అమెరికా డెమోక్రటిక్ పార్టీ జరిపిన సదస్సులో హిల్లరీ రోధమ్ క్లింటన్ అధ్యక్ష పదవి అభ్యర్థిగా అధికారికంగా నామినేషన్ పొందారు. ఆమె నామినేషన్ ను అమెరికా పత్రికలు, ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీకి మద్దతుగా వచ్చే మీడియా “చరిత్ర సృష్టి” గా ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తరచుగా కీర్తించుకునే అమెరికాలో అభ్యర్థి పదవికి అభ్యర్థిగా నామినేషన్ పొందిన మొట్టమొదటి మహిళ హిల్లరీ క్లింటన్ కావడమే వారి ఉబ్బితబ్బిబ్బులకు కారణం.
అమెరికాకు స్వతంత్రం వచ్చి 240 యేళ్ళు అయింది. 1776 జులై 4 తేదీన బ్రిటిష్ రాచరికం పాలనలో నుండి బెటపడి స్వతంత్ర దేశంగా అమెరికా ఉనికిని ప్రారంభించింది. స్వాతంత్య్రం సిద్ధించి లేదా బూర్జువా ప్రజాస్వామిక విప్లవం సంభవించి 240 యేళ్ళు గడిచాక గాని అమెరికా ఒక మహిళకు అధ్యక్ష పదవికి నామినేట్ చేయగలిగింది. దానినే గొప్ప అభివృద్ధిగా, మూల మలుపుగా, ‘గాజు పైకప్పు బద్దలు కొట్టడం’ గా అమెరికన్ మీడియా జబ్బలు చరుచుకుంటోంది. అది కూడా కేవలం అభ్యర్థిత్వానికి నామినేషన్ సంపాదించినందుకే.
అదే, ఇండియాను తీసుకోండి! 1947 ఆగస్టు 15 తేదీన అదే బ్రిటిష్ పాలకుల నుండి ఇండియా స్వతంత్రం సంపాదించింది -అది నామమాత్రపు స్వతంత్రం అన్న సంగతి కాసేపు పక్కన పెడదాం. అనగా ఇండియా స్వతంత్రం మరో మూడు వారాల్లో 69 సంవత్సరాల వయసు పూర్తి చేసుకుంటుంది. అనగా అమెరికాతో పోల్చితే ఇండియా స్వతంత్రం 171 సంవత్సరాలు చిన్నది. కానీ భారత దేశం మహిళా ప్రధాన మంత్రిని ఎన్నుకుని దశాబ్దాలు గడిచాయి కాదా!
ఇందిరా గాంధీ మొట్టమొదటి సారిగా 24 జనవరి 1966 తేదీన ప్రధాన మంత్రి బాధ్యతలు స్వీకరించారు. 1977లో పదవి కోల్పోయిన ఆమె మళ్లీ 1980లో ప్రధాన మంత్రిగా ఎన్నికై 1984లో హత్య కావించబడేంత వరకు పదవిలో కొనసాగారు. అనగా ఏకంగా 15 సం.ల పాటు ఒక మహిళను ప్రధాన మంత్రిగా నెత్తిన పెట్టుకున్నారు.
1966 లోనే మూడవ ప్రధాన మంత్రిగా ఓ మహిళను భారత ప్రజలు ఎన్నుకున్నపుడు భారత స్వాతంత్య్రం వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. ఆ లెక్కన అమెరికా కంటే 221 సంవత్సరాలకు ముందుగానే భారత ప్రజలు మహిళా ప్రధాన మంత్రిని ఎన్నుకుని గాజు కప్పు బద్దలు కొట్టారన్నమాటే కదా! హిల్లరీ క్లింటన్ ను అధ్యక్షురాలిగా అమెరికా ప్రజలు ఇంకా ఎన్నుకోలేదన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. వచ్చే నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగాలి, అందులో హిల్లరీ మెజారిటీ సంపాదించాలి, అప్పుడే ఆమె అమెరికా అధ్యక్షులు అయ్యేది.
ఇంతోసి దానికి “గాజు కప్పు బద్దలు కొట్టేశామహో” అని బాజాలు, భజంత్రీలు వాయించుకోవాలా? అక్కడికి ప్రపంచంలో ఏ యితర దేశమూ సాధించలేని ఘనత తామే సాధించేసినట్లుగా!? కేవలం నామినేషన్ సంపాదించినందుకే గాజు కప్పు బద్దలైపోతే 19 యేళ్ళ బాల్యం లోనే మహిళా ప్రధాన మంత్రిని ఎన్నుకున్న భారత ప్రజాస్వామ్యం ఏ ఇనప పైకప్పునో, వజ్ర సమాన పైకప్పునో బద్దలు కొట్టినట్టే కదా!
“ఆ గాజు పైకప్పు (గ్లాస్ సీలింగ్) లో మనం ఓ పెద్ద పగులు ని మనం సృష్టించాం” అని నామినేషన్ ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యాక హిల్లరీ రోధమ్ క్లింటన్ ప్రకటించారు. “చరిత్ర” అన్న ఒక్క పదాన్ని ట్వీట్ చేసిన ఆమె తద్వారా, తాను చరిత్ర సృష్టించానని తానే చెప్పుకున్నారు.
హిల్లరీ క్లింటన్ నామినేషన్ సంపాదించిన నిన్నటి రాత్రిని “డెమోక్రటిక్ పార్టీకి, దేశానికి కూడా చారిత్రాత్మక రాత్రి” అని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ ప్రకటించింది. “దేశ చరిత్రలోనే ఒక ప్రధాన పార్టీ నామినేషన్ సంపాదించిన మొట్టమొదటి మహిళగా హిల్లరీ చరిత్ర సృష్టించారు” అని ఆస్ట్రేలియా వార్తా సంస్థ ఎబిసి న్యూస్ గొప్పలు పోయింది. “అత్యంత ఎత్తులో ఉన్న అత్యంత కఠినమైన గాజు పైకప్పును బదాబదలు చేయాలన్న కలను ఆమె నెరవేర్చుకున్నారు” అని ఫాక్స్ న్యూస్ అభివర్ణించింది.
“Democrat Clinton makes history with U.S. presidential nomination” అని రాయిటర్స్ వార్తా సంస్థ ఈ వార్తకు శీర్షిక పెట్టింది. ఇక లోపలి వివరణ ఎలా ఉంటుందో ఎవరికి వారు అర్థం చేసుకోవచ్చు. “అధ్యక్ష పదవి నామినేషన్ తో హిల్లరీ క్లింటన్ తన చారిత్రక క్షణాలను ఆవాహన చేసుకున్నారు” అని సిఎన్ఎన్ ప్రకటించింది.
హిల్లరీ నామినేషన్ పట్ల అమెరికా పత్రికలు ఇంతగా ఉబ్బితబ్బిబ్బు కావడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నాయి? “ఒక మహిళను అత్యున్నత పదవికి పోటీ పెట్టడం ద్వారా (ఎన్నుకోవడం కాదు సుమా) అమెరికా ఎంతో నాగరిక సమాజంగా రుజువు చేసుకుంది” అన్నదే వాళ్ళు ఇస్తున్న సందేశం. “అనాగరిక, అభివృద్ధి చెందని, వెనకబడిన సమాజాలు మహిళలను పాలకులుగా అంగీకరించజాలవు” అన్న గుర్తింపు ఇందులో మనం చూడవచ్చు. ఇదే అంశాన్ని వెనక్కి తిప్పి చూస్తే: హిల్లరీ క్లింటన్ నామినేషన్ ఫైనల్ అయ్యే వరకూ అమెరికన్ సమాజం వెనకబడే ఉన్నదని పశ్చిమ మీడియా అంగీకరిస్తోంది.
అయితే ముందుబడిన లేదా ప్రగతిశీల సమాజం ఏది అన్న ప్రశ్న వెంటనే రావాలి. అదొక అంశం కాగా, ఇంతకాలం వరకూ, కనీసం బిల్ క్లింటన్ ఉన్నత స్థాయి రాజకీయాలలో చురుగ్గా వ్యవహరించే ముందు వరకూ హిల్లరీ క్లింటన్ ఎదుర్కొన్న పరిస్ధితి గురించి తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది.
బిల్ క్లింటన్ తో పెళ్లికి ముందు, పెళ్ళయిన చాలా కాలం వరకూ హిల్లరీ క్లింటన్ మహిళా హక్కుల ఛాంపియన్ గా ఉండేవారు. కనీసం అలా కనపడేవారు. ఆమెకు రాజకీయ పునాది కల్పించింది మహిళా హక్కుల ఉద్యమమే. (బూర్జువా సంఘాల హక్కుల ఉద్యమాలకూ, కార్మికవర్గ సంఘాల హక్కుల ఉద్యమాలకు ఉండే తేడాలను ఇక్కడ గమనంలో ఉంచుకోవాలి.) ఫెమినిస్టుగా కూడా ఆమె గుర్తింపు పొందారు, ముఖ్యంగా పాలకవర్గ రాజకీయాల్లో.
కానీ ఎప్పుడైతే బిల్ క్లింటన్ రాజకీయ ప్రభ పెరగడం మొదలైందో అప్పటి నుండి ముఖ్యంగా ఆర్కన్సాస్ గవర్నర్ గా బిల్ క్లింటన్ ఎన్నికైనప్పటి నుండీ ఆమె తన ఫెమినిస్టు ప్రభను, మహిళా హక్కుల రాజకీయాలనూ వదులుకోవలసి వచ్చింది. మెజారిటీ అమెరికన్ సమాజం తమ గవర్నర్ భార్య లేదా సెనేటర్ భార్య లేదా అధ్యక్షుడి భార్య భర్త నీడలో నడవడమే ఇష్టపడతారు తప్ప మహిళా హక్కులు, ఫెమినిజం అంటూ రచ్చకెక్కడం ఎంత మాత్రం ఇష్ట పడదు.
ఫలితంగా, భర్త బిల్ క్లింటన్ రాజకీయ భవిష్యత్తు కోసం హిల్లరీ క్లింటన్ తన ఫెమినిస్టు ముద్రను తొలగించుకోవలసి వచ్చింది; రద్దు చేసుకోవలసి వచ్చింది. కుటుంబ మహిళగా (అక్కడికి ఫెమినిష్టులు కుటుంబ మహిళలు కానట్లు!) ప్రజలకు తనకు తాను రుజువు చేసుకోవలసి వచ్చింది. ఆ విధంగా ఫెమినిస్టు హిల్లరీ అంతర్ధానమై మిసెస్ క్లింటన్ అవతరించారు.
ఇప్పుడు హిల్లరీ దృష్టిలో “పిల్లల్ని సాకడం, స్త్రీ జీవితం లోని పురుషుల శ్రద్ధ తీసుకోవడం నిరాకరించడం ఫెమినిజం కాదు.” భార్య, భర్త ఒకరిపై ఒకరు సమాన శ్రద్ధ తీసుకుంటే అది సమానత్వం. తన జీవితంలోని పురుషుడి (భర్త) గురించిన శ్రద్ధ తీసుకోవడం గురించి మాత్రమే మాట్లాడుతూ భార్య పట్ల భర్త కూడా అన్ని రకాలుగా వహించవలసిన శ్రద్ధను వదిలేస్తే అది ఫెమినిజానికి వ్యతిరేకం లేదా సమానత్వ విరుద్ధం (ఫెమినిజం అంటే స్త్రీ పురుష సమానత్వాన్ని కోరడం అన్న అర్ధంలో). అయితే ఇప్పుడు హిల్లరీ క్లింటన్ రెండోది కూడా ఫెమినిజమే అంటున్నారు.
గవర్నర్ భార్యగా, అధ్యక్షుడి భార్యగా మాత్రమే కాదు, ఆమే స్వయంగా సెనేటర్ కావాలనుకున్నా కూడా ఫెమినిస్టు ముద్రను అమెరికా సమాజం ఒప్పదు. రాజకీయాల్లో ఎదుగుదలకు ఫెమినిస్టు ముద్రను వదులుకోవడానికి ఆమెకు కూడా అభ్యంతరం లేదు. అమెరికన్ బిలియనీర్ సమాజంలో ఆధిపత్య-అధికార స్ధానం వరించవస్తే, ఫెమినిస్టు ముసుగు ఉంటే ఎంత, లేకపోతే ఎంత!? అధికార సోపానాలలో పైకి ఎగబ్రాకడానికి ఫెమినిజం అర్ధాలనూ మార్చేయవచ్చు!
14 సం.ల వయసులో హిల్లరీ నాసాలో ఆస్ట్రోనట్ ట్రైనింగ్ పొందడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తూ దరఖాస్తు చేసుకుంది. “అమ్మాయిలకు ప్రవేశం లేదు” అంటూ నాసా నుండి ఆ దరఖాస్తు తిరుగు టపాలో వెనక్కి వచ్చేసింది. అది జరిగింది 1961లో. బిల్ క్లింటన్ ఆర్కన్సాస్ గవర్నర్ గా 1983 నుండి 1992 వరకు పని చేయగా ఆమె గవర్నర్ కు వర్కింగ్ వైఫ్ గా మాత్రమే జనానికి తెలుసు; ఫెమినిస్టు జీవితం ప్రజల దృష్టిలోకి రాకుండా తగిన జాగ్రత్త తీసుకోబడింది.
1960 లలో మహిళా ఆస్ట్రోనట్ లను నాసా ఒప్పుకోని రోజుల్లోనే ఇక్కడ ఇందిరా గాంధీని రాజకీయ నాయకురాలిగా భారత సమాజం స్వీకరించింది. ఆ 60 ల్లోనే ఆమెను ప్రధాన మంత్రిగా కూడా భారత సమాజం అంగీకరించింది.
ఎవరు వెనకబడి ఉన్నట్లు? అమెరికన్ సమాజమా లేక భారత సమాజమా? అమెరికా సాధించిన పెట్టుబడిదారీ ఆర్ధిక అభివృద్ధి పెట్టుబడిదారీ వర్గం వరకే పరిమితం అయింది తప్ప సాధారణ అమెరికన్ సమాజానికి అది చేరలేదని చెప్పడానికి ఇది ఒక రుజువు. ఆర్ధిక వృద్ధి సాధారణ ప్రజలకు కూడా చేరడం అంటే ఆ మేరకు ఆర్ధిక వనరుల పంపిణీ సాపేక్షికంగా సంబద్ధంగా ఉన్నట్లే.
ఆర్ధిక వృద్ధి సంబంధాలు సామాజిక సంబంధాలను, భావాలను, నమ్మకాలను అనివార్యంగా తదుపరి సమీప ఉన్నత స్ధాయికి చేర్చుతాయి. అది జరగకుండా అమెరికన్ పెట్టుబడిదారీ సమాజం మొదటి నుండీ అడ్డు పడుతూనే వచ్చింది. అందుకే ఇప్పటికీ అమెరికాలో మహిళల అబార్షన్ హక్కులు ఒక పెద్ద రాజకీయ అంశం. అందుకే ఇప్పటికీ అక్కడ క్రైస్తవ మత భావావేశాలు గణనీయంగా కొనసాగడం.
అమెరికా దివిపైన స్వర్గం కానే కాదు. అనేక సామాజిక, రాజకీయ వైకల్యాలు, వెనుకబాటుతనాలు, వివక్షలు అక్కడ పదిలంగా కొనసాగుతూనే ఉన్నాయి. హిల్లరీ క్లింటన్ నామినేషన్ సంబరాల స్వభావం దానిని మరోసారి వెల్లడి చేసింది.
హిల్లరీ క్లింటన్ గాజు పై కప్పును బద్దలు కొట్టలేదు సరికదా, దానిని మరింత దృఢతరం కావిస్తూ డెమోక్రటిక్ నామినేషన్ గెలుచుకున్నారు!