
USS Gravely
అమెరికా యుద్ధ నౌక ఒకటి తమ పెట్రోలింగ్ నౌకను ప్రమాదకరంగా ఆటంకపరిచిందని రష్యా ఆరోపించింది. మధ్యదరా సముద్రంలో ప్రయాణిస్తున్న తమ నౌకను అమెరికన్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక దాటి వెళుతూ అంతర్జాతీయ నావికా చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించిందని, ఇతర దేశాలకు నీతులు చెప్పేందుకు ముందుండే అమెరికా తన ప్రవర్తనను చక్క దిద్దు కోవాలని రష్యా కోరింది.
అమెరికా నౌకా బలగం లోని డిస్ట్రాయర్ నౌక గైడెడ్ మిసైళ్లను ప్రయోగించగల శక్తి కలిగినది. ‘యూఎస్ఎస్ గ్రేవ్ లీ’ అనే పేరు గల ఈ యుద్ధ నౌక అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న తమ పెట్రోలింగ్ నౌకను ప్రమాదకరంగా సమీపించిందని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది.
జూన్ 17 తేదీన జరిగిన ఈ ఘటనలో తమ నౌకను దాటి వెళుతూ తమ నౌక మార్గానికి అడ్డంగా వచ్చిందని రష్యా తెలిపింది. ప్రమాదకర రీతిలో తమ నౌక మార్గానికి ఆటంకం కలిగిస్తూ 180 మీటర్ల సమీపానికి వచ్చిందని తెలిపింది.
సముద్ర జలాల్లో అనుకోని విధంగా ఘర్షణ జరిగే అవకాశాలు నివారించేందుకు ఉద్దేశించిన అంతర్జాతీయ చట్టాలకు ఇది విరుద్ధం అని రష్యా తెలిపింది.
అంతర్జాతీయ జలాల్లో వివిధ దేశాల ఓడలు, యుద్ధ నౌకలు ఒకదానినొకటి అతిక్రమించకుండా ఉండేందుకు దేశాలు చట్టాలను రూపొందించుకున్నాయి. వాటిలో ఒకటి కాల్ రెగ్స్ (COLREGS: International Regulations for Preventing Collissions at Sea). రోడ్డు ప్రయాణాల్లో ప్రమాదాలు నివారించటానికి ట్రాఫిక్ రూల్స్ ఉన్నట్లే కాల్ రెగ్స్ నియమాలు సముద్ర ప్రయాణాలలో పాటించవలసిన నిబంధనలను నిర్దేశిస్తాయి. ఈ నియమాలను ‘యూఎస్ఎస్ గ్రేవ్ లీ’ ఉల్లంఘించిందన్నది రష్యా ఆరోపణ.
“అమెరికా నావికులు, ముఖ్యంగా, రూల్ 13 ను ఉల్లంఘించారు. ఒక నౌకను దాటి వెళ్ళే నౌక తాను దాటి వెళ్ళే నౌక మార్గానికి అడ్డంగా రాకూడదని ఈ రూల్ నిర్దేశిస్తుండగా దానిని అమెరికా నావికులు ఉల్లంఘించారు. స్టార్ బోర్డ్ సైడ్ లో మరో నౌక ఉన్నట్లయితే ఆ నౌకకు మార్గం ఇవ్వాలని నిర్దేశించే రూల్ 15 ను కూడా వాళ్ళు ఉల్లంఘించారు” అని రష్యా రక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించింది.
రష్యా ఎయిర్ ఫోర్స్ మరియు నావికా బలగాలను “మర్యాద విరుద్ధ ప్రవర్తన” అంటూ తరచుగా ఉట్టి పుణ్యానికి విమర్శించే అమెరికా తన బలగాలకు మొదట వాటిని నేర్పాలని ప్రకటన పేర్కొంది. “సముద్ర ప్రయాణ భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించే అవకాశాలను అమెరికా నావికులు తమకు తామే కల్పించుకుంటారు. దానివల్ల ప్రమాదకర ఘటన జరగవచ్చన్న ఆలోచనను విస్మరిస్తారు. భారీ ట్రాఫిక్ నెలకొని ఉండే మార్గాలలోనూ వారు అదే విధంగా ప్రవర్తిస్తారు” అని రష్యా ప్రకటన పేర్కొంది.
యూఎస్ఎస్ గ్రేవ్ లీ డిస్ట్రాయర్ నౌక అత్యాధునికమైన ఏజీస్ మిసైల్ రక్షణ వ్యవస్ధను నిర్వహించగల సామర్ధ్యం కలిగినదని రాయిటర్స్ తెలిపింది. 2010లో సముద్ర జలాల్లో ప్రవేశించిన ఈ నౌకను 2013లో తూర్పు మధ్యదరా సముద్రం పర్యవేక్షణ(?) బాధ్యతలను అప్పగించారు.
రష్యా గస్తీ నౌక ‘యారోస్లావ్ ముడ్రీ’ రష్యా నావికా బలగాలలోని నల్ల సముద్రం విభాగానికి చెందినదని రష్యా టుడే తెలిపింది. సిరియా తీరంలోని రష్యన్ నౌకా స్ధావరం వద్దకు ఈ నౌక వెళ్తుండగా జూన్ 17 తేదీన అంతర్జాతీయ జలాల్లో ఘటన జరిగినట్లు రాయిటర్స్ తెలిపింది.
అనేక పశ్చిమ పత్రికలు కూడా నివేదించిన ఈ ప్రకటన పట్ల అమెరికా స్పందన ఏమిటన్నది తెలియలేదు. రష్యా పొరుగునే ఉన్న తూర్పు యూరప్ రాజ్యాలన్నింటా పెద్ద సంఖ్యలో సైనికులను తరలిస్తున్న అమెరికా రష్యాకు ఆనుకుని ఉన్న నల్ల సముద్రం, బాల్టిక్ సముద్రంలలో సైతం తన యుద్ధ నౌకలను పెద్ద ఎత్తున మోహరించింది. తూర్పు యూరప్ రాజ్యాలలో తమ సైనిక పటాలాలతో, ట్యాంకులు లాంటి భారీ యుద్ధ పరికరాలతో సహా, కవాతు చేయిస్తోంది.
ఈ నేపధ్యంలో గతంలో చిన్న సంఘటనగా చెప్పుకోగలవి కూడా ఇప్పుడు పెద్ద ఘటనగా మారిపోతోంది.