రేపే బ్రెగ్జిట్ రిఫరెండం!


Brexit-Grexit

ప్రపంచ భౌగోళిక రాజకీయాలకు మలుపు, కుదుపు కాగల మార్పులకు దారి తీసే అవకాశం ఉన్న ‘ప్రజాభిప్రాయ సేకరణ’ ఉరఫ్ రిఫరెండం రేపు, జూన్ 23 తేదీన, బ్రిటన్ లో జరగనున్నది.

“యూ‌కే, యూరోపియన్ యూనియన్ లో కొనసాగాలా లేక బైటికి రావాలా?” అన్న ఏక వాక్య తీర్మానంపై జరిగనున్న రిఫరెండంలో విజేతగా నిలవటానికి ఇరు పక్షాలు సర్వ శక్తులూ ఒడ్డాయి. గెలుపు ఇరువురు మధ్యా దొబూచులాడుతోందని సర్వేలు చెప్పడంతో అంతటా ఉత్కంఠ నెలకొన్నది.

యూ‌కే రిఫరెండంలో యూ‌కే ప్రజలు ఇచ్చే తీర్పు కోసం ప్రపంచం అంతా ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా వ్యాపార సామ్రాజ్యాలు, కంపెనీలు, ద్రవ్య మార్కెట్లు, షేర్ మార్కెట్లు రిఫరెండం ఫలితం కోసం భయం భయంగా, ఆశతో, బెదురుతో, ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాయి.

రిఫరెండం ఫలితం యూరోపీయన్ యూనియన్ లో కొనసాగడానికి నిరాకరిస్తే గనక అది నిస్సందేహంగా పెను మార్పులకు దారి తీస్తుంది. బ్రిటన్ బైటికి వెళ్తే ఆ దేశంతో సన్నిహితంగా మెలిగే మరో ఆర్ధిక శక్తి హాలండ్ కూడా మూటా ముల్లె సర్దుకోవచ్చు. ఈ‌యూ దేశాలకు, బ్యాంకులకు భారీగా బాకీ పడ్డ గ్రీసు సత్వరమే, ధైర్యంగా బైటికి వచ్చేయవచ్చు.

అనగా ఈ‌యూ నుండి యూ‌కే విడిపోవటం అంటే యూరోపియన్ యూనియన్ విచ్ఛిన్నం కావటమే. యూరో శక్తి బలహీన పడటమే. అదే జరిగితే డాలర్ తక్షణ భవిష్యత్తులో బలీయం అవుతుంది. కానీ దీర్ఘకాలికంగా దన్ను కోల్పోయి బలహీన పడుతుంది. బలహీన పడ్డ డాలర్ తనతో పాటు అమెరికాను లోయలోకి లాక్కుపోతుంది.

మరో విధంగా చెప్పుకుంటే ఈ‌యూ నుండి యూ‌కే నిష్క్రమణ, సాపేక్షికంగా మరియు దీర్ఘకాలికంగా ప్రపంచానికి అమెరికా పీడ వదిలిస్తుంది లేదా కనీసం బాగా తగ్గించివేస్తుంది. మధ్య ప్రాచ్యంలో ముఖ్యంగా సిరియాలో అమెరికా అఘాయిత్యానికి బ్రేకులు పడవచ్చు. తమ దురహంకార దూకుడు నుండి వెనక్కి మళ్లే విధంగా చేయవచ్చు. తద్వారా సిరియా ప్రజలకు, విశాల దృక్పధంతో అరబ్ ప్రజలకు కాస్త శాంతి లభిస్తుంది.

ఇంత జరగటానికి పశ్చిమ సామ్రాజ్యవాదం ఒప్పుకుంటుందా? సోషలిస్టు నినాదాలు ఇచ్చిన డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష పోటీదారు బెర్నీ శాండర్స్ ప్రైమరీలలో హిల్లరీ క్లింటన్ పై విజయం సాధించకుండా బహుళజాతి కంపెనీలు ఒక్కటై ఎన్నికలను రిగ్గింగ్ చేశాయని ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో మొత్తం పశ్చిమ ఆధిపత్యానికి ప్రమాదకరం కాగల బ్రెగ్జిట్ సాకారం కాకుండా అడ్డుకోవటం బ్రిటన్, అమెరికా లకు పెద్ద పని కాకపోవచ్చు.

స్కాట్లాండ్ రిఫరెండంను స్కాటిష్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా రిగ్గింగ్ చేయటంలో బ్రిటిష్ పాలకులు సఫలం అయ్యారు. అనగా రిఫరెండంను రిగ్గింగ్ చేసిన అనుభవం ‘రిమైన్’ (remain) శిబిరానికి ఇప్పటికే ఉన్నది. ఆ అనుభవాన్ని మరోసారి ప్రయోగించటానికి వారికి అభ్యంతరం ఉండదు.

బ్రిటిష్ యువ ఎం‌పి, రిమైన్ శిబిరం గట్టి మద్దతుదారు అయిన జో కాక్స్ ను గత గురువారం కాల్చి చంపటంతో బ్రెగ్జిట్ వాతావరణం మరో కోణంలో వెడేక్కిపోయింది. చంపిన వ్యక్తి ‘లీవ్’ శిబిరం మద్దతుదారు అన్నట్లుగా “ద్రోహులకు చావే, బ్రిటన్ కు స్వతంత్రం” అంటూ నినాదాలు చేయటంతో అది రాజకీయ హత్య అని స్పష్టం అయింది. అయితే ఇది వ్యక్తిగత ప్రేరేపణతో జరిగిన హత్యా లేక ‘లీవ్’ శిబిరం లోని ఓటర్లను భయాందోళనలకు గురి చేసేందుకు ‘రిమైన్’ శిబిరం చేయించిన హత్యా అన్న విషయంపై ఊహాగానాలు సాగుతున్నాయి.

అంతిమంగా… యూరోపియన్ యూనియన్ నుండి యూ‌కే బైటపడటం దాదాపు అసంభవం. వడ్డించేవాడు మనవాడు అయినప్పుడు బంతిలో ఎక్కడ కూర్చుంటేనేమి? ప్రధాన మంత్రి కామెరాన్ బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయగా, అమెరికా అధ్యక్షుడు స్వయంగా బ్రిటన్ వచ్చి బ్రెగ్జిట్ వ్యతిరేక క్యాంపైన్ చేసి పెట్టగా, ఈ‌యూ తో వ్యాపార సంబంధాలు కలిగిన పత్రికలు, కంపెనీలు, బ్యాంకులు కూడగట్టుకుని బ్రెగ్జిట్ భూతం గురించి ఉన్నవీ లేనివీ నూరి పోయగా బ్రెగ్జిట్ ఎలా సంభవం?

బ్రెగ్జిట్ కు అనుకూలంగా ఫలితం వస్తే గనక అది అద్భుతమే అవుతుంది.

మంగళవారం సాయంత్రం వెంబ్లే స్టేడియంలో జరిగిన చర్చతో రిఫరెండంపై ప్రచారానికి తెర పడింది. ప్రస్తుతం ఇరు పక్షాలు వివిధ సర్వేల ఫలితాలను తిరగేస్తూ మేమే గెలుస్తాం అంటే మేమే గెలుస్తాం అన్న నమ్మకంతో ఉన్నాయి. ఈ లోపు వివిధ సర్వే సంస్ధలు తమ తమ సర్వేలతో సందడి చేస్తున్నాయి. ఏ పరిస్ధితుల్లో ఎవరు గెలవచ్చు అన్న అంశంపై ఊహాగానాలు సాగిస్తున్నాయి.

NatCen Social Research సంస్ధ నిర్వహించిన “What UK Thinks” సర్వే, రిమైన్ శిబిరానికే స్వల్ప మెజారిటీ ఉన్నట్లు ప్రకటించింది. Remain శిబిరానికి 51 పాయింట్లు కట్టబెట్టిన సర్వే Leave శిబిరానికి 49 పాయింట్లు కట్టబెట్టింది. ఇటీవల జరిగిన 6 అభిప్రాయ సేకరణ సర్వేల ఫలితాలను సమీక్షించి 51-49 నిర్ధారణకు వచ్చామని సదరు సంస్ధ పేర్కొంది.

పందేల నిర్వాహకులు (బుక్ మేకర్స్) ఎక్కువగా రిమైన్ వైపే మొగ్గు చూపుతున్నారని పత్రికల ద్వారా తెలుస్తోంది. విలియం హిల్ అనే బుక్ మేకర్ సంస్ధ రిమైన్ శిబిరం నెగ్గటానికి 81 శాతం అవకాశాలున్నాయని పేర్కొన్నట్లుగా ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక తెలిపింది.

వివిధ విశ్లేషణల ప్రకారం వయసు మీద పడిన పౌరులు అత్యధికంగా లీవ్ శిబిరంలో ఉండగా, యువకులు-వలస వచ్చి స్ధిరపడినవాళ్ళు ఎక్కువగా రిమైన్ శిబిరంలో ఉన్నారు.

రిఫరెండం ఓటింగ్ లో పాల్గొనేవారి సంఖ్యను బట్టి కూడా ఫలితాలు ఉంటాయని విశ్లేషణలు చెబుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఓటింగ్ జరిగితే రిమైన్ నెగ్గుతుందని, తక్కువగా ఓటింగ్ జరిగితే లీవ్ శిబిరం నెగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఓటింగ్ లో తక్కువ హాజరు నమోదు కావటం అంటే అర్ధం ఓటర్లలో పెద్దగా ఆసక్తి లేదని. అనాసక్త వాతావరణంలో ఒక నిబద్ధత ఉన్నవారే పోలింగ్ బూత్ లకు వస్తారని, అటువంటి ఓపిక, నిబద్ధతలు పెద్దవారికే ఉంటాయని విశ్లేషిస్తున్నారు.

ఈ విశ్లేషణ ఎక్కువ పాళ్ళు నిజమే. ఇండియాలోనూ ఇది కనిపిస్తుంది. ఉన్న ప్రభుత్వాన్ని దించేయాలని భావించినప్పుడు ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొంటారు. తక్కువ సంఖ్యలో ఓటింగ్ జరిగినప్పుడు ఎక్కువగా పాత ప్రభుత్వమే కొనసాగుతుంది.

స్కాట్లండ్, ఉత్తర ఐర్లాండ్ (పశ్చిమ ఐర్లాండ్ భాగం,  ‘ఐర్లాండ్’ గా ప్రత్యేక దేశంగా విడిపోయింది) ప్రజలు రిమైన్ పక్షానే ఉంటారని అంచనా వేస్తున్నారు. మధ్య ఇంగ్లండ్ ప్రాంత ప్రజలు లీవ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారని భావిస్తున్నారు.

లండన్ నగరం అనేక దేశాల నుండి వచ్చినవారికి నిలయం. ఈ‌యూ సభ్య దేశాలతో లండన్ వాసులకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ద్రవ్య కేంద్రం అయిన లండన్ కు విడివడితే ఒక లాభం, కలిసి ఉంటే మరో లాభం. కానీ విశ్లేషణలు మాత్రం లండన్ మెజారిటీ ‘రిమైన్’ పక్షం లోనే ఉంటుందని చెబుతున్నాయి.

మైనారిటీలు, దక్షిణాసియా నుండి వచ్చి స్ధిరపడిన వాళ్ళు మొత్తంగా ‘రిమైన్’ పక్షంలో ఉన్నారని భావిస్తున్నారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా రిమైన్ శిబిరంలో ఉన్నారని చెబుతున్నారు.

వాతావరణం కూడా రిఫరెండం లో ఒక పాత్ర పోషించనుంది. జూన్ 23 తేదీన బ్రిటన్ లో తుఫాను వాతావరణం ఏర్పడనుందని వాతావరణ శాఖ సమాచారం ఇచ్చింది. అనగా ఎక్కువ మంది పోలింగ్ బూత్ లకు రాకపోవచ్చు. అప్పుడు లీవ్ శిబిరానికి ఎక్కువ అవకాశం ఉన్నట్లు.

మీడియా సంస్ధలు కూడా రెండు శిబిరాలుగా చీలి ఉన్నాయని ది హిందు తెలిపింది. ద టైమ్స్, గార్డియన్, సండే అబ్జర్వర్, మెయిల్ ఆన్ సండే, సండే టెలిగ్రాఫ్ పత్రికలు రిమైన్ శిబిరంలో ఉండగా డెయిలీ టెలిగ్రాఫ్, డెయిలీ మెయిల్, సన్ సంస్ధలు లీవ్ శిబిరంలో ఉన్నాయని తెలిపింది.

సామ్రాజ్యవాదులు ఎంతగా బలహీనపడితే మూడో ప్రపంచ దేశాలకు అంత మేలు జరుగుతుంది. కాబట్టి బ్రెగ్జిట్ సాకారం కావడమే భారత దేశంతో పాటు మూడో ప్రపంచ దేశాలకు ప్రయోజనం. నిజానికి యూ‌కే ప్రజలకు కూడా బ్రెగ్జిట్ ప్రయోజనమే. ఆ సంగతి వారికి తెలియాలి కదా!

ఇటీవల కాలంలో ఆర్ధిక సంస్కరణలకు షరతులు లేని మద్దతు ఇస్తున్న ది హిందుతో సహా భారత కార్పొరేట్ పత్రికలు యావత్తూ యూ‌కే, ఈ‌యూ లో ఉండాలని కోరుతున్నాయి. “ఓ బ్రిటన్, బైటికి వెళ్ళొద్దు ప్లీజ్” అంటూ ఆర్టికల్స్ ను సైతం ఇవి ప్రచురించాయి. పెట్టుబడిదారీ విష పుత్రికల ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా ఉండటంలో ఆశ్చర్యం ఏముంది గనక?

సిరియా నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో ఐరోపా దేశాలకు శరణార్ధులుగా వలస వస్తున్న / తరలిస్తున్న నేపధ్యంలో శరణార్ధుల సమస్య ఇటీవల కాలంలో పెద్ద సమస్యగా ఐరోపా ప్రజలు భావిస్తున్నారు. సిరియా శరణార్ధులను ఆహ్వానిస్తూ జర్మనీ ఛాన్సలర్, ఈ‌యూ లు ఆ మధ్య ప్రకటనలు గుప్పించారు. సభ్య దేశాలకు శరణార్ధుల కోటాలను కూడా ఈ‌యూ నిర్దేశించింది.

ఈ నేపధ్యంలో ఈ‌యూ లో కొనసాగితే శరణార్ధులతో యూ‌కే నిండి పోతుందని లీవ్ అనుకూలురు భావిస్తున్నారు. లీవ్ శిబిరం కూడా శరణార్ధుల భయాన్ని బాగా రెచ్చగొట్టింది. ఈ భయాన్ని అధిగమించడం రిమైన్ శిబిరానికి గట్టి సవాలు కావటం ఒక వాస్తవం.

బ్రెగ్జిట్ వాతావరణం చుట్టుముట్టిన నేపధ్యంలో యూరో, పౌండ్ విలువలు ఇటీవల ఒడి దుడుకులు ఎదుర్కొన్నాయి. ఈ రోజు -జూన్ 22- కూడా ఆ రెండు కరెన్సీల విలువలు క్షీణతకు గురయ్యాయి.

“28 సభ్య దేశాల యూరోపియన్ యూనియన్ నుండి విడిపోవటానికి బ్రిటన్ నిర్ణయిస్తే గణనీయమైన ఆర్ధిక పరిణామాలు సంభవిస్తాయి. ద్రవ్య మార్కెట్ పై బ్రెగ్జిట్ వల్ల కలిగే ప్రభావాలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి ఆటంకాలుగా మారతాయి” అని అమెరికా ఫెడరల్ రిజర్వ్ (సెంట్రల్ బ్యాంక్) ఛైర్మన్ జానెట్ యెల్లెన్ ఈ రోజు ప్రకటించింది.

“లీవ్ శిబిరం నెగ్గితే పౌండ్ స్టెర్లింగ్ విలువ ఖచ్చితంగా తీవ్రంగా క్షీణిస్తుంది. సెప్టెంబర్ 1992 లో జరిగిన 15 శాతం క్షీణత  కంటే ఈసారి క్షీణత బాగా ఎక్కువగా ఉంటుంది” అని అమెరికన్ బిలియనీర్ జార్జి సోరోస్ యూ‌కే ప్రజలను బెదిరించారు.

ఐ‌ఎం‌ఎఫ్ కూడా ఇదే తరహాలో బెదిరింపులు జారీ చేసింది. ఈ‌యూ లో యూ‌కే కొనసాగాలన్న డిమాండ్ విదేశాల నుండే ఎక్కువగా వినపడటం గమనార్హం. ఇది ప్రధానంగా బహుళజాతి కంపెనీల నుండి, కార్పొరేట్ మీడియా నుండి సూపర్ ధనిక కుటుంబాల నుండి వినవస్తోంది.

బ్రెగ్జిట్ వల్ల ఎవరికి నష్టమో, ఎవరికి ప్రయోజనమో ఈ ఒక్క సంగతే ఎరుకపరుస్తోంది.

2 thoughts on “రేపే బ్రెగ్జిట్ రిఫరెండం!

 1. అమెరికా ఆధిపత్యానికి జర్మనీ నేతృత్వంలోని ఈ.యు వాణిజ్యపరమైన(ప్రధానంగా) సవాళ్ళువిసురుతుందని భావిస్తున్న తరుణంలో ఈ.యు విచ్చిన్నం అయితే(తన ప్రయొజనాలకు భంగంకలగనంతవరకు) అది అమెరికాకు ప్రయోజనమే కదా!
  తమకు(అమెరికా నెంతృత్వంలోని సామ్రాజ్యవాదులకు) ఆటంకంపరిచే ఏ విషయాన్నైనా సహించలేని వారు ఈ.యు బలపడితే మాత్రం చూస్తూ ఊరుకోరుకదా!నా ప్రధాన ఉద్దేశ్యం ఈ.యు బలపడితే ఒక ప్రయోజనం,బలహీన పడితే మరో ప్రయోజనం ఉన్నప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒక దానికి ఎంచుకొనే ప్రశ్న తలెత్తుతే వారు ఏ విషయం వైపు మొగ్గుచూపవచ్చు?(ప్రస్తుత బ్రెక్షిట్ పరిస్తితి కాకుండా దీర్ఘకాలిక ప్రయొజనాలలో వారికి ఏది బెటర్?)
  సామ్రాజ్యవాదులు ఎటువంటి పరిణామాన్నైనా తమకు అనుకూలంగా మలుచుకుంటారని తెలిసిన విషయమే కదా?

 2. ఈ‌యూ context లో అమెరికా ప్రయోజనాలు కాస్త confusing గా ఉంటాయి.

  “ఈ‌యూ కలిసే ఉండాలి. కానీ తన అదుపాజ్ఞల్లో ఉండాలి” అన్నది అమెరికా ప్రయోజనం. ఒక్కో ఐరోపా దేశంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం కంటే గుండు గుత్తగా ఒకటే యూనియన్ తో ఒప్పందాలు చేసుకోవటం, ఇతరత్రా డీల్ చేయటం అమెరికాకు తేలిక. అందుకు అవి కలిసి ఉండాలి. కానీ తన మాటకు ఎదురు చెప్పకూడదు. పోటీ రాకూడదు. “నీకు ఎంత భాగం కావాలో నిర్ణయించి ఇస్తున్నా కదా? ఇంకా ఎందుకు నీల్గుడు?” అని అమెరికా అంతరార్ధం.

  అర్ధం చేసుకోవటానికి చిన్న ఉదాహరణ చూద్దాం.

  ఓ భర్త భార్య ఉన్నారు. భర్త భాగా సంపాదిస్తున్నాడు. సుఖంగా సంసారం కొనసాగుతుండగా భర్తకు మరో స్త్రీపైన మోజు పుట్టింది. ఇంకో ఇల్లు తీసుకుని ఆ స్త్రీని అక్కడ ఉంచి రెండు ఇళ్లూ చూసుకుంటున్నాడు. రెండు ఇళ్లకీ అన్నీ సౌకర్యాలు ఇస్తున్నాడు.

  మొదటి భార్యకు విషయం తెలిసింది. భర్తని నిలదీసింది. “నీకు ఏం లోటు చేస్తున్నాను? భ్రహ్మాండమైన ఇల్లు కట్టించాను. ఆ ఇంటికి రాణివి నువ్వే. చట్టబద్ధంగా భార్యవు నువ్వే. భార్య హక్కులు నీవే. వారసత్వ హక్కులు నీ పిల్లలవే. ఇంకా ఏంటీ నీ నీల్గుడు?” అని ప్రశ్నిస్తే మొదటి భార్య ఏం సమాధానం ఇస్తుంది?

  ఆ భర్త గారికి ఇద్దరు భార్యలూ కావాలి. ఇద్దరు భార్యల్ని మెయింటెయిన్ చేస్తున్నాడన్న సామాజిక గౌరవం కావాలి. (తప్పో ఒప్పో తర్వాత సంగతి) తన ఆస్తులకు చట్టబద్ధ వారసుల్ని కన్న మొదటి భార్య తన వద్దే ఉండాలి. తన మోజు తీర్చే రెండో భార్యా తన వద్ద ఉండాలి.

  మొదటి భార్య నిలదీత భర్తకు సమ్మతం కాదు. ఈ‌యూ స్వతంత్ర ఉనికి కోరిక అమెరికాకు సమ్మతం కాదు.

  అమెరికా శక్తి కృశిస్తున్న పరిస్ధితుల్లో బ్రిటన్ లాంటి దేశాలకు చైనా ఆర్ధిక శక్తిని స్పేర్ గా ఉంచుకోవాల్సిన అవసరం. కానీ అలా పక్క చూపు మొదలైతే చూపుతో ఆగదని అమెరికాకు తెలుసు.

  అనేకానేక కోణాలు భౌగోళిక రాజకీయాల్లో పని చేస్తుంటాయి. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి తల పైకి ఎత్తుతూ ఉంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s