ఇరోం షర్మిల తదుపరి నిశ్చయం -ద హిందూ ఎడిట్.. (True translation to today’s The Hindu editorial “Irom Sharmila’s next stand”)

**********

ఇరోం చాను షర్మిల, తన నిరాహార దీక్షను ఆగస్టు 9 తేదీన విరమిస్తానని చేసిన ప్రకటన దాదాపు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వాలు చట్టబద్ధమైన, గందరగోళపరిచే AFSPA మాటున ఆత్మరక్షణ పొందగా, ఆమె చేపట్టిన శక్తివంతమైన శాంతియుత ప్రతిఘటనా చర్య ఆ రక్షణను బలహీనం కావించింది. తద్వారా ప్రజాస్వామ్యం పైనా మానవత్వం పైనా అది కలుగజేస్తున్న క్షయీకరణ ప్రభావాన్ని బట్టబయలు చేశారామె. నవంబర్ 2000 సం.లో ఇంఫాల్ వద్ద 10 మంది హత్యకు గురైన పిమ్మట, అది అస్సాం రైఫిల్స్ పనేనని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, “కల్లోలిత” ప్రాంతాలలో భద్రతా బలగాలకు నేర విచారణ, శిక్షల నుండి మినహాయింపు కల్పించే AFSPA చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ షర్మిల నిరాహారదీక్ష ప్రారంభించారు. మణిపూర్ ను 1980లో “కల్లోలిత ప్రాంతాల చట్టం” పరిధిలోకి తెచ్చారు. దరిమిలా, తిరుగుబాటు గ్రూపులను ఎదుర్కొనేందుకు జరిగే ప్రయత్నాల పేరుతో చోటు చేసుకున్న -అనుమానిత- చట్ట విరుద్ధ హత్యలు ప్రజల్లో కోపోద్రేకాలను, నిస్సహాయతను ప్రోది చేశాయి. షర్మిలకు గొట్టం ద్వారా బలవంతంగా ఆహారం ఎక్కించడం, ఆత్మహత్య ఆరోపణలతో ఆమెను ఇంఫాల్ లోని జవహర్ లాల్ నెహ్రూ ఆసుపత్రిలో నిర్బంధించడం.. ఇవి మణిపూర్ లో ఆందోళనలు కొనసాగటానికి నేపథ్యంగా పని చేస్తున్నాయి. ఉదాహరణకు 2004లో మనోరమ తంఙం అనే యువతిని అస్సాం రైఫిల్స్ అత్యాచారం చేసి (అనుమానం) హత్య చేసినందుకు నిరసనగా పూర్తి వివస్త్రలై ఇంఫాల్ లోని కంగ్లా ఫోర్ట్ వద్ద ప్రదర్శన నిర్వహించారు; “మేమంతా మనోరమ తల్లులం” అని ఆ ప్రదర్శనలో ఎలుగెత్తి నినదించారు. మణిపురి సమాజంలో తల్లి అంటే రోజు వారీ వ్యవహారాలు నడిపిస్తూనే అణచివేతను నిర్భయంగా ప్రతిఘటించే సాహసత్వానికి సర్వనామం. అన్యాయానికి వ్యతిరేకంగా జరిగిన ఈ నిరసనల అల్లికలో షర్మిల కాలాతీత స్థానాన్ని త్వరితగతిన సంపాదించారు. ప్రభుత్వాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి – మచ్చుకు, కంగ్లా నుండి అస్సాం రైఫిల్స్ ను ఉపసంహరించడం, ఇంఫాల్ లో కొన్ని చోట్ల AFSPA ని ఎత్తివేయడం. కానీ మొత్తంగా చూస్తే, షర్మిల పట్టు విడవని చైతన్యయుత నిరసనోద్యమంతో వెంట పడుతున్నా, AFSPA అమలు కొనసాగింది. నిరాహారదీక్షను ముగించడం ద్వారా AFSPA ను తిరిగి పతాక శీర్షికలకు ఎక్కించడంలో షర్మిల కృతకృత్యురాలు కావలసిరావడమే ఒక అభాస.

ఇప్పటికి కొన్ని యేళ్ళుగా, మరో రకం కథనాలు వినవస్తున్నాయి. తన జీవితాన్ని తిరిగి పొందాలని భావిస్తున్నట్లుగా ఆమె అప్పుడప్పుడూ సంకేతాలు ఇచ్చారు. మచ్చుకు, తన ఓటు హక్కు తనకు ఇవ్వాలని కోరడం; తాను ప్రేమలో పడ్డానని చెబుతూ నిరాహార దీక్ష లక్ష్యం నెరవేరిన తర్వాత వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్లుగా సూచనలు ఇవ్వడం ఆ కోవలోనివి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆమె చేసిన ప్రకటన వీటన్నింటి ముగింపు. ఇది కూడా ఒక విధంగా, ఒక లక్ష్య వ్యక్తీకరణకు నిరంతర ముఖంగా ముద్ర పొందడానికి తద్వారా వ్యక్తిగత జీవితాన్ని తనకు నిరాకరించడానికి వ్యతిరేకంగా ఆమె ఇస్తున్న ప్రతిఘటనకు ఒక రూపం. బహుశా, నిరాహార దీక్ష ద్వారా ఆమె తాను చేయగలిగినదంతా చేశారు. తన జీవితాన్నే సందిగ్ధావస్ధలో నిలిపి ఉంచాలని ఒక వ్యక్తిని ఆశించడం అతి అవుతుందనడంలో సందేహం లేదు. లక్ష్యం మిగిలే ఉన్నది. AFSPA ముసుగులో సాగిస్తున్న నేరాలను విచారించవచ్చని ఈ నెలలోనే తీర్పు చెప్పడం ద్వారా సుప్రీం కోర్టు ఆశలు చిగురింపజేసింది. మణిపూర్ లో జరిగిన 1528 హత్యలకు న్యాయం చేకూరింది. అయినప్పటికీ, తమ పట్ల కొనసాగుతున్న ఉదాసీనత, నిర్లక్ష్యాలకు ముగింపు పలకడానికి పతాక శీర్షికలను ఆకర్షించగల మరే నిరసనలకు పాల్పడాలో అని మణిపూర్ ప్రజలు విస్తుపోతూ ఉండాలి.

*****

AFSPA రద్దు కావాలంటే ఇరోం షర్మిల మరింత కాలం, బహుశా రద్దు అయే వరకూ, నిరాహార దీక్ష కొనసాగించాలని ద హిందూ కోరుకుంటున్నట్టుగా ఉన్నది చూడబోతే. పాలకులను నిలదీయలేక ఇరోం నిరాహార దీక్ష అనే గడ్డి పోచ పట్టుకుని AFSPA ఉధృత ప్రవాహాన్ని ఎదుర్కోవాలని భావించడం లోనే అసలు దోషం ఉన్నది. సత్యాగ్రహం, నిరాహార దీక్ష లాంటివి అశేష బాధిత ప్రజానీకాన్ని నిష్క్రియాపరులుగా మిగిల్చి ఒకరిద్దరు వ్యక్తులను హీరోలుగా మార్చడానికి మాత్రమే పనికొస్తాయి. అలాగే ప్రజల బాధలకు, కష్టాలకు, అణచివేతలకు కారణం అయిన ఆధిపత్య వర్గాలు ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వనవసరం లేని సౌకర్యాన్ని కల్పించి పెడతాయి. ఇరోం చాను షర్మిల నిరాహారదీక్ష ఏకంగా 16 సం.ల పాటు కొనసాగినా కూడా పాలకులు వీసమెత్తు కూడా స్పందించక పోగా అణచివేతను నిర్విరామంగా, నిర్విఘ్నంగా కొనసాగించటమే అందుకు ప్రబల సాక్షం. అణచివేతలకు గురవుతున్న ప్రజానీకం ఒక ఉమ్మడి పంధాలో, ఉమ్మడి అంగీకారంతో సామూహిక చర్యలకు పాల్పడితే తప్ప దున్నపోతు చర్మం ప్రభుత్వాలు స్పందించవు. సంపాదకీయం చివరలో చెప్పినట్లు పతాక శీర్షికలకు ఎక్కే నిరసనలు -షర్మిల చేసిన తరహా యేళ్ళ తరబడిన దీక్షలు- ఎన్ని చేసినా అవి యథాతథ స్థితి కొనసాగింపుకే సహకరిస్తాయి.

One thought on “ఇరోం షర్మిల తదుపరి నిశ్చయం -ద హిందూ ఎడిట్.. 

  1. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలు నియంతృత్వానికి మళ్ళిన వార్తలు చదివినప్పుడే ప్రజాస్వామ్య పధ్ధతులు తప్పని అనిపిస్తుంది. తుపాకీపట్టడం తప్పు కాదని అనిపిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల మెడలువంచి వారిని భారత్‌లో విలీనం చేసుకున్నారు. ఇప్పటికీ వాళ్ళని చింకీలుగానే భారతీయులు వ్యవరిస్తారు. భారత్‌కున్నది వాళ్ళ భూభాగంపైన వ్యూహాత్మక-కపట-ప్రేమ తప్ప వాళ్ల హక్కులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతకాదు.

    ఇప్పుడేమవుతుంది. షర్మిల గారు రాజకీయాల్లోకి వస్తారు. ఆవిడ వ్యక్తిగత జీవితాన్నో, లేక ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు దొంగిలించిన బలపం ముక్కనో ఆధారంగా ఆమెపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తారు – మన సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఎందుకు ఉపయోగపడతారు చెప్పండి? FBలో ‘భారతమాత’ అభిమానులు తమ సంస్కారం, నిష్పాక్షికతలను మున్ముందు చూపిస్తారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s