దారిన పోయే దరిద్రాన్ని పిలిచి తలకెత్తుకోవటం అంటే ఇదే కావచ్చు. NSG (న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్) సభ్యత్వం కోసం ఎన్నడూ లేని విధంగా బీజింగ్ చుట్టూ చక్కర్లు కొట్టిన ప్రధాన మంత్రి ఇప్పుడు సరిహద్దు వద్ద ఉద్రిక్తత పెరిగేందుకు దోహదం చేస్తూ చైనాతో ఘర్షణ వాతావరణం పెంచే విధంగా గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు.
వివాదాస్పద సరిహద్దు కలిగిన లడఖ్ ఏరియా లోకి భారీ ఎత్తున యుద్ధ ట్యాంకులను భారత ప్రభుత్వం తరలించింది. జమ్మూ & కాశ్మీర్, టిబెట్ ప్రాంతాల మధ్య నెలకొన్న లడఖ్ ప్రాంతానికి 100 యుద్ధ ట్యాంకులు భారత సైన్యం తరలించిందని రష్యా పత్రిక స్పుత్నిక్ న్యూస్ తెలిపింది.
లడఖ్ సరిహద్దు లోకి భారీ యుద్ధ సామాగ్రిని ఇండియన్ ఆర్మీ తరలించటం ఇదే మొదటిసారి అని తెలుస్తున్నది. రష్యా తయారీ అయిన T-72 ట్యాంకులను తరలించటానికి ముందు వాటికి పెద్ద ఎత్తున మరమ్మతులు చేపట్టామని, ఆధునీకరణ కూడా జరిపామనీ, భారత సైనిక అధికారులు చెప్పారని ఎన్.డి.టి.వి తెలిపింది.
“పర్వత శ్రేణుల వెంట విస్తరించిన విస్తారమైన చదరపు ప్రాంతాలు సాయుధ శకటాల కదలికలకు అనువుగా ఉన్నాయి. అంతే కాకుండా సరిహద్దుకు అవతల బలగాల కదలికలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది” అని మిలటరీ అధికారి ఒకరు చెప్పారని ఎన్.డి.టి.వి తెలిపింది. సరిహద్దుకు అవతల చైనా బలగాల కదలికలు పెరిగాయని, అందుకే ఇండియా కూడా యుద్ధ పరికరాలను, బలగాలను తరలిస్తున్నదని మిలటరీ అధికారి చెబుతున్నారు.
సాధారణ దృష్టితో చూస్తే, అవతలి వైపు బలగాల కదలికలు పెరిగినప్పుడు మనం కూడా అనివార్యంగా అప్రమత్తం కాక తప్పదు. అందునా ఇరు దేశాలు ఒకసారి యుద్ధం చేసుకున్నాయి గనక అఅప్రమత్తంగా లేకపోవడమే తప్పు అవుతుంది. కానీ ఇండియా చైనా మధ్య చెలరేగుతున్న ఉద్రిక్తతలు కేవలం ఇరు దేశాల మధ్య సమస్యగా మాత్రమే చూడటం కూడా తప్పే కాగలదు. ఎందుకంటే ఇండియా, చైనాల మధ్య తగవులు పెరగాలని, ఇరువురు మధ్య ఉద్రిక్తతలు పెరగాలని అమెరికా కోరుకుంటున్నది కాబట్టి!
గతంలో వివిధ ఆర్టికల్స్ లో ఈ అంశంపై చర్చించుకున్నాము. అమెరికా తన ప్రపపంచాధిపత్య వ్యూహాన్ని ఐరోపా, పశ్చిమ ఆసియాల నుండి ఆసియా కేంద్రంగా మార్చుకుంది. ఈ వ్యూహంలో తూర్పు, దక్షిణ ఆసియాతో పాటు పసిఫిక్ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తాయి.
తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రం (ఇవి పసిఫిక్ లో భాగం), తూర్పు యూరప్, నల్ల సముద్రం, బాల్టిక్ మరియు బాల్కన్ సముద్రాలు, కొంత వరకు మధ్య ప్రాచ్యం ప్రధాన ఘర్షణ ప్రాంతాలుగా ఉంటాయి. ఘర్షణలు క్రమంగా మధ్య ఆసియా, రష్యా, చైనాల మీదికి తరలించటం, లేదా తరలిస్తామని బెదిరించటం అమెరికా లక్ష్యం. ఇందులోని చైనా వ్యతిరేక భాగంలో ఇండియాను భాగస్వామిగా అమెరికా ఎంచుకుంది. ఇండియా తమకు వ్యూహాత్మక భాగస్వామి అని ఇఇటీవల కాలంలో అమెరికా ప్రకటించటం ఈ లక్ష్యం తోనే.
తన ఆధిపత్య లక్ష్యం కోసమే ఇండియాకు ఎన్.ఎస్.జి సభ్యత్వం ఇవ్వాలని పట్టుబడుతున్నట్లుగా అమెరికా ఫోజు పెడుతోంది. అందుకు చైనా మోకాలడ్డుతున్నట్లుగా ఒక వాతావరణం సృష్టించింది. నిజానికి NSG ని స్థాపించిందే ఇండియాకు వ్యతిరేకంగా. ఇందిరా గాంధీ హయాంలో పోఖ్రాన్ లో 1974లో ఇండియా అణు పరీక్ష జరిపిన దరిమిలా అణు సాంకేతిక పరిజ్ఞానం మనకు అందకుండా చేసే లక్ష్యంతో అమెరికా NSG కి రూపకల్పన చేసింది. అణు ఇంధనం (యురేనియం) నిల్వలు కలిగిన దేశాలన్నింటినీ NSG కింద సమీకరించింది. ఇండియాకు యురేనియం అందకుండా కట్టడి చేసింది.
ఆ తర్వాత NPT (అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం), CTBT (అణు పరీక్షల నిషేధక సమగ్ర ఒప్పందం) లను అమెరికా ఉనికి లోకి తెచ్చింది. వాటిపై సంతకాలు చేస్తేనే అణు ఇంధనం, అణు సాంసాంకేతిక పరిజ్ఞానం ఇస్తామని ఆంక్షలు విధించింది. ఫలితంగా ఇండియా మూడు సంవత్సరాల పాటు అణు ఏకాకితనంలో మగ్గిపోయింది.
భారత పాలకులు ఈ చరిత్రను మర్చిపోయారు. అమెరికా మాటలు నమ్మి NSG సభ్యత్వం కోసం ఊగిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా NSG సభ్యత్వం కోసం ప్రధాన మంత్రి గారే లాబీయింగు జరపడం కోసం హుటాహుటిన NSG గ్రూపు సమావేశాలు జరుగుతున్న దక్షిణ కొరియాకు బయలుదేరి వెళ్లారు. బీజింగ్ చుట్టూ చక్కర్లు కొట్టారు.
ఇంతగా కాళ్ళా వేళ్ళా పడవలసిన అగత్యం లేదని భారత నిపుణులు, అణు సంస్థల మాజీ అధిపతులు, మాజీ రాయబారులు చెవిన ఇల్లు గట్టుకుని పోరినా మోడి చెవికి ఎక్క లేదు. చివరికి భారత ప్రధానికి శృంగభంగమే ఎదురయింది. ఇలా జరుగుతుందని అమెరికాకు ముందే తెలుసు. తెలిసీ ఇండియాను రెచ్చగొట్టి ముగ్గులోకి లాగింది. NSG గ్రూపులో కనీసం 6 దేశాలు “నో” చెప్పగా, చైనా ఒక్కటే నో చెప్పినట్లు పశ్చిమ పత్రికలు ప్రచారం చేశాయి. దానితో భారత ప్రజలలో అమెరికా ఎంతో నమ్మకమైన మిత్ర దేశం గానూ, చైనా మన సభ్యత్వానికి ఒప్పుకోని ఏకైక శత్రు దేశం గానూ ప్రచారం జరిగిపోయింది.
అమెరికాకు కావలసింది సరిగ్గా అదే. అమెరికా విష కౌగిలిని స్నేహ పూర్వక కౌగిలిగానూ, చైనాను భారత్ ఎదుగుదల ఓర్చుకోలేని శత్రు పూరిత పొరుగు దేశం గానూ భారత ప్రజలు భావించాలి. చైనా చర్యలను అనుమానంతో చూడాలి. అమెరికా చర్యలను స్నేహ పూర్వకంగా పరిగణించాలి. తద్వారా భారత పాలకులు తీసుకునే చైనా వ్యతిరేక విధానాలకు ప్రజల ఆమోదం సంపాదించాలి. ఇదొక పెద్ద గేమ్ ప్లాన్.
లడఖ్ సరిహద్దు లోకి భారీ ఎత్తున యుద్ధ ట్యాంకులను, బలగాలను తరలించడం ఈ గేమ్ ప్లాన్ లో భాగమే. అలాగని సరిహద్దు భద్రతను పెంచుకోకుండా ఊరుకోనూలేము. దీనికి పరిష్కారం మొట్టమొదటగా వీవీలైనంత త్వరగా చైనాతో సరిహద్దు లను నిర్ణయించుకోవటం. ఘర్షణకు తావు లేకుండా చేసుకోవడం. కానీ అందుకు అమెరికా ససేమిరా ఒప్పుకోదు.
మరి ఈ మధ్య కొన్ని భారత వ్యాపార సంస్ధలు ఆయుధవ్యాపారంలోకి ప్రవేశించాయి కదా.
యుధ్ధమేహాలు లేకుండా ఎవడింట్లో వాడు కూకుంటే యాపారం ఎలా అవుద్ది ?
శ్రీకాంత్ గడ్డిపాటి.
మర్మం ఎరుక పరిచారు!
ఎన్.యెస్.జి లో సభ్యత్వానికి చైనా వ్యతిరేకంగా వోటు వేసినపుడు,దానికి సాకుగా వారు చెప్పుకొన్న అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఇండియా సభ్యత్వానికి మోకాలడ్డుపడినపుడు,అదే చైనా ఫిలిప్పైన్స్ కు అనుకూలంగా అంతర్జాతీయ న్యాయస్థాన తీర్పును వ్యతిరేకిస్తున్నప్పుడు వారికి(చైనాకు) అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని తెలియదా?
దీనిని ఏ దృష్టిలో చూడవలసి ఉంటుంది?
ఎన్‌ఎస్‌జి, ఆర్బిట్రేషన్ కోర్టు రెండూ అధికారికమైనవి కావు. మొదటిది ప్రైవేటు గ్రూపు, రెండోది కట్టుబడవలసిన నిబంధన లేని ఆర్బిట్రేషన్ కు పరిమితమైనది. ఈ రెండింటిలో అంతర్జాతీయ చట్టం అన్న పరిభాష వర్తించదు.
విశేఖర్ సర్ మీ బ్లాగు ద్వారా ఎన్నొ విషయల్లొ అవగాహన తెఛుకున్నాను ధన్యవాదాలు.
హెల్లొ విసెకర్ గారు,
మీ ఆర్టికల్స్ చదివి ఎంతో నెర్చుకొన్నాను . ధన్యవదాలు
గొధ్రా ఘటన జరిగిన తర్వత అమెరికా మోది విసా ని రద్దు చెసింది.. అయినా మోది ఇప్పుడు అమెరికా భజన చెస్తున్నాడు..మనకు రుష్యా ఎంతో సహయం చెసింది.. అందుకే రష్యా ఇప్పుడు పాకిస్తాన్ కి దగ్గరవుతుంది . ఈ పరిమనం మనమే చెసుకొన్నామా?
SEKHAR SIR I AM GLADE TO MEET YOU MEANS READING YOUR ARTICLES.I AM PREPARING FOR CIVIL SERVICE MAINS WRITE IN TELUGU
. YOUR ARTICLES GIVE MORE INFORMATION BUT THESE ARE FACTS IF I WILL WRITE THESE FACTS EXAMINER WILL ACCEPT MY ATTITUDES BECAUSE THESE ARTICLES ARE PURELY FACTS
PLEASE CLARIFY MY DOUBT SIR
హృషికేష్ గారు, నేను రాసేవన్నీ నిజాలే. అనుమానం లేదు.
అయితే సివిల్స్ పరీక్షల్లో ఈ వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లు రాస్తే ఎగ్జామినర్ ఆమోదిస్తారా అన్నది మీ ప్రశ్న అనుకుంటాను.
నా సలహా ఏమిటంటే నేను చేసే విశ్లేషణను ఉన్నది ఉన్నట్లు మీరు మీ పరీక్షల్లో ప్రజెంట్ చేయకండి. సంఘటనల్ని ఉన్నవి ఉన్నట్లు ప్రస్తావించవచ్చు. కానీ, నా విశ్లేషణలోని పదును ని యధాతధంగా ఇవ్వవద్దు. కాస్త మొద్దు బార్చి, రెండు వైపుల నుండి వివరణ ఇస్తూ మధ్యవర్తి పాత్రలో మీ విశ్లేషణ ఇవ్వండి. జరిగిన సంఘటనలను మొద్దుబార్చడం అనేది ఉండదు. వాటిని చూసే విధానం లోనే స్వేచ్ఛ ఉంటుంది. కదా?
మధ్యవర్తికి ఇరు పక్షాల్లో ఒకరిదే న్యాయం అనీ మరొకరిది అన్యాయం అనీ తప్పనీ తెలుస్తూనే ఉంటుంది. కానీ తాను మధ్యవర్తి గనుక ఎవరి పక్షమూ వహించకుండా ఇరువురికీ లాభం/న్యాయం/ప్రయోజనం దక్కేలా తీర్పు ఇస్తాడు. అలాగే మీరూ రాయండి.
అయితే వ్యక్తిగతంగా మీరు న్యాయం పక్షానే ఉండాలని మాత్రం మరువకండి.