రాజన్: గిల్లి జోల పాడుతున్న పాలకులు -విశ్లేషణ


raghuram-rajan

“పొమ్మనలేక పొగబెట్టారు” అని మర్యాదగా చెప్పుకోవటానికి కూడా వీలు లేకుండా బి‌జే‌పి పాలకులు రఘురాం రాజన్ పట్ల వ్యవహరించారు.

హద్దు పద్దు ఎరగని నోటికి ఓనర్ అయిన సుబ్రమణ్య స్వామి తనపైన అలుపు లేకుండా మొరగటానికి కారణం ఏమిటో, ఆయన వెనుక ఉన్నది ఎవరో తెలియని అమాయకుడా రాజన్?

రెండో విడత నియామకం ద్వారా ఆర్‌బి‌ఐ గవర్నర్ పదవిలో కొనసాగేందుకు తాను సిద్ధంగా లేనని, అకడమిక్ కెరీర్ పైన దృష్టి పెట్టదలుచుకున్నానని ప్రకటించడం ద్వారా ‘అంత అమాయకుడిని కాదు’ అని ఆయన చెప్పారు.

రఘురాం రాజన్ ను పదవిలో కొనసాగకుండా చేసేందుకు బి‌జే‌పి పాలకులు వారి వెనక ఉన్న దళారీ పారిశ్రామిక వర్గాలు  ఒక శిఖండిని అరువు తెచ్చుకుని తమ ముందు నిలబెట్టారు. ఆయన పేరే సుబ్రమణ్య స్వామి.

సదరు శిఖండి గారు రెండు మూడు వారాల క్రితం గాంధీ కుటుంబం పై నుండి అకస్మాత్తుగా దృష్టి మరల్చి రాజన్ పైన అదే పనిగా మొరగటం మొదలు పెట్టారు. రఘురాం రాజన్ భారత ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధికి ఆటంకం అనీ, ఆయన పూర్తి భారతీయుడు కాదనీ ఆ మొరుగుడులో వినిపించిన వాదన!

ఆర్ధిక వృద్ధికి ఎలా ఆటంకం అయ్యారు అంటే వడ్డీ రేట్ల ద్వారా అన్నది ఒకే ఒక్క సమాధానం. దేశంలో ద్రవ్య చలామణిని నియంత్రించటానికి ఆర్‌బి‌ఐ కి అందుబాటులో ఉండే ఒక సాధనం రేపో రేటు. ఇది ఆర్‌బి‌ఐ వసూలు చేసే స్వల్పకాలిక వడ్డీ రేటు.

ఆర్‌బి‌ఐ చేతిలో ఇతర ఉపకరణాలు కూడా ఉంటాయి. క్యాష్ రిజర్వ్ రేషియో, రివర్స్ రేపో రేటు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్), మారిజినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎం‌ఎస్‌ఎఫ్) రేటు… ఇవి ఇతర రేట్లు. వీటన్నింటిలో ముఖ్యమైనది రెపో రేటు. ఇతర రేట్లు ఏదో విధంగా దీనిపైన ఆధారపడి ఉంటాయి. (ఈ రేట్ల గురించి అవగాహనకు ఈ లంకె లోకి వెళ్ళండి.)

సుబ్రమణ్య స్వామి మొరుగుడు, ఏడుపు… ఏదైనా అనండి.., అదంతా ఈ రెపో రేటు గురించినదే.

దేశంలో ఆర్ధిక పరిస్ధితి సానుకూలంగా ఉన్నప్పటికీ రెపో రేటును తగ్గించడానికి రాజన్ విముఖంగా ఉన్నారనీ, అందువలన దేశానికి అనగా పరిశ్రమాధిపతులకు సరసమైన రేట్లకు రుణాలు అందుబాటులో లేకుండా పోయాయని ఫలితంగా ఆర్ధిక వృద్ధి పెరగవలసినంత వేగంగా పెరగలేదని స్వామి, ఆయన ద్వారా జైట్లీ, మోడి ప్రభుత్వం ఆరోపించారు.

పాఠకులకు గుర్తుంటే ఆర్ధిక మంత్రిగా ఉండగా పి.చిదంబరం ఆనాటి ఆర్‌బి‌ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారెడ్డి పైన కూడా ఇలాగే కినుక వహించారు. కానీ ఆయన ఎప్పుడూ ఇలా బరి తెగించి మొరుగుడు కుక్కలను ఉసిగొల్పలేదు. అలాగని నిరసన చెప్పకుండా ఊరుకోనూ లేదు. “సహకారం లేకుండా పోయింది. అయినా మేమే కిందా మీదా పడతాం” లాంటి మాటలతో మాత్రమే ఆయన నిరసించారు తప్ప వీరంగం వేయలేదు.

చిత్రం ఏమిటంటే సుబ్బారెడ్డి గారిపై అంతగా కినుక వహించి తాను ఏరి కోరి తెచ్చుకున్న రఘురాం రాజన్ కూడా చిదంబరం కోరికలను మన్నించలేదు. ఆర్‌బి‌ఐ గవర్నర్ పదవిలో కూర్చున్నాక ఆ పదవి నిర్దేశించే సూత్రాలను, నడవడిని పాటించక ఎవరికైనా తప్పదు మరి.

రెపో రేటు అంటే తన వద్ద నిధులను రుణాలుగా తీసుకునే వాణిజ్య బ్యాంకుల నుండి ఆర్‌బి‌ఐ వసూలు చేసే వడ్డీ రేటు. దీనిని తగ్గిస్తే బ్యాంకులు విరివిగా ఆర్‌బి‌ఐ నుండి నిధులు సేకరించి అంతే విరివిగా పారిశ్రామికవేత్తలకు నిధులు పంచి పెట్టాలని ఒక అభిప్రాయం పాతుకునిపోయింది.

అలా చేస్తే పరిశ్రమల అధిపతులు రుణాలు తీసుకుని పెట్టుబడులు పెడతారని, దానితో పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకుని ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి వేగంగా వృద్ధి సాధిస్తుందని ఆర్ధిక మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు తాము భావిస్తూ ఇతరులు కూడా అదే భావించాలని చెబుతారు. వడ్డీ రేట్లు తగ్గించాలన్న తమ ఆకాంక్షలకు భిన్నంగా మాట్లాడే ఎవరైనా వృద్ధికి వ్యతిరేకులే అని ఒక ముద్ర వేయటం పరిపాటి అయింది.

అసలు ఆర్ధిక వృద్ధికీ, వడ్డీ రేట్లకు సంబంధం ఉన్నదా? సంబంధమే ఉన్నట్లయితే వడ్డీ రేట్లు తగ్గించడం, పెంచటం మన చేతుల్లో పని కనుక ఆర్ధిక వృద్ధి సాధించడం, సాధించలేకపోవటం కూడా మన చేతుల్లో పనే కావాలి. కానీ ఆచరణలో అలా లేకపోగా కేంద్ర ప్రభుత్వం, ఆర్ధిక మంత్రి తదితర పెద్దలు జి‌డి‌పి వృద్ధి కోసం అంతగా వెర్రెత్తి పోవలసిన అవసరం ఏమిటి?

వడ్డీ రేట్లు, ముందే చెప్పుకున్నట్లు ద్రవ్య చలామణిని నియంత్రించే ఉపకరణం మాత్రమే తప్ప అదే తానుగా ఉత్పత్తిని పెంచటమో తగ్గించటమో చేయదు. దేశంలో ఉత్పత్తి పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. ఉత్పత్తి విలువకు తగిన మొత్తంలో డబ్బు చలామణిలో ఉండేలా ఆర్‌బి‌ఐ చర్యలు తీసుకుంటుంది. వ్యవస్ధలో డబ్బు ఎక్కువగా ఉందని భావిస్తే వడ్డీ రేటు పెంచి అదనపు డబ్బుని absorb చేస్తుంది. వ్యవస్ధలో ఉత్పత్తి విలువ కంటే డబ్బు పరిమాణం తక్కువ ఉందని భావిస్తే వడ్డీ రేటు తగ్గించి మరింత డబ్బు చలామణిలోకి తెస్తుంది.

ఉత్పత్తి విలువ కంటే ఎక్కువ డబ్బు ఆర్ధిక వ్యవస్ధలోకి వస్తే ఏమవుతుంది? ఉత్పత్తి (సరుకుల) ధర కృత్రిమంగా పెరిగిపోతుంది. అనగా ధరలు పెరుగుతాయి. ఉత్పత్తి విలువ కంటే ద్రవ్యం ఎక్కువగా ఉండటమే ద్రవ్యోల్బణం కనుక అధిక ధరలు, ద్రవ్యోల్బణం దాదాపు ఒకటే అవుతాయి. ఈ రెండింటినీ ఒకే అర్ధంతో ఆర్ధికవేత్తలు ప్రస్తావిస్తూ ఉంటారు.

కనుక మానిటరీ పాలసీ నిర్ణయంలో ద్రవ్యోల్బణం గురించి ఆర్‌బి‌ఐ గవర్నర్ తప్పనిసరిగా పట్టించుకుంటారు. ద్రవ్యోల్బణం పెరిగితే అది మొత్తం దేశ ప్రజానీకానికే తీవ్రంగా హాని చేస్తుంది. ధరల పెరుగుదల వల్ల సాధారణ ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. కానీ ద్రవ్యోల్బణం గురించి పారిశ్రామిక వర్గాలు, ధనికులు పట్టించుకోరు. ఎవరన్నా పట్టించుకుంటే తెలివి తక్కువగా, తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లుగా పరిగణిస్తారు.

ప్రస్తుత గవర్నర్ రాజన్, గత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు లు ద్రవ్యోల్బణం ను ఎప్పుడూ ఒక కంట కనిపెట్టకుండా లేరు. ఆ మాటకు వస్తే ప్రపంచం లోని ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అయినా చేసేది అదే. ఆర్ధిక మాంద్యం, సంక్షోభ పరిస్ధితి నెలకొని ఉంటే తప్ప ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటానికే గవర్నర్ లు ప్రయత్నిస్తారు. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి సాపేక్షికంగా మెరుగుపరిచి సరుకుల కొనుగోలును పెంచుతారు.

వడ్డీ రేటు అన్నది డబ్బును ఒకరి చేతి నుండి మరొకరి చేతికి మార్చుతుంది తప్ప తానుగా ఉత్పత్తి చేయదు. వడ్డీ రేటు తగ్గించి నిధుల్ని తేరగా ధనిక వర్గాలకు, పారిశ్రామిక వర్గాలకు ఇవ్వాలి అంటే ఎక్కడి నుండి తేవాలి? ఎవరో ఒకరు పోగొట్టుకోవటానికి సిద్ధంగా ఉంటేనే కదా మరొకరికి పంచి పెట్టేది! రేటు తగ్గింపు గురించి తనపై విమర్శలు వచ్చినప్పుడల్లా రాజన్ ఇదే ప్రశ్న వేశారు. సమాధానం చెప్పిన వాడు లేడు.

డబ్బు దానికదే విలువ కలిగి ఉండదు. అది విలువకు రూపం మాత్రమే. అసలు విలువ ఉత్పత్తి/సరుకులలో ఉంటుంది. ఆ విలువను ప్రతిబింబించేది డబ్బు. కనుక ఉత్పత్తి పెరిగితేనే డబ్బు పెరుగుతుంది తప్ప డబ్బు పెరిగితే ఉత్పత్తి పెరగదు. డబ్బు పెరిగితే పెరిగేది ధరలు లేదా ద్రవ్యోల్బణం.

సమస్య ఎక్కడ వస్తున్నది అంటే ధనిక వర్గాలు అక్రమంగా విదేశాలకు, నల్ల మార్కెట్ కు డబ్బు తరలించడం నుండి. ధనికవర్గాలు అక్రమంగానో, సక్రమంగానో తాము సంపాదించే విలువను తిరిగి మార్కెట్ లో మదుపు చేస్తేనో, పెట్టుబడులు పెడితేనో డబ్బుకు కొరవ ఉండదు. తమ డబ్బుని నల్ల మార్కెట్ లో దాచుకుని జనం డబ్బు / పన్నుల ద్వారా సమకూరే బడ్జెట్ సొమ్ము ని మరింతగా దోచుకుని దానిని పెట్టుబడులుగా పెట్టాలని చూడడం నుండే సమస్య వస్తోంది.

సుబ్బారావు గానీ, రాజన్ గాని అనేక మార్లు చెప్పింది ఏమిటి అంటే ఆర్ధిక వృద్ధి (జి‌డి‌పి వృద్ధి) తమ చేతుల్లో పని కాదని, ఆర్ధిక వ్యవస్ధలో కార్యకలాపాలు పెరగకుండా లేదా నిజ ఆర్ధిక వ్యవస్ధలో ఉత్పత్తి కార్యకలాపాలు జరగకుండా ఆర్‌బి‌ఐ చేయగలిగేది ఏదీ ఉండదు అని.

“ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం చేసుకునే విధానానికి నేను వ్యతిరేకం” అంటూ అరుణ్ శౌరీ లాంటి వారు ఏవో పాఠాలు చెప్పబోతారు. కానీ ద్రవ్యోల్బణం-ధరల పెరుగుదల-మానిటరీ పాలసీ ఇవన్నీ ఒకే ఆర్ధిక వ్యవస్ధకు సంబంధించిన వివిధ అంశాలు అన్న సంగతి వీరు తేలికగా మర్చిపోతుంటారు. మానిటరీ పాలసీ అంటేనే ద్రవ్య నిర్వహణ అని. ఇక అందులో ద్రవ్య + ఉల్బణం పాత్ర కాకుండా ఎలా పోతుంది? ద్రవ్యం ఎంత ఉండాలీ అని నిర్ణయించే పాలసీ ద్రవ్యం ఎక్కువ/తక్కువ చెలామణీలో ఉన్న సంగతిని పట్టించుకోకుండా ఉంటుందా?

వస్తువును పోగొట్టుకున్న చోట వెతికితే దొరుకుతుంది గానీ, వెలుతురు ఉంది కదాని మరోచోట వెతికితే దొరుకుతుందా? నల్ల ఖాతాల్లో దాచిన డబ్బు బైటికి తీయకుండా ఇంకెవడి ముల్లె అంతా కావాలని తలపోసి అందుకు ఆర్‌బి‌ఐ ఆటంకంగా ఉందని అంటే ఎలా నమ్మటం?

వాస్తవం ఏమిటి అంటే రఘురాం రాజన్ తీసుకున్న కొన్ని చర్యలు -చాలా నామమాత్రం అనదగినవి- భారత ధనిక వర్గాలకు రుచించలేదు. వాటిలో ఒకటి బ్యాంకు బ్యాలన్స్ షీట్ల దుమ్ము దులపటం. ధనిక కుటుంబాలు తీసుకున్న వేలాది, లక్షలాది కోట్ల మొండి బాకీలను పుస్తకాల్లో తగిన విధంగా చూపించకుండా బ్యాంకులు సృజనాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చాయి. ఆ సృజనాత్మకత లక్ష్యం ఏమిటి అంటే ధనికవర్గాల ఋణ ఎగవేత ఎవరికీ తెలియకుండా దాచి పెట్టడం.

గత ఆర్టికల్స్ లో వివరించినట్లుగా బ్యాంకులు ఎన్‌పి‌ఏ లను బ్యాలన్స్ షీట్లలో చూపకుండా ఉంచుతారు. వసూలు కావలసిన రుణాలను ఎన్‌పి‌ఏ ల కిందకు నెట్టేసి పుస్తకాల్లో చూపించకుండా ఉండటం వలన బ్యాంకులు లాభాలు ఆర్జించినట్లు కనిపిస్తుంది. అలా చేయవద్దు అని రాజన్ నిర్దేశించారు.

పుస్తకాల నుండి ఋణ ఆస్తులను మాయం చేయటం అంటే పూర్తిగా ఎగవేయటానికి తగిన సువర్ణావకాశాన్ని ఎగవేతదారులకు పళ్ళెంలో పెట్టి అప్పగించడమే. పుస్తకంలో కనిపిస్తుంటే వాటిని వసూలు చేయాలన్నది కనిపిస్తుంది. పుస్తకంలో లేకుండా చేశాక వాటిని వసూలు చేసే ఆసక్తి ఎందుకు ఉంటుంది? “నామమాత్రంగా పుస్తకాల నుండి తొలగిస్తామే తప్ప వాటిని వసూలు చేసేందుకు ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి” అని బ్యాంకులు చేసిన ప్రకటన కేవలం తమ తప్పులను కప్పి పుచ్చుకోవటానికే.

రాజన్ నిర్దేశం వలన ఎన్‌పి‌ఏ లు బ్యాంకు పుస్తకాలలో తిరిగి ప్రత్యక్షం అయ్యాయి. బ్యాలన్స్ షీట్ల లో ఋణ ఆస్తులుగా కనిపించాయి. ఋణ ఆస్తులుగా కనిపించాక ఆ రుణాల షెడ్యూల్ అనివార్యంగా తయారు చేయాలి. ఎవరెవరు, ఎంతెంత, ఎప్పుడెప్పుడు రుణాలు తీసుకున్నారో చూపించే జాబితాయే ఋణ షెడ్యూల్. షెడ్యూల్ లో కనిపించాక ఆ రుణాలను తప్పనిసరిగా వసూలు చేయాల్సి వస్తుంది.

రాజన్ తీసుకున్న మరో చర్య ‘విల్ ఫుల్ డీఫాల్టర్స్ జాబితా’ ప్రకటించాలని నిర్దేశించటం. పదే పదే రుణాలు తీసుకుంటూ ఎగవేస్తున్నవారిని ‘ఉద్దేశ్యపూర్వకంగా రుణాలు ఎగవేస్తున్నవారు’గా బహిరంగంగా ప్రకటించాలని ఆయన నిర్దేశించారు. అలా ప్రకటించిన వారిలో ఒకరు విజయ్ మాల్యా. 9,000 కోట్లకు పైగా చెల్లించాల్సిన మాల్యా బ్రిటన్ పారిపోయి “నేను పారిపోలేదు. ఇండియాలో నాకు న్యాయం దక్కదు. 3,000 కోట్లు చెల్లిస్తా” అంటూ బేరం పెడుతున్నాడంటే అందుకు రాజన్ ఉత్తర్వులు కూడా ఒక కారణం.

ఒక బ్యాంకులో  అప్పు తీర్చడానికి రొక బ్యాంకులో అప్పు చేసే పద్ధతులకు కూడా రాజన్ విధానాలు చెక్ పెట్టాయి.

మాల్యా ఎదుర్కొంటున్న పరిస్ధితికి రాజన్ నిర్దేశన ఒకానొక కారణం మాత్రమే. గొలుసు కట్టు కారణాల్లో ఒక లంకె మాత్రమే రాజన్. మాల్యా స్ధితికి అసలు కారణం ఆయన అప్పు తీసుకుని ఎగవేయటమే. దేశంలో పరిశ్రమ పెడతానని అప్పు తీసుకుని విదేశాల్లో ఆస్తులు కొన్న మాల్యా తన పరిస్ధితికి మరొకరిని బాధ్యులను చేయటం హాస్యాస్పదం.

బ్రిటన్ పారిపోయి ధర్మ పన్నాలు పన్నుతున్న మాల్యా చివరికి ఈ‌డి హక్కులను కూడా ప్రశ్నిస్తున్నాడు. ఈ పరిస్ధితి రావటానికి కారణం భారత ప్రభుత్వం అనుసరిస్తూ వచ్చిన ధనికవర్గాల అనుకూల విధానాలు. రాజన్ పూనుకుని ఆ విధానాల్లో ఎక్కడో ఒక మూల కాస్త సవరణ చేయటం తోనే మిన్ను మీద పడిపోయినట్లుగా పరిశ్రమ వర్గాలు బెంబేలు ఎత్తుతున్నాయి. ఇదే వరసలో పరిణామాలు జరిగితే తమ గుట్టు మట్లు కూడా త్వరలో బైటికి రావటం ఖాయం అని భావించినందునే ఆయన వెళ్లిపోవాలని అందరూ కోరుకున్నారు.

వారి ప్రతినిధిగా సుబ్రమణ్య స్వామి ముందుకు వచ్చాడు. మొరుగుడు మొదలు పెట్టాడు. మోడి, మంత్రులు కూడా భారత ధనికవర్గాల ప్రయోజనాలను కాపాడేవారే తప్ప ప్రజల ప్రయోజనాలకు నిబద్ధులైనవారు కాదు. అందు వల్లనే స్వామి ఎన్ని కూతలు కూసినా మోడి, జైట్లీలు అదేమని ప్రశ్నించలేదు. ఒకటీ అరా మాట అన్నా అది స్వామిని కట్టడి చేసేందుకు ఉద్దేశించి అనలేదు. వారి లక్ష్యం స్వామి మొరుగుడు ద్వారా రాజన్ స్వయంగా తప్పుకుంటానని ప్రకటించేలా చేయటమే.

ఆ కాస్త మాటా రాజన్ అన్నాక అప్పుడు వరదలా ప్రవహించాయి మొక్కుబడి సానుభూతి వచనాలు. ఫిక్కీ, ఎఫ్‌ఐ‌ఐ ల దగ్గరి నుండి వ్యక్తిగత వ్యాపార కుటుంబ ప్రతినిధుల వరకు “రాజన్ నిర్ణయాన్ని గౌరవిద్దాం” అంటూ సంబర పడ్డవాళ్లే. ఆ సంబరంలో రాజన్ దేశానికి చేసిన సేవలను ఏకరువు పెట్టి పొగడ్తలు కురిపించటానికి వారికి అభ్యంతరం కనపడలేదు.

రఘురాం రాజన్ పట్ల ఆర్‌ఎస్‌ఎస్ పరివారం మొదటి నుండి విముఖంగా ఉండటమే సుబ్రమణ్య స్వామికి ఉన్న బలం. తన ప్రోద్బలంతోనే స్వామికి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టిన ఆర్‌ఎస్‌ఎస్, రాజన్ అనుసరించిన మానిటరీ పాలసీ వల్ల భారత వ్యాపారులు ఇబ్బంది పడ్డారని భావిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్ధ వెల్లడి చేయటం గమనార్హం. రాజన్ సరైన నిర్ణయం తీసుకున్నారని ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త గురుమూర్తి ప్రకటించారు కూడా.

ఆర్టికల్ విశ్లేషణ అర్ధం రఘురాం రాజన్ భారత ప్రజల ప్రయోజనాలకు కట్టుబడిన వారని చెప్పటం కాదు. సామ్రాజ్యవాద ప్రయోజనాలకు అనుగుణంగా భారత ఆర్ధిక వ్యవస్ధను, ద్రవ్య విధానాలను తీర్చి దిద్దటానికే రఘు రామ్ రాజన్ నియమితులు అయ్యారనటంలో ఎలాంటి సందేహము అవసరం లేదు.

రఘురాం రాజన్ చర్యల కారణం గానే విదేశీ పెట్టుబడులు ఆ మాత్రమైనా ఇండియాకు వచ్చాయని వాణిజ్య పత్రికలు చేసిన, చేస్తున్న విశ్లేషణలను విస్మరించకూడదు. ప్రపంచం నిండా అస్ధిరత నిండి ఉంటే సాపేక్షికంగా భారత ఆర్ధిక వ్యవస్ధ నిలకడ కలిగి ఉండటంలో రఘురాం తీసుకున్న నిర్దిష్ట చర్యలే ప్రధాన పాత్ర వహించాయని కొందరు నిపుణులు నిష్కర్షగా చెబుతున్నారు.

రాజన్ నిష్క్రమణ అనంతరం విదేశీ మదుపుదారులు తమ పెట్టుబడులను -కనీసం స్వల్ప కాలికంగా- వెనక్కి తీసుకుంటారని పలువురు నిపుణులు భావిస్తున్నారు. ఎకనమిక్ టైమ్స్ పది రోజుల క్రితం ప్రకటించిన సర్వే ప్రకారం 85 శాతం ఇన్వెస్టర్లు రాజన్ నిష్క్రమణ భారత మార్కెట్ సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం పడవేస్తుందని భావిస్తున్నారు.  షేర్ మార్కెట్లు మరోసారి కూలిపోతాయని సెన్సెక్స్ మళ్ళీ 25,000 దిగువకు పడిపోతుందని అంచనా వేస్తున్నారు.

రాజన్ నిష్క్రమణ వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిణామాలను ఎదుర్కొనడానికా అన్నట్లుగా ఈ రోజు మోడి ప్రభుత్వం విదేశీ మార్కెట్లను సంతృప్తి పరుస్తూ పలు సంస్కరణలు ప్రకటించింది. పౌర విమానయాన రంగంలో 100 శాతం ఎఫ్‌డి‌ఐ లకు అనుమతి ఇస్తూ మోడి ప్రభుత్వం నిర్ణయం చేసింది.

కేంద్రం అనుమతి లేకుండా ఔషధ రంగంలో 74 శాతం ఎఫ్‌డి‌ఐ లు పెట్టవచ్చని ప్రకటించింది. సింగిల్ బ్రాండ్ రిటైల్ ఎఫ్‌డి‌ఐ కంపెనీలు తప్పనిసరిగా 30 శాతం ముడి సరుకులను ఇండియాలోనే పొందాలన్న నిబంధనలను సడలించి యాపిల్, ఐ‌కే‌ఈ‌ఏ లాంటి బడా కంపెనీలను సంతృప్తి పరిచింది. ఈ చర్యల పట్ల కొన్ని (విదేశీ) కంపెనీలు హర్షం ప్రకటించగా వాణిజ్య పత్రిక రాయిటర్స్ పెదవి విరిచి “ఇంకా చేయాలి” అని ప్రకటించింది.

రాజన్ ఉద్వాసన/నిష్క్రమణ పట్ల అసంతృప్తి చెందిన విదేశీ ఎఫ్‌డి‌ఐలకు సర్ది చెప్పేందుకు మోడి ప్రభుత్వం తాజా సంస్కరణల చర్యలను ప్రకటించింది. అనగా రాజన్ విదేశీ పెట్టుబడులకు స్నేహితుడని రుజువు అయినట్లే.

బ్యాంకుల ఆర్ధిక పరిస్ధితి మెరుగుపరచడానికి రఘు రామ్ అమలు చేసిన విధానాలు తమ ద్రవ్య వనరులను తద్వారా అక్రమ చర్యలను దెబ్బ తీయటానికి వీలు లేదని దళారీ పాలక వర్గాలు భావించిన ఫలితమే రఘురాం రాజన్ ఉద్వాసన. ఈ ఉద్వాసన భారత పాలకులు, సామ్రాజ్యవాదుల సంబంధాల్లో ఏయే పరిణామాలకు తావిచ్చిందో పరిశీలన చేయవలసి ఉన్నది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s