[True translation for today’s editorial: Turmoil in Turkey]
***
కుట్రలతో కూడిన రాజకీయ వ్యవస్ధకు టర్కీ ఒక ఉత్తమ తార్కాణం. అక్కడి మిలటరీ సాపేక్షికంగా స్వతంత్రమైనది, ప్రజలలో పలుకుబడి కలిగినట్టిది. గతంలో అది నాలుగు సార్లు పౌర ప్రభుత్వాలను కూల్చివేసింది. ఉన్నత పాలక వర్గానికి, మిలటరీ వ్యవస్ధకు మధ్య అక్కడ ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉంటుంటాయి. అయితే 2002 నుండి జస్టిస్ అండ్ డవలప్ మెంట్ పార్టీ నేతృత్వంలో సాపేక్షికంగా సాగుతున్న సుస్ధిర పాలన, దాని నేత రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్ కు ప్రజల్లో ఉన్న పలుకుబడి వల్ల టర్కీలో మిలట్రీ కూల్చివేతలు ఇక గత కాలపు జ్ఞాపకమే అన్న దృశ్యాన్ని ముందు నిలిపాయి. శుక్రవారం, శనివారం రోజుల్లో సంభవించిన పరిణామాలు ఈ మిధ్యను బద్దలు కొట్టాయి. ప్రభుత్వ పగ్గాలను తిరిగి స్వాధీనం చేసుకోవటంలో ఆయన సాధించిన విజయం అటు టర్కీకీ, ఇటు పశ్చిమ ఆసియా ప్రాంతానికీ రెండింటికీ శుభకరం. పశ్చిమ ఆసియాలో తీవ్ర అలజడి నెలకొన్న ప్రస్తుత కాలంలో ప్రాంతీయ భద్రతకు టర్కీ ముఖ్యం. ఇక్కడ అస్ధిరత ఎవరి ప్రయోజనాలకూ అనుకూలం కాదు. అయితే విఫల కుట్ర ఎర్దోగన్ ప్రభుత్వ బలహీనతను వెల్లడి చేసింది. అది కొద్దిమంది సైనికులు లేవదీసిన కొద్దిపాటి తిరుగుబాటు కాక, వేలాదిమంది సైనికులు పాల్గొన్న భారీ తిరుగుబాటన్న వాస్తవం టర్కీ రాజ్య పొందిక పైన తీవ్ర ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఎర్డోగన్, టర్కీ రాజ్యం బలహీనపడేందుకు అనేక విధాలుగా దోహదపడ్డాడు: భద్రతా పరిస్ధితిని ఘోరంగా దిగజార్చిన వినాశకర విదేశీ విధానం; ఇస్లామిస్టులు మరియు లౌకికవాదుల మధ్య వైరుధ్యాలను వాడిగా మార్చిన బలవంతపు ఇస్లామీకరణ; తనకు మరిన్ని అధికారాలు కట్టబెట్టుకోవడానికి వీలుగా రాజ్యాంగాన్ని తిరగరాయడానికి సిద్ధం కావటం!
ఎర్డోగన్-వ్యతిరేక ప్రజల నుండి, సెక్యులర్ రాజకీయ వర్గం నుండి తమకు మద్దతు లభిస్తుందని కుట్రదారులు భావించి ఉండవచ్చు. ప్రజల్లోని ఒక సెక్షన్ కు ఎర్డోగన్ రాజకీయాల వల్ల సమస్యలు ఉన్నాయి. 2013లో ఇస్తాంబుల్ లోని గెజి పార్కులో వేలాదిమంది ప్రజలు అతని పోలీసు బలగాల చేతుల్లో క్రూర నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. ఉదారవాద విద్యావేత్తలు, ప్రతిపక్షాలు, మీడియా, సామాజిక నెట్ వర్క్ లపైన ప్రభుత్వం విరుచుకుపడినప్పటికీ టర్కీలో ప్రజారంగం చురుకుగానే ఉంటూ వచ్చింది; అక్కడ ప్రజలను కూడగట్టి కదిలించడానికి ఎర్దోగన్ వ్యతిరేకవాదం ఒక సాధారణ నేపధ్యం. కానీ తమ తరపున తమ సమస్యలను సైనికులు పరిష్కరించాలని వారు కోరుకోలేదు. అందుకే తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని రక్షించేందుకు వేలమంది ప్రజానీకం వీధుల్లోకి ఉరికారు. అందుకే ప్రతిపక్షం లోని అత్యంత తీవ్ర విమర్శకులు సైతం కుట్రను వ్యతిరేకించారు. ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన బీటలు టర్కీపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నదే ఇప్పుడు సమస్య. అది ప్రధానంగా ఎర్దోగన్ ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో ఉన్న నిబద్ధతను గమనించి, తన నియంతృత్వ విధానాలను పునఃపరిశీలించుకోవటానికి ఇది ఒక అవకాశంగా ఆయన పరిగణించవచ్చు. లేదా తన శత్రువులు మరింత మందిని నిర్మూలించటానికి మిలట్రీ తిరుగుబాటును ఒక అవకాశంగా మలుచుకుని తాను ఎప్పుడూ కోరుకున్నట్లుగా అధ్యక్షుడికి మరిన్ని పాలనాధికారాలను కట్టబెట్టుకోవచ్చు. ఆయన ఎంపిక టర్కీ ప్రజాస్వామ్యం భవిష్యత్తుకు మార్గదర్శనం చేస్తుంది.
*********
ఈ సంపాదకీయం లోని ప్రధాన లోపం ఎర్దోగన్ కూలదోయడానికి మిలట్రీలోని ఒక సెక్షన్ చేసిన కుట్రలో అమెరికా పాత్ర గురించి అస్సలు ప్రస్తావించకుండా ఊరుకోవటం. పూర్తి స్ధాయి ఆర్ధిక సంస్కరణల అమలులో నరేంద్ర మోడికి త్రికరణ శుద్ధిగా మద్దతు ప్రకటించిన ద హిందు పత్రికకు, సదరు మోడిగారు దూకుడుగా అమెరికాకు దగ్గర అవుతున్నందున అమెరికాను తప్పు పట్టడం లేదా కనీసం వేలెత్తి చూపడం తనను తాను వేలెత్తి చూపుకోవడంగా కనిపించింది కావచ్చు.
2000 మంది అమెరికా సైనికులతో నిండి ఉన్న సైనిక పటాలాలతో పాటు 40 వరకు అమెరికా అణు బాంబులకు కూడా ఆశ్రయం కల్పిస్తున్న ఇన్సిర్లిక్ వైమానిక స్ధావరం పైకి టర్కీ పోలీసులు దాడికి వెళ్లారని తాజాగా వార్తలు వస్తున్న నేపధ్యంలో టర్కీలోని మిలట్రీ కుట్ర మధ్య ప్రాచ్యం లేదా పశ్చిమ ఆసియా స్వరూప స్వభావాలను గుణాత్మకంగానే మార్చివేయగల శక్తి కలిగినదిగా పత్రిక గుర్తించకపోవటం విచిత్రమే.
అమెరికాలో ఆశ్రయం పొందుతున్న ఎర్దోగన్ వ్యతిరేక ముస్లిం మత గురువు గులెన్ ఆదేశాల ప్రకారమే మిలట్రీ కుట్ర జరిగిందని సాక్షాత్తు ఎర్దోగన్ స్వయంగా ఆరోపిస్తూ “ఓ ఒబామా, ఇప్పటికైనా మేము ఎప్పటి నుండో కోరుతున్నట్లుగా గులెన్ ను మా దేశానికి పంపించెయ్యి” అని కోరటాన్ని ఎవరైనా ఎలా విస్మరించగలరు? ఎర్దోగన్ ప్రభుత్వం లోని విదేశీ మంత్రి “సైనిక కుట్ర వెనుక అమెరికా పాత్ర ఉన్నది” అని నేరుగా, ప్రత్యక్షంగా ఆరోపించినా కూడా అది ద హిందు దృష్టిలోకి రాకుండా ఎలా పోయిందో ఆశ్చర్యకరం.
ఇటీవల ఎర్దోగన్ కేంద్రంగా జరిగిన పరిణామాల రీత్యా మధ్య ప్రాచ్యంలో తమ సామ్రాజ్యవాద ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఆయన మారాడని అమెరికా గ్రహించినందునే ఆయనను పదవీచ్యుతుదిని చేసి అనుకూల ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు అమెరికా ప్రయత్నించి ఘోరంగా విఫలం అయింది. ఈ విఫల కుట్ర నియంత ఎర్దోగన్ ను మరింత శక్తివంతం కావించటం టర్కీ ప్రజలకు మింగుడు పడని పరిణామం.
కాగా అంతర్జాతీయంగా, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో అమెరికా సాగిస్తున్న వినాశకర, సామూహిక హంతక యుద్ధాలకు ముగింపు పలికే పరిణామం. ఇప్పటికే రష్యాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి సంసిద్ధత ప్రకటించిన ఎర్డోగన్, సిరియా అధ్యక్షుడు అస్సాద్ తో కూడా రహస్య చర్చలు సాగిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. విదేశీ విధానంతో పాటు స్వదేశీ విధానాన్ని కూడా సంస్కరించుకుంటే తప్ప ఎర్డోగన్ వల్ల ప్రమాదం పూర్తిగా తొలగిపోయినట్లు కాదు.
Turkey coup in photos