
Mansukh Vasava
కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు, తొలగింపులు జరిగాక అసమ్మతి స్వరాలు మెల్లగా బయలు దేరుతున్నా యి. అయితే ఆ అసమ్మతి పదవి పేరుతో కాకుండా పార్టీ పనితనం పేరుతో వ్యక్తం కావటం విశేషం. ‘కాంగ్రెస్ కంటే మాది భిన్నమైన పార్టీ’ అని బిజేపి నేతలు చెబుతుంటారు. అసమ్మతిలో కూడా భిన్నం అన్నమాట!
కేంద్ర మంత్రివర్గంలో మన్సుఖ్ వాసవ నిన్నటి వరకు గిరిజన శాఖ మంత్రిగా పని చేశారు. బిజేపి/మోడి ప్రభుత్వం అధికారం చేపట్టిన మే 2014 నుండి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేసిన వాసవను నిన్నటి మార్పుల్లో తొలగించారు. ఇతరులకు శాఖల నుండి ప్రమోట్ చేయడమో, డిమోట్ చేస్తే వాసవను మాత్రం ఏకంగా డిస్మిస్ చేసేశారు.
ఈ నేపధ్యంలో వాసవ గుజరాత్ గురించిన ఒక వాస్తవాన్ని వెల్లడి చేశారు. గిరిజనులకు విద్యా బుద్ధులు చెప్పించి అభివృద్ధి చేయటంలో దేశంలో కెల్లా గుజరాత్ అత్యంత ఘోరమైన రాష్ట్రం అని వాసవ తెలియజేశారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రిగా ఈ పరిస్ధితిని మార్చాలని తాను తీవ్రంగా ప్రయత్నాలు చేశానని కానీ తనకు వ్యతిరేక వాతావరణం ఉండటంతో అది సాధ్యం కాలేదని ఆయన తెలిపారు.
“నన్ను (మంత్రివర్గం నుండి) ఎందుకు తప్పించారో నాకు తెలియదు. ఈ విషయంలో నేను హై కమాండ్ నుండి స్పష్టత కోరుతాను. కానీ నేను ఒక సంగతి మాత్రం చెప్పగలను. నేను అత్యంత శత్రుపూరిత వాతావరణంలో పని చేశాను” అని వాసవ చెప్పారు. గిరిజనుల సంక్షేమం కోసం తాను ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో తన ప్రయత్నాలు గుజరాత్ లో బిజేపి పెద్దలకు రుచించలేదని, దానితో తనను శత్రువుగా చూశారని వాసవ చెబుతున్నారు.
“గిరిజన అభివృద్ధి మంత్రిత్వ శాఖ పని పద్ధతిలో పారదర్శకత తేవటానికి నేను ప్రయత్నాలు చేశాను. కానీ దురదృష్టవశాత్తూ, ఈ దిశలో నాకు ఎలాంటి మద్దతు అందలేదు. గిరిజన ప్రాంతాల్లో (కేంద్ర) ప్రభుత్వం చాలా చేయవలసి ఉన్నది” అని వాసవ చెప్పారు.
ఎస్సి, ఎస్టి ల అభ్యున్నతి కోసమే బిజేపి పార్టీ పని చేస్తున్నదని గుర్తుకు వచ్చినపుడు ప్రధాని నరేంద్ర మోడి చెబుతుంటారు. దళితుల కోసం, బలహీన వర్గాల కోసం తమ ప్రభుత్వం ఎంతో చేస్తున్నదని ఆయన సారం లేని మాటలు చెప్పటం రివాజు. మోడి చెప్పేవి సారం లేని మాటలే అని వాసవ నిర్ధారిస్తున్నారు. ఆయన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ ను కూడా పరుషంగా విమర్శించారు.
“గుజరాత్ లోని గిరిజన ప్రాంతాలలో పాఠశాలల దారుణ పరిస్ధితి గురించి, ఉపాధ్యాయుల లేమి గురించి కొద్ది నెలల క్రితం నేను గుజరాత్ ముఖ్యమంత్రికి లేఖ రాశాను. కానీ నాకు ప్రతిస్పందన అనేదే రాలేదు” అని వాసవ తెలిపారు.
“ఆనాడు నా లేఖలో స్పష్టంగా చెప్పాను. ‘నేను లేవనెత్తిన సమస్యలను తక్షణమే పరిష్కారం చేయనట్లయితే ప్రభుత్వం నుండి నేను తప్పు కుంటాను’ అని. గుజరాత్ లోని గిరిజన ప్రాంతాల్లో విద్యా రంగం దయనీయంగా ఉన్నది. పాఠశాలల్లో శాశ్వత ఉపాధ్యాయులే లేరు.
“అనేక గిరిజన పాఠశాలల్లో లెక్కలు, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్ట్ లలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కనిపించటం లేదు. గిరిజన విద్యకు సంబంధించినంతవరకు గుజరాత్ అత్యంత వరస్ట్ రాష్ట్రం. ముఖ్యమంత్రికి లేఖ రాసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన రాలేదు” అని వాసవ తెలిపారు.
గుజరాత్ గిరిజన ప్రాంతంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వం నుండి రాజీనామా చేయవలసి ఉంటుందని వాసవ హెచ్చరించారు. ఆయనకు ఆ అవకాశం లేకుండా ఏకంగా డిస్మిస్ చేసేశారు. పదవి ఇచ్చినపుడు ఉన్నదానితో ‘సర్దుకు పోవాలి’ గానీ పదవిలో లీనమై పోయి హెచ్చరికలు చేస్తుంటే మరి ఊరుకోవాలా?
వాసవ గుజరాత్ లోని బారుఖ్ లోక్ సభ నియోజకవర్గం నుండి 5 సార్లు ఎన్నికైన సీనియర్ నేత. అయినప్పటికీ వాసవను తొలగించటానికి బిజేపి హై కమాండ్ ఏమీ తొట్రు పాటు పడలేదు. కొత్త మంత్రులతో గుజరాత్ చేరిన అమిత్ షా పాత, కొత్త మంత్రులపై పొగడ్తలు కురిపిస్తూ వాసవ గురించి మాత్రం ఒక్క ముక్కా చెప్పకపోవటం గమనార్హం.
గుజరాత్, మహారాష్ట్ర, రాజస్ధాన్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలలో వరుసగా వ్యాపించి ఉన్న గిరిజన ప్రాంతాలతో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ ఉన్నది. ఈ ప్రాంతాలను కలిపి గతంలో గోండ్వానా ల్యాండ్ గా పిలిచేవారు. ఈ ప్రాంతాలను ఆయా రాష్ట్రాల నుండి విడగొట్టి భిలిస్తాన్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
భిలిస్తాన్ రాష్ట్ర ఉద్యమాన్ని వాసవ చేపడతారని ఆయన అనుచరులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆయన బిజేపి నుండి రాజీనామా చేసి ఉద్యమాన్ని చేపడతారని వాసవ అనుచరులు చెబుతున్నారు. మంత్రివర్గం మార్పుల పేరుతో బిజేపి గుజరాత్ లో అదనపు తలనొప్పిని కొని తెచ్చుకుందని కొన్ని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి.
రాజ్యాధికారాలలో గిరిజనులను చిన్నచూపుచూడడం అన్నదిగా వస్తున్న ఆచారమే,మోదీ దానిని కొనసాగించారంతే!
ఆ మాత్రందానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తానంటే మోదీ చూస్తూఊరుకుంటాడనుకొన్నారా? తాటతీస్తాడు.
నువ్వెంత?(వాసవ)నీబ్రతుకెంత? అని ఓపక్క అమిత్ షా ఊరుకుంటాడనుకొన్నావా?
దేశంలో మతతత్వాన్ని రెచ్చగొట్టిన మాకు(బి.జె.పి) నీవు(గిరిజనులు) ఓ లెక్కా?
2 సంవత్సరాలు మంత్రిపదవి అనుభవించి,మాకు(మోదీకి) స్వామిభక్తి చూపించవలసింది పోయి కిందింటివాసాలు లెక్కపెడతావా?ఖబడ్దార్!
డిగ్రీ పూర్తిచేస్తున్న బాలికలు ఏడుశాతం
– అగ్రస్థానంలో కేరళ
అహ్మదాబాద్: బాలికల సంక్షేమం, బాలికల విద్యపై గుజరాత్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా వాస్తవంలో వారి విద్య విషయంలో ఆ రాష్ట్రం అట్టడుగున నిలిచింది. ఆడపిల్లల బంగారు భవిష్యత్ కోసం అంటూ ‘కన్యా కెలవనీ’ పథకంతో భారీ ప్రచారం నిర్వహించింది. కానీ, బాలికా విద్యలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్ చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 21 రాష్ట్రాల్లో గుజరాత్ 20వ స్థానంలో ఉండటం గమనార్హం. గుజరాత్లో గ్రాడ్యుయేషన్ చేసిన బాలికలు కేవలం ఏడు శాతం మాత్రమేనని శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్-బేస్లైన్ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా సగటున 83.8 శాతం బాలికలు పాఠశాలలకు వెళుతుండగా, గుజరాత్లో ఇది కేవలం 73.4 శాతంగా ఉంది. జాబితాలో చిట్టచివరిన నిలిచిన రాజస్థాన్లో పాఠశాలలకు వెళుతున్న బాలికల సంఖ్య 72.1 శాతంగా నమోదైంది. గుజరాత్లో 15 నుంచి 17 సంవత్సరాల మధ్య బాలికల్లో 26.6 శాతం డ్రాపవుట్లుగా తేలింది. వీరు తిరిగి బడి ముఖం చూడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వెనుకబడిన ప్రాంతాలుగా చెబుతున్న రాష్ట్రాల్లో పరిస్థితి గుజరాత్ కన్నా మెరుగ్గా ఉంది. బీహార్లో పాఠశాలలకు వెళుతున్న బాలికల సంఖ్య 83.3 శాతంగా ఉండగా, అసోంలో 84.8 శాతం, జార్ఖండ్లో 84.1 శాతం, ఛత్తీస్గడ్లో 90 శాతం, మధ్యప్రదేశ్లో 79.2 శాతం మంది బాలికలు పాఠశాలలకు వెళుతున్నారు. ఇక 10 నుంచి 14 సంవత్సరాల బాలికల విషయంలోనూ గుజరాత్ పరిస్థితి పేలవంగా ఉంది.
రాష్ట్రంలోని బాలికల్లో 73.5 శాతం మంది అక్షరాస్యులైనా వీరిలో 59 శాతం మంది పదో తరగతికి మించి చదవడం లేదు. కేవలం 14.8 శాతం మందే ఇంటర్మీడియట్ను పూర్తిచేస్తున్నారు. ఇక గ్రాడ్యుయేషన్ పూర్తయిందనిపించేవారు కేవలం 7.3 శాతమే ఉండటం గుజరాత్లో బాలికల విద్య ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతున్నది.
Tags:courtesy by prajasakthi