పెల్లెట్ గన్ మన వాళ్ళకే తగిలితే?! -ఫోటోలు


కాశ్మీర్ లో సి‌ఆర్‌పి‌ఎఫ్ పోలీసులు స్ధానిక ప్రజలపై విచ్చలవిడిగా వినియోగిస్తున్న సో-కాల్డ్ ప్రమాద రహిత (నాన్-లెధల్) పెల్లెట్ తుపాకులు మనకు బాగా తెలిసిన వాళ్ళకు తగిలితే, ఆ దెబ్బల్ని మన టి.వి చానెళ్లు పచ్చిగా చూపిస్తే మనం ఎలా స్పందిస్తాము?

చాలా మంది భారతీయులకి కాశ్మీర్ ప్రజలు అంటే ముస్లింలు మాత్రమే. వారు మనుషులనీ, వారికీ భారత దేశ ప్రజలకు మల్లేనే ఆశలు, ఆకాంక్షలు, ముఖ్యంగా ప్రాణాలు, జీవితాలు ఉంటాయని భావించేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. కాశ్మీర్ లో ప్రజలు నివసిస్తారని గుర్తించేవారు తక్కువగా కనిపిస్తారు.

కాశ్మీర్ ను ‘భరతమాత నుదుటి సింధూరం’గా చెబుతూ ఆ నుదురు కాశ్మీరీ ప్రజలకు జీవన మాతగా గుర్తించకపోవటం కంటే మించిన అసంబద్ధ దేశభక్తి మరొకటి ఉండబోదు.

భారత దేశ మైదానాలలోని ధనిక వర్గాలకు అడవుల్లోని ఖనిజ సంపదలు కావాలి కాబట్టి, అక్కడ నివసించే గిరిజనులు తమ కొంపా గోడు వదిలి పెట్టి వెళ్లిపోవాలి. వారి జాతి జాతంతా పుట్టి పెరిగింది ఆ అడవులే అయినా, చట్టాల ప్రకారం వారు నివసించే నేల వారి ఆస్తి హక్కు అయినా, కంపెనీల దోపిడీకి ఆ హక్కు రద్దయిపోతుంది.

కాశ్మీరీ జాతి వేల యేళ్లుగా స్వతంత్ర జాతిగా బతికినా, వారి జీవనం-సంస్కృతి-సంప్రదాయం-భావోద్వేగాలు అన్నీ ఆ నేలతో ముడి పడి ఉన్నా గానీ ఆ సుందర ప్రకృతీ లలామ పైన భారత పాలకుల కన్ను పడింది కాబట్టి అది భారత దేశంలో అంతర్భాగం అయిపోతుంది, అక్కడి ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదు. అదేమంటే పాకిస్తాన్ బూచిని చూపి రెచ్చగొడతారు.

కాశ్మీర్ లో నాలుగో వంతు భాగం పాక్ ఆక్రమణలో ఉన్నదని, మూడు వంతుల భాగం భారత ఆక్రమణలో ఉన్నదని, రెండు భాగాలను కలిపి స్వతంత్ర కాశ్మీర్ గా తమ ఉనికిని పునరుద్ధరించుకోవాలని కాశ్మీరీలు భావిస్తున్నారన్న నిజాన్ని బైటి జనానికి తెలియకుండా భావోద్వేగాల కింద పూడ్చిపెట్టడంలో పాలకులు సఫలం అయ్యారని చెప్పబోతే అర్ధం చేసుకోగోరేవారు కనిపించరు.

చెవులు, కళ్ళు, నోరు మూసుకున్న వారికి నిజాలు చేరేది ఎలా? సాటి మనిషి ఆకాంక్ష అర్ధం కావడానికి మనిషిగా కూడా ఆలోచించాలని తెలిసేది ఎలా? దేశం అంటే మట్టి కాదని, మనుషులు అనీ గురజాడ అప్పారావు గారు బతికొచ్చి చెప్పినా అర్ధం అవుతుందా?

అర్ధం కాకపోతే ఈ కింది మార్ఫుడ్ ఫోటోల ద్వారా వ్యక్తం అవుతున్న కాశ్మీరీల భావోద్వేగాలను కూడా అర్ధం చేసుకోలేరు. అర్ధం అయితే కాశ్మీర్ లో ఒక చెల్లినో, ఒక అన్ననో, ఒక అక్కనో, ఒక కూతురినో, ఒక మనవడినో, ఒక తండ్రినో కోల్పోయిన ప్రతి ఒక్క కుటుంబం అనుభవిస్తున్న వేదనను, దుఃఖాన్ని అర్ధం చేసుకోగలరు.

[కాస్త ఓపిక తెచ్చుకుని ఫోటోల పక్కనున్న పాఠ్యాన్ని చదవితే, కాశ్మీరీల మానసిక అలజడిని దగ్గరిగా దర్శించగలం] 

పెల్లెట్ గన్ లు నాన్-లెధల్ అనీ అందుకే వాటిని ఉపయోగిస్తున్నామని భారత ప్రభుత్వం -నిన్న కాంగ్రెస్, ఈ రోజు బి‌జే‌పి- చెబుతుంది. ప్రమాదకరం కాకపోవడం అంటే -ఒళ్ళంతా పుండు కావడమా?

కళ్ళు కోల్పోయి జీవితాంతం గుడ్డి వాడు అయితే అది ప్రమాదరహితమా? నెలల తరబడి ఆసుపత్రి మంచాలపైన గడిపి లక్షలకు లక్షలు వైద్యం కోసం ఖర్చు పెట్టి, అటు ఆదాయమూ లేక – ఇటు ఖర్చులూ భరించలేక కుటుంబాలు దరిద్రాన్ని మోయవలసి వచ్చినా అది ప్రమాద రహితమేనా?

తండ్రి అప్పజెప్పిన పనిని చేసుకురావడానికీ బైటికి వస్తే, మధ్యాహ్న భోజనం లోకి కూర వండుకునేందుకు మార్కెట్ కి వెళ్ళి నూనె తెమ్మని చెప్పిన తల్లి పురమాయింపుని అమలు చేయడానికి వెళ్తే, స్కూల్ వెళ్లడానికి రోడ్డు మీదికి వస్తే, చివరికి వంటలో  అమ్మకు సాయం చేద్దామని కిటికీ పక్కనే ఉన్న స్టౌ వద్ద నిలబడినా పెలెట్ గన్ బులెట్ వచ్చి తగిలి శరీరంలోని అవయవాలు ఛిద్రం అయినా కూడా అది ప్రమాదరహితమేనా?

2010 నుండి సాగుతున్న పెల్లెట్ గన్ ల విధ్వంసంలో వేలమంది కళ్ళు, అవయవాలు కోల్పోతున్నా అవి ప్రమాదకరం కానట్లేనా? ఇది ప్రమాదకరం కాకపోతే భారత పాలకుల దృష్టిలో ‘ప్రమాదం’ అంటే ఏమిటో ఊహించడానికే భయం గొలుపుతోంది.

ఇవన్నీ ఎందుకు? కాశ్మీరీలు రాళ్ళు విసురుతున్నారట! రాయి విసిరినందుకు కాశ్మీరీలు టెర్రరిస్టులు అయితే ఇళ్ల నుంచి తీసుకెళ్లిన యువకుల్ని మాయం చేస్తూ యువతుల్ని పట్టుకెళ్లి మానభంగం చేస్తూ కాశ్మీరీ ప్రజను భయాందోళనలకు గురి చేస్తున్న భారత జవాన్లు ఏమవుతారు? వారిని అందుకు పురమాయించిన పాలకులు ఏమి కావాలి?

అణచివేతను ప్రతిఘటించే పౌరుడి మామూలు చర్య టెర్రరిజమూ, పాలితుల శాల్తీలను గల్లంతు చేయడం దేశాన్ని కాపాడడమూనా? ఏమిటీ అసమ న్యాయం? ఘనత వహించిన భారత ప్రజాస్వామిక కోర్టులు చెప్పే సహజ న్యాయం కాశ్మీరీలకు వర్తించదా?

కాశ్మీర్ సమస్య శాంతి భద్రతల సమస్య కాదని, సామాజిక-రాజకీయ-ఆర్ధిక సమస్య అనీ ఒక పక్కన అంగీకరిస్తూనే, మరో పక్క తీసుకునే చర్యలన్నీ శాంతి  భద్రతల దృక్కోణంలో తప్ప తీసుకోని భారత పాలకులు ఎవరికీ జవాబుదారీ కానక్కరలేదా?

లక్షల మంది సైన్యాన్ని, పారా మిలట్రీ బలగాలని, పోలీసులని దింపి అణచివేత అమలు చేస్తూ, రాళ్ళు విసరడాన్ని భూతద్దంలో పెట్టి చూపి అందుకే పెల్లెట్ గన్ లు కాల్చుతున్నామనీ, బులెట్ లు నాటుతున్నామనీ, కళ్ళు పీకెస్తున్నామనీ చెప్పడం ఘోరం కాదా?

“రాళ్ళు విసిరినందుకు పోలీసు చనిపోతే సంబరాలు చేసుకునేవాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవలసి ఉన్నది” అని హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అంటున్నారు. సరే అనుకుందాం, వాదనకి. ప్రమోషన్ల కోసం అమాయకులని బూటకపు ఎన్ కౌంటర్ లో చంపేసిన సైనికులకి శిక్షలు పడకుండా AFSPA చట్టాన్ని అడ్డు చక్రం వేసిన భారత పాలకుల మైండ్ సెట్ మారవద్దా?

ఎందరో మనోరమలను సామూహికంగా అత్యాచారాలు చేసి, చంపేసి, శవాలను రోడ్డు పక్క విసిరేస్తూ…. రేప్ లను రాజకీయ అణచివేతకు అస్త్రంగా ప్రయోగిస్తున్న పాలకుల మైండ్ సెట్ మారవద్దా?

హోమ్ మంత్రి రాజ్ నాధ్ కాశ్మీర్ వెళ్లారు. “పెల్లెట్ గన్ లు ప్రమాద రహితం అనుకున్నాము. ఇంతమంది తీవ్రంగా గాయపడతారని అనుకోలేదు. పెల్లెట్ గన్ ల స్ధానంలో మరో ప్రత్యామ్నాయాన్ని చూస్తాం” అని అక్కడ ఆయన ప్రకటించారు.

ఆయన కాశ్మీర్ నుండి ఇవతలికి రాగానే “పెల్లెట్ గన్ ల వాడకాన్ని కొనసాగిస్తాం. కాకపోతే గన్ లను మోకాళ్ళ కిందికి కాల్చమని మాకు చెప్పారు. దాన్ని పాటిస్తాం” అని  సి‌ఆర్‌పి‌ఎఫ్ చీఫ్ ప్రకటించారు. మంత్రి గారి నోటితో ఒక మాట చెప్పించి, మిలట్రీ నోటితో మరోమాట చెప్పించే మైండ్ సెట్ ని ఎలా అర్ధం చేసుకుందాం?

“మరి కాశ్మీరీల చేతుల్లో -రాళ్ళు తగిలి, టెర్రరిస్టుల వల్ల- చనిపోతున్న భారత సైనికుల పట్ల లేని సానుభూతి కాశ్మీరీలకు చూపడం దేశ ద్రోహం” అంటూ కొందరు మరోరకం భావోద్వేగాన్ని ప్రతి అస్త్రంగా ప్రయోగిస్తున్నారు.

అసలు లక్షల సైన్యం అక్కడికి వెళ్ళడం ఎందుకు అని కదా అడుగుతున్నది. తుపాకులు, ట్యాంకులు, బ్యారక్ లతో జనావాసాలను యుద్ధ క్షేత్రాలుగా మార్చివేసిన నువ్వే ‘మా సైన్యాన్ని చంపుతున్నారు’ అని వాపోవటం ఏమిటి?

కాశ్మీర్ సమస్యను చర్చల ద్వారా, రాజకీయ చర్యల ద్వారా, ఆర్ధిక ప్రోత్సాహకాల ద్వారా ఎలా పరిష్కరించవచ్చో భారత ప్రభుత్వాలు నియమించిన అనేకానేక కమిటీలే అనేకసార్లు నివేదికల ద్వారా చెప్పాయి. వాటన్నింటిని బుట్ట దాఖలు చేసి సైన్యాన్ని ఏకైక పరిష్కారంగా అమలు చేస్తున్న తప్పును సవరించుకోకుండా ఎన్ని ఎంచి ఏమి లాభం?

అసలు కాశ్మీర్ సమస్యను పరిష్కారం చేసుకునే ఉద్దేశం భారత పాలకులకు (బి‌జే‌పి + కాంగ్రెస్ + etc…) ఉందా, లేదా? పరిష్కారం చేసుకోదలిస్తే సైన్యాన్ని ప్రయోగించరు; నిర్దిష్ట రాజకీయ చర్యలు తీసుకుంటారు; కాశ్మీరీ పార్టీలతో, గ్రూపులతో, టెర్రరిస్టు-టెర్రరిస్టేతర అన్న తేడా లేకుండా చర్చలు జరుపుతారు; ఒక ఆమోదనీయ ఒప్పందానికి రావడానికి ప్రయత్నిస్తారు; నాగా గ్రూపులతో ఒప్పందం చేసుకున్నట్లుగా.

అలా కాకుండా నిత్యాగ్నిగుండంగా రగలాలని, ఆ గాయం నిరంతరం రక్తం ఓడడం కొనసాగాలని కోరుకుంటే సైన్యాన్ని ప్రయోగిస్తారు; సైన్యం ద్వారా కాశ్మీరీ ఆర్ధిక వనరులను స్వాయత్తం చేసుకుంటారు; ప్రపంచ భౌగోళిక రాజకీయ ఆటలో ఇష్టంగా పావులుగా పని చేస్తారు.

ఈ మర్మం ఎరుగకుంటే కాశ్మీర్ లో సైనిక చర్యకు ఆ నెపంతో సాగుతున్న అత్యాచారాలకు, అరాచకాలకు అమాయకంగా మద్దతు ఇస్తూనే ఉంటాం.

4 thoughts on “పెల్లెట్ గన్ మన వాళ్ళకే తగిలితే?! -ఫోటోలు

  1. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉన్నది -పొద్దున్న లేవగానే ఆ రోజంతా శుభప్రదంగా గడిచిపోవాలని దేవును చిత్రపటమో, తల్లి దండ్రులనో, పిల్లలనో, ఇష్టమైన వారినో, పెద్దలనో లేదా రెండు అర చేతులనో చూసుకొని ఇక ఆ రోజంతా బాగా గడిచిపొతుందనే నమ్మకానికి వచ్చి దిన చర్యలకు ఉపక్రమిస్తాము. ఈ కార్యానికి ఏమైనా భంగం కలిగితే అసంతృతికి లోనవుతాము. ఛీ నీ పాడు ముఖం చాశాను అని వేరెవరైనా కనిపిస్తే విసుక్కుంటాము. ఆ రోజు ఏదైనా చిన్న చెడు జరిగినా దానికి కారణం వారేనని శాపనార్ధాలు పెడతాము.

    చేతిలో అధునాతన మిషన్ గన్ లను, ముఖంలో క్రోదాన్ని కలిగి ఉన్న ఆ సైనికుడిని పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకొనేవరకూ చూస్తూ ఎన్ని సంవత్సరాలు కశ్మీరీలు గడపాలి? ఆ వీర సైనికుడు ఎప్పుడేమి చేస్తాడోనని బిక్కుబిక్కుమంటూ కశ్మీరీలు గడపవలసిందేనా? కశ్మీరీలకు ఏమిటీ ధౌర్భాగ్యం?

  2. ఒకే సమయంలో – ఆర్ద్రత తోనూ, ఆలోచన రేకెత్తించేది గానూ ఉంది మీ శైలి.

    ఇలా ఎంత మంది చెప్తే అర్ధమౌతుందో ఆ ‘చెవులు, కళ్ళు, నోరు మూసుకున్న వారికి’…?

  3. https://imageshack.com/i/pntQmTxXj
    0.22 కేలిబర్ గల పెల్లెట్ పిస్తోల్ ఇలా ఉంటుంది. అల్లరి చేసేవాళ్ళని చెదరగొట్టడానికి పెప్పర్ స్ప్రే సరిపోతుంది. దానికి పెల్లెట్ గన్స్ అవసరం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s