త్వరగా దయచేయండి! -ఈయు


‘బైటకు వెళ్లి పోవాలని నిర్ణయించుకున్నారు గదా, ఇంకా ఎన్నాళ్ళు చూరు పట్టుకుని వెళ్ళాడుతారు?’ అని బ్రిటన్ / యూకె ను నిలదీసి ప్రశ్నిస్తోంది యూరోపియన్ యూనియన్. కొందరు ఈయు నేతల ప్రకటనలు చూస్తే బ్రిటన్ నేతల నాన్చుడు ధోరణి వారికి ఎంత మాత్రం ఇష్టంగా లేదని స్పష్టం అవుతోంది.

“యూరోపియన్ యూనియన్ నుండి బయటకు వెళ్ళే కార్యక్రమాన్ని బ్రిటన్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలి” అని ఈయు కమిషనర్ ఒకరు హెచ్చరించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. బైటకు వెళ్లడం ఆలస్యం చేసే కొద్దీ బ్రిటన్ కీ, ఈయు కీ రెండింటికీ నష్టం జరుగుతుందని ఈయు డిజిటల్ ఎకానమీ కమిషనర్ గుయెంతర్ ఒటింగర్ సోమవారం గట్టిగా కోరారని రాయిటర్స్ తెలిపింది.

బ్రెగ్జిట్ ఫలితాలు వెలువడిన శుక్రవారం రోజున ప్రపంచవ్యాప్తంగా షేరు మార్కెట్లు 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ కేపిటల్ నష్ట పోయాయని పత్రికలు కన్నీళ్లు పెట్టుకోని వార్త ఈ నాలుగు రోజుల్లో ఒక్కటీ లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా పశ్చిమ వాణిజ్య పత్రికలు ఈ అంశాన్ని పదే పదే గుర్తుకు తెస్తూ జరగరాని ఘోరం జరిగిపోయిందని పాఠకులకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఈయు-బ్రిటన్ విడాకుల విషయంపై సందిగ్ధత కొనసాగుతూ ఉంటే ఈ నష్టం మరింత పెరుగుతుందని ఈయు సంస్థలు భయపడుతున్న నేపథ్యంలో ఈయు కమిషనర్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా రాజీనామా ప్రకటించిన బ్రిటిష్ ప్రధాని కామెరాన్, అక్టోబర్ వరకు పదవిలో ఉంటానని, కొత్త ప్రధాన మంత్రి నేతృత్వం లోనే బ్రెగ్జిట్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పటంతో అస్ధిరత, అనిర్దిష్టత మరింత కాలం కొనసాగుతుందని భయపడుతున్నారు.

“అనిర్దిష్టత కొనసాగిన ప్రతి ఒక్క రోజూ మదుపుదారులు తమ పెట్టుబడులను బ్రిటన్ లో గానీ, యూరోపియన్ మార్కెట్లలో గాని మదుపు చేయటాన్ని నివారిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్ధితి కొనసాగటం వల్ల ఇరు పక్షాలు నష్ట పోవలసి ఉంటుంది” అని ఈయు డిజిటల్ ఎకానమీ కమిషనర్ గుయెంతర్ జర్మనీకి చెందిన డ్యూశ్చ్ లాండ్ ఫంక్ రేడియో తో మాట్లాడుతూ నిర్మొహమాటంగా ప్రకటించారు.

ఇలాంటి నిర్మొహమాటపు ప్రకటనలు ఒక్క గుయెంతర్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఈయు కూటమి లోని ఇతర సభ్య దేశాల నేతలు, ఈయు సంస్ధల అధికారులు ఇదే తరహా ప్రకటనలు చేస్తున్నారు. బ్రిటన్ ఈయు నుండి వెళ్లిపోవటానికి నిర్ణయించింది అన్న బాధ కంటే అదేదో త్వరగా ముగిసిపోతే ఒక పని అయిపోతుంది అన్న తొందరనే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.

“దానిని (రిఫరెండం తీర్పును) త్వరగా అమలు చేయాలి. మనం అనిర్దిష్ట పరిస్ధితిలో ఎల్ల కాలమూ కొనసాగలేము” అని ఫ్రాన్స్ ఆర్ధిక మంత్రి మైఖేల్ సాపిన్ ఫ్రాన్స్ 2 టెలివిజన్ వెబ్ సైట్ తెలిపింది.

“బ్రిటిష్ కన్సర్వేటివ్ పార్టీ ఎత్తుగడలకు స్ధానం కల్పించే లక్ష్యంతో (అవసరమైన చర్యలు తీసుకోకుండా) వెనకాడుతూ పోవటం వల్ల అందరూ నష్టపోతారు. బ్రెగ్జిట్ పైన అనిశ్చితి మరింత అబధ్రతకు, ఉద్యోగాలు కోల్పోవటానికి దారి తీస్తుంది. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము.  మంగళవారం జరిగే ఈయు శిఖరాగ్ర సమావేశం అందుకు సరైన సమయం” అని యూరోపియన్ పార్లమెంటు చీఫ్ మార్టిన్ షుల్జ్ కోరారని ద హిందు తెలిపింది.

బ్రెగ్జిట్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరుతూ యూరోపియన్ పార్లమెంటు లోని మొదటి అతి పెద్ద నాలుగు గ్రూపులు ఒక తీర్మానం ముసాయిదా తయారు చేశాయని ఈ తీర్మానం మంగళవారం సమావేశంలో చర్చకు రావచ్చని తెలుస్తోంది. “నష్టకరమైన అనిశ్చితిని నివారించటానికి, యూనియన్ సమగ్రతను పరిరక్షించటానికి ఇది చాలా అవసరం” అని తీర్మానం పేర్కొన్నట్లుగా జర్మనీ పత్రికలు నివేదించాయి.

ఈ‌యూ నుండి బ్రిటన్ చట్టబద్ధంగా బైటికి వెళ్ళే ప్రక్రియ ప్రారంభం కానంతవరకు బ్రెగ్జిట్ అనంతర పరిస్ధితిపై ఒప్పందాలు కుదుర్చుకోవటం సాధ్యం కాదని కూడా ఈయు దేశాలు స్పష్టం చేస్తున్నాయి. అధికారిక బ్రెగ్జిట్ ప్రక్రియ ప్రారంభించటానికి అంత తొందరేమి లేదని, మొదట విడాకుల అనంతర పరిస్ధితిపై రాజకీయ, ఆర్ధిక ఒప్పందాలు ఎలా ఉండాలన్న అంశాన్ని చర్చించుకుందామని బ్రెగ్జిట్ ప్రచారానికి నాయకత్వం వహించిన కన్సర్వేటివ్ పార్టీ నేత బోరిస్ జాన్సన్ చేసిన ప్రకటన తమకు సమ్మతం కాదని ఈ విధంగా ఈయు దేశాలు నిర్ధారించాయి.

British FM George Osborne

British FM George Osborne

“బ్రిటన్ నిష్క్రమణ విషయంలో ఒక ఒప్పందం కుదిరే వరకూ యూ‌కే, ఈ‌యూల మధ్య కొత్త సంబంధాలకు సంబంధించిన ఎలాంటి ఒప్పందమూ జరగబోదు. చట్టం నిర్దేశించిన మేరకు బ్రెగ్జిట్ అధికారిక ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే ఏదైనా” అని ఈ‌యూ పార్లమెంటు తీర్మానం ముసాయిదా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

లిస్బన్ ట్రీటీ ప్రకారం కూటమి నుండి బైటికి వెళ్లాలని భావిస్తున్న దేశం సెక్షన్ 50 కింద యూనియన్ కు మొదట నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా నోటీసు ఇచ్చిన అనంతరం అధికారికంగా నిష్క్రమణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సదరు ప్రక్రియ 2 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. నిష్క్రమణకు సంబంధించిన నియమాలు, నిబంధనలు, వ్యాపార సంబంధాలు మొదలైన అంశాలపై ఈ రెండేళ్లు చర్చలు జరుగుతాయి.

వివిధ వాణిజ్య సంస్ధలు, కంపెనీల అధిపతులు సైతం బ్రిటన్ తాత్సార వైఖరి పట్ల అసంతృప్తి ప్రకటిస్తున్నారు. “యూ‌కే లో ఇప్పుడు రాజకీయ నాయకత్వం లేకుండా పోయింది. మార్కెట్లకు ధైర్యం చెప్పి అభయం ఇవ్వాల్సిన సమయంలో ఎవరూ లేకుండా పోయారు” అని ఒక అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ అధిపతి వ్యాఖ్యానించారని రాయిటర్స్ తెలిపింది. ‘ద సిటీ ఆఫ్ లండన్’ లోని అనేక ఫైనాన్స్ కంపెనీలు ఇదే రకం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని వార్తా సంస్ధ తెలిపింది.

ఈయు దేశాలు నేతలు ‘తొందరగా వెళ్లిపోండి’ అంటూ వరస పెట్టి ప్రకటనలు గుప్పిస్తుండడంతో కామెరాన్ తన రాజీనామా తేదీని ఒక నెల ముందుకు జరుపుతూ ప్రకటన చేశారు. సెప్టెంబర్ ప్రారంభానికల్లా కొత్త ప్రధాన మంత్రి పదవి చేపడతారని ఆయన ప్రకటించారు.

బ్రెగ్జిట్ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశంపై తగిన సిఫారసులు చేయాల్సిందిగా కోరుతూ కామెరాన్ తన పార్టీ నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. “సెప్టెంబర్ లోనే కొత్త ప్రధాని నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితే మంచిది” అని ఆ కమిటీ వెంటనే చెప్పటంతో కామెరాన్ తన రాజీనామా తేదీని ముందుకు జరిపినట్లు తెలుస్తోంది.

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఒక్కరే బ్రిటన్ పట్ల కాస్త మెత్తగా వ్యాఖ్యానిస్తున్నారు. బ్రిటన్-జర్మనీ ల మధ్య గల వాణిజ్య సంబంధాలు ఇక ముందు కూడా కొనసాగుతాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. బ్రెగ్జిట్ ప్రక్రియను వేగవంతం చేసే ఆయుధం తన వద్ద లేదని చెప్పుకున్నారు. అయితే ఈయు బైటికి వెళ్ళే ఉద్దేశాన్ని బ్రిటన్ చెప్పడానికి ముందుగానే అనధికారిక (informal) చర్చలు జరిగే అవకాశాన్ని ఆమె కొట్టిపారేశారు. నోటీసు ఇచ్చేముందు ఇన్ఫార్మల్ చర్చలు జరగాలని బ్రెగ్జిట్ నేత బోరిస్ జాన్సన్ కొరటాన్ని ఉద్దేశిస్తూ ఆమె ఈ మాటలు చెప్పారు.

“ప్రత్యేక మర్యాదలు అంటూ ఏమీ జరగవు. ప్రత్యేక బహుమతులు కూడా ఏమీ ఉండవు” అని మెర్కెల్ కు చెందిన పార్లమెంటరీ పార్టీ నేత వొకర్ కాదర్ స్పష్టం చేయటంతో మెర్కెల్ మెత్తని మాటలు మర్యాద కోసమేనని అర్ధం అవుతోంది.

కాగా మార్కెట్ల పతనం కొనసాగుతోంది. శుక్రవారం రోజున భారీగా పతనం అయిన పశ్చిమ మార్కెట్లు సోమవారం కూడా పెద్ద ఎత్తున నష్టాలు నమోదు చేస్తున్నాయి. అమెరికా ప్రధాన షేర్ సూచీ డౌ జోన్స్ మరో 300 పాయింట్లు నష్టపోయి రెండు రోజుల్లో 1000 పాయింట్లకు పైగా నష్టాన్ని నమోదు చేసింది. జర్మనీ సూచీ DAX, ఫ్రాన్స్ సూచీ CAC 40, బ్రిటన్ సూచీ FTSE 200 లు సోమవారం కూడా 2% నుండి 4% వరకు నష్టపోయాయి.

ఈ నేపధ్యంలో బ్రిటన్ ఆర్ధిక మంత్రి (ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్ చెకర్) ఒస్బోర్న్ మార్కెట్లకు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించారు “మన దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించగల శక్తి యుక్తులను మన ఆర్ధిక వ్యవస్ధకు ఉన్నది. గురువారం ఓటు తర్వాత కొత్త పరిస్ధితులకు సర్దుబాటు చేసుకోవటం అనివార్యం. కానీ మన ఫండమెంటల్స్ అన్నీ దృఢంగా ఉన్నాయి” అని ఆయన ప్రకటన జారీ చేశారు. అయితే ఆయన ప్రకటనను మార్కెట్లు పట్టించుకోలేదని షేర్ల పతనం ద్వారా స్పష్టం అయింది.

రెండో రిఫరెండం?!

మళ్ళీ రెండవసారి రిఫరెండం జరుగుతుందంటూ సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లలో జోరుగా ప్రచారం సాగుతోంది. దానికి కారణం సెకండ్ రిఫరెండం కావాలని కోరుతూ ప్రభుత్వ వెబ్ సైట్ లో నమోదైన ఒక పిటిషన్ కు అనుకూలంగా రెండు రోజుల్లోనే 3 మిలియన్ల మందికి పైగా సంతకాలు చేయటం.

అయితే బ్రెగ్జిట్ ఓటింగ్ జరగటానికి చాలా రోజుల ముందే ఈ పిటిషన్ నమోదైందని, పిటిషన్ ను ప్రారంభించింది బ్రెగ్జిట్ అనుకూలుడే తప్ప వ్యతిరేకి కాదని కొన్ని పత్రికలు వెల్లడి చేశాయి. పిటిషన్ ను ప్రారంభించిన వ్యక్తి కూడా ఈ మేరకు స్వయంగా ఫేస్ బుక్ లో ప్రకటన చేస్తూ తన పిటిషన్ ను ‘రిమైన్’ శిబిరం వాళ్ళు హైజాక్ చేశారని వాపోవటం విశేషం.

బ్రెగ్జిట్ రిఫరెండం కోసం హోరా హోరీగా ప్రచారం సాగుతున్న నేపధ్యంలో ‘రిమైన్’ శిబిరం అనేక అవకతవక చర్యలకు, అక్రమ ప్రచార పద్ధతులకు పాల్పడటం చూసి ‘రిమైన్’ శిబిరమే ఏదో విధంగా నెగ్గుతుందని తాను భావించానని, ఆ భావనతో ‘రిమైన్’ తీర్పును తిరస్కరించేందుకు మరొకసారి రిఫరెండం జరపాలని కోరాలని పిటిషన్ ను ప్రారంభించానని సదరు వ్యక్తి తెలిపాడు. కానీ అనూహ్యంగా ‘లీవ్’ శిబిరం విజయం సాధించటంతో పిటిషన్ సంగతి పట్టించుకోలేదని ఈ లోపు ‘రిమైన్’ శిబిరం వాళ్ళు తన పిటిషన్ ను హైజాక్ చేశారని ఆయన తెలిపాడు.

బ్రిటిష్ చట్టాల ప్రకారం ఆన్ లైన్ పిటిషన్ కు కనీసం 100,000 మంది సంతకం చేసినట్లయితే ఆ పిటిషన్ ను బ్రిటిష్ తప్పనిసరిగా పార్లమెంటులో చర్చించాలి. చర్చించినంత మాత్రాన ఏదో ఒక చర్య ఆటో ఇటో తీసుకుంటారని కాదు. కేవలం చర్చ జరుగుతుందంతే.

పైగా రెండు రోజుల్లోనే 3 మిలియన్లకు పైగా సంతకం చేయటం పట్ల అనుమానాలు వ్యక్తం కావటంతో ప్రభుత్వ సంస్ధలు పరిశోధన జరిపాయి. సంతకం చేసిన వారిలో అనేకమంది సంతకానికి అనర్హులని వారి పరిశోధనలో తేలింది. ఉత్తర కొరియా, రష్యా తదితర దేశాల నుండి కూడా సంతకాలు నమోదు అయినట్లు కనుగొన్నారు. ఒకే వ్యక్తి పలుమార్లు సంతకం చేయటానికి వీలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు లేకపోవటంతో ఈ సంఖ్యను ఎవరూ సీరియస్ గా తీసుకోవటం లేదు. అయితే చర్చకు కావలసింది కేవలం లక్ష సంతకాలే కనుక ఒక చర్చ మాత్రం జరుగుతుందని పార్లమెంటు సభ్యులు హామీ ఇస్తున్నారు.

బ్రిటిష్ ప్రధాని కామెరాన్ మాత్రం ఈ పిటిషన్ ను కొట్టిపారేశారు. “గురువారం జరిగిన రిఫరెండం తీర్పును మనం గౌరవించి తీరవలసిందే” అని ఆయన స్పష్టం చేశారు. బ్రిటిష్ నిష్క్రమణను పర్యవేక్షించటానికి తాను ఒక కమిటీని నియమించానని కూడా ఆయన ప్రకటించారు. నిష్క్రమణకు కావలసిన సమాచారాన్ని సిద్ధం చేసి కొత్త ప్రధాని ముందు ఈ కమిటీ ఉంచుతుందని ఆయన తెలిపారు.

2 thoughts on “త్వరగా దయచేయండి! -ఈయు

  1. ఇంగ్లాండ్(యు.కె) ఈ.యు నుండి విడిపోవాలని కోరుకున్నవాళ్ళకులేని తొందర,ప్రత్యార్ధి శిబిరానికి(రిమైన్ శిబిరానికి మద్ధతు తెలిపిన ఇతర ఈ.యు దేశాదినేతలు,వాణిజ్యసంస్థల ప్రతినిధులు) ఉండడం మేకపోతు గాంభీర్యానికి చిహ్నం. చూస్తుంటే యు.కె నిష్క్రమణకు సహకరించకుండా అడుగడుగునా అడ్డుపెట్టడానికి వ్యూహాలు రచిస్తున్నట్లు ఉంది.

  2. అసలు బ్రిటన్ పౌరులు అన్ని బిలియన్ల ఉత్పత్తి లేదా వ్యాపారం ఎక్కడ చేస్తున్నారు ?
    ఇదంతా వారి ఇదివరకటి దోపిడీ సొమ్మా లేక కాగితపు వ్యాపారమా?
    మార్కెట్లను దేశ సంపద స్ధితిగతులకు సూచికలుగానే చూడడం నేర్చుకోవాలి నేతలూ జనమూ. చూడరు.
    నిజానికి ఇదంతా కూడ క్రింది వర్గాలకు ఏ మాత్రం అధిక నొప్పి కలిగించదు. మధ్యతరగతి వారికి ఇదో, ఇది కాకపోతే మరొకటి.
    అలవాటైపోయింది కనుక.
    పై వర్గాల వాళ్ళకు మాత్రం ఆధిపత్యపుటాటలో బోలెడంత కాలక్షేపం, అహం తృప్తి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s