[“A fillip to growth, and maybe inflation” శీర్షికన ఈ రోజు ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం.]
*********
7వ వేతన కమిషన్ సిఫారసులను అమలు చేయడం ద్వారా కోటికి పైగా ఉద్యోగులు, పింఛనుదారుల వేతనాలు మరియు పింఛన్లు పెంచాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం వినియోగ డిమాండ్, ఆర్థిక వృద్ధి లకు ఆదరువు కాగలదు. బలిష్టమైన ప్రైవేటు వినియోగమే ప్రస్తుత ఆర్థిక కదలికకు కీలకమైన శక్తిగా పని చేస్తున్నదని ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్‌బిఐ కూడా వెలువరించిన గణాంకాలు స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బంది మరియు పింఛనుదారుల చేతుల్లో చేరగల అదనపు డబ్బు, వివిధ రకాల సరుకులు సేవలకు ఆరోగ్యకరమైన డిమాండ్ పెరగడానికి దోహదం చేస్తుంది. అనుకున్న విధంగానే సిబ్బంది వేతనాల పెంపుదలను పారిశ్రామిక గ్రూపులు, ఆటోమొబైల్ తయారీదారుల నుండి వినియోగ సరుకుల అమ్మకం దారుల వరకు, ఆహ్వానించాయి. వేతనాలు, అలవెన్సులు మరియు పింఛన్ల పెంపుదల నిమిత్తం మార్చి 2017తో ముగిసే కోశాగార సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేయనున్న చెల్లింపులు 1.14 లక్షల కోట్లకు మించుతుందని అంచనా వేస్తున్నందున తదనంతరం ఏర్పడగల బహుళ హెచ్చింపు ఫలితాలు గణనీయ మొత్తంలో ఉంటాయి. కేంద్రం పెంపుదల ప్రభావం రాష్ట్ర ప్రభుత్వాల వేతనాలతో పాటు, ప్రైవేటు రంగం పైన కూడా ఊర్ధ్వ దిశలో పడటం అనివార్యం. అంతేకాకుండా గృహ నిర్మాణం నిమిత్తం అడ్వాన్సు చెల్లింపుల గరిష్ట పరిమితిని మూడు రెట్లు -7.5 లక్షల నుంచి 25 లక్షలకు- పెంచుతూ చేసిన నిర్ణయం, మరింత మంది ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ ఉద్యోగులు గృహ నిర్మాణ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తద్వారా ఉపాధి పెరిగేందుకు దోహదం చేసే అవసరమైన ప్రోత్సాహకం. సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని, బ్రెగ్జిట్ దరిమిలా ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని ఇప్పటి వరకు అందిన సూచనలు తెలియజేస్తున్నందున ఆర్థిక వ్యవస్థకు శకునాలు సానుకూలంగానే ఉన్నాయి. పైగా వ్యయంలో ఉంటుందని భావిస్తున్న పెరుగుదల, అధిక వేతనాలు మరియు పింఛన్లు పొదుపు వృద్ధికి కూడా తోడ్పడతాయి. దరిమిలా ఈ నిధులను బ్యాంకులు మరియు ద్రవ్య వ్యవస్థ మార్గాల ద్వారా పెట్టుబడుల డిమాండ్ ను తీర్చడానికి ప్రోద్బలం అవుతుంది.
అయితే, పెరిగిన వేతనాలు, పెన్షన్ల వలన కొన్ని ప్రమాదాలు లేకపోలేదు. జూన్ విత్త విధానం నివేదికలో ద్రవ్యోల్బణంకు ఊర్ధ్వ దిశలో ప్రభావితం చేయగల అనేక ప్రమాదాంశాలను ఆర్‌బిఐ పేర్కొన్నది. 7వ వేతన కమిషన్ సిఫారసులు కూడా ఆర్‌బిఐ పేర్కొన్న అంశాలలో ఒకటి. సిఫారసుల మేరకు అలవెన్సులు కూడా పెంచే అంశాన్ని ప్రభుత్వం నిలిపి ఉంచింది కాబట్టి, మరో వైపు వేతన కమిటీ నిర్దేశాలను ఆమోదించడం వల్ల కలిగే ప్రభావాలను ఫైనాన్స్ సెక్రటరీ నేతృత్వం లోని కమిటీ పరిశీలిస్తున్నందునా ధరల ఒత్తిడి దిశలో కాస్త ఉపశమనం లభించినట్లే. అధిక ఇంటి అద్దె భత్యం వల్ల, ఇప్పటికే 21 నెలల గరిష్ట స్థాయిలో ఉన్న చిల్లర ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం తక్షణమే ప్రభావితం అయి ఉండేది. ఇతరత్రా ఆందోళన ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితికి, ముఖ్యంగా కోశాగార స్థిరీకరణకు సంబంధించినది. బడ్జెట్ లోటు (ఫిస్కల్ డెఫిసిట్) ను ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం లక్ష్యం అయిన 3.5 శాతం లోపల పరిమితం చేయగలమని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ విశ్వాసంతో ఉన్నారు. కానీ ఇది ఎలా సాధ్యమూ ఇంకా స్పష్టం కాలేదు.
*********
ప్రస్తుతం భారత దేశ జిడిపి దాదాపు 2 ట్రిలియన్ డాలర్లు. అనగా 132 లక్షల కోట్ల రూపాయలు. 2016-17 లో మన జిడిపి రు. 150.65 లక్షల కోట్లు ఉంటుందని బడ్జెట్ లో అంచనా వేశారు. అలాగే 2016-17కు గాను భారత దేశ బడ్జెట్ రు. 19.78 లక్షల కోట్లు.
ఇంత భారీ బడ్జెట్, జిడిపి లపైన 1.1 లక్షల కోట్ల వేతన పెంపుదల ప్రభావం చూపిస్తుందని సంపాదకీయం చెబుతోంది. ప్రభావం చూపే మాట నిజమే గాని సంపాదకీయం ఆశిస్తున్నంత/సూచిస్తున్నంత ప్రభావం ఉంటుందా అన్నది అనుమానమే.
ఎందుకంటే చెల్లింపులలో మొత్తం భాగం జిడిపి ప్రభావంలోకి పూర్తిగా లెక్కకు రావటం దాదాపు అసాధ్యం కనుక. బ్యాంకుల్లో పొదుపు చేసుకున్నది మొత్తం ప్రభుత్వ పెట్టుబడుల కిందికి మారిపోవటం జరగదు. భారత బ్యాంకుల నిల్వలను అక్రమ కార్యకలాపాల నిమిత్తం రుణాల రూపంలో ధనిక, పారిశ్రామిక వర్గాలు కాజేస్తున్న విషయాన్ని విజయ్ మాల్యా ఉదంతం నిరూపిస్తోంది. మల్యాల ద్వారా రుణాల పంపిణీ రూపంలో విదేశీ ఖాతాల్లోకి, విదేశీ పెట్టుబడుల లోకీ తరలిపోతున్న ప్రజల పొదుపు సంపాదకీయం ఆశిస్తున్నట్లు పెట్టుబడులుగా కంటే అక్రమ రుణాలుగా మారుతోంది. అలాంటి పొదుపు వల్ల జిడిపి పెరగటం ఎలా సాధ్యం అన్నది ప్రశ్న!
ప్రజల ఆదాయాలు, తద్వారా వారి కొనుగోలు శక్తి పెరిగితే జిడిపి పైన మంచి ప్రభావం పడుతుందని సంపాదకీయం నిరూపిస్తోంది. కేవలం 10 లక్షల మంది ఉద్యోగుల కొనుగోలు శక్తి పెరిగితేనే జిడిపి పైన సంపాదకీయాలు రాసేంతగా ప్రభావం కలిగితే 4 కోట్ల నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వారి కొనుగోలు శక్తి కూడా పెంచితే ఇంకెంత ప్రభావం జిడిపి పైన పడాలి?! బహుశా అమెరికా జిడిపిని దాటి పోవటం చిటికెలో పని కావచ్చు.
వేలు, లక్షలు సంపాదిస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచడం వ్యతిరేకించవలసిన విషయం కాదు. కానీ అసలు ఏ సంపాదనా నికరంగా లేని కోట్లాది నిరుద్యోగులకు కనీస ఉపాధి కల్పించడం పైనా, శ్రామికుల వేతనాల పెంపుదల పైనా కూడా అదే శ్రద్ధను ప్రభుత్వాలు ఎందుకు చూపవు?
వేతనాల పెంపుదలలలో పరిగణలోకి తీసుకొనే అంశాలనుగూర్చి వివరంగా తెలియజేయగలరా?
దైనందిన వస్తువుల ధరలు బాగా అందుబాటులో ఉండి,(శ్రీశ్రీ వెళ్ళి చూసి చెప్పినట్లు అప్పటి చైనాలో గుడ్డు ధర పాతికేళ్ళుగా ఒకటే) క్రింది, మధ్య తరగతి ఆదాయాలు పెరిగితే గాని, పై వర్గాల వాళ్ళు దోచుకోవాలనుకున్నా దోచుకోలేరు. ఇంత చిన్న విషయం సూత్రధారులకు అర్ధం కాకపోతే ఎలా?
80 శాతం మందికి వచ్చిన ఆదాయం ఇంటి అద్దెకూ పొట్టకూ సరిపోతోంది. ఇంక జిడిపి కు ఫ్యుయలింగ్ ఎక్కడి నుంచి తెస్తారు అక్కడికీ పాపం ‘తేలిక’ ఇ ఎమ్ ఐ ల ద్వారా ఫోన్ల నుండి ఫ్లాట్ల వరకూ భవిష్యత్ ధనాన్ని ఇపుడే ఫ్యుయలింగ్ చేస్తున్నారు.
రాష్ట్రాల్లోను,కేంద్రం లోను ఏలుచున్న వారు ప్రజల నుండి ఇంకా ఏమి ఆశిస్తున్నారు?
దయచేసి నల్లడబ్బు అంతా ఒకేసారి కాకుండా (అంతా ఒకేసారి తెచ్చేస్తే – పొరుబాటున— – ఉత్తినే —– ఊహేలెండి.— ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పెరిగి రచ్చ రభసలయిపోతాయి.) కొంచెం కొంచెంగా తెచ్చి ఇన్‍ఫ్రాలో పెట్టండి.నిత్యావసరాలు అదుపులో పెట్టండి. క్రింది, మధ్య తరగతి ఆదాయాలు కొంచెం పెంచండి.
మళ్ళీ దోచుకోవచ్చు.
పనికిమాలివీ, అక్కరలేనివీ కొనకుండా క్రింది వాళ్ళు, మధ్య వాళ్ళు ఉండలేరు.
అవి తయారుచేసి అమ్మకుండా పై వాళ్ళూ ఉండలేరు
క్రింది వాళ్ళు, మధ్య వాళ్ళు, పై వాళ్ళు అందరూ పిచ్చ హాపీస్.