[Ending impunity under AFSPA శీర్షికన ఈ రోజు -11/07/2016- ద హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్]
“జవాబుదారితనం, చట్టబద్ధ సూత్రాలకు ఒక పార్శ్వం.” విధి నిర్వహణ పేరుతో “కల్లోలిత ప్రాంతాలలో” కూడా, భద్రతా బలగాలు పాల్పడే అతి చర్యలపై జరగవలసిన దర్యాప్తు నుండి తప్పించుకోజాలరని సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగు దరిమిలా ఈ స్థాపిత సూత్రం తాజాగా ప్రాధాన్యత సంతరించుకుంది. అటువంటి నోటిఫైడ్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు తమ “ప్రత్యేక అధికారాలు” ఉపయోగించినప్పుడు చట్టబద్ధ రక్షణ పొందుతున్నాయి. మణిపూర్ లో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలు, మరియు తత్సంబంధిత ఘటనల పర్యవసానంగా సంభవించిన 1528 మరణాలపై విచారణ జరిపించాలన్న డిమాండ్ విషయమై దాఖలైన పిటిషన్ లను విచారణకు స్వీకరిస్తూ సుప్రీం కోర్టు, భద్రతా బలగాల (ప్రత్యేక అధికారాలు) చట్టం, మరియు ఆ చట్టం కింద ఉపయోగించే బల ప్రయోగానికి, “అది చావుకు దారి తీసేది అయినప్పటికీ,” నేర విచారణ నుండి అందుతుందని చెప్పబడుతున్న మినహాయింపు, సవాలుకు అతీతమైనది ఏమీ కాదని స్పష్టం చేసింది. అటువంటి చట్టబద్ధ రక్షణ, ముఖ్యంగా దాదాపు 60 యేళ్ళుగా AFSPA కింద మగ్గుతున్న ఒక రాష్ట్రంలో, మానవ హక్కులు లాంటి విశాల సూత్రాలకు లోబడి ఉండాలి; అతిగా గానీ ప్రతీకారంగా గానీ బల ప్రయోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఆమూలాగ్రం విచారణకు గురి కాకుండా విస్మరించబడ రాదు. ప్రజాస్వామ్యానికీ, చట్ట సూత్రాల సంరక్షణకూ ఇది ఒక అవసరం. కోర్టు నిర్దిష్టంగా 62 కేసులకు సంబంధించి పట్టికల వారీ వివరాలు ఇవ్వాలని కోరింది. ఈ కేసుల్లో సంభవించిన మరణాలు వాస్తవంగా ఆపరేషనల్ కారణాల వల్ల జరిగినవి కావని చట్ట విరుద్ధ హత్యలు లేదా బూటకపు ఎన్ కౌంటర్ల ఫలితం అనీ నమ్మడానికి ఎంతో కొంత సాక్షం ఉన్నదని కోర్టు భావిస్తోంది. 85 పేజీల రూలింగు, గతంలో నాగా పీపుల్స్ మూవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (నాగా ప్రజల మానవ హక్కుల ఉద్యమం – 1997) కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు నుండి సంగ్రహించిన సూత్రాలపై ఆధారపడినప్పటికీ, AFSPAను రద్దు చేయడం గానీ సవరించడం గానీ జరగాలన్న అబిప్రాయానికి బలం పెరుగుతున్న ప్రస్తుత సందర్భంలో దానికి ప్రత్యేక అర్ధం ఉన్నది.
మణిపూర్ లో, దాని పొరుగు రాష్ట్రాలలో ఉనికిలో ఉన్న పరిస్ధితుల పట్ల కోర్టుకు అవగాహన లేకుండా ఏమీ పోలేదు. దిగ్భ్రాంతికి కారణమైన అంశం ఏమిటంటే ఎలాంటి విచారణ కూడా దాదాపు పూర్తిగా లేకపోవడం. అనేక కేసుల్లో కనీసం మొదటి సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) కూడా నమోదు కాలేదు; కొన్ని కేసుల్లో బాధితుల పైననే కేసులు మోపబడ్డాయి. ఉగ్రవాదంతో సమర్ధవంతంగా పోరాడేందుకు సాయుధ బలగాలకు అదనపు అధికారాలు కట్టబెట్టారన్న సంగతిని కోర్టు గుర్తించింది. అయితే, చట్ట విరుద్ధమైన హత్యలకు అది సాకు కారాదని స్పష్టం చేసింది -అటువంటి ఆరోపణలు వచ్చినప్పుడల్లా, సంబంధిత వ్యక్తి ఎంత భయంకరమైన నేరస్ధుడు, ఉగ్రవాది లేదా తిరుగుబాటుదారుడు అన్నదానితో సంబంధం లేకుండా ఆ ఆరోపణలపై దర్యాప్తు జరపాలి. కల్లోలిత ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నపుడు ఎలాంటి పరిస్ధితులలో సైన్యం యొక్క బల ప్రయోగం, చావుకు దారి తీసేది అయినప్పటికీ, ప్రాసిక్యూషన్ నుండి మినహాయింపు పొందుతుంది అన్న అంశాన్ని, సైన్యం తీసుకోవలసిన మరియు తీసుకోకూడని చర్యలను కోర్టు అధికారులకు గుర్తు చేసింది. కల్లోలిత ప్రాంతంలో ఆయుధాలు ధరించిన ప్రతి వ్యక్తి, అలా ఆయుధాలు ధరించినందుకే ‘శత్రువు’ కాజాలడు. అలాంటి సందర్భం బలవంతపు మాయంలు, చట్ట విరుద్ధ హత్యల ఆరోపణల పైన దర్యాప్తును కోరుతుంది, ముఖ్యంగా ఇప్పటికే పత్రాలు అందుబాటులో ఉన్న కేసుల్లో మరియు పాక్షికంగా దర్యాప్తు జరిగిన కేసుల్లోనూ. అది (దర్యాప్తు) శిక్ష లేమికి ముగింపు పలికే దిశలో AFSPA ను రద్దు చేయాలన్న డిమాండ్ కు ఊపు ఇవ్వాలి.
*********
సుప్రీం కోర్టు ఇచ్చిన రూలింగు, ఏఎఫ్‌ఎస్‌పిఏ ద్వారా భద్రతా బలగాలు పొందుతున్న విచక్షణారహిత రక్షణకు ముగింపు పలుకుతుందన్న పత్రిక ఆశాభావం అత్యాశగా, అతి అంచనాగా కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో సుప్రీం కోర్టులు ఇచ్చిన తీర్పులకే -రూలింగుల సంగతి తర్వాత- దిక్కు లేకుండా పోయింది. ఉదాహరణకు మధ్య భారతంలో గిరిజనులకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బిజేపి పార్టీలు పెంచి పోషించిన ‘సల్వా జుడుం, ప్రత్యేక గిరిజన పోలీసులు చట్ట విరుద్ధం అనీ వారిని వెంటనే రద్దు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది. కానీ సల్వా జుడుంను రద్దు చేసినట్లు పైకి ప్రకటించిన ప్రభుత్వాలు ఆచరణలో మరో రూపంలో దానిని కొనసాగిస్తోంది. ఇప్పటికీ గిరిజనులను అడవుల నుండి తరిమి వేయటానికి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ రూపాల్లో సాయుధ అణచివేతలను, తరిమివేతలను అమలు చేస్తున్నాయి.
ఏఎఫ్‌ఎస్‌పిఏ 60 యేళ్ళ నుండి కాశ్మీర్ రాష్ట్రంలో, ఈశాన్య రాష్ట్రాల్లో భారత ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఇన్నేళ్ల కాలంలో ఈ చట్టం పాలకవర్గాలకు ప్రజా ఉద్యమాలను, ఆయా రాష్ట్రాల ప్రజల జాతీయ ఆకాంక్షలను అణచివేసేందుకు మాత్రమే కాకుండా సైనిక అధికారులకు భారీ ఆదాయ వనరుగా కూడా మారిపోయింది. బంగారు గుడ్లు పెట్టే బాతుగా మార్చుకున్న ఏఎఫ్‌ఎస్‌పిఏ ను రద్దు చేయటానికి సైన్యం, ముఖ్యంగా అధికారవర్గం, అందుకే ససేమిరా ఒప్పుకోవటం లేదు. చట్టంలో కనీసం సవరణలు చేసేందుకు గానీ, ఎంపిక చేసిన కొద్ది ప్రాంతాల్లో ఎత్తివేసేందుకు గానీ కూడా సైనికాధికారులు ఒప్పుకోవటం లేదని హోమ్ మంత్రిగా పని చేసినప్పుడు పి.చిదంబరం ప్రకటించటం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. కనుక ఏఎఫ్‌ఎస్‌పిఏ ను రద్దు చేయటం అటుంచి సవరణలు చేసినా కూడా అది సుప్రీం కోర్టు సాధించగలిగిన అద్భుతంగా పేర్కొనవచ్చు. అనేక యేళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న మణిపూర్ మహిళా ఇరోమీ షర్మిల లాంటి పోరాటయోధుల ఎడతెగని పోరాటాలకు ఫలితం దక్కిందని సంతోష పడవచ్చు. కానీ రూలింగు ఇచ్చింది సుప్రీం కొర్టే అయినప్పటికీ దాన్ని అమలు చేయవలసింది చట్టం ద్వారా లబ్ది పొందుతున్న పాలకవర్గాలు మరియు సైన్యాధికారులే. అందువలన ద హిందూ ఎడిటోరియల్ వ్యక్తం చేసిన ఆశాభావం దాదాపు దుస్సాధ్యం.
Sir one small doubt ఏ విధంగా సైనిక అధికారులకు భారీ ఆదాయ వనరు??
ఎఎఫ్ఎస్ పిఎ కింద నేర రాహిత్యంకు ముగింపు -ద హిందూ ఎడిట్.. అనే పోస్టూ …ఈ పై పోస్టూ ఒకటేనా శేఖర్ గారూ? ఆ post కనబడడం లేదు అని వస్తోంది…
కళ్యాణి గారూ, రెండూ ఒకటే. మొదటిది పొరపాటున పబ్లిష్ అయింది. ఆఫీసులో ఖాళీ సమయం వచ్చినప్పుడు కాస్త కాస్త అనువాదం చేస్తూ ఉండగా పొరపాటున పబ్లిష్ బటన్ మీద వేలు ప్రెస్ అయి సగం లోనే పోస్ట్ అయిపోయింది. దానిని తొలగించి పూర్తి అయ్యాక పోస్ట్ చేస్తూ టైటిల్ ని సవరించాను. మొదటిది ఫేస్ బుక్ లో మీకు కనిపించినట్లుంది.
రాధాకృష్ణ గారూ బైట ఉన్నా. వచ్చాక సమాధానం ఇస్తాను.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలలో గిరిజన జాతులకు అనేక సరుకులు సబ్సిడీ ధరలకు ఇస్తారు. అయితే వాటిని ప్రజలకు అందకుండా అధికారులు పక్కదారి మళ్లిస్తారు. ఇలా పక్కదారి మళ్లించటంలో సాయుధ గ్రూపులది ఓ ముఖ్య పాత్ర. పంపిణీ కేంద్రాల వద్ద, రవాణాలో ఉండగానే సరుకుల్ని అటకాయించి సాయుధ గ్రూపులు స్వాధీనం చేసుకుంటాయి. వారికి సమాచారం చేరవేసేది ఆర్మీ అధికారులే. ఆ సరుకుల్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మేస్తారు. ఇలా వచ్చిన మొత్తాన్ని సాయుధ గ్రూపు, అధికారులు, ఆర్మీ అధికారులు పంచుకుంటారు. సాయుధ గ్రూపుల రౌడీయిజానికి జనం కూడా భయపడుతుంటారు. ఈ అవినీతిని అడ్డుకున్న వారిని, బైట పెట్టిన వారిని, ప్రశ్నించిన వారిని సైన్యం ఏఎఫ్‌ఎస్‌పిఏ ని అడ్డం పెట్టుకుని చంపేస్తున్నారు. చంపేసి టెర్రరిస్టులు అని ముద్ర వేస్తున్నారు.
సాయుధ గ్రూపులు అనేక చోట్ల రోడ్ల పైన పబ్లిక్ గానే చెక్ పోస్టులు నడుపుతుంటారు. సైన్యం, పోలీసులు వాటిని ముట్టుకోవు. వాటి వద్ద లారీలు, ట్రక్కులు ఇతర వాహనాల నుండి వసూళ్ళు చేస్తారు. ఒక్కోసారి లారీలోని సరుకూ లాక్కుంటారు. వసూళ్లు, సరుకులు అమ్మగా వచ్చే డబ్బుని గ్రూపులు, రాజకీయ నాయకులు, సైన్యం అధికారులు పంచుకు తింటున్నారు. సైన్యంలో కింది నుండి పై అధికారుల వరకు ఒక్కో స్ధాయిలో దందా సాగిస్తుంటారు.
నిజాయితీగా లక్ష్యం కోసం ఆయుధాలు పట్టుకున్న కొందరు యువకులు కొన్నాళ్ళు పని చేసి విరమించుకుంటారు. తాము చేరిన సంస్ధల్లో నిజాయితీ లేదని వారు గ్రహించినప్పుడు అలా జరుగుతుంది. వాళ్ళు పోలీసులకు లొంగిపోయినా కూడా పోలీసులు వారిని విడిచి పెట్టరు. నిత్యం వెంట పడుతూ అరెస్టులతో బెదిరిస్తూ వారి సంపాదనని లాక్కుంటారు. కాశ్మీర్ లో అఫ్జల్ గురుని అక్కడి పోలీసులు ఇలానే వేధించుకు తిన్నారు.
వీటిని చాలా సార్లు హక్కుల సంస్ధలు, నిజాయితీగా పని చేస్తున్న గ్రూపులు వెల్లడి చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవు. అధికారులు అలాంటిది ఏమీ లేదని బుకాయిస్తారు.
Thankyou sir