దచైస: సాయుధ ఘర్షణకు సిద్ధంగా ఉండాలి -చైనా పత్రిక లు


Permanent Court of Arbitration -The Hague

Permanent Court of Arbitration -The Hague

అవసరం ఐతే దక్షిణ చైనా సముద్రం విషయంలో సాయుధ ఘర్షణకు సిద్ధంగా ఉండాలని చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక గ్లోబల్ టైమ్స్ పిలుపు ఇచ్చింది. చైనా జాతీయ ప్రయోజనాలను నిక్కచ్చిగా ప్రతిబింబిస్తుందని, కఠినంగా వెల్లడిస్తుందని పేరున్న గ్లోబల్ టైమ్స్ తాజాగా ఇచ్చిన పిలుపుతో పశ్చిమ పత్రికలు, పరిశీలకులు అప్రమత్తం అయ్యారు.

మరి కొద్ది రోజుల్లో -బహుశా జులై 12 తేదీన- హేగ్ లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టు దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో ఫిలిప్పీన్స్ ఇచ్చిన ఫిర్యాదు పై తీర్పు ప్రకటించనున్నది. ఈ తీర్పు చైనాకు వ్యతిరేకంగా వెలువడనున్నదని పశ్చిమ పత్రికలు తీర్పుకు ముందే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ టైమ్స్ పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది.

అమెరికా జోక్యం వలన దచైస సమస్య తీవ్ర రూపం దాల్చిందని చైనా, సరిగ్గానే, భావిస్తోంది. హేగ్ (నెదర్లాండ్స్/హాలండ్) కోర్టు, తీర్పు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ సమస్య మరింత ఉధృతం అయిందని పత్రిక పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అవసరమైతే మిలటరీ ఘర్షణకు కూడా చైనా తనను తాను సిద్ధం చేసుకోవాలని పత్రిక సూచించింది.

ఆంగ్లం, చైనీస్.. రెండు భాషల్లో వెలువడే గ్లోబల్ టైమ్స్, ఆ రెండు భాషల్లోనూ తన సందేశాన్ని ప్రచురించింది. పత్రిక చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక కాకపోయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ అధికారిక పత్రిక అయినందున దాని అభిప్రాయాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుకు కారణం అవుతాయి. అంతర్జాతీయ స్ధాయి స్పందనను ప్రేరేపిస్తాయి.

ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పుకు ముందే ఫిలిప్పీన్స్ తో దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసిన చైనా దక్షిణ చైనా సముద్రంలో సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు చర్చలు జరుపుదామని ఆ దేశాన్ని ఆహ్వానించింది. చర్చలకు తాము కూడా సుముఖమేనని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కూడా ప్రకటించటం విశేషం. చర్చలకు ఇరు దేశాల ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేయటంతో అమెరికా ప్రేరేపిస్తున్న ఘర్షణ వాతావరణం నుండి తుస్సుమని గాలి తీసినట్లుగా అయింది.

PAC emblem

PAC emblem

చర్చలకు ఫిలిప్పీన్స్ సిద్ధం కావటం బట్టి ఆ దేశం చైనా నుండి ఎంత తీవ్ర ఒత్తిడిలో ఉన్నదో స్పష్టం అవుతున్నదని రాయిటర్స్ లాంటి పత్రికలు విశ్లేషిస్తున్నాయి. చైనా, ఫిలిప్పీన్స్ ల మధ్య సమస్యలు సానుకూలంగా పరిష్కారం కావటం కంటే ఘర్షణ మరింత రేగటమే తమకు కావాలని పశ్చిమ దేశాలు ఆశిస్తున్నాయని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది.

“దక్షిణ చైనా సముద్రంలో అమెరికా రెండు కేరియర్ యుద్ధ గ్రూపులను మోహరించింది. తన ఆయుధ బలగాలను, బలాన్ని చూపడం ద్వారా అమెరికా ఒక సంకేతం ఇవ్వ దలుస్తోంది: ఈ ప్రాంతంలో అతి పెద్ద శక్తివంతమైన దేశంగా తాము చైనా విధేయత కోసం ఎదురు చూస్తున్నాము, అని” అని గ్లోబల్ టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది.

“స్వల్ప కాలికంగా అమెరికా మిలట్రీ బలగానికి చైనా సరితూగలేనప్పటికీ, దక్షిణ చైనా సముద్రం వివాదంలో బలవంతంగా జోక్యం చేసుకున్నట్లయితే, తాను భరించలేనంత మూల్యాన్ని చెల్లించుకునే విధంగా అమెరికాకు చైనా సమాధానం ఇవ్వగలగాలి. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని చైనా నమ్ముతుంది. కానీ ఎలాంటి మిలట్రీ ఘర్షణకైనా అది సిద్ధంగా ఉండాలి. అంతర్జాతీయ సంబంధాలలో ఇది సాధారణ అవగాన” అని గ్లోబల్ టైమ్స్ తెలిపింది.

చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారిక పత్రిక పీపుల్స్ డెయిలీ కాగా, పీపుల్స్ డెయిలీ ఆధ్వర్యంలో గ్లోబల్ టైమ్స్ పత్రిక ప్రచురితం అవుతుంది. పార్టీ అభిప్రాయాలను పీపుల్స్ డెయిలీ సున్నితంగా అందిస్తే, గ్లోబల్ టైమ్స్ కఠినంగా అందిస్తుందని పరిశీలకులు తరచుగా చెబుతుంటారు. పీపుల్స్ డెయిలీ చూపే మర్యాదకర అభిప్రాయాల వెనుక అర్ధాన్ని గ్లోబల్ టైమ్స్ తెలియజేస్తుందని వారి అభిప్రాయం. ఆ విధంగా చైనీయ జాతీయ భావాలను గ్లోబల్ టైమ్స్ తీవ్ర స్ధాయిలో వ్యక్తం చేస్తుంది.

ఈ రోజు (జులై 5) నుండి చైనా దక్షిణ చైనా సముద్రంలో మిలట్రీ విన్యాసాలు నిర్వహిస్తోంది. మిలట్రీ విన్యాసాలు రొటీన్ అని చైనా చెబుతున్నప్పటికీ హేగ్ కోర్టు తీర్పు నేపధ్యంలో విన్యాసాలకు చైనా పధక రచన చేసుకుందన్నది ‘గోడ మీద రాత’గా చూడవచ్చు. ప్రపంచ వ్యాపితంగా తనకు సవాలు ఎదురైన చోటల్లా మిలట్రీ విన్యాసాలకు దిగే అమెరికా తన విన్యాసాలను ఎప్పుడూ ‘రొటీన్’ గా చెప్పటం రివాజు. చైనా అదే పద్ధతిని అనుసరిస్తోంది.

మరోవైపు పిటిషన్ వేసిన ఫిలిప్పీన్స్ స్వరం తగ్గించడం పశ్చిమ దేశాలకు, పత్రికలకు చికాకు కలిగిస్తోంది. అమెరికా లాగానే ఫిలిప్పీన్స్ కూడా చైనాకు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు విసురుతూ, ఉద్రిక్తతలు ప్రేరేపిస్తూ, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాలని పశ్చిమ వ్యూహకర్తల కోరిక. వారి కోరికకు విరుద్ధంగా ఫిలిప్పీన్స్ ప్రకటనలు జారీ చేస్తున్నది.

China 9 dash line maritime claim

China 9 dash line maritime claim

“వాస్తవం ఏమిటంటే ఘర్షణ కావాలని ఎవరూ కోరుకోవటం లేదు. మా వివాదాన్ని హింసాత్మకంగా పరిష్కరించాలని ఎవరూ కోరుకోవటం లేదు. యుద్ధాన్ని ఎవరూ కోరుకోవటం లేదు” అని ఫిలిప్పీన్స్ విదేశీ మంత్రి పెర్ఫెక్టో యసయ్ మంగళవారం (ఈ రోజు) తెలిపాడు.

“ప్రతి ఒక్కరితోనూ చైనాతో సహా, అమెరికాతో సహా, జపాన్ తో సహా, అందరితోనూ బలమైన, మెరుగైన సంబంధాలు నిర్వహించాలని (మా) అధ్యక్షుడు వాంచిస్తున్నారని నా అవగాహన” అని యసయ్ ప్రకటించాడు. దచైస వివాదం పరిష్కారం కోసం ప్రత్యేక దౌత్య అధికారి (స్పెషల్ ఎన్వాయ్) కావాలని ఆయన కొరటం విశేషం. స్పెషల్ ఎన్వాయ్ లను ఐరాస నియమిస్తుంది. స్పెషల్ ఎన్వాయ్ కావాలని కొరటం అంటే ఐరాస జోక్యాన్ని కొరడమే. ఇది మళ్ళీ చైనా కోరుతున్న ద్వైపాక్షిక పరిష్కారానికి విరుద్ధం.

చైనా మునుముందు ఎటువంటి వైఖరి తీసుకుంటుంది అన్నది పూర్తిగా ఫిలిప్పీన్స్ పైనే ఆధారపడి ఉన్నదని చైనా డెయిలీ పత్రిక వ్యాఖ్యానించింది. “అన్ని పక్షాలు ఆర్బిట్రేషన్ నిర్ణయాన్ని పక్కన పెట్టినట్లయితే ఎలాంటి సంఘటనా జరిగే అవకాశం లేదు. ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టటంలో చైనా ఎన్నడూ నాయకత్వ పాత్ర తీసుకోలేదు” అని చైనా ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ చైనా డెయిలీ తెలిపింది.

ఆర్బిట్రేషన్ కోర్టు నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ రగడ సృష్టిస్తే దక్షిణ చైనా సముద్రంలో ఏదో ఒక సంఘటన (ఘర్షణ) చోటు చేసుకునే అవకాశం ఉన్నదని ఈ వ్యాఖ్య ద్వారా చైనా స్పష్టం చేస్తోంది. మరో వారం రోజులకు వెలువడే ఆర్బిట్రేషన్ కోర్టు నిర్ణయం దరిమిలా దక్షిణ చైనా సముద్రంలో, ఇప్పటికే చైనా మిలట్రీ విన్యాసాలు ప్రారంభం అయిన రీత్యా, గ్లోబల్ టైమ్స్ హెచ్చరిక సైతం వెలువడిన రీత్యా, ఘర్షణ నెలకొనే అవకాశం కనిపిస్తోంది.

7 thoughts on “దచైస: సాయుధ ఘర్షణకు సిద్ధంగా ఉండాలి -చైనా పత్రిక లు

  1. ఈ విషయంలో మీరు రాస్తున్నవి చూస్తూ ఉంటే మూడవ ప్రపంచ యుధ్ధమ్ వస్తుందని సూచనగా ముందే చెపుతున్నారా మీరు అనిపిస్తోంది.

  2. “పార్టీ అభిప్రాయాలను పీపుల్స్ డెయిలీ సున్నితంగా అందిస్తే, పీపుల్స్ డెయిలీ కఠినంగా అందిస్తుందని పరిశీలకులు తరచుగా చెబుతుంటారు.” – chinna achchu tappu vachchinattundi ikkada..

  3. మంజరి గారు మీకు అలా అనిపించటంలో తప్పు లేదు. నిజానికి అమెరికా, రష్యా, చైనా లు ఇప్పటికే ఆ ఏర్పాట్లలో ఉన్నాయి. దానర్ధం ‘యుద్ధం ఖచ్చితంగా వస్తుంది’ అని చెప్పటం కాదు. ఖచ్చితమో, అనుమానమో అన్నదానితో సంబంధం లేకుండా ఈ దేశాలు ‘తగిన స్పందన’ ఇవ్వటానికి సిద్ధం అవుతున్నాయి.

    ముఖ్యంగా అమెరికా యుద్ధం ఇక రేపో మాపో అన్నట్లుగా నౌకలను, విమానాలను, ట్యాంకులను తూర్పు యూరప్ కూ, చైనా పక్కకు, రష్యా సరిహద్దులకు తరలిస్తోంది. మరోవైపు అమెరికా, ఐరోపాల ఆర్ధిక సంక్షోభం తీవ్రం అవుతోంది.

    ఆర్ధిక సంక్షోభాలే రెండు యుద్ధాలకు దారి తీసిన నేపధ్యంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్ధితులు మూడో యుద్ధానికి దారి తీసే అవకాశాలు లేకపోలేదు.

    అదంతా అమెరికా నిర్ణయంపై ఆధారపడి ఉన్నది. రాబోయే ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ అధ్యక్షురాలు అయితే గనక యుద్ధ పరిస్ధితులు తీవ్రం అవుతాయి. ట్రంప్ గెలిస్తే గనక రష్యా-అమెరికాల మధ్య వేడి కాస్త చల్లబడవచ్చు.

  4. అమెరికా చైనాకి చాలా డబ్బు ఇవ్వాలా? అది ఇచ్చే పరిస్తితి అమెరికాకు లేదా? మరి చైనా ఆ డబ్బు గురించి ఏమీ వత్తిడి తెస్తున్నట్లుగా లేదు కదా. ఇంక మిగిలింది మార్కెట్ల కోసం పోటీ పడటం. అలాంటి దేమన్న ఉందంటారా. అలా అయితే అమెరికా చేసే ఉత్పత్తులు ఏమిటీ? వేటిలో వాటికి పోటీ?లేదా ఇంక దేశాల మీద ఆధిపత్యం కోసమే అలా చేస్తున్నాదనుకోవాలా అమెరికా? నేను సరిగా అడగలేకపోతే ఏమి అనుకోవద్దు.

  5. చైనాకు అమెరికా భారీ మొత్తంలో అప్పు పడిన మాట నిజమే. జపాన్ కు కూడా అమెరికా అప్పు పడింది. కానీ ప్రస్తుతం ఘర్షణలకు కారణం అది కాదు.

    చైనా ఆర్ధికంగా అభివృద్ధి చెందుతోంది. దాని ఉత్పాదక శక్తి పెరుగుతోంది. కనుక ఆ దేశానికి కొత్త మార్కెట్లు కావాలి. కానీ మార్కెట్లు ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాల మధ్య విభజించబడి ఉన్నది. కాబట్టి చైనాకు కావలసిన మార్కెట్లు అమెరికా, ఐరోపాల నుండే రావాలి. తమ మార్కెట్లను చైనా లాక్కోకుండా ఉండేందుకు అమెరికా ముందుగానే చైనాను నిలువరించే ప్రయత్నం చేస్తోంది. అలాగే రష్యా కూడా.

    ప్రస్తుతం ప్రధాన పోటీ ఫైనాన్స్ రంగమే. ఫైనాన్స్ వనరులు దండిగా ఉంటే సరుకుల ఉత్పత్తిని నియంత్రించటం తేలిక అవుతుంది. ప్రస్తుతం అవసరాల్లో ఉన్న దేశాలకు చైనా ఇస్తున్నంతగా అప్పులు అమెరికా ఇవ్వలేకపోతోంది. దానితో మూడో ప్రపంచ దేశాలు సహాయం కోసం చైనాను ఆశ్రయిస్తున్నాయి. సహాయం అంటారు గాని ఆ పేరుతో ఆ దేశం లోని మార్కెట్ ను, కాంట్రాక్టులను సహాయం చేసే దేశం ఆక్రమిస్తుంది.

    మార్కెట్ పోటీ లో నెగ్గాలంటే ఆధిపత్యం కావాలి. ఆధిపత్యం ప్రధానంగా ఆయుధ బలగం నుండి వస్తుంది. అయితే ఎంత ఆయుధ బలగం ఉన్నా దాన్ని కాంప్లిమెంట్ చేసే ఆర్ధిక శక్తి లేకపోతే ఆయుధ శక్తి పెద్దగా పని చేయదు. ఎందుకంటే ఆయుధ శక్తి నిర్వహణకు మళ్ళీ ఆర్ధిక శక్తి కావాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s