చెన్నై: స్వాతి హంతకుడు దొరికాడు


వారం రోజులుగా చెన్నై పోలీసులకు ‘కొరకరాని కొయ్య’గా మారిన చెన్నై టెకీ స్వాతి హత్య మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. తాను పని చేసే ఇన్ఫోసిస్ కంపెనీకి వెళ్ళేందుకు నుంగంబక్కం రైల్వే స్టేషన్ లో ఎదురు చూస్తున్న స్వాతిని కొడవలితో నరికి చంపిన హంతకుడి ఆచూకీని ప్రజల సాయంతో పోలీసులు పట్టుకోగలిగారు.

తమిళనాడులో వరుసగా జరుగుతున్న హత్యల నేపధ్యంలో పోలీసుల పైనా, ప్రభుత్వం పైనా తీవ్ర విమర్శలు వచ్చిన నేపధ్యంలో చెన్నై పోలీసులు భారీ ఎత్తున బలగాలను కేంద్రీకరించి పని చేసినప్పటికీ హంతకుడు ఎవరో తెలుసుకో లేకపోయారు. హత్యకు కారణం ఏమిటో కూడా వారికి అంతుబట్ట లేదు.

స్టేషన్ లో సి‌సి‌టి‌వి కెమెరాలు లేకపోవటంతో వీధుల్లో ప్రైవేటు సి‌సి‌టి‌వి కెమెరాల రికార్డింగు లను జల్లెడ పట్టవలసి వచ్చింది. అలా చేసినా కూడా హంతకుడిని దూరం నుండి రికార్డు చేయటమే తప్ప అతని ముఖాన్ని కెమెరాలు స్పష్టంగా పట్టుకోలేకపోయాయి. పోలీసులపై వివిధ రూపాల్లో అన్ని వైపుల నుండి తీవ్ర వత్తిడి వచ్చింది. దానితో కేసు పోలీసులకు సవాలుగా మారింది.

పత్రికలు, ఛానెళ్లు క్రమం తప్పకుండా వార్తలు ప్రచురించాయి. హంతకుడిగా భావిస్తున్న వ్యక్తి హత్యానంతరం రోడ్డుపై నడిచి వెళ్తున్న దృశ్యాలను ఛానెళ్లు ప్రసారం చేశాయి. పోలీసులు ఊహా చిత్రాలను గీయించి ప్రచారం చేశారు. ఇన్ఫోసిస్ వద్దా, హంతకుడు కనిపించిన ఏరియాల లోనూ ఇంటింటికి తిరుగుతూ పోలీసులు తనిఖీలు చేశారు. సమాచారం కోసం విజ్ఞప్తులు చేశారు.

కొన్ని కీలక ప్రాంతాల లోని టవర్ల గుండా వెళ్ళిన ఫోన్ కాల్స్ ను, నెంబర్లను సెల్యులార్ కంపెనీల నుండి సేకరించి జల్లెడ పట్టారు. అనుమానిత కాల్ నెంబర్లను 100 వరకు షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. క్లూల కోసం స్వాతి తల్లి దండ్రులను వివిధ కోణాల్లో విచారించారు. స్నేహితులను ఆరా తీశారు. సహ ఉద్యోగులను ప్రశ్నించారు. చివరికి చొలైమేడులో హంతకుడు నివశిస్తున్న అద్దె ఇల్లు వాచ్ మెన్ ఇచ్చిన సమాచారంతో హంతకుడి ఆచూకిని పోలీసులు కనుగొన్నారు.

తిరునల్వేలి సమీపం లోని మీనాక్షీపురంలో అతని ఇంటిని పోలీసులు ఈ రోజు చుట్టుముట్టారు. పోలీసుల రాకను గమనించిన వ్యక్తి పదునైన ఆయుధంతో మెడను కోసుకున్నాడు. పోలీసుల అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గాయం ప్రాణాంతకం కాదని డాక్టర్లు చెప్పటంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మెడ గాయం వల్ల మాట్లాడలేకపోవటంతో అతను కోలుకోవటం కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. అప్పటివరకూ హత్యకు కారణం ఏమిటో వెల్లడి అయే అవకాశం లేదు.

హంతకుడి పేరు రామ్ కుమార్ అని, ఇంజనీరింగ్ పట్టబధ్రుడు అనీ, వయసు 22 సం.లు అనీ పోలీసులు తెలిపారు. తాను ఒక్కడే హత్యలో పాల్గొన్నాడని ఇతరుల పాత్ర లేదని పోలీసులు చెప్పారు. మరొకరి సహకారంతో గానీ లేదా మరొకరి ఆదేశాలతో గానీ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బహుశా స్వాతి పట్ల ఆకర్షణతో ఒక చివరికి వెళ్ళిపోయి ప్రాణం తీసి ఉండవచ్చన్న పత్రికల సూచనలను పోలీసులు నిర్ధారించలేదు.

24 సం.ల స్వాతి ఇన్వోసిస్ ఉద్యోగిని. 3 నెలల క్రితం చెన్నై వచ్చిన రామ్ కుమార్ స్వాతిని క్రమం తప్పకుండా ఫాలో అవుతుండేవాడు. అతను ఫాలో అవుతున్న విషయం గమనించినప్పటికీ స్వాతి పట్టించుకోలేదు. వారి మధ్య పరిచయం జరిగిందా లేదా అన్నది ఇంకా తెలియలేదు. జూన్ 24 తేదీన నుంగంబక్కం రైల్వే స్టేషన్ లో విధులకు వెళ్లడానికి రైలు కోసం చూస్తుండగా హంతకుడు ఆమెను సమీపించి బ్యాక్ ప్యాక్ నుండి కొడవలి తీసి నరికాడు. ఆమె వెంటనే చనిపోయింది.

మూడు నెలల క్రితం చెన్నై వచ్చిన రామ్ కుమార్ సౌరాష్ట్ర నగర్ లోని ఏ ఎస్ మాన్షన్ పేరుతో ఉన్న ఇంటిలో ఒక గదిలో అద్దెకు దిగాడు. మరో 50 సం.ల వయసు గల పెద్దాయన అతనితో కలిసి అదే గదిలో అద్దెకు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఇంటికి సమీపంలో నివశిస్తున్న వ్యక్తి అతని నివాసం సమాచారాన్ని పోలీసులకు అందించాడు. దానితో పోలీసులు అక్కడికి వచ్చి మాన్షన్ ప్రవేశం వద్ద అమర్చిన సి‌సి‌టి‌వి కెమెరాలో అతని పూర్తి రూపాన్ని గుర్తించగలిగారు. ఆ విధంగా మిస్టరీ వీడింది.

పోలీసులు సరిగ్గా దృష్టి పెడితే నేరస్ధులను పట్టుకోవటం అంత కష్టం కాదని స్వాతి హత్య కేసు నిరూపిస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s