యాహూ అస్తమయం ఇక గోడ మీది రాత!


verizon

గూగుల్ కంటే ముందు స్ధాపించబడి ఇంటర్నెట్ సర్చ్ ప్రపంచాన్ని రారాజుగా ఏలిన యాహూ త్వరలో ఒక స్వతంత్ర కంపెనీగా ఉనికి చాలించనున్నది. యాహూ కేంద్ర (కోర్) బిజినెస్ కార్యకలాపాలను అమెరికా టెలీ కమ్యూనికేషన్ దిగ్గజం వెరిజాన్ కంపెనీ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరిన దృష్ట్యా ఈ పరిణామం పూర్తి కావడమే ఇక మిగిలింది.

ఆపరేటింగ్ బిజినెస్ గా పేర్కొనబడుతున్న యాహూ ఇంక్ కార్యకలాపాలను 4.4 బిలియన్ డాలర్లకు (వోక్స్ పత్రిక 4.8 బిలియన్ డాలర్లుగా పేర్కొంది) కొనుగోలు చేయడానికి వెరిజాన్ – యాహూల మధ్య ఒప్పందం కుదిరింది. అమెరికాకు చెందిన అనేక టెలికాం దిగ్గజాలు యాహూ వేలంలో పోటీ పడగా అందరిలో వెరిజాన్ విజేతగా నిలిచింది.

యాహూ అమ్మకం ప్రక్రియ 2017 ఆరంభానికి ముగుస్తుందని పత్రికలు తెలిపాయి. అంతిమ కొనుగోలు ప్రకటన వెలువడే వరకు యాహూ స్వతంత్ర సంస్ధగా తన ఉనికిని కొనసాగిస్తుంది. ఆ తర్వాత యాహూ కంపెనీకి ఇతర కంపెనీలలో ఉన్న వాటాలు మాత్రమే దాని ఆస్తులుగా ఉంటాయి. స్వతంత్ర కంపెనీగా పని చేయడం ఆగిపోతుంది. అయితే యాహూ పేరు కొనసాగిస్తారా లేదా అన్నది తెలియలేదు.

ఆపరేటింగ్ కంపెనీగా పని చేయడం ఆగిపోవటం అంటే యాహూ ఒక స్వతంత్ర కంపెనీగా ఉనికిలో లేకపోవడమే. కానీ వ్యాపార పరిభాషలో దీనికి పూర్తి అర్ధం ఏమిటో తెలియవలసి ఉన్నది. యాహూ పేరు కొనసాగినప్పటికీ వెరిజాన్ అనే మర్రిచెట్టు నీడలో గత కాలపు వైభవం దుర్లభం కాగలదు.

నాలుగైదు సం.ల క్రితం యాహూ కంపెనీని కొనుగోలు చేసేందుకు మైక్రో సాఫ్ట్ కంపెనీ తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఒక దశలో బెదిరింపులు కూడా సాగించింది. కానీ వాటిని తట్టుకుని ఎలాగో నిలబడింది.

అనంతరం గూగుల్ కంపెనీ అత్యున్నత స్ధాయి మేనేజ్ మెంట్ బృందం నుండి మరిస్సా మేయర్ ను రప్పించుకుని కంపెనీ సి‌ఈ‌ఓ గా నియమించుకున్న యాహూ వృద్ధి కోసం తీవ్ర ప్రయత్నాలు సాగించింది.

మరిస్సా నేతృత్వంలో ఏవో కొన్ని కొత్త వ్యూహాలు అమలు చేసినప్పటికీ దిగజారుడు నుండి యాహూ బైటపడ లేకపోయింది. సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లు, మొబైల్ ఫోన్ల ఉరవడికి అనుగుణంగా టెక్నాలజీని మార్చుకోవడంలో వెనకబడి పోవడంతో యాహూ కోలుకోవడం అసాధ్యం అయింది. యాహూ వ్యాపారం క్రమంగా గూగుల్ వశం అయింది. ఈ నేపధ్యంలో కోర్ వ్యాపార వ్యవస్ధలను అమ్మకానికి పెట్టింది.

కోర్ వ్యాపారాలు అంటే, సర్చ్ ఇంజన్, యాహూ మెయిల్, యాహూ మెసెంజర్ లాంటి అసెట్స్ తో పాటు ప్రకటనల టెక్నాలజీ పరికరాలైన బ్రైట్ రోల్ (BrightRoll), ఫ్లర్రీ.

మరిస్సా నేతృత్వంలో యాహూ కంపెనీ కొనుగోలు చేసిన టంబ్లర్ (Tumblr) బ్లాగింగ్ ప్లాట్ ఫారం కూడా వెరిజాన్ సొంతం కానున్నట్లు తెలుస్తోంది. ఫోటో షేరింగ్ వెబ్ సైట్ ఫ్లికర్ కూడా. 

యాహూ కంపెనీకి చైనా ఆన్ లైన్ రిటైల్ కంపెనీ (ఈ-కామర్స్) ‘ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్’ లో 15 శాతం వాటా కలిగి ఉండగా, యాహూ జపాన్ కార్ప్ లో 35.5 శాతం వాటా కలిగి ఉన్నది. ఇవి వెరిజాన్ కొనుగోలు ఒప్పందంలో కలిసి లేవు. యాహూ ఖాతా లోని డబ్బు, కోర్ యేతర పేటెంట్లు, అనేక యితర కంపెనీల లోని మైనారిటీ ఇన్వెస్ట్మెంట్ లు కూడా ఒప్పందంలో భాగం కావు.

యాహూ కంపెనీ షేర్ విలువ ప్రకారం లెక్కించే మార్కెట్ కేపిటల్ విలువ 37.4 బిలియన్ డాలర్లని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ఆలీబాబా, యాహూ జపాన్ వాటాల మొత్తం 40 బిలియన్ డాలర్ల విలువ చేస్తాయని కూడా రాయిటర్స్ తెలిపింది. ఉచ్చ దశలో ఉండగా (2000 సం.లో) యాహూ మార్కెట్ కేపిటల్ 100 బిలియన్ డాలర్లు.

యాహూ కోర్ వ్యాపారాలను సొంతం చేసుకునేందుకు మరో అమెరికా టెలికాం దిగ్గజం AT&T Inc (అమెరికా బిలియనీర్ వారెన్ బఫెట్ ఈ కంపెనీ వాటాదారు), ప్రైవేటు ఈక్విటీ సంస్ధ TPG Capital LP, వివిధ కంపెనీల కన్సార్టియంలు వెక్టార్ కేపిటల్, సికామోర్ పార్టనర్స్ మొ.న కంపెనీలు పోటీ పడ్డాయి.

“మా ఆపరేటింగ్ బిజినెస్ అమ్మకం యాహూ షేర్ హోల్డర్ విలువను పెంపొందించే దిశలో ముఖ్యమైన అడుగు” అని యాహూ ఇంక్ సి‌ఈ‌ఓ మరిస్సా మేయర్ ఒక ప్రకటనలో అన్నారని ద హిందు తెలిపింది.

Marissa Mayer

Marissa Mayer

పెట్టుబడిదారీ ప్రపంచంలో విలీనం & స్వాధీనం (Mergers & Acquisitions – M&A) పేరుతో పాత కంపెనీలు మూత పడుతుంటాయి; కొత్త కంపెనీలు పుడుతుంటాయి; ఉన్న కంపెనీలు విస్తృతం అవుతాయి లేదా తగ్గిపోతాయి. అయితే ఇవి పైకి కనపడేవి మాత్రమే. లోలోపల మాత్రం పెట్టుబడిదారుల ఆస్తులు భద్రంగా కాపాడబడతాయి. ఈ కంపెనీల షేర్లలో చిన్న మొత్తాలు పొదుపు చేసుకునే మధ్య తరగతి వేతన జీవులు మాత్రం ఇలాంటి ప్రక్రియలలో రాత్రికి రాత్రి బికారులుగా మారిపోతుంటారు.

యాహూ మూత పడుతున్నందుకు ‘అయ్యో’ అనుకోవలసిన అవసరం లేదు. అయ్యో అనుకోవలసింది ఆ కంపెనీ ఉద్యోగుల భవిష్యత్తు తలుచుకుని మాత్రమే. ఒక వ్యాపార సామ్రాజ్యం కూలిపోయినప్పుడు అందులోని ప్రధాన పెట్టుబడిదారుల ఆస్తులు ఎక్కడికీ పోవు. మరో కంపెనీ కిందకు అవి చేరతాయి. అనగా అవే ఆస్తులు పేరు మార్చుకుంటాయి.

కాబట్టి ‘ఒక శకం ముగిసింది’ అంటూ పత్రికలు విడిచే నిట్టూర్పులు కేవలం సంకేతాత్మకం మాత్రమే. Rhetorical కూడా. సాధారణ జనానికి ఆ శకంలో ఎప్పుడూ భాగస్వామ్యం ఉండదు.

One thought on “యాహూ అస్తమయం ఇక గోడ మీది రాత!

  1. వివరణ చాలా బాగుంది… ముగింపు మీదైన శైలిలో ఉంది….. అయినా ఈ విషయంలో మనం బాధపడవల్సినది ఏమీ లేదు. ఇందులో సామాన్యమానవునికి సంబంధించిన అంశాలు ఎమీలేవు.

    నాగ శ్రీనివాస

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s