దళిత ఓటు: మోడి ‘అఖిల్లెస్ హీల్’ -కార్టూన్


Modi's heel

మోడి రాజకీయాలు, దళిత ఓట్లు మధ్య నెలకొన్న సంబంధాన్ని వివరించడానికి, బహుశా, ఇదే గొప్ప పోలిక!

ముందు అఖిల్లెస్ హీల్ అంటే ఏమిటో చూద్దాం. ఇది చాలా మందికి తెలిసి ఉండవచ్చు, ఐనా రికార్డు కోసం, తెలియని వాళ్ళ కోసం, వివరిస్తాను.

గ్రీకు పురాణాల్లో అఖిల్లెస్ ఒక పాత్ర. మహాభారతంలో దుర్యోధనుడి తొడలతో అఖిల్లెస్ పాదాన్ని పోల్చవచ్చు.

అఖిల్లెస్ పుట్టుక నాడు అతను యవ్వనంలోనే చనిపోతాడని జ్యోతిష్కులు చెబుతారు. ఆమె తల్లి ధేటీస్ అతన్ని శక్తివంతుడ్ని చేయాలని తలపోస్తుంది. అద్భుత శక్తులను ప్రసాదించే స్టిక్స్ నది వద్దకి తీసుకెళ్తుంది. నది నీటిలో ముంచి తేల్చుతుంది. నదీ జలంతో తడిసిన అతని శరీరం దుర్భేద్యం అవుతుంది. అతన్ని ఇక ఎవరూ చంపలేరు.

కానీ అఖిల్లెస్ శరీరాన్ని ముంచేటప్పుడు అతని తల్లి అతని పాదాన్ని ఒక చేత్తో పట్టుకుని తలకిందులుగా ముంచుతుంది. అందువలన పాదం నీటితో తడవకుండా ఉండిపోతుంది. ఫలితంగా అఖిల్లెస్ శరీరం అంతా శక్తివంతం అయినప్పటికీ పాదం మాత్రం శక్తిరహితంగా మిగిలిపోతుంది.

ట్రాయ్ ద్వీప రాజ్యం కోసం జరిగిన త్రోజాన్ యుద్ధంలో విషం పూసిన బాణం అతని పాదానికి గుచ్చుకుంటుంది. విషం శరీరంలోకి ప్రవేశించి అఖిల్లెస్, జ్యోతిష్కులు చెప్పినట్లుగా, యౌవనం లోనే చనిపోతాడు.

ఆ విధంగా శక్తివంతుల బలహీనతలను ‘అఖిల్లెస్ హీల్’ గా సామెత రూపంలో పోల్చుతారు.

మోడి/ఆర్‌ఎస్‌ఎస్/బి‌జే‌పి బలం ఏమిటి? హిందూత్వయే దానికి బలం. ప్రజల హిందూ భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్ల రూపంలో పిండుకోవటమే బి‌జే‌పికి తెలిసిన విద్య. ముస్లింలను శత్రువులుగా సృష్టించడం ద్వారా సెంటిమెంట్లను, మత విద్వేషాన్ని, భావ హింసతో పాటు భౌతిక హింసను సాగించి ఓట్లు జమ చేసుకుంటుంది హిందూత్వ పరివారం.

హిందూ మతం దళితులను పరమ హీనంగా చూస్తూ వచ్చింది, ఇంకా అలాగే చూస్తోంది. అయితే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్ధలో దళితుల ఓట్లకు కూడా సమాన విలువ ఉండడం హిందూత్వకు అచ్చిరాని వ్యవహారం అయింది.

హిందూ మతం అంటే చరిత్ర, సంప్రదాయం, జీవన విధానం, సంస్కృతి అని ఆర్‌ఎస్‌ఎస్ పరివారం ఢంకా భజాయిస్తుంది. కానీ ఆ చరిత్రలో దళితులను హీన స్ధాయికి నెట్టివేసిన నిజం, ఆ ఢంకా మోతను ఓటి మోతగా చేసేస్తుంది.

హిందూ చరిత్ర ‘సమున్నతం, స్వర్ణ యుగం, అంత గొప్పది, ఇంత గొప్పది’ అంటూ గొంతులు చించుకునే హిందూత్వ, పంచములు/ దళితుల విషయానికి వచ్చేసరికి, స్వరం బలహీనం అయిపోతుంది. ‘వాళ్ళూ హిందువులే, సమానులే, రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నాం, ఇంకా అది ఇస్తాం, ఇది ఇస్తాం’ అంటూ ఓటి మోతలు మోగిస్తుంది.

కర్ణాటకలో ఒక దళిత కుటుంబం ఆవు మాంసం తిన్నారని చెబుతూ ఆర్‌ఎస్‌ఎస్ పరివారానికి చెందిన గుంపు ఆ కుటుంబంపై దాడి చేసి కొట్టిన దుర్మార్గం నిన్నటిదే. గుజరాత్ లో నలుగురు దళిత యువకుల్ని చచ్చిన ఆవు చర్మం ఒలుస్తున్నందుకు బట్టలు విప్పి కొడుతూ వీడియో తీసి ఇంటర్నెట్ కు ఎక్కించిన హైన్యం మొన్నటిదే. ఆధునిక విశ్వ విద్యాలయం లోనే అధికారికంగా రోహిత్ ను సంఘ బహిష్కారం చేయించిన దారుణం గురించి చెప్పనే అవసరం లేదు.

ఇవన్నీ దళితుల పట్ల ఆర్‌ఎస్‌ఎస్/బి‌జే‌పి/మోడి ప్రభుత్వానికి ఎంత మాత్రం గౌరవం లేదని, వాళ్ళు తప్పనిసరి ఓటు బ్యాంకు గానే వాళ్ళు పరిగణిస్తున్నారని తెలియజేసేవి.

కాణీ ఖర్చు లేకుండా హిందూ జనాన్ని గుంపులు గుంపులుగా కూడగట్టగల శక్తివంతమైన హిందూత్వకు ఒక్క దళిత ఓటు మాత్రం అఖిల్లెస్ హీల్ గా పదే పదే పొడుస్తోంది.

వాళ్ళు రెచ్చగొట్టి పెట్టిన ఆవు భావోద్వేగాన్ని వదిలి పెట్టమని హిందూత్వ గణాలకి చెప్పనూ లేరు, అలాగని గోచర్మం వొలిచే బాధ్యతను హిందు మతమే చారిత్రకంగా అప్పజెప్పిన  దళితుల పట్ల తమ తిరస్కారాన్ని బహిరంగం చేసి వారి ఓట్లను దూరం చేసుకోనూ లేదు.

మోడి పాదం, దళిత ఓటు బలహీనతను నయం చేసుకుందాం రమ్మని డాక్టర్ దగ్గరికి లాక్కుపోతుంటే హిందూత్వ ధర్మ సంస్ధాపన కోసం దాన్ని నిలవరించలేక సతమతం అవుతున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి! పాదాన్ని తొలగించలేరు, అలాగని ఉంచుకోనూ లేరు!

One thought on “దళిత ఓటు: మోడి ‘అఖిల్లెస్ హీల్’ -కార్టూన్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s