నగదు బదిలీ: మోడి చెప్పింది అబద్ధం! -కాగ్


Gas Subsidy

అబద్ధం! అబద్ధం!! అబద్ధం!!!

తమ ప్రభుత్వం గొప్పతనాల గురించి, సాధించిన బృహత్కార్యాల గురించి బి‌జే‌పి నేతలు చెప్పేవి అన్నీ అబద్ధాలే. జి‌ఎస్‌టి బిల్లు ఆమోదింపజేసుకోవడానికి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలోనే అబద్ధం ఆడేస్తారు. నగదు బదిలీ పధకం దేశానికి భలే ఒరగబెట్టిందని చెప్పడానికి ప్రధాన మంత్రి చాలా తేలికగా వేల కోట్ల అబద్ధాన్ని ఆడేస్తారు.

బి‌జే‌పి ప్రభుత్వ నేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఈ అబద్ధాల కార్యక్రమానికి నాయకత్వం వహించడం ఒక విడ్డూరం. అత్యున్నత ప్రభుత్వ నేత మంచి సాంప్రదాయాలను ప్రవేశపెట్టడం మాని, కనీసం ఉన్న సాంప్రదాయాలను కొనసాగించకపోగా, దుఃసంప్రదాయాలను ప్రవేశపెట్టడం దేశానికి, రాజకీయ వ్యవస్ధకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ఇక ఆయన జమానాలోని మంత్రులు ఆయన్ను అనుకరించక ఏంచేస్తారు?

వంట గ్యాస్ పంపిణీలో అవినీతిని అరికట్టేందుకు అని చెబుతూ సబ్సిడీలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు మోడి ప్రభుత్వం ఏకంగా చట్టమే చేసేసింది. ఆధార్ కార్డు నమోదును తప్పనిసరి చేసిన ఈ చట్టం ద్వారా గ్యాస్ సబ్సిడీని ఖాతాదారు నగదు చెల్లించేటప్పుడు కాకుండా గ్యాస్ బండ తీసుకున్న తర్వాత సబ్సిడీ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు.

ఇలా చేయటం వల్ల 2014-15, 2015-16 ఆర్ధిక సంవత్సరాలలో ఏకంగా రు 22,000 కోట్లు ఆదా చేశామని నరేంద్ర మోడి గత సం. స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్ర కోట పైనుండి మాట్లాడుతూ చెప్పారు. తన ప్రభుత్వం ప్రకటించిన ‘Give It Up – (సబ్సిడీ) వదులుకోండి’ పిలుపు కూడా ఈ ఆదాకు దివ్యంగా పని చేసిందని ఆయన గొప్పలు చెప్పుకున్నారు. అయితే ఇది నిజం కాదని కాగ్ నివేదిక ఒకటి వెల్లడి చేసింది.

కాగ్ నివేదిక ప్రకారం నగదు బదిలీ పధకం ద్వారా కేంద్రానికి ఆదా అయిన మొత్తం కేవలం రు 2,000 కోట్ల రూపాయలకు లోపలే ఉన్నది. మిగిలిన మొత్తం అంతా, అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్/పెట్రోలియం ధరలు తగ్గడం వల్ల ఆదా అయింది తప్ప మోడి ప్రభుత్వ పధకాల వల్ల కాదు.

అంతే కాకుండా కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ మోడి ప్రభుత్వం అమలు చేస్తున్న నగదు బదిలీ పధకంలో పలు లొసుగులు ఉన్నట్లు వెల్లడి చేసింది. ఇవి చిన్న చిన్న లొసుగులు కావనీ, వ్యవస్ధాగతంగా లోతులకు చొచ్చుకుని ఉన్నాయని కాగ్ తెలిపింది. అనగా అవినీతికి బ్రహ్మాండమైన అవకాశాలను కల్పిస్తున్నట్లే భావించవచ్చు. లొసుగుల్లో ఒకటి గృహ వినియోగం కోసం ఉద్దేశించిన సబ్సిడీలను వాణిజ్య వినియోగం కోసం తరలించడం.

ఇది దానికదే పెద్ద అవినీతి. గృహ వినియోగదారుల పేరుతో వాణిజ్య సంస్ధలు పెద్ద ఎత్తున గ్యాస్ నిల్వలను వాడుకుంటున్నాయని దీనిని అరికట్టాలంటే నగదు బదిలీ పధకం అవసరమని గత కాంగ్రెస్ ప్రభుత్వం, నేటి బి‌జే‌పి ప్రభుత్వం రెండూ చెప్పాయి. నగదు బదిలీ పధకం తర్వాత కూడా ఈ అవినీతి కొనసాగుతున్నదంటే ఏమిటి అర్ధం? బి‌జే‌పి, కాంగ్రెస్ ప్రభుత్వాలు చెప్పిన ‘అవినీతి అరికట్టుడు,’ నగదు బదిలీ పధకం వల్ల సాధ్యం కాలేదనే కదా? ఆధార్ అనుసంధానం వాస్తవంగా అవినీతిని అరికట్టడానికి ఉద్దేశించింది కాదనే కదా?

గృహ వినియోగం కోసం ఉద్దేశించిన గ్యాస్ సబ్సిడీని వాణిజ్య సంస్ధలకు తరలించడం ఒక లొసుగు కాగా, వాణిజ్య వినియోగానికి ఉద్దేశించిన గ్యాస్ ను, గృహాలకు తరలించడం మరొక లొసుగు. మొదటి లొసుగులో సబ్సిడీ సొమ్ము దుర్వినియోగం అవుతుండగా, రెండవ లొసుగులో వినియోగం లోనే మతలబు జరుగుతోంది. వాణిజ్య సంస్ధలు వాణిజ్య సిలిండర్లను గృహ వినియోగంగా మార్చుతున్నారనీ తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఈ అంశం సూచిస్తోంది.

“ప్రత్యక్ష నగదు బదిలీ పధకమే లేనట్లయితే 2014-15 సం.లో ప్రభుత్వం రు 15,000 కోట్లు అదనంగా ఖర్చు చేయవలసి ఉండేది” అని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ఒక సెమినార్ లో మాట్లాడుతూ చెప్పారు. ఇంధనం సబ్సిడీలపై జరిగిన సెమినార్ లో మాట్లాడిన మంత్రి తమ పధకం గొప్పతనం వివరిస్తూ ఆ మాటలు చెప్పారు.

అదే అబద్ధాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఎర్ర కోట నుండి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. “ఎల్‌పి‌జి గ్యాస్ సబ్సిడీ పంపిణీని మేము ప్రత్యక్ష నగదు లబ్ది బదిలీ పధకం కిందకు తెచ్చాము. జన్ ధన్ యోజన పధకం, ఆధార్ కార్డులను అందుకు వినియోగించాము. ఇలా చేయడం వల్ల మధ్య దళారీలు, బ్లాక్ మార్కెట్ దారులు నష్టపోయారు. మేము వ్యవస్ధను సరిచేసి, గ్యాస్ సబ్సిడీ పధకం కింద ప్రతి యేడు దొంగిలించబడుతున్న రు 15,000 కోట్లను ఆదా చేశాము” అని మోడి ఆగస్టు 15, 2015 తేదీ ప్రసంగంలో ఆర్భాటంగా చాటారు.

అయితే వాస్తవాలు ఇందుకు పూర్తిగా విరుద్ధం అని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వానికి చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ – పి‌పి‌ఏ‌సి- ప్రకారం భారత ఎల్‌పి‌జి దిగుమతులు 2014-15 సం.లో రు 36,571 కోట్లు ఉండగా అది 2015-16 లో రు 25,626 కోట్లకు పడిపోయింది. తద్వారా ఒక సంవత్సరంలో రు 10,945 కోట్లు ఆదా అయింది. ఈ ఆదా దిగుమతుల్లో నమోదు అయింది గాని వినియోగంలో కాదు.

దిగుమతి బిల్లు తగ్గిపోయింది కాబట్టి గ్యాస్ దిగుమతి పరిమాణం కూడా తగ్గిందా? జరిగింది అది కాదు. నిజానికి గ్యాస్ దిగుమతుల పరిమాణం 2015-16లో అంతకు ముందు కంటే పెరిగింది. 2014-15లో 8,313 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ దిగుమతి కాగా అది 2015-16లో 8,885 వేల మెట్రిక్ టన్నులకు పెరిగిందని పి‌పి‌ఏ‌సి గణాంకాలు తెలిపాయి.

మే 2014 లో బ్యుటెన్ (C4H10  – వంట వినియోగంలో వాడుకునే గ్యాస్) ధర మెట్రిక్ టన్నుకు 825 డాలర్లు ఉండగా అది జులై 2016లో 310 డాలర్లకు పడి పోయింది. అలాగే ప్రోపేన్ (ద్రవంగా మార్చగల గ్యాస్ – వాహనాల ఇంధనం) మే 2014లో 810 డాలర్లు ఉండగా జులై 2016 నాటికి 295 డాలర్లకు పడిపోయింది. ఈ తగ్గుదల పెద్ద పెద్ద అడుగుల వారీగా జరిగింది.

ఈ విధంగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్ధితుల వల్ల రెండేళ్లలో భారీ మొత్తం భారత ప్రభుత్వం ఖజానాకు ఆదా అయింది. ఆదా మొత్తం రు.  21,576 కోట్లు కాగా అందులో నగదు బదిలీ పధకం గివ్ ఇట్ అప్ పధకంల ద్వారా ఆదా అయింది రు 2,000 కోట్లకు లోపే అని కాగ్ తెలిపింది.

కాగ్ నివేదికను పార్లమెంటుకు సమర్పించబడింది. నివేదికను ప్రభుత్వం ఆమోదించాక గాని పూర్తి వివరాలు వెల్లడి కావు. నివేదికను చర్చకు స్వీకరించిన తర్వాత మోడి లెక్కలలోని ఆర్భాటాలకు, అంకెల తేడాలకు సమాధానం ఇచ్చుకోవలసి ఉంటుంది. సమాధానం ఇవ్వకుండా ఎగవేయనూ వచ్చు. మోడి ఇంతకాలం చేసింది అదే. ప్రభుత్వంపై వచ్చిన, వస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వకుండా మౌనం వహించడమే మోడి అనుసరిస్తున్న ఎత్తుగడ!

“తా వలచింది రంభ, తా మునిగింది గంగ” అన్నట్లుగా మన్మోహన్ సింగ్ మౌనం వహిస్తేనేమో ఆయనను ‘మౌని బాబా’ అని యేళ్ళ తరబడి ఎకసక్కెం చేయొచ్చు. అదే మౌనం మోడి పాటిస్తేనేమో అది ‘రియల్ పోలిటిక్’ అవుతుందా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s