స్వామి జీనీని వదిలారు, అనుభవిస్తున్నారు! -కార్టూన్


Swamy & Modi

ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ నేతలపై, ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై దాడి చేయడమే పనిగా పెట్టుకున్న సుబ్రమణ్య స్వామి ఇటీవల చూపు తిప్పారు. పైకి ఆర్ధిక శాఖ నియమిత అధికారులను లక్ష్యం చేస్తూ లోపల ఆర్ధిక మంత్రి జైట్లీని సాధిస్తున్నారు.

సుబ్రమణ్య స్వామి ఓ శుభ దినాన ఆర్‌బి‌ఐ గవర్నర్ రఘురాం రాజన్ ను లక్ష్యంగా చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా దూషణలు రువ్వటం ప్రారంభించినపుడు ఆయన లక్ష్యం ఎవరో త్వరగా అర్ధం కాలేదు. తన దూషణల్లో దేశభక్తి, విదేశీయత, పౌరసత్వం రసాలను కూడా రంగరించడంతో అసలు విషయం ఏమిటో బొత్తిగా అందకుండా పోయింది.

మళ్ళీ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పూనుకుని తనదైన ట్వీట్ వదిలితే గాని స్వామి లక్ష్యం ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అనీ, జైట్లీని సాధించటానికి వరస పెట్టి ఆర్ధిక శాఖ అధికారుల దేశభక్తిని శంకిస్తూ తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని తెలియలేదు. 

మరి కొందరు ఇంకా ముందుకు వెళ్ళి, అసలు ఆర్ధిక శాఖనే స్వామి లక్ష్యం చేసుకున్నారని తక్షణమే జైట్లీని దించి తనను ఆయన స్ధానంలో కూర్చోబెట్టాలని డిమాండ్ చేస్తున్నారని, ఆ లక్ష్యంతో ఆర్‌బి‌ఐ గవర్నర్, కేంద్ర ఆర్ధిక సలహాదారులను అడ్డం పెట్టుకున్నారని చెబుతున్నారు.

ఏ మాటల వెనుక ఏ గూఢార్ధం దాగి ఉన్నదో తెలియదు గాని స్వామికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి బి‌జే‌పి కొరివితో తల గోక్కున్నదని మాత్రం అర్ధం అవుతోంది.

తల మీద పేనుకు పెత్తనం ఇస్తే ఏమవుతుంది? తలంతా గొరిగి పెడుతుంది. స్వామికి పెత్తనం ఇచ్చారు, ఆయన ఏం చేస్తారో అదే చేస్తున్నారు.

అసలు స్వామికి రాజ్య సభ సీటు ఇవ్వటం మోడికి కూడా ఇష్టం లేదని కొందరు సూచిస్తున్నారు. ఆయన్ని ఎంత దూరం పెడితే అంత మంచిదన్నదే మోడి అభిప్రాయం అనీ, కానీ ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం సిఫారసు చేయటంతో రాజ్యసభకు రప్పించుకోక తప్పలేదని వారి అభిప్రాయం.

బాటిల్ మూత తీసి జీని లాంటి స్వామిని వదిలి పెట్టిన మోడి అదే బాటిల్ లో ఇరుక్కుపోయిన తన కాలును బైటికి ఎలా తీసుకోవాలో తెలియక తంటాలు పడుతున్నారు. అసలు తన కాలు బాటిల్ లోకి ఎలా వెళ్లిందో కూడా ఆయనకు తెలిసినట్లు లేదు పాపం. తన కాలు నుండి బాటిల్ ని వదుల్చుకోవాలా లేక జీనీ వదులుతున్న ట్వీట్ లపై దృష్టి పెట్టాలా అన్నది ఆయనకు సమస్య అయిందని కార్టూన్ సూచిస్తోంది.

కానయితే కార్టూనిస్టు కేశవ్, ఏదో ఒక సామెతతో మోడి పరిస్ధితిని పోల్చుతూ ఈ కార్టూన్ ని గీసినట్లు అనిపిస్తోంది. ఆ సామెత ఏమిటన్నదే తెలియటం లేదు.

13 thoughts on “స్వామి జీనీని వదిలారు, అనుభవిస్తున్నారు! -కార్టూన్

 1. ఓ దిగ్విజయ్ చెప్పేంతవరకు స్వామి కి అరుణ్ జైట్లి పడదని తెలియదన్నమాట మీకు. స్వామి ఫాలో అయ్యె లక్షల మందికి స్వామికి లోక్ సభ టికెట్ రానప్పుడే జైట్లి ఆపని చేశాడని తెలుసు. అంతేకాదు ఎన్నికల ముందు స్వామికి మంత్రి వర్గం లో చోటు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. దానికి బదులుగా బ్రిక్స్ బంక్ చైర్మన్ పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చాడు. దానిని స్వామి తిరస్కరించాడు. కారణం రామజన్మభూమి అంశాన్ని ఆయన లాజికల్ కంక్లుషన్ కు తేవాలనుకోవటం.

 2. లేదు వాసు గారూ, బి జె పి ఇన్నర్ రాజకీయాల్లో నేను పూర్.

  అయితే రామ జన్మ భూమి లాజికల్ కంక్లూజన్ మోడీకీ ఇష్టం లేదన్న మాట!

  మోడి భక్తులకు మీరు కోపం తెప్పిస్తున్నారు సుమా.

 3. నేను మోడి భక్తుడినే. స్వామి వర్సెస్ మోడి అనే ప్రశ్న వస్తే స్వామికే నా ఓటు. స్వామి వలననే నేను మోడి ని సమర్ధించేది. రెండో అంశం. మీరు మీ ఊహల్లో ఉంట్టున్నారు. స్వామి రఘురాం రాజన్ విషం లో చెప్పినది ఎంతో నిజం. పారిశ్రామిక వేత్తలైన కిరణ్ మజుందర్ షా, నారయణమూర్తి నోరు అదుపులో పెట్టుకోకుండా స్వామి మీద ఆరోపణలు చేస్తే దిమ్మదిరిగేలా స్వామి భక్తులు జావాబు ఇస్తారు. వాళ్ళకి భారత ఆర్థిక వ్యవస్త గురించి అవగాహన లేకపోయిన ప్రెస్టిట్యుట్ ల తో చేరి మీడియాలో ఉచిత బోడి సలహాలు ఇస్తున్నారు. గ్రీస్ ఆర్ధికం గా దివాల తీసినపుడు అక్కడి ఆర్ధిక మంత్రి చెప్పిన సలహ కూడా స్వామి చెప్పినదానికి భిన్నంగా ఎమీ లేదు. మనదేశం దివాల తీయటం అనేది ఉండకపోవచ్చు. కాని చాలా మంది మధ్య తరగతి ప్రజలు, చిన్న పరిశ్రమలు పెట్టుకొన్న వారు సఫర్ అవుతారు. అవుతున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ పేరుతో ప్రభుత్వం ఎమి ఖర్చు చేయకుండా, ప్రజల పై టాక్స్ లు వేస్తూ పోతే, ఆ ఆర్ధిక వ్య్వస్థ పరిస్థితి బాగుపడకపోగా చచ్చు కూచుంట్టుంది. మనదేశంలో చిన్న పారిశ్రామిక వేత్తలు ఫాక్టరిలు మూసుకొంట్టున్నా, రఘురాం రాజన్ వాళ్ళకి ఎమి సహాయం చేయకుండా పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అని ఒక ఉద్యోగి సైకాలజి తో ప్రవర్తిస్తున్నాడు. ఉద్యోగి సైకాలజి వచ్చిన జీతం లో సర్దుకు పోదాం అని ఉంట్టుంది. ఆయనది నాయకుడి సైకాలజి కాదు. నాయకులు రిస్క్ తీసుకొని కొత్త మార్గంలో ప్రయాణించాలి. ప్రజలను కన్వీన్స్ చేయాలి. స్వామి అదే చేస్తున్నాడు.

  ఈవిషయంపై స్వామి ముందుగానే హెచ్చరిస్తున్నాడు. వాజ్పాయ్లా ఇండియా షైనింగ్ నినాదం లో కూరుకుపోయి చివరికి ఓటమి పాలైనాడు.

 4. రిసర్వ్ బాంక్ గవర్నర్ గా మొదటి మహిళా గవర్నర్ ఆరుంధతి రాయ్ బాగుంట్టుందని కాంగ్రెస్+కార్పోరేట్ వర్గాల వారు పేపర్లలో స్రీలను, ఫెమినిస్త్ లను ఆకట్టుకొనే విధంగా ప్రచారం మొదలుపెట్టారు. ఆమే విజయ్ మాల్యాకు వేల కోట్లు అప్పు ఇచ్చింది. ఇంకొక దేశం లో ఈపాటికి ఉద్యోగం పోయి ఉండేది. కాని కాంగ్రెస్ + మీడీయా వాళ్ళు ఆమె తప్పుల గురించి ఎక్కడా బయటకు రానీయకుండా, మోడి ప్రభుత్వాన్ని ప్రభవితం చేయటానికి మొదటి మహిళా గవర్నర్ పాట అందుకొన్నారు. మీడియాలో పది పేర్ల లిస్త్ ఒకటి తిరుగుతున్నాది. అందులో స్వామి చాయిస్ మాజీ కాగ్ చీఫ్ వినోద్ రాయ్, లేకపోతే ఇంకెవరైనా నిజాయితిగా పని చేసే వాళ్ళు.

  రాహుల్ బజాజ్ మోడి స్వామి రెండు మీటింగ్ లను కేన్సిల్ చేశాడని పొంగిపోతున్నాడు. వచ్చే ఎన్నికలలో బిజెపి గెలవాలంటే మోడి స్వామికి దారి లోకి రావాలే గాని స్వామి మోడి దారిలోకి రాడు. పారిశ్రామిక వేత్తల మాటలు వింటే ఎన్నికలలో ఎవ్వరు గెలవారు. పారిశ్రామిక వేత్తల టైం అయిపోయింది. వాళ్ళ పుచ్చొంక్కాయ్ సలహాలకు ఇప్పుడు విలువలేదు.వాళ్లు సామాన్య ప్రజలతో సంబంధాలు కోల్పోయారు. మొన్న బ్రిటన్ లో జరిగిన అభిప్రాయసేకరణే చూస్తే సామాన్య ప్రజలు రాజకీయ,పారిశ్రామిక, ఆర్ధిక (నోబుల్)శాస్రవేత్తల కలసి ఉందామనే సలహాలను తోసిపుచ్చి, వారిని చావుదెబ్బ కొట్టారు.

  మోడి కామెంట్ చేశాడు గదా అని స్వామి ఆగడు. పక్కరోజు నుంచే ట్విటర్ లో అస్రాలు సంధిస్తున్నాడు. మోడికి నిజమైన ప్రతిపక్షం స్వామి + కట్టర్ బిజెపి వాదులే.

 5. స్వామిపై మోడి కామెంట్ చేశాడు అనటం కార్పోరేట్ వర్గల వాళ్ళు ఆనందం దాచుకోలేక ఎగిరి గంతేశారు. కార్పోరేట్ సి.యి.ఓ. లు రాజకీయాలపై కనీస అవగాహన లేదు. వాళ్ళ కంపెనిలలో లాగా నాయకుదు నచ్చని వారిని తీసేసో, మరో విధంగా కట్టడి చేసేయ గల సర్వ శక్తిమంతుడనుకొంట్టున్నారు. రాజకీయాలలో అది సాధ్యపడదు. నచ్చని వాళ్లను తీసి పారేస్తే ఇంకొక పార్టి వారు తీసుకొంటారు లేక ఇంకొక పార్టి పెట్టుకొంటారు. విమర్శలు మరింత తీవ్రంగా చేస్తారు. అదే బిజినెస్ లో, కంపెనిలలో ఉద్యోగం పీకితే ఎవరు పట్టించుకోరు.

  ఇక స్వామి పై వాళ్ళ కోపం ఈ ఆక్స్ ఫర్డ్,హార్వర్డ్, కేంబ్రిడ్జ్ బేటాలియన్ కు చెందిన విద్యావేత్తలకు రఘురాం రాజన్ నూ పూచిక పుల్లా తీసిపారేశాడు, అది నచ్చలేదు. పాపం ఆ పెద్ద యునివర్సిటిలలో చదివిన వారందరి ఇగో ఘోరంగా దెబ్బతింది.

 6. స్వామి వ్యక్తులకన్నా తాను పాటించే ప్రినిసిపల్స్ కు మొదటి ప్రాముఖ్యత ఇస్తాడు. స్వామి దానిని ధర్మం అంటారు. ఈమొత్తం వ్యవహారం అరుణ్ జైట్లి/మోడి వర్సెస్ స్వామి అనుకొనే కన్నా స్వామి వర్సెస్ బ్యురో క్రాట్స్ అనుకోవచ్చు. ఎప్పుడైతే స్వామి 20 మంది పైగా అధికారుల బండారం భయటపెడతానని అనటమేకాక, ఒక అధికారి దాస్ పైన ఆరోపణలు చేశాడో మిగతావరందరు భయపడిపోయారనిపిస్తుంది. స్వామి రక్షణకి బ్లాక్కమాండో భద్రతదళాలను కేంద్ర ప్రభుత్వం ఇస్తే అధికారులు ఎంత ఆలస్యం చేయగలరో అంత ఆలస్యం చేసి చివరికి ఇచ్చరు. ఈయన రాసే ఉత్తరాలను తొక్కి పెడతారు. వాటిని కేంద్రమంత్రుల దృష్టికి తీసుకు పోరు. ఈయన రాసి రాసి చివరికి మంత్రుల అపాయింట్ మెంట్ తీసుకొని వారినిఅడిగితే, ఆ ఫైల్ కి చలనంవచ్చేది.
  ఇక నేషనల్ హెరల్ద్ కేసు లో ఆయనకి బిజెపి ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహాయం లేదు. ఈయన ఒక్కడే కోర్ట్ చూట్టుతిరిగేవాడు, యథావిధిగా ప్రభుత్వ అధికారూల నుంచి ఏ సహకారం ఉండేది కాదు. ఒక్క కేంద్రం మంత్రి కూడా ఆ వైపుకు తొంగి చూడలేదు. అదే కాంగ్రెస్ లో కపిల్ సిబాల్,అభిషేక్ మను సింఘ్వి, సంజయ్ ఝ ఒకరికి పది మంది హాజరయ్యే వారు.

  మోడికి రామజనభూమి వివాదానికి పరిష్కారం ఇష్టమే,హిందువులు దానికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని కోరుకుంట్టున్నారు, ఐతే దానిని పరిష్కరించాల్సిన బాధ్యత స్వామిదే! ఎందుకంటే ఆయనే పరిష్కరిస్తానని ముందొచ్చాడు. అదేమి అంత కష్టమైన పనిగాదు.

 7. “..మీరు మీ ఊహల్లో ఉంట్టున్నారు…”

  అయ్యో రాత! స్వామి-మోడి-రాజన్ గొడవ లోకి నన్నెందుకు లాగుతారు వాసు గారూ?

  స్వామి అంత వీరుడే అయితే ఓ పార్టీ పెట్టేసి, వివాదాలన్నీ పరిష్కరించేసి, దేశాన్ని (అందులో జనం ఉన్నారని ఆశిస్తూ) ఎక్కడికో తీసుకెళ్లేసి…. ఇవన్నీ చేయొచ్చు గదా మరి. ఆయనకు అడ్డు వస్తున్నది ఎవరు?

  అసలు అంత పరిష్కర్త, ప్రతిభావంతుడూ అయిన స్వామి గారు ట్విట్టర్ లో కూస్తూ, అధికారులకు ఉత్తరాలు రాస్తూ, మంత్రుల చుట్టూ తిరుగుతూ, మోడి భజన చేస్తూ… ఎందుకు ఉండిపోతున్నారు? నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాలే ముఖ్యమంత్రి కాగా లేనిది స్వామి గారు కాలేకపోయారా?

 8. అదే మరి. మీ ఆవేశం ఇక్కడే తెలిసి పోతుంది 🙂 మీ ఆరోపణలలో తార్కికత ఎమిలేదు. ఆయనకు వ్యతిరేకంగా కూయటానికి 24X7 గంటలు ఇంగ్లీష్ మీడీయా ఉంది కదా! ఆయన ట్విటర్ కూడా ఉపయోగించకుడదు అంటె ఎలా? ట్విటరొక్కటే వార్తలను వక్రీకరించకుండా ఈరోజుల్లో తెలియజేసేది. ఆయన ఊరికే కూతలు కుసేవాడంటే ఎలా? మీరు జయలలిత సంగతి, సోనియా,రాహుల్ కోర్ట్ కు ఎందుకు,ఎవరి వలన హజరైందో అన్న విషయం మరచిపోతే ఎలా?

  స్వామి మోడి భజన ఎమి చేయలేదు. ఆ విషయం అందరికి తెలుసు. పారిశ్రామిక వేత్తలు,అధికారులు మోడిని తప్పు దోవ పట్టించకుండా చూస్తున్నాడు. అంతే. వాళ్ళు వెస్ట్ ఇంకా సుపర్ పవర్ అనే భ్రమల్లో ఉంట్టూన్నారు. పారిశ్రామిక వేత్తలు దైవాంశ సంభూతులైనట్లు ప్రతిదానికి సలహా లివ్వటానికి పోటుగాళ్లలా వస్తారు. ఈ పారిశ్రామిక వేత్తల అసోచాం ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఎమిటి? విజయ మాల్య ఎంత ఇస్తే బాంక్లు అంత తీసుకోవలంట. ఒక లక్ష మంది ఇంటి లోన్ లు తీసుకొన్న వారు సంస్థగా ఏర్పడి మేము అప్పు తీర్చలేము. తలా ఒక లక్ష ఇస్తాము అంటే ప్రైవేట్ బాంక్ లు, ఒప్పుకొంటాయా? ఇక ఈ కామేడి గాళ్లను ఎవ్వరు పట్టించుకోరు. వాళ్ళ డబ్బును వారే ఖర్చు చేసుకొంట్టు, వారిలో వారికే అవార్డ్ లు ఇచ్చుకొంట్టు, ఇంగ్లిష్ మీడీయాలో వారి గురించి వారే డబ్బాకొట్టుకోవలసిందే.

 9. వాసు గారు, మీ పారిశ్రామికవేత్తల సంగతి నేను అడిగానా? నేను అడిగిన ప్రశ్నలు వదిలి పారిశ్రామిక సుత్తి ఎందుకు మోదుతున్నారు? వాళ్ళని కాసేపు పక్కన ఉంచండి.

  మళ్ళీ అడుగుతున్నాను, మీ సమాధానం కోసం!

  అసలు అంత పరిష్కర్త, ప్రతిభావంతుడూ అయిన స్వామి గారు ట్విట్టర్ లో కూస్తూ, అధికారులకు ఉత్తరాలు రాస్తూ, మంత్రుల చుట్టూ తిరుగుతూ, మోడి భజన చేస్తూ… ఎందుకు ఉండిపోతున్నారు? నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాలే ముఖ్యమంత్రి కాగా లేనిది స్వామి గారు కాలేకపోయారా?

  విషయం మీద కేంద్రీకరించండి.

 10. రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాలే ముఖ్యమంత్రి కాగా లేనిది స్వామి గారు కాలేకపోయారా?

  అది స్వామి అడిగి తేలుసుకోండి. నాకు తెలిసినంత వరకు విషయాలను రాశాను.

  ——–
  ఎగతాళి చేయాలంటే కమ్యునిస్ట్ లను ఎంతో చేయవచ్చు. భారతదేశంలో నంబర్ 2 స్థానంలో ఉండి, నేడు ఘోరమైన స్థాయి లో ప్రజలలో విశ్వాసంకోల్పోయి , వాళ్లని వాళ్ళు సంస్కరించుకోలేక, ప్రజల విశ్వాసం పొందలేక, తెలంగాణలో ఉన్న ఒక్క శాసన సభ్యుడు ఫిరాయిస్తే ఎమి చేయలేక, సారంగ వంటి వెబ్ సైట్లకి పరిమితమై, కొనప్రాణం తో కొట్టుమ్మిట్టాడుతూ, చింతచచ్చినా పులుపు చావక విమర్శలతో కాలం వెళ్లబుచ్చుకొంట్టున్నారు. ఈ పేపర్ పులులు ఘాండ్రించి సోషల్ మీడియాలో గోల చేసిన, దాని ఓట్ల లో ఓట్లుగా మార్చుకోలేక,ఎన్నికలలో చతికలపడతారు. రాను రాను వీళ్ళ ఘాండ్రిపులను ప్రజలు పిల్లి కూతలు అనుకొని పట్టించుకోవటంలేదులేండి.

  Good Bye.

 11. పారిశ్రామికవేత్తలు అయ్యారు, ఇప్పుడు కమ్యూనిస్టుల దగ్గరికి వచ్చారా!

  మీ కమ్యూనిస్టుల గాండ్రింపులు, పిల్లి కూతల గొడవ కూడా నాకు వద్దు లెండి.

  స్వామిని నేను అడగడటం ఏమిటండీ. నేను చెప్పేది ఏదో ఆర్టికల్ లో చెప్పాను. మీరు స్వామికి వకాల్తా వచ్చి, స్వామి భక్తుడిని అని మీరు చెబితేనే కదా మిమ్మల్ని అడుగుతున్నది? లేకుంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను?

  “ఈవిషయంపై స్వామి ముందుగానే హెచ్చరిస్తున్నాడు. వాజ్పాయ్లా ఇండియా షైనింగ్ నినాదం లో కూరుకుపోయి చివరికి ఓటమి పాలైనాడు.”

  “…ఐతే దానిని పరిష్కరించాల్సిన బాధ్యత స్వామిదే! ఎందుకంటే ఆయనే పరిష్కరిస్తానని ముందొచ్చాడు. అదేమి అంత కష్టమైన పనిగాదు.”

  “ఆయన ఊరికే కూతలు కుసేవాడంటే ఎలా? మీరు జయలలిత సంగతి, సోనియా,రాహుల్ కోర్ట్ కు ఎందుకు,ఎవరి వలన హజరైందో అన్న విషయం మరచిపోతే ఎలా? ”

  “స్వామి మోడి భజన ఎమి చేయలేదు. ఆ విషయం అందరికి తెలుసు. పారిశ్రామిక వేత్తలు,అధికారులు మోడిని తప్పు దోవ పట్టించకుండా చూస్తున్నాడు.”

  ఇవన్నీ మీరే కదా రాసింది. ఇంతలోనే స్వామిని పక్కకు విసిరేసి, మీరు పలయానం చిత్తగిస్తే ఎలా?

 12. పలాయనం చిత్తగించటం ఎమిటి? స్వామిని నేను విసిరేశానంటూ మీరు పెడర్ధాలు పీకటమేమిటి? నేను పుట్టకముందు నుంచి స్వామి జాతీయ రాజకీయాలలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు యం.యల్.ఏ.గా పోటిచేయలేదు. వర్తమానం లో తెలిసిన విషయాలను రాశాను మీరడిగిన ప్రశ్నకు జవాబు కోసం స్వామిని అడగండి. లేకపోతే యుట్యుబ్ లో స్వామి వీడీయోలు ఎన్నో ఉంటాయి..వాటిలొ మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో ప్రయత్నించండి. పోని మీకేమైనా ఆసంగతి తెలిసి ఉంటే మీరే ఒకటపా రాయండి.

 13. స్వామి-జైట్లీలకు పడకపోవటంతో మొదలు పెట్టి, నా ఊహలు, తార్కికత పైన తీర్పులు ఇస్తూ ఆసోచాం, విజయ్ మాల్యా తదితర పారిశ్రామిక వేత్తలతో సహా కమ్యూనిస్టులను సైతం కాచి వడపోసినట్లు తీర్మానాలు చేసిన మీరు ఆనక స్వామికి వకాల్తా వచ్చారు. స్వామి గొప్ప పరిష్కర్త అన్నారు. ఆయన చేస్తాడని మీరు చెప్పిన వాటినే ఎందుకు చేయటం లేదు అని అడుగుతుంటే ఆయన్ని అడగమని తప్పుకుంటున్నారు. స్వామిని నెత్తిన మోస్తూ వచ్చి ‘ఆయన్ని అడగండి’ అని తప్పుకోవటాన్ని ‘విసిరేశారు’ అన్నాను.

  పోటీ చేయలేదు సరే. ఎందుకు పోటీ చేయరు అని కదా అడుగుతున్నది! మోడి తప్పు దోవ వెంట కాపలా కాసే బదులు ఆయనే ఒప్పు దారి వేయవచ్చు గదా అని అడుగుతుంటే వీడియోలు చూడండి అంటారేమీ? మీరు చూసి చెప్పరాదా? స్వామిని మోస్తున్నది మీరు గానీ నేను కాదు కదా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s