రోహిత్ దళితుడే, కలెక్టర్ అధికారిక నిర్ధారణ!


Rohith

భారత దేశ హిందూ కుల సమాజం, బి‌జే‌పి నేతృత్వం లోని బ్రాహ్మణీయ అధికార వ్యవస్ధ, హిందూ కులాధిపత్యం నరనరానా నింపుకుని పార్లమెంటులో జడలు విప్పి నర్తించిన హైందవ విషనాగు నీడలోని కేంద్ర మంత్రులు కట్ట గట్టుకుని ఆత్మహత్య వైపుకు నెట్టివేసిన స్పుర ద్రూపి, దళిత రీసర్చ్ స్కాలర్ రోహిత్ వేముల మాల కులానికి చెందినవాడేనని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతి లాల్ దండే అధికారికంగా నిర్ధారించారు.

రోహిత్ వేముల దళితుడు కాదని, అతని కులం గూర్చి అబద్ధాలు చెప్పి యూనివర్సిటీలో జరిగిన గొడవను, రోహిత్ ఆత్మహత్యను కుట్రపూరితంగా దళిత సమస్యగా ముందుకు తెచ్చారని పత్రికల ముందు, ఛానెళ్ల కెమెరాల ముందు, వీధుల్లో, సభల్లో, పార్లమెంటు సమావేశాల్లో ఒకటే సొదగా విషం కక్కిన కేంద్ర మంత్రులు అందరూ ఇప్పుడు ఏం చెబుతారో చూడాలి.

రోహిత్ వేముల, భారత రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాల జాబితాకు చెందిన కులంగా గుర్తించిన మాల కులానికి చెందిన దళితుడు అని అధికారికంగా నిర్ధారణ అయినందున హైద్రాబాద్ పోలీసు స్టేషన్ లో ఎస్‌సి/ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదైన కేసుపై విచారణ కొనసాగటానికి అడ్డంకి తొలగిపోయింది. కేసులో యూనివర్సిటీ ఆఫ్ హైద్రాబాద్ వైస్ ఛాన్సలర్ అప్పారావు, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ మరితర ముగ్గురు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.

ఎస్‌సి/ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం కింద తనపై నమోదైన కేసు నుండి తనను తప్పించాలని కోరుతూ వి సి పొదిలే అప్పారావు పెట్టుకున్న విన్నపాన్ని హైద్రాబాద్ హై కోర్టు గత ఏప్రిల్ నెలలో తిరస్కరించిన సంగతి ప్రస్తావనార్హం. కేసులో పోలీసుల విచారణపై స్టే విధించేందుకు గానీ, ఎఫ్‌ఐ‌ఆర్ ను రద్దు చేసేందుకు గానీ, పోలీసులు అరెస్టు చేయకుండా స్టే విధించేందుకు గానీ హై కోర్టు నిరాకరించింది. ఈ సంగతి ఎందుకు వార్త కాలేదు అన్నది ఒక మిస్టరీ.

గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతి లాల్ దండే, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ (ఎన్‌ఎస్‌ఎస్‌సి) కి సమర్పించిన నివేదికలో ఒక భాగం ఇలా పేర్కొంది:

“గుంటూరు తహసీల్దారు వద్ద అందుబాటులో ఉన్న పత్రాల సాక్షాల (documentary evidence) ప్రకారం శ్రీ రోహిత్ చక్రవర్తి వేముల హిందు మాల కులానికి చెందినవారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ కులం షెడ్యూల్డ్ కులాల జాబితాలోని కులంగా గుర్తించింది. అతని కుటుంబం దారిద్ర్య రేఖకు దిగువన గల కుటుంబాల్లో ఒకటి. శ్రీ రోహిత్ చక్రవర్తి వేముల గారి అమ్మమ్మ మరియు ఇతరుల నుండి సేకరించి నమోదు (రికార్డు) చేసిన ప్రకటనలను మీ సమాచారం నిమిత్తం ఈ నివేదికతో జతపరుస్తున్నాము.”

రోహిత్ కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అడ్వకేట్ ఎస్ గుణ రతన్ ప్రకారం రోహిత్ మరణానంతరం అతని గుర్తింపును ఏ యితర మూడో వ్యక్తి సవాలు చేయటానికి చట్టం అంగీకరించదు. మాధురి పటేల్ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో ఔరంగాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు చట్టబద్ధంగా కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేయటానికి జిల్లా కలెక్టర్ గానీ, ఆయన నియమించిన అధికారి గానీ  తగిన అధికారాలు కలిగి ఉంటారు.

“రోహిత్ వేముల ఎస్‌సి, మాల అని జిల్లా కలెక్టర్ గారు ధృవీకరించారు కనుక ఆయన తండ్రి లేదా పోలీసులతో సహా మరే యితర మూడో వ్యక్తి అత్యాచారాల నిరోధక చట్టం కేసు విచారణలో జోక్యం చేసుకునేందుకు వీలు లేదు; సవాలు చేసేందుకు అర్హత లేదు” అని అడ్వకేట్ గుణ రతన్ చెప్పారని ది హిందు తెలిపింది.

రోహిత్ వేముల అత్యంత దారుణ పరిస్ధితుల్లో ఆధునిక అంటరానితనానికి గురై, యూనివర్సిటీ నుండి వెలివేయబడిన పరిస్ధితుల్లో తన వెలివేతకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధపడ్డాడు. బ్రాహ్మణీయ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రుల ఒత్తిడి ఫలితంగా వైస్ ఛాన్సలర్ ఏ విధంగానూ తన చదువును కొనసాగించేందుకు అవకాశం కల్పించబోడని రోహిత్ గుర్తించాడు.

చదువు పూర్తి చేసుకుని కొత్త కొత్త ఊహలతో, వ్యూహాలతో తమదైన వ్యాపారాలతో మిత్రుడితో కలిసి గుంటూరు నగరాన్ని ఏలుదామని కలలు కన్న రోహిత్, తన కలలు సాకారం అయ్యేందుకు తన చుట్టూ ఉన్న అసమాన సమాజం ఒప్పుకునే పరిస్ధితిలో లేదని గ్రహించాడు. తన పుట్టుకే ఒక చావుతో కూడిన ప్రమాదంగా తన ఎదుట వెక్కిరిస్తూ నిలబడిన పరిస్ధితిని ఎదుర్కొన్నాడు. అడుగడుగునా దళిత విద్యార్ధుల ఎదుగుదలకు, సంఘంగా ఏర్పడే హక్కుకూ అడ్డు పడుతున్న బ్రాహ్మణీయ విద్యార్ధి సంఘానికి సాక్షాత్తు కేంద్రం నుండే మద్దతు అందుతున్న నేపధ్యంలో పోరాటాన్ని విరమించేందుకు మనసు సహించక ఆత్మహత్యను పోరాట రూపంగా ఎంచుకుని అమలు చేశాడు రోహిత్ చక్రవర్తి వేముల.

రోహిత్ మిత్రుడు దొంతా ప్రశాంత్ ఫిర్యాదు మేరకు ఎస్‌సి/ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం కింద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయటంతో యూనివర్శిటీలను తమ భావజాలానికి అనుకూలంగా సంస్కరించుకోవాలని తలపెట్టిన హిందూత్వ కేంద్ర ప్రభుత్వం వ్యూహాలకు ఆదిలోనే హంసపాదు ఎదురయింది. సాక్షాత్తు కేంద్ర మంత్రులే ఎస్‌సి/ఎస్‌టి అత్యాచారాల కేసులో ముద్దాయిలై ఉండగా, దళిత వ్యతిరేక ముద్ర ఎన్నికల అవకాశాలను పరిమితం చేస్తున్న భయం వెంటాడడంతో రోహిత్ వేముల దళితుడు కాడు అని తేల్చవలసిన అగత్యం హిందూత్వ-కాషాయ పరివారానికి కలిగింది.

ఫలితంగా మానసిక నియంత్రణలో లేని రోహిత్ తండ్రి, ఆయన దళిత వ్యతిరేకత, దళిత స్త్రీని పెళ్లాడి మోసపోయానన్న ఆగ్రహం కాషాయ పరివారానికి, వారి అనుంగు అధికార వ్యవస్ధకూ అక్కరకు వచ్చాయి. దానితో “నేను మాలోడ్ని కాదు. నాణ్యమైన వడ్డెరలం” అంటూ రోహిత్ తండ్రి ఛానెళ్ల ముందుకు వచ్చాడు.

రోహిత్ తండ్రి మానసిక బలహీనత కాషాయ పరివారానికి కొండత బలాన్ని ఇచ్చింది. అదే తడవుగా “రోహిత్ దళితుడు కాదు. అతని ఆత్మహత్య, యూనివర్సిటీ వెలివేతలు దళిత సమస్య కాదు” అంటూ కేంద్ర మంత్రులు వరస పెట్టి ప్రకటనలు గుప్పించారు.

“ఇది దళితులు వర్సెస్ దళితేతరులు సమస్య కాదు. భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి దురుద్దేశంతో దీనిని దళిత సమస్యగా ముందుకు తెస్తున్నారు” అని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ రోహిత్ ఆత్మహత్య చేసుకున్న మూడు రోజుల తర్వాత విలేఖరుల సమస్య పెట్టి ప్రకటించారు.

“వేముల ఆత్మహత్యకు ముందు క్యాంపస్ లో 9 ఆత్మహత్యలు జరిగాయి. ఇది పదవది. మొదటి తొమ్మిది మంది ఆత్మహత్యలు ఇంత పెద్ద సమస్య ఎందుకు కాలేదు? … వేముల, అతని కుటుంబం మొత్తం వడ్డెర కులానికి చెందినవారు. అనగా అతను ఒక ఓ‌బి‌సి కులానికి చెందిన వ్యక్తి. కనుక ఇది ‘దళితులు వర్సెస్ దళితేతరులు’ సమస్య అయ్యే ప్రశ్నే లేదు” అని కేంద్ర సోషల్ జస్టిస్ & ఎంపవర్ మెంట్ శాఖ మంత్రి ధావర్ చంద్ గెహ్లాట్ ఫిబ్రవరి 2 తేదీన జైపూర్ లో విలేఖరుల సమావేశంలో ప్రకటించాడు.

“వేముల దళితుడు అని ఎవరు చెప్పారు? అతను దళితుడు కాదు. ఇది కేవలం రాజకీయ సమస్య” అని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తిరుపూర్ లో విలేఖరులను ప్రశ్నించాడు. మళ్ళీ గుచ్చి అడిగితే “అతను ఓ‌బి‌సి కేటగిరీకి చెందిన వాడని ఎవరో చెప్పారు. అతను అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కార్యకర్త అయితే కావచ్చు. ఆ మాటకొస్తే నేనూ అంబేద్కర్ ని ఆరాధిస్తాను. అంత మాత్రాన నేను ఫలానా కులానికి చెందినవాడినా?” అని సమాధానం ఇచ్చారు.

“ఈ కేసులో వాస్తవాలు బైటికి వస్తున్నాయి. నాకు తెలిసిన పూర్తి సమాచారం మేరకు ఆ విద్యార్ధి దళితుడు కాదు. అతనిని దళితుడు అని చెప్పడం ద్వారా ఈ సమస్య మొత్తానికి కొంత మంది కులం రంగు పులిమారు” అని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ బల్ల గుద్ది చెప్పారు.

ఇపుడీ కేంద్ర మంత్రులు ఏ మొఖం పెట్టుకుంటారు? రోహిత్ ఆత్మహత్య జరిగినప్పటి నుండి పదే పదే అబద్ధాలు చెబుతూ వచ్చిన మానవ వనరుల మంత్రి “నేను అలా అనలేదు” అని మరోసారి అబద్ధం చెబుతారా? “వేముల దళితుడు కాదని ఎవరన్నారు?” అని సంతోష్ కుమార్ మరో ప్రశ్న వేస్తారా? “మాల కులం దళిత కులం అని నాకు తెలియదు” అని సుష్మా గారు నాలుక మడత వేస్తారా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి లాగా “దేశం ఒక పుత్రుడిని కోల్పోయింది” అంటూ మొసలి కన్నీరు తుడుచుకుని విమానం ఎక్కేస్తారా?

ఎవరు ఏది చేసినా పొదిలే అప్పారావు, బండారు దత్తాత్రేయ, ఇతర నిందితులను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలి. విచారణ పూర్తి అయ్యే వరకూ, నిందితుల పలుకుబడి రీత్యా బెయిలు ఇవ్వకూడదు. ఎస్‌సి/ఎస్‌టి అత్యాచారాల చట్టం అదే చెబుతుంది. బి‌జే‌పి పాలకులు చట్టాన్ని అమలు చేస్తారా, లేక తమకు తామే మినహాయింపులు ఇచ్చుకుంటారా?

3 thoughts on “రోహిత్ దళితుడే, కలెక్టర్ అధికారిక నిర్ధారణ!

  1. ఎట్టకేలకు రొహిత్ కు సంభందించిన ఒక నిజం బయటకు వచ్చింది.ఈ విధంగానైనా అతనికి(కుటుంబసభ్యులకు) కొంత ఉపసమణం కలిగింది. కలక్టర్ నివేదికలో స్వతంత్ర దర్యాప్తు ఉందంటారా? లేకపోతే దీనిని ఉపయోగించుకొని చంద్రబాబు కేంద్రంతో బేరసారాలు జరుపుకొనే అవకాశం కల్పించుకొంటున్నారా?
    (విషయాన్ని తప్పుదోవ పట్టించాలనికాదు,కానీ రాజ్యంలో బలహీనుడికి జరిగే కొద్దిపాటి న్యాయంలోకూడా ఆధిపత్యవర్గాల ప్రయోజనాలు ఇమిడి ఉంటాయికదా!)

  2. మీ దృష్టికోణంలో తప్పు లేదు. పాలకవర్గాల రాజకీయాలు అర్ధం చేసుకోవటంలో అది ఒక పరిగణించవలసిన కోణం.

    నిజం బైట పెట్టడానికి వెనుక మీరు చెప్పిన ప్రయోజనాలు ఉన్నా ఆశ్చర్యం లేదు. అంత మాత్రాన నిజం నిజం కాకుండా పోవలసిన అవసరం లేదని గమనంలో ఉంచుకోవాలి.

    కేసు పెట్టింది, తెలంగాణ పోలీసులు. ఇలాంటి ఎత్తుగడలు కే‌సి‌ఆర్ కు అలవాటే. ఇందిరా గాంధీ బుర్ర ఆయనది. ఆ ప్రయోజనాలు, ఒక వేళ ఉన్నట్లయితే, బాబు కంటే కే‌సి‌ఆర్ వి అయ్యే అవకాశాలు ఎక్కువ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s