ఇరాక్ యుద్ధం చట్ట విరుద్ధం -యూ‌కే మాజీ ఉప ప్రధాని


Lord Chilkot Enquiry

Lord Chilkot Enquiry

ఇరాక్ యుద్ధానికి దారి తీసిన పరిస్ధితులను విచారించటానికి గత బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన ఎంక్వైరీ కమిషన్, తన నివేదికను వెలువరించిన దరిమిలా బ్రిటన్ మాజీ నేతల ఒప్పుకోళ్ళు వరదలా ప్రవహిస్తున్నాయి. 2009లో అప్పటి ప్రధాని గార్డన్ బ్రౌన్, లార్డ్ జాన్ చిల్కాట్ నేతృత్వంలో నియమించిన విచారణ కమిషన్ కొద్ది రోజుల క్రితం విచారణ నివేదికను విడుదల చేసింది.

ఆనాటి ప్రధాని టోని బ్లెయిర్ సరైన కారణాలు లేకుండా బ్రిటిష్ యువ సైనికుల ప్రాణాలను బలి పెడుతూ దేశాన్ని యుద్ధం లోకి నడిపించాడని చిల్కాట్ కమిషన్ నివేదిక నిర్ధారించింది. యుద్ధాన్ని నివారించే పరిస్ధితులు, అవకాశాలు ఉన్నప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం గుడ్డిగా అమెరికాకు మాట ఇచ్చి ఇరాక్ యుద్ధంలో లక్షల మంది ఇరాకీలు, వందల మంది బ్రిటిష్ సైనికుల మరణానికి కారణం అయిందని కమిషన్ నిందించింది.

ఈ నేపధ్యంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మంత్రులు, అధికారులు ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇరాక్ యుద్ధం చట్ట విరుద్ధంగా జరగటం వాస్తవమే అని ఒప్పుకుంటూ జరిగిన తప్పుకు పశ్చాత్తాపం ప్రకటిస్తున్నారు. చివరికి ప్రధాని టోనీ బ్లెయిర్ సైతం పరోక్షంగా పశ్చాత్తాపం ప్రకటించగా ఆనాటి ఉప ప్రధాని లార్డ్ ప్రెస్కాట్, “ఇరాక్ యుద్ధం ప్రధాన లక్ష్యం ప్రభుత్వ మార్పిడే” అని స్పష్టం చేశాడు.

“2004లో ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ ఇరాక్ యుద్ధానికి ఉన్న ప్రధాన లక్ష్యం ప్రభుత్వ మార్పిడే అని, ఇరాక్ యుద్ధం చట్ట విరుద్ధం అనీ ప్రకటించారు. అత్యంత వేదనతో, కోపంతో నేను ఇప్పుడు ఆయన చెప్పింది నిజమే అని నమ్ముతున్నాను” అని యూ‌కే మాజీ ఉప ప్రధాని లార్డ్ ప్రెస్కాట్ ‘సండే మిర్రర్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.

ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ ‘సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయని, అమెరికా ఐరోపా దేశాలపై ప్రయోగించేందుకు ఆయన అణు బాంబులు, రసాయన ఆయుధాలు కూడబెట్టాడని పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా, యూ‌కే లు ఆరోపించాయి. 9/11 టెర్రరిస్టు దాడులకు కారకులైన ఆల్-ఖైదా, ఒసామా బిన్ లాడెన్ తో సద్దాం హుసేన్ కు సంబంధాలు ఉన్నాయని కూడా పశ్చిమ దేశాలు ఆరోపించాయి.

అయితే దురాక్రమణ అనంతరం ఇరాక్ లో ఒక్క సామూహిక మారణాయుధాన్ని కూడా దురాక్రమణ దేశాలు చూపలేకపోయాయి. తమ ప్రభుత్వాల మాటలు నమ్మి స్వచ్ఛందంగా సైన్యంలో చేరి ఇరాక్ యుద్ధరంగం లోకి దూకిన పలువురు యువతీ యువకులు తాము తమకు అక్కరలేని యుద్ధాన్ని చేస్తున్నామని త్వరలోనే అర్ధం అయింది. ఇరాక్ ప్రజలను ఉత్తి పుణ్యానికి ఊచకోత కొస్తున్నామని, వారి దేశాన్ని నాశనం చేస్తున్నామని తెలుసుకున్నారు. ఆ మేరకు అనేకమంది తమ పశ్చాత్తాపాన్ని తెలియజేస్తూ స్వానుభవాలను వెల్లడి చేశారు.

ఇరాన్-ఇరాక్ యుద్ధం అనంతరం అమెరికా ఉక్కు కౌగిలి నుండి బైట పడడానికి ఆనాటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ సొంతగా ప్రయత్నాలు ప్రారంభించాడు. తాము అమ్మే క్రూడాయిల్/పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తులకు డాలర్లకు బదులుగా యూరోలు స్వీకరించటానికి ఒప్పందాలు చేసుకోవటం ప్రారంభించాడు. అమెరికా బహుళజాతి ఆయిల్ కంపెనీల ఆధిపత్యానికి గండి కొట్టడానికి పూనుకున్నాడు.

Tony Blair

Tony Blair

ఇది సహించని అమెరికా ఇరాక్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సన్నాహాలు ప్రారంభించింది. సద్దాం వద్ద లేని మారణాయుధాలను సాకుగా చూపింది. ఉనికిలో లేని సద్దాం-లాడెన్ సంబంధాలను సృష్టించింది. ఈ అంశాలను అనేకమంది స్వతంత్ర పరిశీలకులు, విశ్లేషకులు వెల్లడి చేసినప్పటికీ నమ్మినవారు లేరు. వారు చెప్పిన వాస్తవాలు పశ్చిమ కార్పొరేట్ మీడియా సృష్టించిన దుమ్ము దుమారంలో కొట్టుకుపోయాయి. వాస్తవాలను ‘కుట్ర సిద్ధాంతాలు’గా ప్రచారం చేయటంలో పశ్చిమ మీడియా సఫలం అయింది.

ఇవే అంశాలను లార్డ్ చిల్కాట్ విచారణ కమిషన్ తన నివేదికలో నిర్ధారించింది. ‘కుట్ర సిద్ధాంతాలు’గా పశ్చిమ కార్పొరేట్ మీడియా ప్రచారం చేసిన అంశాలనే వాస్తవాలుగా పేర్కొంది. తద్వారా ‘కుట్ర సిద్ధాంతం’ ప్రచారకులే అసలైన కుట్ర దారులని తేల్చేసింది. “అమెరికా నేతృత్వంలో జరిగిన ఇరాక్ దురాక్రమణ దాడికి మిలట్రీ బలగాలను పంపాలని  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనివార్యంగా సమైక్య జీవనానికి నిర్దేశించబడిన మార్గదర్శక సూత్రాలను ఉల్లంఘించే వైపుగా మరింతమంది మిలట్రీ బలగాలను నెట్టడానికి కారణంగా నిలిచింది. మిలట్రీ బలగాలపై తీవ్ర ఒత్తిడి వస్తుందన్న అంశాన్ని ఆనాటి నిర్ణయానికి ముందు పరిగణనలోకి తీసుకోలేదు” అని చిల్కాట్ కమిషన్ పేర్కొంది.

ఇరాక్ యుద్ధానికి 8 నెలల ముందుగానే ఇరాక్ పై అమెరికా దురాక్రమణ దాడికి సహకరిస్తామని బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ మాట ఇచ్చిన విషయాన్ని చిల్కాట్ కమిషన్ వెలుగులోకి తెచ్చింది. “ఏం జరిగినా సరే, నేను మీతో ఉన్నాను” అని బ్లెయిర్, ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ కు మాట ఇచ్చాడని, తన మాట మేరకు దేశాన్ని యుద్ధం లోకి నడిపించాడని తెలిపింది. “2002లో బుష్ కు టోనీ బ్లెయిర్ పంపిన ఆ వినాశకర లేఖ యుద్ధానికి 8 నెలలు ముందుగానే అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ కు కావలసిన మద్దతును, ఐరాస మద్దతు లేకుండానే, అందజేసింది. వేసవి మిలటరీ దాడి యొక్క వేడికి ముందే త్వర త్వరగా దాడిని ముగించాలని వారు తలపెట్టారు” అని కమిషన్ నివేదిక పేర్కొంది.

“యుద్ధానికి సన్నద్ధం అవుతున్నప్పుడు ప్రభుత్వ కేబినెట్ కు ప్రధాని బ్లెయిర్ ఎటువంటి పత్రాలను అందుబాటులో ఉంచలేదు. మాకు తగిన సమాచారం ఇవ్వలేదు. లేదా చాలా తక్కువ సమాచారం మాత్రమే ఇచ్చాడు. ఇరాక్ కు వ్యతిరేకంగా మిలట్రీ చర్య తీసుకోవటం చట్టబద్ధమే అన్న అటార్నీ జనరల్ లార్డ్ గోల్డ్ స్మిత్ వాదనలకు మద్దతుగా ఎలాంటి పత్రాలు చూపలేదు” అని మాజీ ఉప ప్రధాని లార్డ్ ప్రెస్కాట్ తెలిపాడు.

“బ్లెయిర్ ప్రభుత్వం యుద్ధాన్ని నిర్వహించిన విధానంపై చిల్కాట్ నివేదిక ఒక తీవ్రమైన నేరారోపణ పత్రం” అని లార్డ్ ప్రెస్కాట్ స్పష్టం చేశాడు. “ఆనాటి ప్రభుత్వంలో ఉప ప్రధాన మంత్రిగా నేను నా పూర్తి క్షమాపణలను ప్రకటిస్తున్నాను. ముఖ్యంగా ఇరాక్ యుద్ధంలో తమ ప్రాణాలు అర్పించిన 179 మంది యువతీ యువకుల కుటుంబాలకు” అని మాజీ ఉప ప్రధాని ప్రకటించాడు.

“యుద్ధానికి వెళ్లాలన్న మా నిర్ణయం గురించి తలచుకోకుండా నాకు ఒక్క రోజు కూడా గడవదు. 6 సంవత్సరాల ఇరాక్ యుద్ధంలో 150,000 మంది ఇరాకీ పౌరులు చంపబడ్డారు. ఇరాక్ ఆందోళనకరమైన అస్ధిరత్వం లోకి, నిత్య అలజడిలోకి జారిపోయింది.  ఈ పరిస్ధితి ఇస్లామిక్ స్టేట్ పుట్టడానికి దారి తీసింది” అని లార్డ్ ప్రెస్కాట్ తెలిపాడు.

చిల్కాట్ నివేదిక దరిమిలా ఇరాక్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన బ్రిటిష్ సైనికుల కుటుంబాలు కూడా స్పందిస్తున్నాయి. ఆనాటి బ్రిటిష్ ప్రధాన మంత్రిని అంతర్జాతీయ చట్టాల ప్రకారం మానవ హక్కుల కోర్టులో విచారించి శిక్షించాలని కొన్ని కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. “టోనీ బ్లెయిర్ ప్రపంచంలో కెల్లా అత్యంత దారుణమైన టెర్రరిస్టు” అని ఒక సైనికుడి సోదరి పేర్కొనడం విశేషం.

ఒక్క టోనీ బ్లెయిర్ మాత్రమే కాదు. బిన్ లాడెన్, అబూ బకర్-ఆల్ బాగ్దాది, ఆల్-ఖైదా, ఇసిస్, ఆల్-నూస్రా లాంటి టెర్రరిస్టు నేతలను, సంస్ధలను సృష్టించి వాటి ద్వారా భౌగోళిక రాజకీయ అధిపత్య ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు కృషి చేస్తున్న పశ్చిమ ప్రభుత్వాల నేతలందరూ టెర్రరిస్టులే అన్నది నిర్వివాదాంశం. జార్జి బుష్ సీనియర్ మరియు జూనియర్, బారక్ ఒబామా, టోనీ బ్లెయిర్, డేవిడ్ కామెరాన్… ఇత్యాది నేతలందరూ ఇస్లామిక్ టెర్రరిస్టు సంస్ధలను పోషిస్తున్నవారే. టెర్రరిజం పోషకులు కాకుండా ఇంకెవ్వరు టెర్రరిస్టులు అవుతారు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s