స్వాతి హత్య కేసు విషయంలో పోలీసుల కథనం ఆరంభం లోనే సంధి కొట్టింది. వారం రోజుల వేట అనంతరం పట్టేశామని ప్రకటించిన నిందితుడు, తాను అసలు నిందితుడునే కాననీ, తనకు సంబంధం లేని కేసులో తనను పోలీసులు ఇరికించారనీ పోలీసులు అరెస్టు చేసిన రాం కుమార్ చెబుతున్నాడు.
అయితే గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ వలసిన అగత్యం ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నకు అతని వద్ద సమాధానం సిద్ధంగా ఉంది. “నేనసలు ఆత్మహత్యకు పాల్పపడ లేదు” అని రాం కుమార్ స్పష్టం చేస్తున్నాడు.
“పోలీసులు అతని ఇంటి లోపలికి వెళ్లినప్పుడు వారితో పాటు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. వారు రాం కుమార్ పై దాడి చేశారు. బ్లేడుతో అతని గొంతు పైన గాయం చేశారు. అంతే తప్ప అతను గొంతు కోసుకోలేదు. పోలీసులు చెబుతున్నది నిజం కాదు. ఆత్మహత్య పోలీసులు అల్లిన కట్టుకధ” అని రాం కుమార్ తరపు న్యాయవాది చెప్పారని ద హిందూ పత్రిక తెలిపింది.
స్వాతిని ఎవరు చంపి ఉంటారన్న విషయంలో రాం కుమార్ లాయర్ ఒక క్లూ అందించాడు. స్వాతి చనిపోవటానికి రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి ఆమె పైన దాడి చేశాడని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పాడని లాయర్ కృష్ణ మూర్తి వెల్లడి చేశాడు. ఈ సాక్షాన్ని పోలీసులు పట్టించుకోవడం లేదని కృష్ణ మూర్తి ఆరోపించారు.
“నిజమైన నేరస్ధుడిని పోలీసులు కాపాడుతున్నారు. అందుకోసం రాం కుమార్ ని అక్రమంగా ఇరికించారు. రాం కుమార్ ఒక గ్రామానికి చెందిన వ్యక్తి. అమాయకుడైన పేద వాడు” అని అడ్వకేట్ కృష్ణ మూర్తి తెలిపాడు. “పిటిషనర్ (రామ్ కుమార్) కు హత్యతో ఏ విధంగానూ సంబంధం లేదు. ఇది పోలీసులు సృష్టించిన తప్పుడు కేసు” అని కృష్ణ మూర్తి స్పష్టం చేశాడు.
ఇదే వాదనతో రాం కుమార్ లాయర్ తన క్లయింట్ కు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరాడు. పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని, ప్రాసిక్యూషన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశమే తన క్లయింటుకు లేదని బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు.
రాం కుమార్ నిరాకరణ బహుశా న్యాయ స్ధానాలకు కొత్తకాదు. ‘నేనే హత్య చేశాను. కాబట్టి శిక్ష వేయండి’ అని కోరే నేరస్ధులు దాదాపు ఎవరూ ఉండరు. లాయర్లు రంగం లోకి దిగాక వాళ్ళు ఎలాగూ తమ క్లయింటు నిర్దోషి అనే వాదిస్తారు కనుక కృష్ణ మూర్తి ప్రకటనలను సీరియస్ గా తీసుకోలేము.
కానీ వీడియోలో ఉన్న వ్యక్తి, రాం కుమార్ ఒకరే అన్న విషయం కోర్టులో ఎలా నిర్ధారణ అవుతుంది? వీధుల్లో సిసిటివి కెమెరాలలో రికార్డ్ అయిన వ్యక్తే రైల్వే స్టేషన్ లో హత్యకు పాల్పడ్డాడని చెప్పగల అవకాశం కూడా తక్కువే. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని దొరకబుచ్చుకుంటే తప్ప రాం కుమార్ హంతకుడు అన్నది ఇదమిద్ధంగా నిర్ధారణ కాకపోవచ్చు. కానీ ఆయుధం రాం కుమార్ దగ్గర దొరికింది అని పోలీసులు చెప్పినట్లుగా ఏ పత్రికా ఇంతవరకు చెప్పినట్లు లేదు.
పైగా ఆసుపత్రిలో రాం కుమార్ వద్ద మేజిస్ట్రేట్ స్టేట్ మెంట్ రికార్డు చేసినప్పుడు నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్లుగా పత్రికలు తెలిపాయి. స్వాతిపై తనకు ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తూ ప్రపోజ్ చేయగా ఆమె తన రూపాన్ని హేళను చేస్తూ కఠినంగా మాట్లాడిందని, మూడు సార్లు వివిధ చోట్ల ఇతరుల ముందు తన రూపం గురించి అవమానకరంగా మాట్లాడిందని అందుకే కోపంతో చంపేశానని రాం కుమార్, మేజేస్ట్రేట్ వద్ద అంగీకరించినట్లుగా పత్రికలు తెలిపాయి.
ఎంత అవహేళన చేస్తే మాత్రం మనిషి ప్రాణం తీసే వరకూ కక్ష పెంచుకోవటం అత్యంత దారుణం. రాం కుమార్ అంతర్ముఖి (introvert) అనీ, ఎవరితోనూ కలవడని, అతని ఊరిలో కూడా ఒక్క ఫ్రెండ్ కూడా అతనికి లేరని కూడా పత్రికలు చెప్పాయి. వంచిన తల ఎత్తకుండా వస్తూ, వెళ్ళే రాం కుమార్ హత్య చేశాడంటే నమ్మ బుద్ధి కావటం లేదని అతని ఊరు మీనాక్షీపురం వాసులు చెప్పారని తెలుస్తోంది. ఖాళీ దొరికితే తమ మేకలు మేపటానికి వెళ్తాడు తప్ప ఎవరితో మాట్లాడేవాడు కాదని ఇరుగు పొరుగును ఉటంకిస్తూ కొన్ని పత్రికలు తెలిపాయి.
రాం కుమార్ కూడా ఇంజనీరింగ్ పట్టబధ్రుడే. అయితే అతని డిగ్రీ ఇంకా పూర్తి కాలేదు. కొన్ని సబ్జెక్ట్ లు మిగిలాయి. వాటిని పూర్తి చేసే క్రమంలో చెన్నైలో ఒక షాపులో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అతను ఉంటున్న పిజి (పేయింగ్ గెస్ట్) మాన్షన్ కు సమీపం లోనే స్వాతి వాళ్ళ ఇల్లు ఉన్నది. ఆమె కంపెనీకి వెళ్ళి వస్తున్న క్రమంలో ఆమెపై అతనికి దృష్టి పడిందని, ఆమెపై మొహం పెంచుకున్నాడని పోలీసులు చెప్పారు.
ఆడ పిల్లను ఇష్ట పడటం, ఇష్టపడిన వ్యక్తి జీవిత భాగస్వామి కావాలని కోరుకోవటం వరకు యువకులకు సహజమైన విషయమే. అవతలి వ్యక్తి కాదు అన్న తర్వాత మరి కాస్త ప్రయత్నించడం కూడా కొందరు చేస్తుంటారు. ‘ఇష్టం లేదు’ అన్న విషయాన్ని స్వాతి కాస్త గట్టిగా చెప్పి ఉండవచ్చు. అంత మాత్రాన చంపటం వరకు ప్రతీకార ఆలోచనలు వెళ్ళటం చాలా తీవ్రమైన విషయం. ఒక పట్టాన అర్ధం కాని విషయం కూడా.
మరో ముఖ్యాంశం ఏమిటంటే -న్యూస్ 18 వెబ్ సైట్ ప్రకారం- తన ఉద్దేశం స్వాతిని చంపటం కాదని, ఆమెను గాయపరచాలని మాత్రమే అనుకున్నానని రామ్ కుమార్ మేజిస్ట్రేట్ కు చెప్పటం. ఒక అమ్మాయిని గాయ పరచటానికి ఏకంగా కొడవలినే తీసుకుని వస్తారా?
రాం కుమార్ దోషిత్వం/నిర్దోషిత్వం విషయమై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రావలసి ఉన్నది. లాయర్ కృష్ణ మూర్తి చెప్పినట్లుగా హత్యకు రెండు రోజుల ముందు మరొకరు ఎవరు స్వాతిపై దాడి చేశారన్నది నిజమే అయితే ఆ కోణాన్ని పోలీసులు ఎందుకు వదిలి పెట్టారని మరో ప్రశ్న ఉదయిస్తోంది.
తమిళ పత్రికల ప్రకారం -సిఫీ న్యూస్ వెబ్ సైట్ తమిళ పత్రికలు రాసిన అంశాలను బ్రీఫ్ చేసి ప్రచురించింది- హత్య జరిగిన రోజున అదే ప్లాట్ ఫారంపైన స్వాతికి కొద్ది దూరంలో నిలబడి అదే ట్రైన్ కోసం చూస్తున్న ఒక యువకుడు పత్రికలకు అంతకు ముందరి దాడి విషయం చెప్పాడు. ఆ రోజు మరొక వ్యక్తి స్వాతి దగ్గరకు వచ్చి ఆ చెంపా, ఈ చెంపా మార్చి కొట్టాడని, అంత కొట్టినప్పటికీ ఆమె ఏ మాత్రం ప్రొటెస్ట్ లేకుండా గమ్మున రైలు ఎక్కి కూచుందని చెప్పాడు. అతనూ, చంపిన వ్యక్తి ఒకరు కాదని కూడా చెప్పాడు.
ఈ పరిస్ధితుల్లో ‘రాం కుమారే దోషి’ అన్న నిర్ధారణ కాస్తా ‘దోషా, నిర్దోషా?’ అన్న సంకటంగా మారిపోయింది. పోలీసులు ఇంటిని చుట్టుముట్టినపుడు కుక్కలు మొరిగాయని, దానితో రామ్ కుమార్ తండ్రి పోలీసులను చూసి అరిచాడని తమిళ పత్రికలు రాసినట్లుగా సిఫీ న్యూస్ తెలిపింది. తండ్రి అరుపుతో రామ్ కుమార్ అప్రమత్తమై వెనక నుండి పారిపోవటానికి ప్రయత్నించాడని, కానీ చుట్టూ పోలీసులు ఉండటంతో లోపలికి వెళ్లిపోయాడని, పోలీసులు తలుపులు నెట్టుకుని వెళ్ళేసరికి రామ్ కుమార్ బ్లేడు గాయంతో రక్తం కారుతూ కనిపించాడని తమిళ పత్రికలు రాసినట్లు తెలుస్తోంది. ఈ కధనం నిజమే అయితే రామ్ కుమార్ దోషిత్వంపై అనుమానాలు పెట్టుకోనవసరం లేదు.
తమిళ పత్రికల కధనం నిజమేనా? పోలీసులు చెప్పింది చెప్పినట్లు రాసాయా లేక వాస్తవాలు నిర్ధారించుకుని రాసాయా?
పోలీస్ లను నమ్మడం కష్టమే!తిమ్మిని బమ్మి చేయడంలో వారు సిద్ధహస్తులు. ఎన్నోకేసుల్లో అమాయకులను ఇరికించిన ఘనచరిత్రవారిది. రాం అంతర్ముఖుడు అంటున్నారు గనుక,సహజంగా అంతర్ముఖులు తమ ప్రేమను బహిర్గతపరచరు.
అంతేకాకుండా అంత పబ్లిక్గా చంపేటువంటు సాహసం చేయలేరు.
అతను ఉంటున్న పిజి (పేయింగ్ గెస్ట్) మాన్షన్ కు సమీపం లోనే స్వాతి వాళ్ళ ఇల్లు ఉన్నది.
పోలీసులు ఇంటిని చుట్టుముట్టినపుడు కుక్కలు మొరిగాయని, దానితో రామ్ కుమార్ తండ్రి పోలీసులను చూసి అరిచాడని తమిళ పత్రికలు రాసినట్లుగా సిఫీ న్యూస్ తెలిపింది.
పి.జి గా రాం తోపాటూ అతని తండ్రికూడా ఉంటున్నరా?
కాదు. పిజి హాస్టల్ ఉన్నది చెన్నైలో. రాం ని అరెస్ట్ చేసింది అతని సొంత ఊరు మీనాక్షీ పురం లోని సొంత ఇంట్లో.
@moola:'” సహజంగా అంతర్ముఖులు తమ ప్రేమను బహిర్గతపరచరు.
అంతేకాకుండా అంత పబ్లిక్గా చంపేటువంటు సాహసం చేయలేరు “‘ ———— అలా నిర్ధారించలేం మూలా గారు. అంతర్ముఖులే సడన్ గా షాకులు ఇస్తూ ఉంటారు. వారి ఆలోచనలే ఉన్నట్లుండి ఆశ్చర్యకరంగా మారిపోతూ ఉంటాయి.
స్వాతి కేస్ లో ముద్ధాయి(రాం కుమర్) ఆత్మహత్య చేసుకోవడం వలన కేస్ వివరాలలో నిజానిజాలు పక్కదారిపట్టించేటట్లున్నారు పోలీసులు!