
Recep Tayyip Erdogan amid tight security
[Erdogan’s coup శీర్షికన జులై 25 -ఈ రోజు- తేదీన ద హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్]
*********
జులై 15 నాటి విఫల కుట్రకు టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ ప్రతీకారంతో చూపుతున్న అసమతూక ప్రతిస్పందన పెద్దగా ఆశ్చర్యం కలిగించేది కాదు. ఆయన ప్రభుత్వంలో పెచ్చరిల్లిన నియంతృత్వ ధోరణుల దృష్ట్యా తన శత్రువులను, విమర్శకులను నిర్మూలించటానికి, అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారని అనేక మంది హెచ్చరించారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు జరుగుతున్నది సరిగ్గా అదే. సైనిక కుట్రకు అమెరికాలో ప్రవాసం గడుపుతున్న ఫెతుల్లా గులెన్ కారకుడని ఎర్డోగన్ నిందిస్తున్నప్పటికీ అందుకు ఆధారాలను ఆయన ఇంకా చూపవలసి ఉన్నది. కానీ ప్రభుత్వం ఇప్పటికే 58,000 మంది వరకు అరెస్టు చేశారు, తొలగించారు, సస్పెండ్ చేశారు, నోటీసులు ఇచ్చారు. వారిలో అత్యధికులు గులెన్ మద్దతుదారులే. అధ్యక్షుడి పట్ల విమర్శనాత్మకంగా ఉండే వార్తలను ప్రచురించకూడదని మీడియా గ్రూపులు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. గత వారం ప్రకటించిన మూడు నెలల ఎమర్జెన్సీ ఎర్డోగన్ కు అపరిమిత అధికారాలు ఇస్తుంది; మొట్టమొదటి అధ్యక్ష డిక్రీలలో ఒకటి గులెన్ తో సంబంధం ఉన్న సంస్థలను మూసివేయటం. ఈ అణచివేత లోతు, విస్తృతిని గమనిస్తే, కుట్రదారులపై తిరగబడేందుకు జులై 15,16 తేదీల్లో అంకారా, ఇస్తాంబుల్ నగరాల వీధులను ముంచెత్తిన టర్కులు తాము పునరుద్ధరించాలని కోరుకున్న ప్రజాస్వామ్యం ఇదేనా అని విస్మయం చెందకుండా ఉండరు.
మిలటరీ తిరుగుబాటుకు దారి తీసిన కారణాను నినిజాయితీగా అన్వేషించి, వ్వవస్ధాగత వైఫల్యాలను పరిష్కరించే దిశలో చర్యలు తీసుకోవటానికి, విఫల కుట్ర ఎర్డోగన్ కు లభించిన అవకాశం. ప్రజాస్వామిక సంస్థలను శక్తివంతం కావించి, తన నియంతృత్వ విధానాల పట్ల వ్యక్తం అవుతున్న ఆందోళనలను మరియు ఆధునిక టర్కీ వ్యవస్థాపక సూత్రాలలో ఒకటయిన రాజ్యాంగ లౌకికవాదం ఎదుర్కొంటున్న అపాయాలను ఉపశమింప జేసేందుకు కూడా ఇదొక అవకాశం. అందుకు బదులుగా, ప్రభావశీల రంగాల నుండి తన శత్రువులను -వాస్తవ మరియు ఊహాత్మక- తుడిచి పెట్టడానికి, ఇప్పుడు లభించిన రాజకీయ ప్రతిష్టను ఉపయోగపెట్టుకోవడమే ఉత్తమమని ఎర్డోగన్ ఒక నిశ్చయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇది ప్రమాదకర మలుపు కాగలదు. అంతర్గతంగా శక్తివంతమైన ప్రజాస్వామిక ప్రవాహాలు కలిగిన, పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చెలరేగిన చరిత్ర కలిగిన సమాజం పైన భారీ ఎత్తున విరుచుకుపడటం అంటే, అది ప్రజల నుండి కేవలం అసమ్మతిని మాత్రమే ఆహ్వానిస్తుంది. టర్కీ విషయంలో గతంలో ప్రతి ఒక్క నియంతృత్వ పాలనా అంతిమంగా పౌర నాయకులకు అధికార పగ్గాలు అప్పగించ వలసి వచ్చింది. 1980 నాటి అత్యంత క్రూరమైన మిలటరీ అధికార స్వాధీనం కూడా ఎంతో కాలం నిలవలేదు. కాబట్టి ఈ నిర్మూలన ద్వారా శక్తివంతులంగా అవతరిస్తామని ఎర్డోగన్, ఆయన మద్దతుదారులు భావించినట్లయితే తాము పొరపడ్డామన్న రుజువులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండవది, అణచివేత, ఇప్పటికే ప్రపంచ స్ధాయిలో టర్కీ ప్రతిష్టను దిగజార్చింది. కుట్ర నుంచి బయటపడిన నాయకుడి రూపం నుండి ఎర్డోగన్ అంతర్జాతీయ ప్రతిమ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న శక్తివంతుడి రూపంలోకి మారిపోయింది. పశ్చిమ దేశాల్లోని ఆయన మిత్రులు సైతం చట్టబద్ధ పాలనకు లోబడి చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు. మూడోది, కుట్రదారులను వారి చర్యలకు బాధ్యులను చేయడం ముఖ్యమే గానీ మిలట్రీపై పూర్తి స్థాయిలో దాడికి తెగబడటం -దాదాపు మూడు వంతుల మిలటరీ అధికారులను ఆయన తుడిచిపెట్టారు- వ్యతిరేక ఫలితాలు మాత్రమే ఇస్తుంది. పౌర ప్రభుత్వం, మిలట్రీల మధ్య పెచ్చరిల్లిన ఉద్రిక్తతలు అస్థిరతకు మాత్రమే దారి తీస్తాయి.