పడడం వల్ల అమెరికాయే నష్టపోవలసి వస్తుందని వారు భావిస్తున్నారు. ఘర్షణకు బదులు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా బోలెడు ప్రయోజనం పొందవచ్చని వారు నమ్ముతున్నారు. రష్యా అధ్యక్షుడు పుటిన్ ను సందర్భం వచ్చినప్పుడల్లా డొనాల్డ్ ట్రంప్, సానుకూల వచనాలతో, ప్రశంసలతో పలకరించడం/ప్రస్తావించడం ఈ కోణం నుండే జరుగుతోంది. సిరియా, ఇరాక్ లలో అమెరికా దుస్సాహసానికి పూనుకుందని, ఆఫ్ఘన్ నుండి పూర్తిగా సైన్యాన్ని వెనక్కి రప్పిస్తానని ట్రంప్ ఇస్తున్న వాగ్దానాల లక్ష్యం యుద్ధ వ్యతిరేక, ప్రపంచీకరణ వ్యతిరేక ప్రజానీకాన్ని ఓట్లుగా గెలుచుకోవడం.

చైనా వ్యతిరేకతలో పోటీ

హిల్లరీ, ట్రంప్ ల మధ్య సాగుతున్న ప్రచార పోటీలో ఒక వింత అంశం చోటు చేసుకుంటోంది. చైనాను విమర్శించడంలో ఇరువురి మధ్య పోటీ నెలకొనడం ఆ వింత అంశం. రష్యా విషయంలో ఇరువురి మధ్య తేడాలు నెలకొని ఉండగా, చైనా విషయానికి వచ్చేసరికి ఆ దేశాన్ని విమర్శించడానికి పోటీ పడుతున్నారు. తన చైనా విధానాలను ట్రంప్ కాపీ కొట్టారని హిల్లరీ ఆరోపించడం బట్టి చైనాను ‘ఉద్యోగాల తస్కరి’ గా ఆరోపించడంలో ఇద్దరు ఎంతగా పోటీ పడుతున్నది అర్ధం చేసుకోవచ్చు. అనగా చైనా విషయంలో ఇరువురు ఒకే అవగాహనను వ్యక్తం చేస్తున్నారు. మరో వింత ఏమిటంటే యుద్ధ వ్యతిరేక స్రవంతికి సృష్టికర్తగా మారిన ట్రంప్ కు చైనా నుండి నైతిక, ప్రచార మద్దతు అందటం. అమెరికా చైనాను కూడా సైనికంగా చుట్టుముట్టిన నేపధ్యంలో ఆ దేశం “హిల్లరీ తప్ప ఎవరైనా సరే” అన్న సందేశాన్ని తన పత్రికల ద్వారా ఇస్తోంది. ఉదాహరణకి చైనా కంపెనీల నుండి ట్రంప్ కు నిధులు (చందాలు) ప్రవహించాయని పరిశోధక జర్నలిస్టులు చెబుతున్నారు.

అయితే హిల్లరీ మద్దతుదారులు లేదా అమెరికా యుద్ధోన్మాద పాలకవర్గాలు రష్యా, చైనాల మధ్య కూడా తేడా చూస్తుండడం ఒక ప్రత్యేక విషయంగా చూడవచ్చు. చైనా ఆర్ధిక శక్తిని స్వప్రయోజనాలకు ఉపయోగపెట్టుకోవచ్చని హిల్లరీ క్లింటన్ మొదటి నుండి చెబుతున్న మాట. ఒబామా మొదటి పదవీ కాలంలో విదేశీ మంత్రిగా ఉండగా ఆమె ఓ వైపు చైనాను ముల్లుతో గుచ్చుతూనే మరో వైపు అమెరికాతో జట్టు కడితే ప్రయోజనం పొందవచ్చని ఊరించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. గూగుల్ కంపెనీ సాధనంగా చైనా మానవ హక్కులు, స్వేచ్ఛా వాణిజ్య నిబద్ధతలను ప్రశ్నిస్తూనే ప్రపంచ వనరులను కొల్లగొట్టడంలో అమెరికాతో భాగస్వామ్యం వహించాలని సందేశాలు పంపిన చరిత్ర హిల్లరీకి ఉన్నది. ఈ చారిత్రక, వ్యూహాత్మక కారణాలు అమెరికా-చైనాల మధ్య సంబంధాలలో ఒక పార్శ్వం సానుకూల దృక్పధంతో కొనసాగడానికి వీలు కల్పిస్తున్నాయి. ఈ సానుకూల పార్శ్వం చైనా-రష్యాల మధ్య, అమెరికా సామ్రాజ్యవాద దృక్పధంలో, విభేదాలు రెచ్చగొట్టేందుకు అవకాశాలు కల్పిస్తోంది. (రష్యా పట్ల అమెరికాకు ఏ విధంగా చూసినా సానుకూలతకు అవకాశం లేదని యుద్ధోన్మాద వర్గాలు భావించడం కూడా ఇందుకు తోడ్పడుతోంది.)

అమెరికా తదితర పశ్చిమ దేశాలు ప్రపంచంపై రుద్దుతున్న గ్లోబలైజేషన్ విధానాల వల్ల చైనా అమితంగా లబ్ది పొందిన విషయాన్ని తప్పనిసరిగా గమనంలో ఉంచుకోవాలి. ఈ విధానాలు లేకుంటే పెద్ద ఎత్తున ఎఫ్.డి.ఐ లను ఆకర్షించడం చైనాకు సాధ్యం అయ్యేది కాదు; 3 ట్రిలియన్ డాలర్ల మేర వాణిజ్య మిగులు సంపాదించగలిగేది కాదు; సంవత్సరాల తరబడి తొమ్మిది, పది శాతం మధ్య జిడిపి వృద్ధిని నమోదు చేసి ఉండేది కాదు. అమెరికాకు రెండు ట్రిలియన్లు అప్పు ఇవ్వగలిగేది కాదు (ఇప్పుడు అది ఒక ట్రిలియన్ కు తగ్గితే తగ్గవచ్చు గాక!). ఈనాడు ప్రపంచాన్ని ముంచెత్తుతున్న పశ్చిమ దేశాల కంపెనీల ఉత్పత్తులలో దాదాపు తొంభై శాతం చైనాలో తయారైనవేనన్న సంగతిని ఎలా విస్మరించగలం? చైనా ఆర్ధిక ప్రయోజనాలు ఇప్పటికీ పెద్ద ఎత్తున అమెరికాతో ముడిపడి ఉండడం ఒక భౌతిక వాస్తవం. ఈ నేపధ్యంలో అధ్యక్ష ఎన్నికలను సమీపంగా పరిశీలించవలసిన అవసరం చైనాకు కలుగుతోంది. ట్రంప్ పైకి ఎన్ని చెప్పినప్పటికీ ఆయన అధ్యక్షరికంలో తమ వాణిజ్య ప్రయోజనాలు మెరుగుపడవచ్చని చైనా పాలక వర్గాలు భావిస్తున్నాయి.

అంతిమంగా ఏమి గ్రహించవచ్చు? డొనాల్డ్ ట్రంప్ అధికారం లోకి వస్తే గ్లోబలైజేషన్ విధానాలను తిరగదోడతాడా? అలా అని నమ్మితే పప్పులో కాలు వేసినట్లే. యుద్ధోన్మాదం నుండి అమెరికా కాస్త నెమ్మదించడం వరకు డొనాల్డ్ ట్రంప్ వాగ్దానాలను నమ్మవచ్చు గానీ, పూర్తిగా యుద్ధ ప్రయత్నాల నుండి ఆయన వెనక్కి మళ్లుతాడని ఆశించడం వెర్రిబాగులతనం అవుతుంది. మెజారిటీ ఓట్లను ఆకర్షించి ఎన్నికల్లో గెలవడం, రష్యా పైకి దూకుడుగా వెళ్లడం వల్ల కలిగే వాణిజ్య నష్టాలను నివారించడం, ఆర్ధికంగా బలహీనపడిన పరిస్ధితుల నుండి తెరిపడి పడటం… ఈ లక్ష్యాలు నెరవేరేవరకు మాత్రమే ట్రంప్ వాగ్దానాలు ప్రయాణిస్తాయి. అంతకు మించి ముందుకు వెళ్లేందుకు సామ్రాజ్యవాద ప్రయోజనాలు ఒప్పుకోవు. అమెరికా ప్రపంచాధిపత్యాన్ని తిరిగి పొందడానికి చేసే ప్రయత్నాలలో సానుకూల ధోరణిని (ఐక్యతను) ఒక మార్గంగా మాత్రమే ట్రంప్ వర్గాలు పరిగణిస్తాయి.

రష్యాతో ఉద్రిక్తతలు తగ్గించి ఐరోపా వాణిజ్యాన్ని ఒత్తిడితో కాకుండా సానుకూలంగా కాపాడుకోవడమూ ట్రంప్ సాధించదలిచిన ప్రయోజనాలలో ఒకటి. ఉక్రెయిన్ సంక్షోభం, క్రిమియా పునః స్వాధీనం దరిమిలా రష్యాపై ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు విధించిన అమెరికా ఆంక్షలను అమలు చేయాలని యూరోపియన్ యూనియన్ ను కూడా ఒత్తిడి చేసింది. అమెరికా ఆదేశాల మేరకు ఈ‌యూ తన సొంత ఆంక్షలను ప్రకటించి రష్యాపై అమలు చేస్తోంది. ప్రతీకారంగా రష్యా కూడా ఈ‌యూపై ప్రయాణ, వాణిజ్య ఆంక్షలు అమలు చేస్తోంది. ఆంక్షలు – ప్రతి ఆంక్షలతో పశ్చిమ దేశాల వాణిజ్యం ముఖ్యంగా ఈ‌యూ దేశాల వాణిజ్యం గణనీయ మొత్తంలో దెబ్బ తిన్నది. దానితో ఆంక్షలు ఎత్తివేయాలని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీలు లాబీయింగు చేస్తున్నాయి. ఆంక్షలు ఎత్తేద్దామని అమెరికాను వేడుకుంటున్నాయి. ఇలాంటి ఒత్తిడి వల్ల ఈ‌యూ అమెరికాకు దూరం అవుతున్నదని, పరోక్షంగా ఈ‌యూ విచ్ఛిన్నానికి కూడా ఆంక్షలు దోహదం అవుతున్నాయని ట్రంప్ వర్గం భావిస్తోంది. బ్రెగ్జిట్ వల్ల ఏర్పడిన ప్రతికూల పరిస్ధితిలో ఘర్షణ వైఖరి మరింత నష్టం తెస్తుందని ఆ వర్గం భావిస్తోంది. కనుక అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాల పరిమితికి లోబడి మాత్రమే ట్రంప్ లేదా రిపబ్లికన్ పార్టీ వల్లిస్తున్న ‘దిద్దుబాటు వైఖరి’ పని చేస్తుంది.

హిల్లరీ వైఖరి ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధకు మరింత చేటు తేవడం ఖాయం. ఒబామా ప్రకటించిన ‘ఆసియా-పివోట్’ వ్యూహానికి ప్రధమ, ప్రధాన కర్త హిల్లరీయే అని చైనా పత్రికలు వెల్లడి చేసిన నేపధ్యంలో హిల్లరీ నుండి మరింత వినాశనం తప్ప ఇంకేదీ ఒనగూరదు. దక్షిణ చైనా సముద్రంలో మరింతగా ఉద్రిక్తతలు చెలరేగడం, చైనా-జపాన్ ల మధ్య తూర్పు చైనా సముద్రంలో ఉద్రిక్తతలు పెరగడం, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలలో అమెరికా కుట్రలు తీవ్రమై అక్కడ మరోసారి ప్రజల ఉద్యమాలు పెరగడం, రష్యా వ్యతిరేక యుద్ధోన్మాదం తీవ్రమై ఉక్రెయిన్ లాంటి చోట్ల అటో, ఇటో తేలేవరకూ పరిస్ధితి దిగజారడం, ఆఫ్రికా దేశాలలో ఇసిస్ విస్తరణ, ఇండియా-పాక్ మరియు ఇండియా-చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, మధ్య ప్రాచ్యంలో అమెరికా ప్రభ క్షీణిస్తున్న నేపధ్యంలో ‘ఆరిపోయే దీపం’ వలే అమెరికా యుద్ధ గర్జనలు పెరగడం… మొ.న పరిణామాలు హిల్లరీ క్లింటన్ అధ్యక్షరికంలో తప్పనిసరి కావచ్చు.

అంతిమ పరిశీలనలో అమెరికాలో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఇన్నాళ్లూ కొనసాగిన నామమాత్ర విభేదాలు, కార్మికవర్గ దృక్పథంలో, మాయం అయిపోయిన పరిస్ధితిని ప్రస్తుత ఎన్నికల ప్రచార ధోరణి ప్రతిబింబిస్తోంది. ఒకరి పాత్ర మరొకరు చేపట్టడానికి ఇరు పార్టీలకు మధ్య ఎలాంటి అభ్యంతరం ఉండదని, అవి వల్లించే సిద్ధాంతాలు, చేసే రాద్ధాంతాలు ప్రజల వినియోగానికే తప్ప తాము పాటించడానికి కాదని ఎన్నికల ప్రచార సరళి తేటతెల్లం చేస్తోంది. ప్రజల సామాజిక జీవనంలో లేని వైరుధ్యాలను, పనికిమాలిన భావోద్వేగాలను సృష్టించి లబ్ధిపొందడానికి ఏ అవకాశాన్ని అవి వదులుకోవనీ, తమ ప్రయోజనాల కోసం ఏ -రాజకీయ, సామాజిక, కౌటుంబిక- విలువనైనా ఇట్టే వదులుకోగలవనీ అమెరికా రాజకీయ పార్టీలు చాటుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా హిల్లరీని గెలిపించడానికి ఆ పార్టీ ఉన్నత స్థాయి నేతలే కుట్ర చేశారన్న వికీ లీక్స్ వెల్లడితో, ప్రైమరీ ఎన్నికలను పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యానికి సంకేతంగా చెప్పుకోవడం శుద్ధ బూటకం అని రుజువయింది. ప్రైమరీల ప్రచారంలో శక్తివంతమైన సోషలిస్టు/కార్మికవర్గ ప్రచారంతో కాక పుట్టించిన బెర్నీ సాండర్స్ ఎన్నికలు ముగిశాక హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వానికి బేషరతు మద్దతు ప్రకటించడం ఈ కధకు కొసమెరుపు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s