
The U.S. and the justice
ఏదో ఒక వంక పెట్టుకుని కాలు దువ్వక పోతే అమెరికాకు రోజు గడవదు. చైనా లక్ష్యంగా తూర్పు మరియు దక్షిణ చైనా సముద్రాలలో భారీ మిలటరీ బలగాలను మోహరించిన అమెరికా అడపాదడపా చైనాకు వ్యతిరేకంగా యుద్ధ సవాళ్లు విసురుతోంది. త్వరలో వెలువడే అంతర్జాతీయ కోర్టు తీర్పును పాటించకుండా విస్మరిస్తే చైనా తగిన ఫలితం అనుభవించ వలసి ఉంటుందని అమెరికా తాజాగా బహిరంగ వివాదానికి అంకురార్పణ చేసింది.
అంతర్జాతీయ కోర్టుగా పరిగణించబడే ‘పర్మినెంటు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్’ లో ఫిలిప్పీన్స్, చైనా పైన ఫిర్యాదు చేసింది. ఈ కేసులో త్వరలో -కొన్ని వారాలలో- తీర్పు వెలువడుతుందని భావిస్తున్నారు. అంతర్జాతీయ కోర్టుల పేరుతో వివిధ పశ్చిమ నగరాలలో ఉన్న కోర్టులు ప్రధానంగా అమెరికా, పశ్చిమ దేశాల పెత్తనంలో ఉన్నాయి. అందువల్ల కోర్టు తీర్పు అనివార్యంగా చైనాకు వ్యతిరేకంగా వస్తుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో, ఆ తీర్పును పట్టించుకోబొమని చైనా ఇప్పటికే చెప్పేసింది. కనుక తీర్పును పక్కన పడేసి తన వాదనను తాను చైనా కొనసాగించడం తథ్యం అని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా తాజా హెచ్చరికను జారీ చేసింది.
దక్షిణ చైనా సముద్రంలో మెజారిటీ భాగం తనదే అని చైనా వాదిస్తున్నది. ఈ సముద్రంలో కొంత కొంత భాగం తమకు చెందుతుందని ఫిలిప్పీన్స్, బ్రూనె, తైవాన్, వియత్నాం, ఇండోనేషియా దేశాలు కూడా వాదిస్తున్నాయి. ఈ వివాదం ప్రధానంగా ప్రాంతీయ సమస్య. అంతర్జాతీయ వాణిజ్య నౌకలు ప్రయాణించే మార్గం కనుక ఆ మేరకు ఇతర దేశాలు కూడా దృష్టి పెట్టవచ్చు. కానీ వారి దృష్టి వివాదాలను పరిష్కారం చేసి శాంతి నెలకొనే వైపుగా ఉండాలి తప్ప మరింత రెచ్చగొట్టే విధంగా, మంటలు రగిల్చి స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకునే విధంగా ఉండకూడదు. అమెరికా చేసేది సరిగ్గా ఇదే.
పక్కనే ఉన్న తూర్పు చైనా సముద్రంలో దక్షిణ కొరియా, జపాన్, చైనాల మధ్య వివాదాలు ఉన్నాయి. తూ.చై.స కూడా మత్స్య, చమురు, సహజవాయువు సంపదలకు నిలయం. సముద్రంలో ఉన్న దీవులను సెంకాకు దీవులు అని జపాన్ పిలుస్తుంది. దియోయు దీవులు అని చైనా పిలుస్తుంది. ఇవి తమవే అంటే తమవే అని ఇరు దేశాలు వాదిస్తున్నాయి. ఇది కూడా ప్రధానంగా రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సమస్య. ఎవరి జోక్యం లేకపోతే ఇరు దేశాలు చర్చించుకుని పరిష్కరించుకోగలవు.
కానీ అమెరికా జోక్యంతో ఈ రెండు వివాదాలు ఉద్రిక్తంగా మారాయి. భౌగోళిక రాజకీయ ఆధిపత్యం సాధించడానికి సాధనాలు అయ్యాయి. దశాబ్దాలుగా నెలకొన్న శాంతి భగ్నమై, పాలస్తీనా-పనామా ల తరహాలో, అంతర్జాతీయ ఘర్షణ ప్రాంతంగా రూపుదిద్దుకుంది. ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనాను ఇబ్బందులు పెట్టి మరింతగా ఎదిగి తనకు పోటీ కాకుండా నిలువరించే సాధనం అయ్యాయి. అమెరికా చేస్తున్న తాజా హెచ్చరికను ఈ నేపథ్యం నుండి పరిశీలించాలి. అమెరికా ఉద్దేశం ఏదైనా కోర్టు తీర్పు పాటించాలని కోరడంలో తప్పు లేదు కదా అని భావిస్తే తప్పులో కాలు వేసినట్లే. అమెరికా విసిరిన ప్రచార వలలో పడిపోయినట్లే.
“తీర్పు వెలువడిన తర్వాత చైనా అదనంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే ఊరుకోబోము. చైనా అటువంటి చర్యలకు పాల్పడితే స్పందించటానికి అమెరికా ముందు అనేక ఆప్షన్లు ఉన్నాయని మరవొద్దు” అని అమెరికా విదేశాంగ శాఖలో తూర్పు ఆసియా విభాగం డెప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ కొలిన్ విల్లెట్ హెచ్చరించిందని రాయిటర్స్ వార్తా సంస్ధ ప్రకటించింది. ఈ ప్రకటనతో దక్షిణ చైనా సముద్రం కేంద్రంగా త్వరలో ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని అర్ధం అవుతున్నది.

An island in South China Sea
దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు కీలకమైన ప్రయోజనాలు ఉన్నాయని కొలిన్ విలేట్ వాకృచ్చారు. వేల మైళ్ళ దూరం లోని అమెరికాకే కీలక ప్రయోజనాలు ఉంటే తన పక్కనే ఉన్న అదే సముద్రంలో చైనాకు ఎంతటి కీలకమైన ప్రయోజనాలు ఉండాలి? సాధారణ స్ధాయి మెదడులో తలెత్తే ప్రశ్న ఇది. అమెరికా ప్రయోజనాలు అసాధారణం కావటంతో దాని వెర్రి మొర్రి హెచ్చరికలు సాధారణ ఆలోచనలకు ఒక పట్టాన అంతు బట్టవు.
ఆర్బిట్రేషన్ కోర్టు రూలింగ్ ఖచ్చితంగా చైనాకు వ్యతిరేకంగానే వస్తుందని రాయిటర్స్ నిర్ధారించి చెప్పేసింది. కోర్టు రూలింగ్ ను పట్టించుకోకుండా చైనా వెంటనే ‘రెచ్చగొట్టే చర్యల’కు పాల్పడుతుందని అమెరికా ముందే ఊహించి హెచ్చరికలు జారీ చేసిందన్నమాట! కోర్టు రూలింగ్ దరిమిలా (అదేలాగూ చైనాకు వ్యతిరేకంగానే వస్తుంది కాబట్టి) చైనా తీసుకునే చర్యలకు అమెరికా ఎలా స్పందిస్తుంది అన్న దానిపైన -ప్రాంతీయంగా- అమెరికా విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని రాయిటర్స్ విశ్లేషించింది. అనగా అమెరికా ఏదో ఒక చర్య తీసుకోక తప్పదని, అమెరికా తీసుకునే చర్యకు చైనాను తప్పు పట్టాలి తప్ప అమెరికాను కాదని రాయిటర్స్ ముందే చెబుతోంది.
“మాకు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కు ఈ ప్రాంతంలో స్పష్టమైన ప్రయోజనాలు ఉన్నాయి. మేము కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలను, భద్రతా భాగస్వామ్యాలను నిలబెట్టుకోవలసిన బాధ్యత మాపైన ఉన్నది” అని అమెరికా విదేశీ అధికారిణి హెచ్చరించింది.
అమెరికా భావిస్తున్నట్లు చైనా ఏమన్నా చర్యలు తీసుకుంటే అమెరికా తీసుకునే ప్రతి చర్యలు ఏమిటి? ఈ ప్రశ్నకు కూడా విల్లెట్ సమాధానం ఇచ్చారు. అమెరికా యుద్ధ నౌకలు మరింత తీవ్ర స్ధాయిలో దక్షిణ చైనా సముద్రంలో ‘ఫ్రీడం ఆఫ్ నేవిగేషన్” గస్తీలు తిరగటం, అమెరికా యుద్ధ విమానాలు సముద్రంపై మరింత తరచుగా హెచ్చు సంఖ్యలో ఎగరటం, ఆగ్నేయాసియా దేశాలకు మరింత ఎక్కువగా రక్షణ సహాయం అందించటం… ఇవన్నీ చేస్తామని విల్లెట్ చెప్పారు.
“హేగ్ లోని పర్మినెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏ తీర్పు ఇస్తుందో ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ అదనపు రెచ్చగొట్టుడు చర్యలు తీసుకోవటం చైనా ప్రయోజనాలకే నష్టకరం అవుతుంది” అని అదే హెచ్చరికను ఇతర మాటల్లో చెప్పారు కొలిన్ విల్లెట్! ఆమె అంతరార్ధం స్పష్టమే. ‘కోర్టు రూలింగ్ చైనాకు వ్యతిరేకంగా వచ్చేట్లుగా మేము ముందే ప్రభావితం చేసేశాం. కాబట్టి చైనా ఏమన్నా చర్యలు తీసుకుంటే ప్రతి చర్యలు తీసుకునే హక్కు మా సొంతం’ అన్నది ఆమె అంతరార్ధం.
అయితే పర్మినెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ రూలింగ్ తమకు సమస్య కాదని, దానిని అసలు పట్టించుకోమని చైనా ఇప్పటికే స్పష్టం చేసింది. “మామూలుగా చెప్పాలంటే ఆర్బిట్రేషన్ కేసు ఐరాస ఆర్బిట్రేషన్ పరిధి లోనిది కాదు. ఎందుకంటే ప్రాదేశిక మరియు సార్వభౌమ వివాదాలు ఆర్బిట్రేషన్ పరిధిలో ఉండవు. కనుక ఈ కేసు చట్ట విరుద్ధం. అందువలన అందులో మేము పాల్గొనటం లేదు, దానిని ఆమోదించబోము” అని చైనా నేషనల్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖలో విదేశీ విభాగం డైరెక్టర్ రియర్ అడ్మిరల్ గువాన్ యౌఫీ చెప్పారని జూన్ 6 తేదీన ఫాక్స్ న్యూస్ (అమెరికా) తెలిపింది.
దక్షిణ చైనా సముద్రంకు సంబంధించిన వివాదాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి చైనా సిద్ధంగా ఉన్నది. ఆ మేరకు స్ధానికంగా వివాదంలో ఉన్న దేశాలు వివిధ సందర్భాలలో తాము కూడా ద్వైపాక్షిక చర్చలకు సుముఖమే అని చెప్పాయి. కానీ ద్వైపాక్షిక చర్చలు జరిగితే అక్కడ ఇక అమెరికాకు ప్రాధాన్యం ఉండదు. శాంతియుతంగా వివాదాలను పరిష్కరిస్తే అమెరికా ఆధిపత్యం ఏం కావాలి? ఫిలిప్పీన్స్, వియత్నాం లాంటి చిన్న దేశాలకు తొడపాశం పెట్టి వాటితో చైనా వ్యతిరేక ప్రకటనలు ఇప్పించి, రక్షణ ఒప్పందాలను బలవంతంగా రుద్ది తనకు తానే అక్కడ “కీలక ప్రయోజనాలు” సృష్టించుకుంది.
ఇంతకీ ఆర్బిట్రేషన్ రూలింగ్ తనకు వ్యతిరేకంగా వస్తే తాను ఫలానా చేస్తానని చైనా ఎప్పుడూ చెప్పింది లేదు. రూలింగ్ ను పట్టించుకోము, అది చట్ట విరుద్ధం అనడమే గానీ ‘అది చేస్తా, ఇది చేస్తా’ అని బెదిరింపులు హెచ్చరికలు జారీ చేయలేదు. ఈ సంగతి రాయిటర్స్, ఫాక్స్ న్యూస్ లు కూడా అంగీకరిస్తాయి. అయినా సరే అమెరికా బెదిరింపులకు మరింత మసాలా చేర్చి చైనా వ్యతిరేక విశ్లేషణ చేయటం మానవు.
దక్షిణ చైనా సముద్రం వివాదం పైన హైప్ సృష్టించటం మానుకోవాలని చైనా ప్రభుత్వం అనేక మార్లు అమెరికాను ఉద్దేశిస్తూ హితబోధ చేసింది. మాకు లేని తొందర నీకు ఎందుకు అని ప్రశ్నించింది. అంతర్జాతీయ చట్టాలు, ప్రయోజనాల గురించి నువ్వు చెప్పే నీతులు నీకే ఎదురు వస్తాయి అని గుర్తు చేసింది. దక్షిణ చైనా సముద్రంలో తన వాదనలకు అనేక దేశాల మద్దతును కూడా సంపాదించింది. నైజర్, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే, శ్రీలంక తదితర దేశాలు చైనాకు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి. మొత్తం మీద 40కి పైగా దేశాలకు తనకు మద్దతు ఉన్నాయని చైనా చెబుతోంది.
అయితే అమెరికా మాత్రం భారీ మొత్తంలో మిలట్రీ విన్యాసాలను దక్షిణ చైనా సముద్రంలో కొనసాగిస్తూనే ఉన్నది. విమాన వాహక నౌకలు జాన్ సి స్టెన్నిస్, రోనాల్డ్ రీగన్ (ఇవి నౌకల పేర్లు) లను సముద్రంలో తిప్పుతోంది. ఫిలిప్పీన్స్ తో కలిసి సముద్రంలో యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది. నిరంతరం ఆ పేరు చెప్పి, ఈ పేరు చెప్పి స్ధానిక దేశాలతో ‘సంయుక్త విన్యాసాలు’ అని చెబుతూ యుద్ధ విన్యాసాలు నిర్వహించటం ఒక పనిగా పెట్టుకుంది.
దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు సందు ఇస్తే అది చైనా వాణిజ్య ప్రయోజనాలకు తీవ్ర విఘాతం అవుతుంది. విఘాతం కావాలన్నదే అమెరికా లక్ష్యం కనుక ఆ దేశ ఆధిపత్య చర్యలను ప్రతిఘటించటం తప్ప చైనాకు మరో మార్గం లేదు. ఈ దృక్పధంతో చూసినపుడు తన పొరుగు సముద్రంలో మెజారిటీ తనదే అంటున్న చైనా వాదన దూర దృష్టితో చేస్తున్నదని అర్ధం అవుతుంది. మెజారిటీ తనదే అనటం ద్వారా అమెరికా దూరకుండా చేసి ఆ తర్వాత ద్వైపాక్షిక చర్చల ద్వారా పొరుగు దేశాలతో వివాదాలను పరిష్కరించుకోవటం చైనా లక్ష్యంగా కనిపిస్తోంది.
vishekar garu
palestina gurunchi telusukani panama vyavaharam teleyadu
please daani gurinchi teliyachayandi
thanking you
లోక్ నాధ్ గారూ
వాస్తవంగా నేను రాయాలనుకున్నది సూయజ్ కాలువ అని. మీ వ్యాఖ్య చూసే వరకు గమనించలేదు. ఆఫ్ కోర్స్, పనామా కాలువ కూడా అంతర్జాతీయ ఘర్షణకు కేంద్రంగా ఉండేది. కానీ సూయజ్ అంతగా కాదు.
పనామా కాలువ మానవ నిర్మితం. 50 మైళ్ళ దూరం మేర భూమిని తవ్వి తీసి పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాలను కలుపుతూ పనామా కాలువ నిర్మించారు. దానికి ముందు వాణిజ్య నౌకలు దక్షిణ అమెరికా మొత్తం చుట్టి రావలసి వచ్చేది.
కాలవ నిర్మాణానికి మొదట ఫ్రాన్స్ పూనుకుని కష్టాలకు (కఠినమైన వాతావరణం, దానివల్ల జబ్బులు, మహమ్మారి దోమలు, కొండలు లోయలతో నిండిన ప్రాంతం కావటం) ఓర్వలేక విరమించుకుంది.
అనంతరం అమెరికా కంపెనీ చేపట్టి పూర్తి చేసింది. కాంట్రాక్ట్ ఒప్పందాల్లో తేడా రావటంతో కొలంబియా నిర్మాణం నిలిపివేయించింది. దానితో అమెరికా పనామా వాసులను రెచ్చగొట్టి స్వతంత్రం కోసం అంటూ వేర్పాటుకు ప్రోత్సహించి సఫలం అయింది.
1914లో కాలువ పూర్తి చేసినప్పటి నుండి అమెరికా ఆధిపత్యంలో కొనసాగుతోంది. 1999లో పనామా దేశానికి కాలవని అప్పగించినట్లు చెబుతారు గానీ అమెరికా మాట దాటి ఏమీ జరగదు. ఈ కాలవపై ఆధిక్యం కోసం అమెరికా పనామాలో ప్రభుత్వాలను కూల్చి, నిలబెట్టి, నేతలను చంపి, ఏకంగా అధ్యక్షుడినే జైలులో పెట్టి నానా అరాచకాలు సాగించింది.
సూయజ్ కాలవ గురించి తెలిసే ఉంటుంది. మధ్యధరా, ఎర్ర సముద్రాలను కలిపే కృత్రిమ కాలువ. దానిపై ఆధిపత్యం కోసం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, సోవియట్ రష్యా తదితర దేశాల మధ్య రెండు దశాబ్దాల పాటు ఘర్షణలు, యుద్ధాలు, ఎత్తులు పై ఎత్తులు, వ్యూహ ప్రతి వ్యూహాలు సాగాయి.
ఈ కాలవలపై ఆధిపత్యం ఉంటే వాటి గుండా సాగే వాణిజ్యం పైన నియంత్రణ వస్తుంది. ఆ నియంత్రణతో వాణిజ్య ఒప్పందాలను అనుకూలంగా మార్చుకునే అవకాశం వస్తుంది. అందుకే ఆ కాలవలు అంతర్జాతీయ ఘర్షణలకు కేంద్రం అయ్యాయి.
సందర్భం వచ్చినప్పుడు వీటి గురించి వివరంగా చెప్పుకుందాం.