అనుకున్నంతా అయింది!
అఖ్లక్ ని చంపారు. అఖ్లక్ కొడుకుని మృత్యు ముఖం వరకూ తీసుకెళ్లారు. మళ్ళీ అఖ్లక్ నీ, ఆయన కుటుంబాన్నే దొషులుగా నిలబెట్టారు, హిందూత్వ కుట్రదారులు.
మాయావతిని తిట్టారు. వేశ్య కంటే నీచంగా టికెట్లు అమ్ముకుంటుంది అన్నారు. ఇప్పుడు ఆమె పైన కూడా ఫిర్యాదు చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఆమెనీ దోషిని చేసేశారు.
బాధితులే నేరస్ధులన్న మాట! కత్తిది కాదు, గాయానిదే తప్పన్నమాట!
కత్తి దిగబడేంత మెత్తగా ఎవరుండమన్నారు, గాయాన్ని? కత్తి దూసుకొస్తుంటే పక్కకు తప్పుకుని ఉండవచ్చు గదా? ఎదురు నిలబడి కత్తి పైన నేరం మోపబడే విధంగా గాయం, గాయంగా ఎందుకు మారాలి? అది తప్పు కాదా? కత్తిని నేరం చేసేట్లుగా ప్రోత్సహించడం కాదా?
అబెట్మెంట్ టు కమిట్ ఇంజురీ, గాయం చేసే విధంగా కత్తిని ప్రోత్సహించడమూ నేరమే, ఈ ఖర్మ భూమిలో!
ఎంత తీవ్ర నేరం అంటే; సెక్షన్ 120B కింద గాయం నేరపూరిత కుట్రకు పాల్పడింది; సెక్షన్ 153A కింద గాయాల గుంపుకీ, కత్తుల గుంపుకీ మధ్య శతృత్వం రెచ్చగొట్టింది; సెక్షన్ 504 కింద శాంతిని భంగం కలిగించే లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగా కత్తిని అవమానించింది; సెక్షన్ 506 కింద నేరపూరిత బెదిరింపులకు దిగింది; మరీ ఘోరంగా సెక్షన్ 509 కింద మహిళ శీలాన్ని అవమానించే చర్యకు, దూషణకూ, సంజ్ఞకూ పాల్పడింది.
ఇవన్నీ చేసింది ఎవరూ…., మాయావతి గారు! దయాశంకర్ సింగ్ అనబడే హిందూత్వ నాయకుని చేత “వేశ్య కంటే ఘోరం” అని దూషణలు ఎదుర్కొన్న మాయావతి ఇన్ని నేరాలకు పాల్పడింది.
అలాగని ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి రెడీగా అంగీకరించారు. ఆ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది దయాశంకర్ సింగ్ భార్య, తల్లి, కూతురు, 12 యేళ్ళ మనవరాలు!
దయాశంకర్ సింగ్ దూషణల నేపధ్యంలో ఆందోళనకు సిద్ధపడిన మాయావతి, ఆమె పార్టీలు, దయాశంకర్ పైన చర్య తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చాక తాము తలపెట్టిన ఆందోళనను విరమించుకున్నారు.
కానీ మాయావతి, ఇతర బిఎస్‌పి నేతలు, బిఎస్‌పి కార్యకర్తలు అప్పటికే నేరం చేసేశారు. వాళ్ళు నినాదాలు ఇచ్చారు; హెచ్చరికలు చేశారు; బెదిరింపులు జారీ చేశారు; కులాల వారీగా విభేదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. అందుకే వారిపైన ఎఫ్‌ఐఆర్!
ఇంతకు ముందు ఆర్టికల్ లోనే చెప్పుకున్నాం, దళితుల నుండి ఎదుర్కొంటున్న ప్రతిఘటనను హిందూత్వ చూస్తూ ఊరుకోదు అని. ఇలా:
ఈ తరహా అవమానాన్ని, ఇబ్బందిని హిందూత్వ ఎల్లకాలం సహించకపోవచ్చు. ఏదో ఒక పేరు పెట్టి, దళితుల మీదికి కత్తి దూసే మార్గాన్ని కనిపెట్టకుండా ఉండరు.
ఏదో ఒక పేరుతో కాదు, మహిళల పేరుతోనే ఎదురు దాడికి హిందూత్వ సిద్ధ పడింది. అన్ని తిట్లూ తిట్టిన దయాశంకర్ సింగ్ ని ఇంతవరకు అరెస్టు చేసింది లేదు గానీ మాయావతి పైనా, బిఎస్‌పి కార్యకర్తల పైనా తప్పుడు కేసులు మాత్రం సిద్ధం అయిపోయాయి.
ఎఫ్‌ఐఆర్ నమోదు అయిపోయింది కనుక, ఇక మాయావతి అరెస్టుని డిమాండ్ చేస్తాం అని దయాశంకర్ సింగ్ తల్లి గారు అల్టిమేటం ఇచ్చేశారు. “ఇప్పుడు మేము మాయావతి, బిఎస్‌పి నేతల అరెస్టు డిమాండ్ చేస్తాము. (దయాశంకర్ సింగ్) కుటుంబానికి చెందిన మహిళలను దూషించడంలో వాళ్ళు అన్ని పరిమితులూ దాటిపోయారు” అని సింగ్ తల్లి గారైన తేత్రా దేవి గారు ప్రకటించారు.
ఇంతకీ తన కొడుకు దయాశంకర్ సింగ్ ఎన్ని పరిమితులు దాటిపోయారో తేత్రా దేవి గారు లెక్క పెట్టారా?
“వారి ఆందోళన సందర్భంగా కుల విభేధాల ఆధారంగా హింస, అల్లర్లను రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆందోళనలో ఇచ్చిన నినాదాలు మహిళ శీలాన్ని భంగం కావించడంతో సమానం” అని తేత్రా దేవి ఆరోపిస్తూ దళితుల నినాదాలకు అర్ధాలు చెప్పారు.
“ఆందోళనలో చేసిన నినాదాలు విన్న 12 యేళ్ళ సింగ్ కూతురు దిగ్భ్రాంతికి లోనైంది. ఆ దిగ్భ్రాంతి నుండి ఆమె ఇంకా బైట పడలేదు” అని తేత్రా దేవి, దళితుల నినాదాల ఫలితంగా తమ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఆందోళనకర పరిస్ధితిని వివరించారు.
“నా కొడుకుని భౌతికంగా నిర్మూలించడానికి కుట్రలు జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది” అని తేత్రా దేవి అనుమానం వ్యక్తం చేశారు.
భారత దేశంలో తనకు సరైన న్యాయం లభిస్తుందన్న నమ్మకం లేదు గనక విజయ్ మాల్యా ఇండియాకు రాడు. తనను చంపుతారని అనుమానం, భయం ఉన్నది గనక దయాశంకర్ సింగ్ పోలీసులకు లొంగిపోడు. పోలీసులు ఎంత వెతికినా ఆయన దొరకడు, అది వేరే సంగతి!
దళితుల అరాచకాలను -కుల అణచివేత అంటూ గావు కేకలు పెట్టడం, రిజర్వేషన్ తో తృప్తి పడకుండా ఆత్మగౌరవం అంటూ అతిగా ఆశించడం, కుల వివక్ష వ్యతిరేక చైతన్యం ప్రదర్శించడం… ఇవన్నీ దళితుల అరాచకాలే- ఎదుర్కోవడానికి హిందూత్వ ఈ స్ధాయికి తెగబడింది!
కారంచేడు నరమేధం అనంతరం కాస్త బుర్రా, బుద్ధీ ఉన్న ప్రతి ఒక్కరూ కలత చెంది ‘అన్యాయం, దారుణం’ అంటుంటే బాధితుల పైన సాగించిన ప్రచారం గుర్తుందా?
‘వాళ్ళు అగ్ర కులాల ఆడవాళ్ళను వేధిస్తున్నారు, అల్లరి పెడుతున్నారు, ఆగం చేస్తున్నారు. ఇవన్నీ భరించి, భరించీ ఇక ఓపిక లేక…’ అని ప్రచారం చేశారు.
చుండూరు హత్యల తర్వాత కూడా అదే ప్రచారం చేశారు.
ఇప్పుడూ అదే చేస్తున్నారు. దళితులు బిఎస్‌పి నేతృత్వంలో దయాశంకర్ సింగ్ కుటుంబ స్త్రీలను అవమానపరిచారు, కుల విభేదాలను రెచ్చగొట్టారు, తమ నినాదాల ద్వారా శీల భంగం కావించారు.
ఫాసిజానికి ఓటమి తర్వాత సంగతి, ఓటమి వాసన కూడా నచ్చదు. దళితుల వల్ల తలదించుకోవలసి వస్తే, అసలే ఒప్పదు.
‘మనల్ని కాదులే’ అని ఊరుకుంటే రేపు ఈ హిందూత్వ ఫాసిజం ప్రతి ఒక్కరినీ చుట్టుముట్టడం ఖాయం!
***

Martin Niemöller
First they came for the Socialists, and I did not speak out—
Because I was not a Socialist.
Then they came for the Trade Unionists, and I did not speak out—
Because I was not a Trade Unionist.
Then they came for the Jews, and I did not speak out—
Because I was not a Jew.
Then they came for me—and there was no one left to speak for me.
-Martin Niemoller, Protestant paster
—
వాళ్ళు మొదట సోషలిస్టుల కోసం వచ్చారు, నేను ఏమీ మాట్లాడ లేదు-
ఎందుకంటే నేను సోషలిస్టును కాను.
తర్వాత వాళ్ళు ట్రేడ్ యూనియనిస్టుల కోసం వచ్చారు, నేను నోరు తెరవలేదు-
ఎందుకంటే నేను ట్రేడ్ యూనియనిస్టుని కాను.
ఆ తర్వాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు, అప్పుడూ నేను మాట్లాడ లేదు-
ఎందుకంటే నేను యూదుని కాను.
అనంతరం వాళ్ళు నా కోసమే వచ్చారు – అప్పటికి నా కోసం మాట్లాడేందుకు ఎవరూ మిగిలి లేరు.
-మార్టిన్ నీమొల్లర్, ప్రొటెస్టెంట్ పాస్టర్
***
మోడిని వ్యతిరేకించినందుకు అద్వానీని కూడా మోడీ గణాలు సహించలేదు.
తస్మాత్ జాగ్తత్త!
‘పెరుగుట విరుగుట కొరకే.’ ఇది సాధారణ సామెత కాదు, గతి తార్కిక సూత్రం. ఇది కూడా దాని పని అది చేసుక పోతుంది.
తెలిసో తెలియకో అధికారం చేతికొచ్చింది. ఆ అధికార దండంతో తన భావజాలాన్ని వ్యాప్తి చేసుకోవడం సహజమే! అయితే మిణుగురు పురుగుకు తనని ఆకర్షించింది నిప్పు అని తెలియక పోతే తను మాడి మసైపోతుంది. ఇది జగమెరిగిన సత్యం!
తిరుపాలు గారు, మీరు తెలుగు సామెతలు, జాతీయాలు భలేగా చెబుతారు, సరిగ్గా సందర్భానికి తగినట్లుగా. ఇలాంటి సందర్భోచిత పోలికలు సాధారణంగా పల్లెల్లో అనుభవంతో పండిన పెద్దల దగ్గర వింటుంటాం. మీరు వాటిని సులువుగా చెప్పేస్తుంటారు.
దయాశంకర్ సింగ్ ఏమన్నాడో తెలుసా? “మాయావతీ జీ వేశ్యా సే భీ బదతర్ చరిత్ర కీ హో గయీ హై” (మాయావతి గారు వేశ్య కంటే నీచమైన ప్రవర్తన ఉన్నదానిగా మారినారు) అని. వేశ్య అయితే తినడానికి డబ్బులు లేక ఒళ్ళు అమ్ముకుంటుంది. ఆమె కోట్లు సంపాదించదు. రాజకీయ ప్రత్యర్థుల్ని వేశ్యలతో పోల్చడం అనవసరం.