ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వచ్చిన కేబినెట్ విస్తరణ ఎట్టకేలకు పూర్తయింది. ఇది యధావిధిగా మోడి మార్కు విస్తరణగానే ఉన్నదని పత్రికలు, ఛానెళ్లు వ్యాఖ్యానించగా, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని అభివృద్ధి లక్ష్యంగా కొన్ని సర్దుబాట్లు జరిగాయని బిజేపి ప్రభుత్వ నేతలు వ్యాఖ్యానించారు.
బిజేపి నేతలు ఏమి చెప్పినా, ఏ కారణము లేకుండా, ఏ ఫలితమూ ఆశించకుండా ప్రధాన మంత్రి తన కేబినెట్ లో మార్పులు, చేర్పులు చేస్తారంటే నమ్మటానికి వీలు లేదు. “కేబినెట్ విస్తరణ ప్రధాన మంత్రి ప్రిరోగేటివ్” అంటున్న బిజేపి ప్రతినిధుల వివరణ ప్రకారం విస్తరణకు ప్రత్యేకత లేనిమాట నిజమే అయితే, అలాంటి విస్తరణ ప్రభుత్వ అసమర్ధతను తెలియజేస్తుందే తప్ప పనితనాన్ని తెలియజేయదు. ఎందుకంటే సమర్ధవంతమైన ప్రభుత్వం ఒట్టినే, ప్రధాన మంత్రి ప్రేరోగేటివ్ గురించి తెలిపేందుకు విస్తరణ చేపట్టదు కనుక!
అనేక మంది విశ్లేషకులు ఇప్పటికే చెప్పినట్లుగా మంత్రివర్గ విస్తరణ/సవరణలో వ్యక్తం అయిన ప్రధాన లక్ష్యం ఉత్తర ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు. ఈ ఎన్నికలకు ముందు తాము దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మోడి ప్రభుత్వం చెప్పదలుచుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో దళితులు పెద్ద ఎత్తున బిజేపికి ఓటు వేశారు. బిఎస్‌పి తుడిచి పెట్టుకుపోవటానికి, బిజేపి కి భారీ సీట్లు దక్కటానికి ఇది ఒక కారణం.
అయితే ఈ రెండేళ్లలో బిజేపి పైన మొహం మొత్తిందని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా మోడి వాగ్దానాలపై ఆశలు పెట్టుకున్న దళితులు రాష్ట్ర ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలపై దృష్టి సారిస్తారని, ఆ విధంగా దళితులు మళ్ళీ బిఎస్‌పి వైపు మొగ్గుతారని బిజేపి తో పాటు బిఎస్‌పి నేతలు కూడా భావిస్తున్నారు. దానితో దళితుల ఓట్లు చేజారకుండా ఉండేందుకు వారికి reassurances ఇచ్చేందుకు మోడి ప్రభుత్వం పూనుకుంది.
ఈ లక్ష్యంలో దొర్లిపడిన మొదటి పెద్ద తలకాయ -స్మృతి ఇరాని! మానవ వనరుల శాఖ మంత్రిగా వరస పెట్టి వివాదాలు చెలరేగేందుకు మంత్రి దోహదం చేశారని, ముఖ్యంగా దళిత విద్యార్ధులకు, పేద విద్యార్ధులకు మోడి ప్రభుత్వం వ్యతిరేకం అన్న ముద్రను ఆమె సంపాదించి పెట్టారని ఒక అభిప్రాయం ఏర్పడి ఉన్నది. నిజానికి స్మృతి ఇరాని మోడికి చెప్పకుండా, ప్రభుత్వానికి తెలియకుండా, ఆర్‌ఎస్‌ఎస్ పరివారం ఆదేశాలకు విరుద్ధంగా ఏ ఒక్క పనీ చేయలేదు. పైగా ఆమె తీసుకున్న చర్యలు, చేసిన ప్రసంగాలు, ప్రవేశ పెట్టిన సూత్రాలు అన్నీ ఆర్‌ఎస్‌ఎస్ అజెండా అమలుకు ఉద్దేశించినవే.
ఆయా వివాదాలు చెలరేగినపుడు ఆర్‌ఎస్‌ఎస్ గానీ నరేంద్ర మోడి గానీ ఏ దశలోనూ స్మృతి ఇరానిని ఖండించలేదు. పోనీ సవరణకు పూనుకోలేదు. ఆమె ఉద్దేశం అది కాదు, ఇది అని సర్దుడుకు పూనుకోలేదు. అవేమీ చేయకపోగా ఆమెను బేషరతుగా సమర్ధించుకు వచ్చారు. పూర్తి మద్దతు ఇచ్చారు. ఆమె సరైన నిర్ణయాలు తీసుకున్నారని స్పష్టం చేశారు. హిందూత్వ మూకల వీరంగాలకు ఏ మాత్రం స్పందించని మోడి స్మృతి పార్లమెంటు ప్రసంగాన్ని మాత్రం ‘సత్యమేవ జయతే’ అంటూ మెచ్చుకున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ హైద్రాబాద్ లో రోహిత్ ఆత్మహత్య జరిగినప్పుడు గానీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) లో అనిర్బన్, ఉమర్ ఖలీద్, కన్హయ్య కుమార్ లను అక్రమంగా అరెస్టు చేసి దేశద్రోహం కేసులు మోపినప్పుడు గానీ మోడి ఆదేశాల ప్రకారమే స్మృతి నడుచుకున్నారు. రోహిత్ ఆత్మహత్య ద్వారా దళితుల ఆగ్రహాన్ని నమోదు చేసుకున్న బిజేపి జేఎన్‌యూ చర్యల ద్వారా కోర్టులో విద్యార్ధులపై లాయర్ గూండాల దాడి ద్వారా పేదల్లో నెలకొన్న ‘అభివృద్ధి’ భ్రమలను పోగొట్టుకుంది. ఈ ఖాళీలను, వ్యతిరేకతను పూరించవలసిన అవసరం ఎన్నికల వేళలో బిజేపికి కలిగింది.
దాని ఫలితంగానే స్మృతి ఇరానిని మానవ వనరుల అభివృద్ధి శాఖ నుండి బిజేపి తొలగించింది. అలాగని ఆమెను పూర్తిగా తొలగిస్తే అది తిరిగి బిజేపి ప్రతిష్టను దెబ్బ తీస్తుంది. ఆ ప్రమాదం లేకుండా పెద్దగా ప్రాధాన్యత లేని జౌళి శాఖను ఆమెకు కట్ట బెట్టారు. యూపి ఎన్నికలలో ఆమె సేవలు అవసరం అనీ, ప్రాధాన్యత లేని శాఖ ఇవ్వటం ద్వారా యూపి ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తగిన ఖాళీని ఆమెకు కల్పించారని బిజేపి పనుపున కొన్ని చానెళ్లు ప్రచారం చేస్తున్నాయి. ఇది face saving వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఆ మాటకొస్తే మానవ వనరుల మంత్రిగా ఉండగానే స్మృతి ఇరాని నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయలేదా?
దళిత ఓట్లకు గాలం వేయటంలో భాగంగానే నలుగురు దళిత ఎంపి లకు కొత్తగా మంత్రివర్గంలో స్ధానం కల్పించారు. యూపి, గుజరాత్ ల ఎన్నికలు లక్ష్యంగా ఆ రాష్ట్రాల నుండి మరింత మందికి మంత్రివర్గంలో స్ధానం కల్పించారు. గుజరాత్ లో పటిదార్ రిజర్వేషన్ ఉద్యమం నేపధ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ ను తప్పించటం ఖాయం అనీ ఆమె స్ధానంలో బిజేపి అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగవచ్చని సూచనలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఇద్దరు నాయకులకు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా గుజరాత్ లో అమిత్ షా పోటీ లేకుండా చేసుకున్నారని విశ్లేషిస్తున్నారు.
విచిత్రం ఏమిటంటే విస్తరణకు ముందు “విస్తరణ లక్ష్యం నిమ్న వర్గాల అభివృద్ధి మాత్రమే తప్ప కుల సమీకరణలు కాదు” అని నరేంద్ర మోడి చెప్పటం. ‘కాదు’ అన్నారంటే ‘అవును’ అన్నారని భావించవచ్చన్నమాట! అనవసరంగా ఆడవారిని ఆడిపోసుకోవటం అన్యాయం కాదా?