
Nabam Tuki -Congress CM to be restored
ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు విషయంలో బిజేపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక చెంప వాయించిన సుప్రీం కోర్టు, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మంత్రాంగం విషయంపై తీర్పు ద్వారా రెండో చెంప కూడా వాయించింది.
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ అమలు చేసిన విచక్షణాధికారాలను రద్దు చేసింది. జనవరి 14, 2016 తేదీన ప్రారంభం కావలసిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను “తన విచక్షణాధికారాలను వినియోగించి” డిసెంబర్ 16, 2015 తేదీకి మార్చుతూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం చెల్లదని తీర్పు చెప్పింది.
అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి, బిజేపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దారి తీసిన పరిణామాలకు బీజం ఈ తేదీ మార్పుతోనే పడ్డాయి. రాజ్యాంగ సూత్రాల ప్రకారం సభా నిర్వహణ స్పీకర్ అధికారాల పరిధిలో ఉండగా దానిని గవర్నర్ తన చేతుల్లోకి తీసుకున్నారు. తీసుకుని సభ ఒక నెల ముందుకు జరిపారు.
ఇలా ముందుకు జరిపిన సమావేశాల్లో కాంగ్రెస్ రెబెల్ ఎంఎల్‌ఏలు, బిజేపి ఎంఎల్‌ఏ లు కలిసి స్పీకర్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ భవనాలకు ప్రభుత్వం తాళాలు వేయటంతో రెబెల్ ఎంఎల్‌ఏ లు, బిజేపి ఎంఎల్‌ఏ లు హోటల్ భవనంలో అసెంబ్లీ సమావేశం నిర్వహించి స్పీకర్ ను తొలగించి, కొత్త స్పీకర్ ని ఎన్నుకుని ఆనక కొత్త ముఖ్యమంత్రిని కూడా ఎన్నుకున్నారు.
ఆ విధంగా గవర్నర్ “విచక్షణాధికారాలు” అంటూ లేని అధికారాలు తెచ్చి పెట్టుకుని అసెంబ్లీ సమావేశాల వ్యవహారం లోకి గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం జొరబడి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఈ ప్రజాజాస్వామ్య ప్రబోధకులే కుట్రలు సాగించారు. తాము చెప్పే ప్రజాస్వామ్యంపై తమకే నమ్మకం లేదనీ, గౌరవం అసలే లేదనీ చాటారు.
గవర్నర్లను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టానుసారం మార్చిపారేసే ఎత్తుగడలకు పాల్పడటం పట్ల అనాదిగా కాంగ్రెస్ ప్రభుత్వాలను విమర్శిస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మొదటిసారి పూర్తి మెజారిటీతో అధికారం చేపట్టిన తొడనే అవే ఎత్తులతో సో కాల్డ్ ప్రజాస్వామ్య సూత్రాలను తుంగలో తొక్కడం మొదలు పెట్టింది.
గవర్నర్ కలుగజేసుకుని తానే ప్రకటించిన సమావేశాల తేదీన ముందుకు జరపడంతో మొదలైన మోడి ప్రభుత్వ నియంతృత్వ చర్యలు బిజేపి ఎంఎల్‌ఏలు, రెబెల్ కాంగ్రెస్ ఎంఎల్‌ఏ లు కుమ్మక్కై తమ సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు దారి తీసాయి. ఈ ప్రభుత్వం లోని ఎంఎల్‌ఏ లలో అత్యధికం కాంగ్రెస్ టికెట్ తో గెలిచి రెబెల్స్ గా మారినవారే కావటం గమనార్హం.

Arunachal Pradesh Chief Minister -rebel- Kalikho Pul
కాంగ్రెస్ టికెట్ తో గెలిచిన సభ్యులను ఫిరాయింపులకు ప్రోత్సహించి అద్దె ఎంఎల్‌ఏ లతో, తమ పునాదులు మరిచిన ఎంఎల్‌ఏ లతో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి బిజేపి/ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ఏ మాత్రం సిగ్గు పడలేదు. ఊరందరికీ శాకాహారం గొప్పలు నేర్పే పంతులుగారు తన వరకు వచ్చేసరికి రొయ్యల బుట్ట మాయం చేయటానికి వెనకాడక పోవడమే బిజేపి మార్కు నీతి!
విచిత్రం ఏమిటంటే సుప్రీం కోర్టు తీర్పు తమకు వ్యతిరేకం ఏమీ కాదని కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఇద్దరూ బింకాలు పోవటం. అసలు చట్ట విరుద్ధంగా సమావేశాలను ముందుకు జరపాలని గవర్నర్ ని పురమాయించింది కేంద్ర ప్రభుత్వము, ఆర్‌ఎస్‌ఎస్/మాధవన్ సంస్ధలే. గవర్నర్ అంటేనే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. కనుక కేంద్రానికి తెలియకుండా గవర్నర్ కాలు కదపడు. అలాంటి గవర్నర్ చర్యలను రద్దు చేయడం బిజేపి/ కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకం కాకుండా ఎలా పోతుంది?
ఉత్తరా ఖండ్ విషయం లో గానీ, అరుణాచల్ ప్రదేశ్ విషయంలో గానీ కోర్టు విచారణలో ఉండగానే ఆయా కేసుల్లో కోర్టుల అభిప్రాయాలు (ఉత్తరాఖండ్ విషయంలో ఉత్తరాఖండ్ హై కోర్టు; అరుణాచల్ ప్రదేశ్ విషయంలో సుప్రీం కోర్టు) ప్రభుత్వాల రద్దుకు విరుద్ధంగానే వ్యక్తం అయ్యాయి. వాటిని కోర్టులు దాచుకోలేదు. విచారణ కాలం లోనే కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా కోర్టులు వ్యాఖ్యలు చేశాయి. ఆ వ్యాఖ్యల ద్వారానే కేంద్రం చర్యలకు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రానున్నాయని అర్ధం అయింది.
కేంద్రం-రాష్ట్రాల వివాదాలకు సంబంధించి గతంలో అనేక మార్లు సుప్రీం కోర్టు తీర్పులు ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పూర్తిగా స్పీకర్ అధికారాల పరిధిలోనిది అనీ, సభ్యుల సస్పెన్షన్, రాజీనామా ఆమోదం-తిరస్కరణ ఇత్యాదివి అన్నీ కూడా స్పీకర్ మాత్రమే తీసుకోగలరని వివిధ తీర్పుల సందర్భంగా కోర్టులు స్పష్టం చేశాయి.
ఒక ప్రభుత్వం బల నిరూపణ కేవలం అసెంబ్లీ ఫ్లోర్ లో మాత్రమే జరగాలి తప్ప గవర్నర్ వద్దనో, ఢిల్లీ లోనో కాదని వివిధ తీర్పులు పేర్కొన్నాయి. అయినప్పటికీ ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’ అన్నట్లుగా బిజేపి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కుంటి సాకులతో కూలదొస్తూ వచ్చింది. ఫిరాయింపులతో ప్రభుత్వాలను కూల్చేసి అవన్నీ కాంగ్రెస్ అంతర్గత ఘర్షణలు అంటూ ‘రాజనీతిజ్ఞత’ ప్రదర్శించినట్లుగా ఫోజులు ఇచ్చింది.
అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించిన కేంద్ర ప్రభుత్వం ‘రాష్ట్రంలో శాంతి భద్రతలకు తీవ్ర ప్రమాదం వచ్చిందని అందుకే రాష్ట్రపతి/గవర్నర్ పాలన తప్పలేదని కోర్టులో వాదించింది. దానితో గవర్నర్-కేంద్రం ల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అన్నింటినీ కోర్టు తెప్పించుకుని పరిశీలించింది.
ఫిబ్రవరి నెలలో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ రోజు (జులై, 13) తీర్పు ప్రకటించింది. డిసెంబర్ 15 తేదీ ముందరి నాటి పరిస్ధితిని పునరుద్ధరించాలని తీర్పు చెప్పింది. అనగా కాంగ్రెస్ నేతృత్వంలో పాత ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టాలి. బల నిరూపణ, ఫ్లోర్ టెస్ట్… ఇత్యాదివన్నీ ఆ తర్వాత మొదలు కావాలి.
తీర్పుపై కాంగ్రెస్ పార్టీ సహజంగానే హర్షం ప్రకటించింది. సుప్రీం కోర్టుకు జై కొట్టింది. సుప్రీం కోర్టు ప్రజాస్వామ్యాన్ని రక్షించిందని సంతోషం వెలిబుచ్చింది. ఈ తీర్పు సువర్ణాక్షరాలతో లిఖించదగినది అన్నది. “ప్రజాస్వామ్యం గురించి మోడీకి బోధించిన సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశాడు.
బిజేపి బింకం ప్రదర్శించింది. తీర్పు కాపీ అందలేదని చెప్పింది. అందాక, దాన్ని పూర్తిగా చదివి ఆ తర్వాత పూర్తిగా స్పందిస్తామని చెప్పింది. అంతవరకు “తీర్పు బిజేపి కీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం ఏమీ కాదు” అని రాసుకొమ్మంది. రెబెల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి “మా బలం ఎక్కడికీ పోలేదు. బలం నిరూపించుకుంటాం” అని ప్రకటించాడు. “తీర్పును సమీక్షించాలని పిటిషన్ వేస్తాం” అని కూడా చెప్పాడు.
రివ్యూ పిటిషన్ వేస్తే తీర్పు వచ్చే వరకు, బహుశా, ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగవచ్చు. తీర్పు చెప్పింది రాజ్యాంగ ధర్మాసనమే కనుక సమీక్ష తీర్పు భిన్నంగా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ తక్కువను ఎక్కువ చేసుకునేందుకే జడ్జిల నియామకాలలో కేంద్ర ప్రభుత్వం / రాజకీయ నాయకుల పాత్రను చొప్పించేందుకు బిజేపి ప్రభుత్వం సవరణలు ప్రతిపాదిస్తోంది. ఈ సవరణలను ఒకసారి సుప్రీం కోర్టు తిరస్కరించి కేంద్రం తెచ్చిన ఎన్‌జేఏసి చట్టాన్ని రద్దు చేసింది. మళ్ళీ వివిధ పేర్లతో అవే సవరణలను తిప్పి తిప్పి ప్రతిపాదిస్తున్నప్పటికీ సుప్రీం కోర్టు లొంగి రావటం లేదు.
సుప్రీం కోర్టు – బిజేపి ప్రభుత్వాలకు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ లో ఏ పక్షం నెగ్గుతుంది అన్న అంశంపై ఆధారపడి దేశ రాజకీయ-ఆర్ధిక-వ్యవస్ధాగత నిర్మాణాన్ని మలుపు తిప్ప గల పరిణామాలు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు నెగ్గితే ఆ మేరకు దేశంలో లిబరల్ రాజకీయ వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నది.
బిజేపి/ఆర్‌ఎస్‌ఎస్ పరివారం నేతృత్వం లోని కేంద్రం నెగ్గితే (జడ్జిల నియామకాల్లో కేంద్రం చొరబడగలిగితే) ఆర్ధిక-సామాజిక వ్యవస్ధలో హిందూత్వ మరింత చొరబడే ప్రమాదం పొంచి ఉన్నది. దాని వెంటే అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలు నెరవేర్చే ‘సెట్ ఆఫ్ విధానాలు’ మరింత దూకుడుగా ప్రజల పైన రుద్దబడతాయి. ప్రజల ప్రజాస్వామిక హక్కులను, ప్రతిఘటనను మరింత పరిమితం చేసి దేశ వనరులను విచ్చలవిడిగా పశ్చిమ బహుళజాతి కంపెనీల దోపిడీకి అప్పగించే కృషి ఊపు అందుకుంటుంది.
హిందూత్వ-అమెరికా/పశ్చిమ సామ్రాజ్యవాద పొత్తుకు వ్యతిరేకంగా దేశంలోని లిబరల్ బూర్జువా పాలకవర్గాలు ఇస్తున్న ప్రతిఘటనలో బహుశా సుప్రీం కోర్టు చివరి ప్రతిఘటన (the last defence line) కావచ్చు. ఒకసారి ఈ డిఫెన్స్ బద్దలవటం అంటూ జరిగితే కాంగ్రెస్ కూడా లిబరల్ వాసన వదిలేసి హిందూత్వలో వాటా కోసం పోటీ పడుతుంది.