జిఎస్టి వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో లేని మేలు జరుగుతుందని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు సభలో మాట్లాడుతూ చెప్పారు. అమ్మకపు పన్నులో గతంలో రాష్ట్రాలకు వాటా ఉండేది కాదనీ, జిఎస్టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) బిల్లు ఆమోదం పొందితే సేల్స్ టాక్స్ లో కూడా రాష్ట్రాలకు వాటా వస్తుందని అరుణ్ జైట్లీ ఊరించారు.
కానీ ఇది అబద్ధం అని మాజీ ఆర్ధిక మంత్రి పి చిదంబరం వెల్లడి చేశారు. కేంద్రానికి సమకూరే ప్రతి పన్ను ఆదాయం లోనూ రాష్ట్రాలకు వాటా వెళ్తుందని అందులో సేల్స్ టాక్స్ కూడా ఉన్నదని ఆయన ట్విట్టర్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. సభలో ఆర్ధిక మంత్రి చెప్పింది సరికాదని కూడా ఆయన తెలిపారు.
అమ్మకపు సేవల పన్ను (GST) ప్రధానంగా కంపెనీల ప్రయోజనాలకు, అది కూడా విదేశీ కంపెనీల ప్రయోజనాలకు ఉద్దేశించింది. దీని వల్ల పన్నులపై నియంత్రణను రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోతాయి. స్ధానిక ప్రజల డిమాండ్ మేరకు పన్నులు తగ్గించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండదు. అలాగే తమ ఆదాయం పెంచుకోవడానికి కంపెనీలపై పన్నులు వేసే అధికారం కూడా ఉండదు.
పన్నుల అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కేంద్రీకృతం అవుతాయి. వసూలు అయిన పన్నులలో కొంత భాగాన్ని కేంద్రం రాష్ట్రాలకు పంచి పెడుతుంది. అనగా ఆదాయ వనరుల కోసం రాష్ట్రాలు కేంద్రంపై భారీగా ఆధారపడవలసి వస్తుంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అని గతంలో రాష్ట్రాల ప్రభుత్వాలు వాదిస్తూ తిరస్కరించాయి. కానీ కంపెనీల తెర వెనుక కృషితో నితీశ్ కుమార్ తో సహా, జయలలిత మినహా, జిఎస్టి కి ఆమోదం ప్రకటించాయి.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా పన్ను విధానం ఉండటం వల్ల వ్యాపారం చేసుకోవటం కష్టంగా మారిందని విదేశీ కంపెనీలు ఎన్నాళ్లుగానో వాపోతున్నాయి. దేశం అంతా ఒకే పన్ను విధానం అమలు చేయాలని ప్రపంచ బ్యాంకు చేసిన సిఫారసును అమలు చేస్తామని భారత ప్రభుత్వాలు ఒట్టు పెట్టాయి. అందు కోసమే జిఎస్టి ని భారత ప్రజలపై రుద్దుతున్నారు తప్ప పాలకులు చెబుతున్నట్లు పన్నుల క్రమబద్ధీకరణ కోసమో మరోకందుకో కాదు.
ఈ వాస్తవాన్ని కాంగ్రెస్, బిజేపి ప్రభుత్వాలు రెండూ ప్రజల నుండి దాచి పెడుతున్నాయి. ఇప్పుడు బిజేపి మంత్రి ఏకంగా రాష్ట్రాలకే ప్రయోజనం అంటూ లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా కల్పించి చెప్పడానికి సైతం సిద్ధం అయ్యారు. ఆ విధంగా సభను, దేశాన్ని కూడా తప్పు దోవ పట్టించారు.
ప్రపంచ బ్యాంకు ద్వారా మూడో ప్రపంచ దేశాలపై ఇంతగా వెంటబడి మరీ రుద్దుతున్న అమెరికా, జిఎస్టి ని తాను అమలు చేయదు. అమెరికాలో జిఎస్టి లేదు; కొత్తగా ప్రవేశపెట్టే ఉద్దేశమూ లేదు. పైగా అక్కడ పూర్తి స్ధాయి ఫెడరల్ వ్యవస్ధ ఉనికిలో ఉన్నది. ఒక్కో రాష్ట్రం ఒక్కో రకం పన్నుల వ్యవస్ధను అమలు చేస్తాయి. అమెరికాలో జిఎస్టి ని ప్రవేశపెడితే గనక అల్లకల్లోలమే జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలు తిరుగుబాటు చేసినా ఆశ్చర్యం లేదు.
అలాంటి జిఎస్టి ని భారత్ లాంటి మూడో ప్రపంచ దేశాలు అమలు చేయాలని అమెరికా శాసిస్తోంది. తద్వారా పశ్చిమ బహుళజాతి కంపెనీలకు అనుకూలమైన పన్నుల వాతావరణం ఏర్పరుచుకునేందుకు కృషి చేస్తోంది.
ఇప్పటి వరకు ఉనికిలో ఉన్న అనేక పన్నులు రద్దు అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఉదాహరణకి ఆక్ట్రాయ్, సెంట్రల్ ఎక్సైజ్, వ్యాట్ మొదలైన పన్నులన్నీ రద్దవుతాయని ఒక్క జిఎస్టి మాత్రమే ఉనికిలో ఉంటుందని చెబుతోంది. ఫలితంగా పన్నుల వ్యవస్ధ తేలిక అవుతుందని వివరిస్తోంది.
కానీ జిఎస్టి అనంతరం కూడా వివిధ పేర్లతో పన్నులు ఉండబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి లాంటి పేర్లు పాత పన్నులకు పెడుతున్న కొత్త పేర్లేనని ఇవేవీ విప్లవాత్మకమైనవి కావని వారు చెబుతున్నారు.
అంతే కాకుండా రియల్ ఎస్టేట్ రంగాలు జిఎస్టి ఫలితంగా సాధారణ ప్రజలకు మరింతగా అందకుండా పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి ప్రకారం జిఎస్టి అనంతరం కొత్త ఇళ్ల నిర్మాణం ఖరీదు 8 శాతం పెరుగుతుంది. ఫలితంగా రియల్ ఎస్టేట్ డిమాండ్ 12 శాతం పడిపోతుంది. ఇప్పటికే చుక్కల్లో ఉన్న రియల్ ఎస్టేట్ ధరలు మరింతగా పెరగడం అంటే సామాన్యుడిపై మోయలేని భారం పడటం ఖాయం. వారి సొంత ఇంటి కల మరింత దూరం జరుగుతుంది. కొందరిని ఎన్నటికీ కలగా మిగిలిపోతుంది.
పన్నుల వ్యవస్ధను క్రమబద్ధీకరించడం, సులభతరం చేయటం అవసరమే గానీ అది ప్రజల అవసరాల కోసం జరగాలి తప్ప విదేశీ కంపెనీల అవసరాల కోసం జరగరాదు. ప్రభుత్వాలు ఉన్నది దేశ ప్రజల జీవనాన్ని సులభతరం చేయటానికి తప్ప విదేశీ కంపెనీల వ్యాపారం సులభతరం చేయటానికి కాదు.
కానీ కాంగ్రెస్, బిజేపి ప్రభుత్వాలు విదేశీ కంపెనీల కోసమే పడరాని పాట్లు పడుతూ, పెట్టుబడుల కోసం మొక్కుతూ, వ్యవస్ధలను మార్చివేస్తూ, వనరులను అప్పజెపుతూ ప్రజల ప్రయోజనాలకు సరిగ్గా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. జిఎస్టి అందులో ఒక భాగం మాత్రమే.
ఈ బ్లాగుల ఎర్రబాబుల రాతలు, ముక్కిపోయిన బియ్యం వాసన బగ్గ కొడ్తున్నాయి.
మీరు ఓసారి ముక్కు డాక్టర్ ని కలవడం మంచిది.
వార్తలు బుర్రకు ఎక్కించుకోవాలి, ముక్కుకు కాదు. నోటితో గాలి పీల్చడం తప్పయినట్లే, ముక్కుతో వార్తల్ని వాసన చూడడమూ తప్పే.
డాక్టర్ ని కలిసినప్పుడు మీ అసలు పేరు చెప్పడం మరువద్దు. అలవాటుగా ‘తెలియదు’ అంటే మీకే నష్టం.