వివరణ: టర్కీ సైనిక కుట్ర -అంకెల్లో..


కొన్ని గంటలలోనే, నిమిషాలు కాకుంటే, ఓటమితో ముగిసిపోయిన టర్కీ సైనిక కుట్ర పైన ప్రస్తుతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కుట్ర జరగడం వాస్తవమేనా అన్నది ప్రధాన అనుమానం.

తామే “కుట్రతో” కుట్ర చేయించుకుని ఆ సాకుతో మరిన్ని నియంతృత్వ అధికారాలు తనకు తానే కట్టబెట్టుకునేందుకు టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ ప్రయత్నిస్తున్నాడని అనుమాన ప్రియుల అనుమానం.

అమెరికా ప్రభుత్వ అధికారులు, వివిధ ఇంటలిజెన్స్ సంస్థల అధికారులు ఈ అనుమానాలను వ్యక్తం చేస్తున్న వారిలో ఉన్నారు. ఇలాంటి ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ లకు పాల్పడటం అమెరికాకు మామూలే. కనుక అమెరికా అనుమాన పడటంలో ఆశ్చర్యం లేదు.

కుట్ర చేయించింది అమెరికాయే అని టర్కీ ప్రభుత్వం ఆరోపించింది కనుక అమెరికా అనుమానాలను పక్కన పెట్టేయవచ్చునేమో కూడా. కానీ యూరోపియన్ యూనియన్ నాయకులు సైతం ఈ అనుమానాలను గట్టిగానే వ్యక్తం చేయడం ఒక విశేషం.

అనుమానాలు నిజమా కాదా అని తర్కించుకునేటప్పుడు ఒక నిర్ధారణకు రావటంలో కుట్రకు సంబంధించిన గణాంకాలు ఉపయోగపడతాయి. ఎందుకంటే గణాంకాలు వాటికవే కొన్ని వాస్తవాలు వెల్లడి చేస్తాయి కనుక.

ఆ ఉద్దేశంతో వివిధ వార్తా పత్రికలు, వెబ్ సైట్ల నుండి సేకరించిన కొన్ని గణాంకాలు కింద చూడవచ్చు.

 • కుట్ర సందర్భంగా 232 మంది చనిపోయారు. వారిలో 208 మంది సాధారణ పౌరులు కాగా 24 మంది సైనిక తిరుగుబాటులో పాల్గొన్న సైనికులు. 1400 మందికి పైగా గాయపడ్డారు. 
 • మొత్తం మీద ఇప్పటి వరకు, అనగా మంగళవారం మధ్యాహ్నం వరకు, 20,000 మందికి పైగా నిర్బంధం లోకి తీసుకున్నారు. 
 • నిర్బంధించిన వారిలో పోలీసులు, పౌర ఉద్యోగులు, ఉన్నత స్ధాయి అధికారులు, జడ్జీలు, ప్రభుత్వ ప్రాసిక్యూటర్లు, ఆర్మీ అధికారులు, సైనికులు ఉన్నారు. 
 • 7500 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు ప్రభుత్వ నేతలు ప్రకటించారు. వారిలో 6038 మంది సైనికులు. 
 • 26 మంది సైనిక జనరల్స్ (ఉన్నతాధికారులు) కు కోర్టు రిమాండ్ విధించింది. 
 • అరెస్టయిన అత్యున్నత స్ధాయి జనరల్స్ లో ఒకరు ఇన్సిర్లిక్ వైమానిక స్ధావరం కమాండర్ అయిన జనరల్ బెకీర్ ఎర్కన్ వాన్. ఈ స్ధావరం లోనే 2000కు పైగా అమెరికా సైనికులు, 40 వరకు అమెరికా అణు బాంబులు ఉన్నాయి.
 • 2015 వరకు ఎయిర్ ఫోర్స్  చీఫ్ గానూ, హై మిలట్రీ కౌన్సిల్ సభ్యుడుగానూ పని చేసిన అకిన్ ఒజ్ టర్క్ కూడా అరెస్టయినవారిలో ఉన్నాడు.
 • వివిధ రాష్ట్రాలు, నగరాల్లో 8000 మంది పోలీసులను విధులనుండి తొలగించారు / డిస్మిస్ చేశారు. 
 • వివిధ స్థాయిల్లోని కోర్టులలో పని చేస్తున్న 3000 మంది జడ్జిలను విధులనుండి సస్పెండ్ చేశారు / తాతాత్కాలికంగా తొలగించారు. వారిలో 775 మందిని అరెస్టు చేశారు. 
 • రాష్ట్రాల గవర్నర్ లను 30 మందిని పదవుల నుంచి తొలగించారు.  లీగల్ అడ్వైజర్లు 16 మందిని తప్పించారు.
 • ఉన్నత స్థాయి సివిల్ సర్వీసెస్ అధికారులు 50 మందిని డిస్మిస్ చేశారు. 
 • ఆర్థిక మంత్రిత్వ శాఖలో పని చేస్తున్న 1500 మంది అధికారులు, ఉద్యోగులను సస్పెండ్ చేశారు. 
 • ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ (హోమ్ శాఖ) కు చెందిన 9,000 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించారు.
 • దేశ వ్యాప్తంగా 3 మిలియన్లకు పైగా పౌర ఉద్యోగులకు వార్షిక సెలవులను రద్దు చేసి వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.

ఈ గణాంకాలలో మొదటి అంశాన్ని శ్రద్ధ పెట్టి చూడండి. విచిత్రంగా ఉంది కదా! సైనిక కుట్ర జరిగితే సైనికులు అధిక సంఖ్యలో చనిపోవాలి గానీ, జనాలు చనిపోవటం ఏమిటి? ఈయు నేత ఒకరు సైనిక తిరుగుబాటు నేపధ్యంలో ఎర్డోగన్ పైన చేసిన ఒకానొక విమర్శలో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.

“కుట్రను ఎదుర్కోవాలంటూ ఎర్డోగన్ ప్రజలకు పిలుపు ఇచ్చి పెద్ద తప్పు చేశాడు. తన అధికారం కాపాడుకునేందుకు జనాన్ని బలి చేశాడు. ఆయన పిలుపు అందుకున్న కొందరు జనం తిరుగుబాటు సైన్యాల ట్యాంకులకు ఎదురు వెళ్లారు. ట్యాంకుల కింద పడి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు” అని ఈయు నేత విమర్శించారు.

టర్కీ ఈ‌యూ లో చేరే వ్యవహారం గురించి చూస్తున్న కమిషనర్ జోహానెస్ హాన్ సైనిక కుట్ర గురించి తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇదంతా చూస్తే ముందే తయారుగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. జాబితాలు అప్పటికే సిద్ధంగా ఉండడం బట్టి తిరుగుబాటుకు ముందే జాబితాలు తయారు చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. లేకపోతే అత్యంత వేగంగా 3,000 మంది జడ్జిలను కుట్రదారులుగా ఎలా గుర్తించారు?” అని ఆయన ప్రశ్నించారు.

“మాకు ఆందోళనగా ఉన్నది. ఏం జరుగుతుందని భయపడ్డామో అదే జరుగుతోంది” అని కూడా హాన్ అన్నాడు. ఇంతకీ ఈ‌యూ కమిషనర్ కూడా ఫలానా జరుగుతుందని ముందే భయపడ్డాడా? టర్కీలో కుట్ర గురించి ఈ‌యూ నేత ముందే భయపడటం ఏమిటి?

హాన్ వ్యాఖ్యానాలు తమకు ఆమోదయోగ్యం కావని టర్కీ విదేశీ మంత్రి మెవ్లుట్ కవుసోగ్లు తప్పు పట్టాడు. ట్విట్టర్ లో ఆయన హాన్ వ్యాఖ్యాల్ని ఖండించాడు. తన పౌర ప్రజాస్వామ్య బాధ్యతల నుండి టర్కీ ఎన్నటికీ వెనక్కి వెళ్లబోదని ఆయన స్పష్టం చేశాడు.

“టర్కీలో జరిగింది ఏమిటో ఆయనకు ఏమీ అర్ధం కానట్లు కనిపిస్తోంది. టర్కీలో ప్రజాస్వామ్య ప్రక్రియకు ఈ‌యూ తదితర మిత్రులు మద్దతు ఇస్తారని, కుట్ర ప్రయత్నాన్ని గట్టిగా ఖండించాలని ఆశిస్తున్నాము” అని కవుసోగ్లు ప్రకటించాడు.

ఇంతకీ ఏది నిజం? సైనిక కుట్ర నిజమా, లేక సైనిక కుట్ర జరిగినట్టు కుట్ర చేయడం నిజమా?

“ఇది దేవుడు అందించిన బహుమతి. ఎందుకంటే ఈ సందర్భంగా ఆర్మీని ప్రక్షాళన చేసే అవకాశం లభించింది” అని కుట్ర ముగిసిన క్షణాలలో అధ్యక్షుడు ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యకు అర్ధం ఏమై ఉంటుంది?

సైనిక తిరుగుబాటు/కుట్ర జరిగితే ఆందోళన ప్రకటించి, ప్రజలకు విషయాలు తెలిపి, కుట్రదారులను పట్టుకుని శిక్షిస్తారు గానీ, ‘దేవుడు ఇచ్చిన బహుమానం’ గా చెబుతూ సంతోషం ప్రకటిస్తారా ఎవరైనా? ఇది ఒకవైపు నుండి వస్తున్న ప్రశ్న.

మరోవైపు నుండి ఉదయిస్తున్న ప్రశ్న: వేలమంది సిబ్బందిని, ఉద్యోగులను, సైన్యాన్ని, సైన్యాధికారులను, న్యాయమూర్తులను, ప్రాసిక్యూటర్లను నిర్బంధించిన తర్వాత కూడా కుట్ర చేయడం కూడా కుట్రగా ఎలా చెప్పగలం? దేశంలో ఆందోళనలు జరుగుతూ, అధికార వర్గాల్లో అసంతృప్తి పేరుకుని ఉన్న పరిస్ధితుల్లో కుట్ర నాటకం ఆడితే, ఆ నాటకం కాస్తా నిజం అయ్యే ప్రమాదం అత్యధికంగా ఉందన్న సంగతి ఎర్డోగన్ కు తెలుసు. తెలిసి తెలిసీ నాటకం ఎలా ఆడతాడు? అసలు ఇంతమందిని అరెస్టు చేసిన తర్వాత కూడా నాటకం అని భావించవచ్చా?

మరో సంగతి ఏమిటి అంటే, కుట్రకు కారణం అమెరికాయే అని తీవ్రంగా ఆరోపిస్తున్న టర్కీ ప్రభుత్వం అమెరికా రాయబారులను కనీసంగా పిలిపించి నిరసన ఎందుకు తెలియజేయడం లేదు? చిన్న పొరపాటు జరిగితేనే రాయబారులను పిలిపించి నిరసన తెలియజేయడం, కాస్త తీవ్రం అయితే రాయబారులను బహిష్కరించడం సాధారణంగా జరుగుతుంది. ఇలాంటి చర్యలు ఏవీ ఇంతవరకు అమెరికా విషయంలో టర్కీ తీసుకోలేదు. కుట్ర వెనుక అమెరికా ఉన్నదని టర్కీ భావిస్తున్నట్లా, లేనట్లా?

ఈ ప్రశ్నలకు సమాధానం దొరకబుచ్చుకోవటం అంత తేలిక కాదు. భౌగోళిక రాజకీయాల రీత్యా టర్కీకి ఉన్న ప్రాధాన్యత తక్కువ కాదు. పైగా అమెరికా నేతృత్వం లోని మిలట్రీ కూటమి నాటోలో టర్కీ సభ్య దేశం. కనుక అంతర్గతంగా టర్కీ-అమెరికాల మధ్య తీవ్ర స్ధాయిలో తర్జన భర్జనలు జరుగుతూ ఉండాలి. ఇవి సావధానంగా పరిష్కారం కాకపోతే అప్పుడు వాస్తవాలు ఏమిటో బహిర్గతం అవుతాయి. కాబట్టి మరి కొన్ని రోజులు లేదా వారాలు గడిస్తే తప్ప ఒక నిర్ణయానికి రాలేము.

కానీ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అమెరికా వ్యతిరేక శిబిరం/శిబిరాలకు సానుకూలం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా ఆధిపత్యం లోని ఏక ధృవ ప్రపంచాన్ని నిలుపుకోవటానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటే దాని ఆధిపత్యాన్ని కూల్చివేసి బహుళ ధృవ ప్రపంచాన్ని పూర్తి స్ధాయిలో ఆవిష్కరించటానికి రష్యా, చైనా, ఇరాన్ దేశాలు కృషి చేస్తున్నాయి.

బహుళ ధృవ ప్రపంచం ప్రపంచ కార్మిక వర్గానికి సాపేక్షికంగా అనుకూలమైనది. అమెరికా ఒత్తిడితో ప్రపంచ దేశాలు విచక్షణా రహితంగా అమలు చేస్తున్న నయా ఉదార విధానాలు కాస్త వెనకడుగు వేసే అవకాశాన్ని అది కల్పిస్తుంది.

ఎర్డోగన్ చెప్పుకుంటున్నట్లుగా, కుట్రకు వ్యతిరేకంగా ఆయనకు ప్రజల నుండి విపరీతమైన మద్దతు వచ్చినట్లుగా, కుట్రదారులతో ప్రజలు వీధుల్లో వీరోచిత పోరాటాలు చేసినట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదు. అధికార పార్టీ మద్దతుదారులు కొందరు, ఆ పార్టీ మాతృ సంస్ధ ముస్లిం బ్రదర్ హుడ్ కార్యకర్తలు కొందరు తప్పితే ఎవరూ వీధుల్లోకి రాలేదు. కుట్రకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయలేదు.

కలగాపులగంగా బైటపడుతున్న వార్తలను ఒక దారిలో పెట్టేందుకు మరిన్ని పరిణామాలు జరగాలి. మరిన్ని అంశాలు వెలుగు చూడాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s