ప్రమాదకర పహరా -ద హిందు ఎడిట్…


[Dangerous vigilantism శీర్షికన ఈ రోజు -జులై 21- ద హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం.]

*********

గుజరాత్ లోని చిన్న పట్టణం ఉనా వద్ద “గో రక్షణ” కావలిదారుల చేతుల్లో కొందరు దళితులు హింసకు గురయిన సంఘటన, పార్లమెంటులో ప్రతిధ్వనిస్తుండగానే దానిపై నిరసనలు రాష్ట్ర వ్యాపితంగా విస్తరించడం కొనసాగుతూనే ఉన్నాయి. దళితుల నాయకత్వంలోని ఆందోళనలతో అట్టుడుకుతున్న సౌరాష్ట్రలో మెజారిటీ ప్రాంతాలు బుధవారం బంద్ పిలుపును అనుసరించి మూసివేతకు గురయ్యాయి. అక్కడ ఆందోళనకారులు వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టారు. జులై 11 తేదీన దళితులు ఎదుర్కొన్న హింసకు ప్రతిస్పందనగా సజీవ చైతన్యంతో చెలరేగినదిగా కనిపిస్తున్న నిరసన అది. సదరు హింసాత్మక దాడిని దాడి చేసినవారిలో ఒకరు వీడియో తీసి ఆన్ లైన్ లో పోస్ట్ చేశాడు. చర్మం కోసం ఆవును చంపారన్న ఆరోపణలతో వాళ్ళ బట్టలు ఊడదీసి, (రాడ్లు, కర్రలతో) కొట్టి, చేతులు కట్టివేసి, ఊరేగించారు. అది యధేచ్ఛగా మరియు వ్యవస్ధాగతంగా కూడా సాగిన క్రూరత్వం తాలూకు వీడియో రూపం లోని రికార్డు. వివిధ రూపాల్లో వ్యక్తం అవుతున్న నిరసనను కష్టాల నివృత్తి కోసం, మొత్తంగా వ్యవస్ధాగతంగా జరగవలసిన సామాజిక మార్పు కోసం ఎలుగెత్తడంగా చూడాలి. కొందరు ఆత్మహత్యా ప్రయత్నం ద్వారా నిరసన తెలిపారు; విష ద్రావకం సేవించడంతో ఒకరు చనిపోయారు కూడా. నిర్దిష్ట నిరసనకారులు ఒక జిల్లా అధికారి కార్యాలయంలో పశువుల కళేబరాలను తెచ్చిపడేయడం ద్వారా నిరసన తెలిపారు. గుజరాత్ వ్యాపితంగా అనేకమంది వీధుల్లోకి వచ్చి నిరసిస్తున్న క్రమంలో నిరసనకారులు విసిరిన రాయి దెబ్బకు గాయపడి ఒక పోలీసు మృతి చెందాడు. రాష్ట్ర వ్యాపితంగా మరిన్ని నిరసనలు జరపాలని నిరసనకారులు పధకాలు వేసుకుంటున్నారు. ఇది సమగ్ర మరియు సంపూర్ణ ప్రతిస్పందన అందించవలసిన కోపోద్రేకమే గానీ ఘర్షణాత్మక ధోరణితో యుద్ధానికి వెళ్ళే మాదిరి చర్యలపై అతిగా ఆధారపడవలసినవి కాదు.

గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ బాధితులను కలిశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఈ అత్యాచారాన్ని ఖండించారు. కేంద్ర హోమ్ మంత్రి రాజనాధ్ సింగ్ దాడి గురించి పార్లమెంటులో మాట్లాడారు. దళితులకు వ్యతిరేకంగా జరిగే ఇలాంటి చర్యలు సామాజిక చెడుగుగా అభివర్ణిస్తూ దానితో పోరాటానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. ‘సామాజిక ఉగ్రవాదం’గా ఘటనను అభివర్ణిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ భారతీయ జనతా పార్టీని మూలకు నెట్టే ప్రయత్నం చేయగా ఆమె పార్టీ నాయకులు ఉనా ను సందర్శించే యోచనలో ఉన్నారు. అనేక ఇతర రాజకీయ పార్టీల నాయకులు కూడా అదే పనిలో ఉన్నారు. దాడి చేసిన వారిని శిక్షించబడేట్లుగా చూడడం ద్వారా అధికారులు ఉనా బాధితులకు స్ధైర్యం కల్పించాలి; అంతే కాకుండా బాధితులకు బధ్రత కల్పించి, ప్రతీకార చర్యలకు లోను కాకుండా చూడాలి. కానీ, ఇది జరగాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలతో ఒక అంగీకారానికి రావాలి. దేశంలో వివిధ చోట్ల కనిపిస్తున్నట్లుగా దూకుడుమారి కాపలాకు గో రక్షణ ఒక ముసుగు కారాదు. తరచుగా ఇది మతతత్వ స్ధిరీకరణ దిశగా సాగుతున్న కార్యలాపంగా జరుగుతోంది. ఆవు (లేదా ఎద్దు) పేరుతో జరిగే ఆ హింసా, బెదిరింపులను సహించేది లేదన్న సందేశాన్ని త్వరితగతిన, మరో మాటకు తావు లేకుండా -గుజరాత్ ప్రభుత్వం నుండే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా అందించాలి.

*********

తమది మనువాద హిందూత్వ ప్రభుత్వమనీ, మనువాదం మల్లేనే తాము దళిత వ్యతిరేకులమేననీ బి‌జే‌పి-ఆర్‌ఎస్‌ఎస్ పరివారం నేతృత్వం లోని ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యల ద్వారా చాటుకుంది. ప్రజా ప్రాతినిధ్య ఓటింగు వ్యవస్ధలో దళితులకూ ఓటు హక్కు ఉండి చచ్చింది కనుక తప్పనిసరై అంబేద్కర్ ను తమ వాడిగా చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నారే తప్ప వాస్తవంలో హిందూత్వ భావజాలంలో దళితుల గౌరవానికి తావు లేదు. ఈ సంగతి మను స్మృతి ఇరానీ గారి సుప్రసిద్ధ రాజ్య సభ ప్రసంగంలో, మహిషాసురిడిని కొలిచే అసురులను ‘భ్రష్ట మనస్కులు’ గా చీత్కరించినప్పుడే స్పష్టాతిస్పష్టంగా తేటతెల్లం అయింది. 

ఇటువంటి భావజాలంతో నిండిన కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రజలతో, ముఖ్యంగా దళిత ప్రజలతో ఒక అవగాహనకు లేదా అంగీకారానికి రావటానికి ప్రయత్నాలు చేస్తుందని భావిస్తే అది ఒట్టి భ్రమే అవుతుంది.

హిందూత్వ వినాశకర జైత్రయాత్రకు, గోరక్షణ ముసుగులో సాగుతున్న గూండాయిజానికి అడుగడుగునా అడ్డు పడుతున్నది దేశం లోని దళిత శక్తులే. హిందూ సెంటిమెంట్లతో ప్రతి హేతుబద్ధమైన చర్చను, సంఘాన్ని, సంస్ధను, పార్టీని, నిర్మాణాన్ని దులిపి కొట్టేస్తున్న హిందూత్వకు దళిత నిరసన, పోరాటం, చర్చ పంటి కింద రాయిలా, చెవిలో జోరీగలా, కాలిలో ముల్లులా ఎదురు దెబ్బలను తాటిస్తోంది. ఇది హిందూత్వకు అత్యంత నిస్పృహను కలిగిస్తోంది. అఖ్లక్ కుటుంబంపై అత్యంత దారుణంగా దాడి చేసి చంపిన తర్వాత కూడా ఆ కుటుంబంపై గోవధ కేసు పెట్టించడంలో సఫలమైన హిందూత్వకు దళితుల దగ్గరికి వచ్చేసరికి ఎటూ పాలుపోకుండా అవుతోంది.

విశ్వవిద్యాలయాల మీదికి వెళ్ళబోతే రోహిత్ త్రిశూలమే అయి గుండెల్లో పొడిచాడు. వేల మంది ముస్లింలను ఊచకోత కోయించి కూడా నిర్దోషులుగా బైటికి వచ్చిన చోటనే నలుగురు దళిత యువకులను కేవలం బట్టలు విప్పి కొట్టినందుకే పార్లమెంటులో సమాధానం చెప్పుకోవలసిన పరిస్ధితి దాపురించింది. మర్యాద అన్నది ఎరుగని రీతిలో రాజకీయ పార్టీల నేతలను చిత్తం వచ్చినట్లు తూలనాడే బి‌జే‌పి నేతలు దళిత నేత మాయావతిని దూషించి నిలువెత్తు లోతులో మునిగిపోయినట్లుగా ఊపిరాడక గిలగిలా కొట్టుకోవలసిన పరిస్ధితి ఎదుర్కొంటున్నారు.

ఈ తరహా అవమానాన్ని, ఇబ్బందిని హిందూత్వ ఎల్లకాలం సహించకపోవచ్చు. ఏదో ఒక పేరు పెట్టి, దళితుల మీదికి కత్తి దూసే మార్గాన్ని కనిపెట్టకుండా ఉండరు. మావోయిస్టులు అన్న ముద్ర వేసి ఆదివాసీలను వందలాదిగా జైళ్ళలో కుక్కుతున్న హిందూత్వ పాలకులు అదే మంత్రాన్ని దళిత నిరసనలపై ప్రయోగించినా ఆశ్చర్యం లేదు. వారి కుట్రలను తిప్పికొట్టేందుకు ఒక్క దళితులే కాదు, ప్రజాస్వామిక వాదులు, హేతువాదులు, హక్కుల కార్యకర్తలు అందరూ సిద్ధం కావలసి ఉన్నది. 

4 thoughts on “ప్రమాదకర పహరా -ద హిందు ఎడిట్…

 1. ఇది మీ సౌత్ ఇండియన్ ఇంటర్ప్రేటేషన్. నార్త్ ఇండియాలో దళితులకి బిజెపి మీద ద్వేషమేమి లేదు. దళిత చైతన్యం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలోనే దళిత పార్టి లు బిజెపి తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఈ నాడు ఏ దళిత నాయకుడు అధికారం వదలుకొని ఉద్యమాలు చేసేస్థాయిలో ఉన్నాడో మీరోక సారి ఆలోచించి చెప్పండి. ఒకవేళా చేసిన అతనికి ఎంత ఆదరణ లభిస్తుంది?

  బిజెపి పాలిత రాష్ట్రం కాబట్టి మీరు మీ వర్షన్ అల్లుకొంట్టుపోయారు. తమిళ నాడు,కేరళ లో దళితులపై దాడులు జరిగటం లేదా? బీహార్ లో దళిత యువతి ఇంఫార్మర్ గా పని చేయను, చదువు కొంటాను అని చదువువైపు మొగ్గు చూపితే నక్సల్స్ కాల్చి చంపారు. ఇటువంటి సంఘటనలు ఎన్నో రోజు పేపర్లలో కనబడుతున్నాయి. వాటికి లేని కవరేజ్ గుజరాత్ కు ఎక్కువగా ఇవ్వటం రాజకీయం చేయటమే. గుజరాత్ లో వంజీరా వంటి దళితులు బిజెపి ని సమర్ధించేవారు ఎంతో మంది ఉన్నారు.

 2. మీది “మీ” నార్త్ ఇండియన్ “ఇంటర్ప్రేటేషన్” లా కనిపిస్తున్నది సుమీ.

  అయితే మీరు ‘నార్త్’ సౌత్ ఇండియన్ అన్నమాట!

 3. ఎవరి దాకానో ఎందుకు? మాయావతి గారే ఓ సారి బిజెపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కదా! మొన్న లోక్ సభ ఎన్నికల్లో యుపి దళితులు సగం మంది బిజెపికీ ఓటు వేశారని కూడా కొందరు చెబుతారు.

  ఇవేవీ బిజెపి దళిత వ్యతిరేక తత్వాన్ని నెగేట్ చేసేవి కావు. ఆ పార్టీ స్వభావం ఏంటో దాని చర్యలు చెబుతాయి గానీ, ఆ పార్టీ నేతల కబుర్లు కాదు. దళిత నేతల కబుర్లు వాళ్ళ అవకాశవాద రాజకీయాలు కూడా బిజెపికి సర్టిఫికెట్ కాజాలవు. వాళ్ళు ఉద్యమం చేసే స్ధాయిలో లేరు, కరెక్టే. కానీ అక్కడి నుంచి బిజెపికి లెజిటిమసీ రాదు కదా!

  అవును, రాజకీయం చేయడమే. ఓ పక్క దళితుల ఆహార అలవాట్లను కూడా నేరంగా మార్చి రాజకీయం చేస్తారు. కరసేవకుల్ని కాల్చితే రారాజకీయ లబ్ధి కోసం ప్రతీకారం రెచ్చగొడతారు. అగ్ర కులాల ఓట్ల కోసం దళితుల మీదా, రిజర్వేషన్ల మీదా ద్వేషం రెచ్చగొడతారు. దళితుల మీద దాడులు చేస్తే, అది కూడా బిజెపి రాష్ట్రంలో చేస్తే అది రాజకీయం కాకూడదా?!

  అసలు రాజకీయం కానిది ఏమిటో ఒక్కటి చెప్పండి. మిగతా పార్టీలు కనీసం నటనకైనా దళితుల మీద సానుభూతి చూపుతాయి. బిజెపి అది చేయక పోగా, దళితుల పైన పచ్చిగా, నగ్నంగా అన్ని విలువలూ తుంగలో తొక్కి ద్వేషం వెళ్ళగక్కుతుంది. అణచివేత అమలు చేస్తోంది.

  ఉదాహరణలు కావాలా? రోహిత్ ని సంఘ బహిష్కరణ చేసి, ఆత్మహత్య చేసుకున్నా కూడా అతను జాతీయ వ్యతిరేకి అనీ, ఉగ్రవాది అనీ దుదుష్ప్రచారం చేసింది బిజెపి మంత్రులు కాదా? మాయావతిని వేశ్యకంటే ఘోరం అని దూషించి, తిరిగి ఆమె పైనే ఆడవాళ్ళ చేత తప్పుడు కేసులు మోపింది బిజెపి కాదా? కేసుతో బిజెపికి సంబంధం లేదని నంగనాచి కబుర్లు చెప్పినా ఎవరూ నమ్మరు. ఇలాంటి ఉదాహరణలు బోలెడు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s