యువ ఇన్ఫోసిస్ ఉద్యోగిని ఎస్ స్వాతిని చెన్నై లోని నుంగంబక్కం రైల్వే స్టేషన్ లో పట్ట పగలు క్రూరంగా నరికి చంపిన ఘటన నగరంలో ప్రజా భద్రతపై కఠినమైన వెలుగును ప్రసరింపజేసింది. అనుకున్నట్లుగానే ఈ హత్య అబధ్రతా భావాన్ని రేకెత్తించింది. ఆమెను చంపాడని భావిస్తున్న అనుమానితుదిని పట్టుకోవడంలో అత్యంత ప్రతిభావంతంగా కృషి చేసిన చెన్నై పోలీసులు, పాలనా యంత్రాంగం, పౌర సమాజంతో చర్చించి, ఉనికిలో ఉన్న తనిఖీలను సమీక్షించి మెరుగు పరచడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలి. హృదయ విదారక ఘటన, న్యాయపరంగా, పాలనాపరంగా, సామాజికంగా- మనం దృష్టి సారించవలసిన, లెక్కకు మించిన మహిళా వ్యతిరేక నేరాలను వెలుగులోకి తెచ్చింది. స్వాతిని వెంటాడిన గుర్తుల కోసం, నేరాన్ని జరగక ముందే పసిగట్టి నివారించగల గుర్తుల కోసం గుర్తించటానికి ఆమెకు ప్రియమైన వారు, పరిశోధకులు కృషి చేస్తుండగా… ఈ మరణం మనం రోజువారీగా ఎదుర్కొంటూనే ఉన్నా తేలికగా విస్మరిస్తున్న ఒక ముఖ్య అంశాన్ని -మహిళలపై జరుగుతున్న నేరాలకు ఒక నిరంతరాయత ఉండటం- వేలెత్తి చూపుతోంది. ప్రతి రోజూ సాగుతున్న వేధింపుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవటం తప్పనిసరి అవసరంగా సమాజం గానీ, శాంతి భద్రతల యంత్రాంగం గానీ గుర్తించటానికి తీవ్ర స్ధాయి హింస చోటు చేసుకోవలసి రావటం దురదృష్టకరం. స్వాతి తనను వెంటాడుతున్న వ్యక్తిపై అధికారులకు ఫిర్యాదు చేసి ఉన్నట్లయితే ఆమెకు భద్రత లభించి ఉండేదా? వెనక్కి తిరిగి చూసుకుంటున్న ఈ సమయంలో ఈ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం చెప్పలేము. పెద్దగా సంశయం లేకుండా ఒక సంగతి మాత్రం చెప్పవచ్చు. అదేమిటంటే వెంటపడటాన్ని చాలా సాధారణ విషయంగా, ఏదో కాస్త చికాకు కలిగించే అంశంగా, ఆటవిడుపుగా (అమ్మాయిలతో) జరిగే వ్యవహారంగా మాత్రమే పరిగణించటం. హింసకు తక్కువగా ఉంటే గనక, ఒక్కోసారి హింస జరిగినా కూడా అలాంటి ఘటనలను అధికారం, పెద్దరికం హోదాలకు -ఇంటి వద్ద, పాఠశాలలు మరియు కాలేజీల్లో, పని స్ధలాల్లో, స్ధానిక పోలీసు స్టేషన్ లో- ఫిర్యాదు చేసి తీరాలని మహిళలకు, ఇంకా చెప్పాలంటే అమ్మాయిలకు కూడా సమాజం గట్టిగా షరతు విధించింది లేదు.
నివారించగలిగిన చావుకు స్వాతి బలయింది. ఆమెను స్మరిస్తున్నాం సరే, అదే సమయంలో వెంటపడి వేధించటాన్ని సమాజాన్ని క్షయింపజేసే, హింసకు దారి తీయగల చర్యగా ప్రజలు గుర్తించేలా చేయాలి. డిసెంబర్ 2012 నాటి డిల్లీ సామూహిక అత్యాచారం అనంతరం మహిళలపై నేరాల పట్ల వహిస్తున్న ‘చల్తా హై’ వైఖరి నుండి దేశాన్ని బైటికి గిరాటు వేయటంతో పార్లమెంటు క్రిమినల్ లా (అమెండ్మెంట్) యాక్ట్, 2013 కు ఆమోద ముద్ర వేసింది. సదరు చట్టం లోని అంశాలు మహిళలపై నేరాలను గుర్తించే ప్రక్రియలకు పదును పెట్టడానికీ, అధికారుల వద్ద తమ ఫిర్యాదులను నమోదు చేయటాన్ని మరింత సులభతరం చేసేందుకు, న్యాయం పొందేందుకు జరిగే ఈ ప్రక్రియలో వారి గుర్తింపుకు భద్రత సమకూర్చటానికీ ఉద్దేశించబడ్డాయి. చట్టం పేర్కొన్న నేరాలలో (ఆడ పిల్లలను, స్త్రీలను) వెంటాడం కూడా ఒకటి. ఆ నేరం మొదటి సారి జరిగితే జరిమానాకు గానీ లేదా మూడేళ్ళ పాటు జైలు శిక్షకు గానీ దారి తీయవచ్చు; ఆ తర్వాత కూడా అదే నేరం మళ్ళీ జరిగితే 5 సం.ల పాటు జైలు శిక్షను చట్టంలో నిర్దేశించారు. ఒక మహిళను అనుసరించటం, అనుసరించి ఆమెను తాకటం (contact) లేదా తాకేందుకు ప్రయత్నించటం, ఆమె తన అనాసక్తిని స్పష్టంగా చెప్పినప్పటికీ వ్యక్తిగత సంభాషణ కోసం పదే పదే ప్రయత్నించటం, ఆమె ఇంటర్నెట్, ఈ మెయిల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ రూపం లోని వినియోగంపై కన్ను వేయటం… ఇవన్నీ చట్టం ప్రకారం నేరం. కానీ ఒక మహిళ ‘కాదు/లేదు’ అని చెప్పగలిగేంతగా సాధికారత సాధించాలంటే మరింత శక్తివంతమైన అవగాహన అవసరం.
*********
ఆ చివరి వాక్యంలోని ‘శక్తివంతమైన అవగాహన’ ఎవరికి అవసరం అన్న అంశాన్ని సూచించటంలో స్పష్టత/ఖచ్చితత్వం వ్యక్తం కాలేదు. అవగాహన స్త్రీలకు ఉండాలా లేక సమాజానికి ఉండాలా? స్త్రీలకు కూడా ఉండాలి అనే పనైతే మళ్ళీ బాధ్యతను ఏదో ఒక విధంగా, ఎంతో కొంత స్త్రీల మీదికి నెట్టినట్లే అవుతుంది. కాబట్టి ‘శక్తివంతమైన అవగాహన’ పురుషాధిక్య సమాజానికి అవసరం అని స్పష్టం చేసి ఉండాల్సింది. ఒకటికి పదిసార్లు ముందుకు, వెనక్కి తిప్పి తిప్పి సమీక్షించి ప్రచురించే సంపాదకీయంలో ఇలాంటి అస్పష్టత దొర్లడం ఎలా సాధ్యపడింది?