అరుణాచల్: కాంగ్రెస్ మాస్టర్ స్ట్రోక్! 


wp-1468838475673.jpeg

అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం పోగొట్టుకోవటం ఇక లాంఛనప్రాయమే అనుకున్నారు అందరూ. చీలిక వల్ల ఆ పార్టీకి మెజారిటీ లేదు. కాస్త సమయం తీసుకుని చీలిన ఎమ్మెల్యేలను సొంత గూటికి రప్పిద్దాం అన్న లక్ష్యంతో బల నిరూపణకు సమయం కోరితేనేమో గవర్నర్ లేదు పొమ్మన్నారు. ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో బలం నిరూపించుకోలేక ముఖ్యమంత్రి నబామ్ టుకి రాజీనామా సమర్పించటమే తరువాయి, అని అంతా భావించారు. “ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్” అంటూ కొందరు పరాచికాలు కూడా మొదలు పెట్టారు.

అయితే కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఒప్పుకోలేదు. బుర్రలకు పదును పెట్టి 2004 నాటి తరహాలో అనూహ్య  ఎత్తుగడను రచించారు.

పాఠకులకు గుర్తు ఉంటే సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఆనాటి బిజెపి జాతీయత సెంటిమెంటు ను రెచ్చగొట్టడాన్ని మననం చేసుకోవచ్చు. బిజెపి నేతృత్వంలోని ఎన్డియేకి రెండో విడత పదవీ కాలానికి జనం నిరాకరించి యుపిఎ ప్రభుత్వానికి పట్టం కట్టిన నేపథ్యంలో సోనియా గాంధీ ప్రధాని పదవి స్వీకరించ టానికి వీలు లేదని అద్వానీ తదితర నేతలు తీవ్ర స్ధాయిలో అభ్యంతరాలు లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక మంది నేతలు గోతి కాడ గుంట నక్కల్లా కాచుకొని ఉన్నారు. ఆ సమయంలో ఎవరు సలహ ఇచ్చారో తెలియదు గానీ (నిజానికి అమెరికా సామ్రాజ్య ప్రభువుల అనుమతి లేకుండా ఇలాంటి కీలక అంశాలపై నిర్ణయాలు జరగవు) అనూహ్యంగా ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ తమ ప్రధాన మంత్రిగా సోనియా గాంధీ / కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అప్పట్లో దానిని ‘మాస్టర్ స్ట్రోక్’ గా రాజకీయ పండితులు అభివర్ణించారు.

ఇప్పుడు కూడా దాదాపు అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ‘మాస్టర్ స్ట్రోక్’ అనదగ్గ ఎత్తుగడను రచించి అమలు చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో మాట్లాడమని ముఖ్యమంత్రి టుకి కి ఆదేశాలు ఇచ్చారు. పదవి వదులుకునేందుకు నబామ్ టుకిని సిద్ధం చేశారు. అందరికీ ఆమోద యోగ్యుడు అయిన వ్యక్తి కోసం వెతికారు. చివరికి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ప్రేమ్ ఖండును కాంగ్రెసు శాసనసభ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. ప్రేమ్ ఎంపికతో చీలిక ఎమ్మెల్యేలు అందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీ నీడలోకి వచ్చేశారు. చీలిక వర్గ నేత, సంక్షోభ కాల ముఖ్యమంత్రి కలికో పల్ సైతం పార్టీ గొడుగు కిందకు రావడం బట్టి ఆ పార్టీ తెర వెనుక పడిన పాట్లు ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ఈ క్రమంలో జరిగిన ఒక సానుకూల పరిణామాన్ని గుర్తించ వలసి ఉన్నది. భారత దేశంలో ప్రజలకు ప్రజాస్వామ్యం ఎలాగూ లేదు. ప్రజలతో పాటు రాజకీయ పార్టీల్లో కూడా (అంతర్గత) ప్రజాస్వామ్యం ఏ కోశానా లేకపోవడం ఒక దుర్భర వాస్తవం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో సీల్డ్ కవర్లలో పెట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలకు తెలియజేయడం అనాదిగా కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానం. దానికి ముందు పార్టీ లెజిస్లేచర్ పక్షం నేతను నిర్ణయించే అధికారాన్ని అధిష్టానానికి అప్పజెపుతూ ఎమ్మెల్యేల చేతనే ఒక తీర్మానం చేయించటం ఆ పార్టీకి రివాజు. తద్వారా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ణా పార్టీ బొంద పెడుతూ వచ్చింది. ఇదే విధానాన్ని ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలు కూడా తరతమ భేదాలతో, ఓ వైపు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూనే, పాటిస్తున్నాయి.

అరుణాచల్ ప్రదేశ్ సంక్షోభం సందర్భంగా ఈ తరహా నియంతృత్వ వైఖరి ఒక చర్చాంశంగా ముందుకు వచ్చింది. ఫలితంగా కావచ్చు, తమ అధికార అవసరాల రీత్యా కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, బహుశా మొట్టమొదటి సారిగా, తమ ఎమ్మెల్యేలకు ఆమోద యోగ్యుడు అయిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించ వలసి వచ్చింది. ఆ విధంగా పార్టీ అధిష్టానం తన అహంభావాన్ని పక్కన పెట్ట వలసి వచ్చింది.

ఇక బిజెపి పార్టీకి, ముఖ్యంగా ఆ పార్టీ నియంతృత్వ నాయక ద్వయం అయిన నరేంద్ర మోడీ, అమిత్ షా ల ఒంటెత్తు పోకడ గురించి చెప్పనవసరం లేదు. వారి నియంతృత్వ ధోరణి ఫలితంగా ఆ పార్టీ లోని మహా మహా నేతలు సైతం నోళ్ళు కట్టేసుకుని కూర్చున్నారు. అద్వానీ బ్లాగు రాతలకు పపరిమితం కాగా, మురళీ మనోహర్ జోషి  అసలు నోరే విప్పటం లేదు. ఆర్థిక సంస్కరణల నిపుణుడు అరుణ్ శౌరి ఛానెళ్ళకు ఇంటర్వ్యూలు ఇస్తూ, అక్కడే మోడి విధానాలను కూడా విమర్శిస్తూ, కాలం గడిపేస్తున్నారు. యశ్వంత్ సిన్హా అయితే అడ్రస్ లేడు. ఈ ననేపథ్యంలో రెండు రాష్ట్రాల విషయం లోనూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు మోడి, షా ద్వయానికి ఒక పాఠం నేర్పి ఉండాలి. ఇంకా పాఠాలు నేర్చుకోక పోతే ఎప్పుడోకప్పుడు జనమే నేర్పుతారు.

One thought on “అరుణాచల్: కాంగ్రెస్ మాస్టర్ స్ట్రోక్! 

  1. భాజపా తన గొయ్యి తాను తవ్వుకుంటోంది. ఒక భాజపా నాయకుడు మాయవతిని “వేశ్యా సే భీ బురా” (వేశ్య కంటే నీచురాలు) అన్నాడు. గూగుల్‌లో వెతకండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s