[ఈ విమర్శ చదవటానికి ముందు గత టపా ఎడిటోరియల్ అనువాదాన్ని చూడగలరు. -విశేఖర్]
“ఒంటరి తోడేళ్ళ దాడులు” (లోన్ వోల్ఫ్ అటాక్స్) అమెరికాకు కొత్త ఉగ్ర వాస్తవికతగా మారిందని ది హిందూ ఎడిటోరియల్ చెబుతోంది. అందుకని ముందుగా లోన్ వోల్ఫ్ సంగతి చూద్దాం. తోడేళ్లు సాధారణంగా గుంపుగా నివసిస్తాయి. గుంపుగా వేటాడతాయి. పాలిచ్చే భారీ జంతువులు (గుర్రం, జిరాఫీ, దుప్పి, హిప్పోపోటమస్, అడవి దున్న మొ.వి) వాటికి ఇష్టమైన ఆహారం. ఈ జంతువులను వేటాడటం మామూలుగా ఒక తోడేలుకు సాధ్యం కాదు. తోడేళ్ళ గుంపులో పిల్లల్ని కనే జంట ఒక్కటే ఉంటుంది. అందువలన యుక్త వయసుకు వచ్చిన తోడేళ్లు తోడు కోసం గుంపును వీడి కొత్త గుంపు తయారు చేసుకునే పనిలో పడతాయి. అలా గుంపును వీడిన తోడేలు మరో గుంపు ఏర్పాటు చేసుకునే వరకూ ఒంటరి అవుతుంది. ఆ సమయంలో తన అవసరం రీత్యా అది ఎక్కువ దూకుడుగా ఉంటుంది; ఎక్కువ శక్తిని ప్రదర్శిస్తుంది; ఎక్కువ ప్రమాదకరంగా ఉంటుంది. (వయసు మీరిన తోడేళ్లు కూడా, యుక్త వయసు తోడేళ్ళ ధాటికి తట్టుకోలేక, ఒంటరిగా ఉండవచ్చు. అవి ఈ సందర్భంలోనివి కావు).
ఇలాంటి ఒంటరి తోడేళ్లతో ఒంటరి ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్న వారిని ‘లోన్ వోల్ఫ్ అటాక్స్’ గా పశ్చిమ ప్రధాన స్రవంతి పత్రికలు, ఛానెళ్లు (Main Stream Media) పోల్చి చెబుతున్నాయి. ఆ పత్రికల వార్తలు, అమెరికా భద్రతా అధికారుల మాటల ప్రకారం చూస్తే, అప్పటివరకూ జనంలో తిరుగుతున్న వారే హఠాత్తుగా ఉగ్రవాది అవతారం ఎత్తుతారు. ఎన్నడూ లేనిది ఆ దాడి జరిగిన తర్వాతే ఆ ఉగ్రవాది కారులోనో, ఇంటిలోనో, పెరట్లోనో, ఔట్ హౌస్ లోనో కుప్పలు తెప్పలుగా తుపాకులు, పేలుడు సామాగ్రి ఉన్నట్లు ఎన్‌ఎస్‌ఏ, ఎఫ్‌బిఐ, సిఐఏ లాంటి గూఢచార, పోలీసు విభాగాలు కనిపెడతాయి.
విచిత్రం ఏమిటంటే వాళ్ళు భారీగా మారణాయుధాలు కూడబెట్టు కుంటున్నట్లు వారి ఇంటిలో నివసించే కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. ఇంకా విచిత్రం ఏమిటంటే చాలా తరచుగా (దాదాపు అన్నిసార్లూ) ఈ ఒంటరి తోడేళ్లు అప్పటికే నెలలు, సంవత్సరాల తరబడి ఎఫ్‌బిఐ, ఎన్‌ఎస్‌ఏ, సిఐఏ లాంటి చేయి తిరిగిన గూఢచార సంస్ధల నిఘాలో ఉంటారు. కానీ వారి నిఘాలో ఉన్నవారే ఉన్నట్టుండి భారీ ఉగ్రవాద దాడులకు ఎలా పాల్పడతారో వివరణ ఉండదు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా ఆ సమాచారం మాకు ముందే తెలుసంటూ ఖచ్చితంగా ప్రకటన చేసే ఈ సంస్ధలు తమ నిఘాలో ఉన్నవారి ఉగ్ర కదలికలను ఎందుకు పసిగట్టవు?
సంవత్సరాల తరబడి తమ నిఘాలో ఉన్న వ్యక్తి హఠాత్తుగా తుపాకులు, మారణాయుధాలు, పేలుడు సామాగ్రి ఎలా కూడబెడతారో, తమకు తెలియకుండా ఆ ఆయుధాలన్నీ ధరించి చాలా కూల్ గా, ఆపరేషన్ రూమ్ లో కత్తులతో ఆపరేషన్ చేసే డాక్టర్ తరహాలో, అత్యంత శ్రద్ధగా ఇటుక మీద ఇటుక కట్టినట్లు తుపాకి తర్వాత తుపాకి పేల్చుతూ, బాంబు తర్వాత బాంబు విసురుతూ, వీలయితే డజన్ల మందిని -వందల మందిని కాకపోతే- బందీలుగా చేసుకుంటూ ఎలా విధ్వంసం, హత్యాకాండలకు పాల్పడగలరో మనకి ఎప్పటికీ అర్ధం కాదు. నిజానికి అదేం చిత్రమో గానీ ఆ వార్తలు చదివే జనాలు కూడా తటాలుమని నమ్మేస్తారు. నమ్మేసి ప్రచారం కూడా చేసి పెడతారు.
ఈ విధంగా ఒంటరిగా ఉగ్ర దాడులకు పాల్పడే వ్యక్తులు అతి భయంకర ఉగ్రవాద భీభత్సకులని జనానికి నచ్చజెప్పేందుకు “లోన్ వొల్ఫ్ అటాకర్” గా అక్కడి ప్రభుత్వాలు, మీడియా పేరు పెడుతున్నాయి. ఆ ఒక్క పదం వింటే చాలు, ఆ ఉగ్రవాది అరివీర భయంకర ఉగ్రవాది అని వార్త చదివేవారికి/వినేవారికి ఒక ఐడియా వచ్చేస్తుంది.
ఇలాంటి దాడులు గతంలో చిన్న పిల్లల పాఠశాలల్లో (రోస్ బర్గ్-ఓరెగాన్, శాంతా మోనికా-కాలిఫోర్నియా) జరిగాయి. సిక్కుల గురుద్వారాలలో (ఓక్ క్రీక్, విస్కాన్సిన్) జరిగాయి. సినిమా హాళ్లలో (అరోరా, కొలరాడో) జరిగాయి. పరుగు పందెం కోసం జమకూడిన జనం మధ్యలో (బోస్టన్) జరిగాయి. వీటన్నింటి లోనూ దాడులకు పాల్పడిన వారు వాస్తవానికి ఒకరు కాదనీ, ఇద్దరు లేదా ముగ్గురు ఒకోసారి అంతకు మించి కూడా ఉన్నారని ప్రత్యామ్నాయ వార్తా సంస్ధలు, స్వచ్ఛంద మీడియా సంస్ధలు సాక్షాలతో సహా నిరూపించాయి. పైగా నిందితులుగా ప్రకటించినవారు అప్పటికి ఎఫ్‌బిఐ, సిబిఐ నిఘాలలో ఉన్నవారని కూడా వెల్లడి చేశాయి. ఆ సంస్ధల వార్తలను ‘కుట్ర సిద్ధాంతం’ అనే ఒక ముద్ర తగిలించే కొట్టిపారేయటం పరిపాటి. కానీ కొన్ని నెలలు, యేళ్ళ తర్వాత ఆ ‘కుట్ర సిద్ధాంతాలే నిజం’ అన్న సంగతి ప్రధాన స్రవంతి మీడియా కూడా చప్పుడు లేకుండా ప్రకటిస్తుంది.
ఉదాహరణకి డబల్యూటిసి జంట టవర్ల పైన జరిగిన దాడినే తీసుకోవచ్చు. ఈ దాడి జరిగిన గంటల లోపే దాడికి బాధ్యురాలు ఆల్-ఖైదా అనే ఉగ్ర సంస్ధ అనీ, బిన్ లాడెన్ ఆదేశాలతో దాడి జరిగిందని కాంతి వేగంతో అమెరికా ప్రభుత్వము, పత్రికలు చెప్పేసాయి. ఆ వార్తలను నెత్తిన వేసుకుని భారత పత్రికలు కూడా వీర కిశోరాల లెక్కన మోసి తరించాయి. “ఈ దాడి సంగతి నాకు తెలియదు. కానీ నేనే చేయించి ఉంటే సంతోష పడే వాడ్ని” అని బిన్ లాడెన్ చేసిన ప్రకటనను చెప్పిన పత్రిక గానీ, చానెల్ గానీ ఇక్కడ లేదు. డబల్యూటిసి జంట టవర్లు నిజానికి సౌదీ దేశీయులు నడిపిన విమానాలు ఢీ కొట్టడం వల్ల కూలలేదనీ, అంత శక్తి విమానం తాకిడికి ఉండదని అనేకమంది పరిశోధకులు, నిర్మాణ సాంకేతిక నిపుణులు చెవిన ఇల్లు కట్టుకుని చెప్పారు.
టవర్లలో ముందుగానే అనేక చోట్ల బాంబులు పెట్టి ఉంచారనీ విమానం తాకడం ఒక సిగ్నల్ మాత్రమే అనీ, ఆ సిగ్నల్ అందాక రిమోట్ లతో బాంబులు పేల్చడంతో టవర్ లు కూలాయనీ వారు తెలిపారు. టవర్లు తగలబడుతున్న దృశ్యాలే తప్ప విమానం నేరుగా ఢీ కొట్టిన దృశ్యం ఎప్పటికీ అందుబాటులో లేదని వారు చెప్పారు. నియంత్రిత పేలుళ్ళ (controlled demolition) ద్వారా టవర్లను కూల్చివేశారని ఆ నెపాన్ని ఆల్-ఖైదా పైకి నెట్టివేయడం ద్వారా భౌగోళిక రాజకీయ ఆధిపత్య లక్ష్యాన్ని అమెరికా నెరవేర్చుకోదలిచిందని వారు చెప్పారు. దేశంలో ప్రజలను “ఉగ్రవాద ఉపద్రవం ముంచుకు వచ్చింది” అన్న భయంతో నింపివేయటానికీ తద్వారా తమ విదేశీ దాడులకు మద్దతు పోగు చేసుకోవటానికి ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ ను అమెరికా పాలకవర్గాల్లో ఒక సెక్షన్ దాడులు చేయించిందని వెల్లడి చేశారు. వారు చెప్పినట్లే 9/11 దాడిని చూపి అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసి ఆక్రమించింది. ఇరాక్ ను దురాక్రమించి ఆ దేశాన్ని అణువు అణువునా బలహీనం కావించారు. రాజ్యం (state) అన్నదే లేకుండా చేశారు లేదా రాజ్యాన్ని నామమాత్రం చేశారు.
ఈ వాస్తవాలను ప్రధాన స్రవంతి మీడియా ప్రచురించకపోగా ‘కాన్స్పిరసీ ధియరీ’ గా కొట్టి పారేసింది. కానీ ఇప్పుడు చూస్తేనేమో ఆ కుట్ర సిద్ధాంతమే వాస్తవం అన్న విషయాన్ని ప్రధాన స్రవంతి మీడియాయే ముక్కలు ముక్కలుగా వెల్లడి చేస్తున్నాయి. ఇందుకు కారణం మిత్ర రాజ్యాలైన అమెరికా-సౌదీ అరేబియాల మధ్య సంబంధాలు దెబ్బ తినడం. అమెరికా – సౌదీ అరేబియాల మధ్య ఇప్పుడు సంబంధాలు అంత బాగా లేవు. ఇరాన్ అణు కార్యక్రమం విషయంలో ఆ దేశంతో అమెరికా ఒప్పందం చేసుకోవటం సౌదీ పాలకులకు ససేమిరా ఇష్టం లేదు. ఇరాన్ పైన బాంబులు వేయమని తాము, ఇజ్రాయెల్ కోరుతుంటే తమ అభిలాషను పక్కన పెట్టి ఆ దేశంతో ఒప్పందం చేసుకోవటం, ఆంక్షలు పాక్షికంగా అయినా ఎత్తివేయటం వారికి కంటగింపు అయింది. ఈ నేపధ్యంలో అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా సౌదీ అరేబియా రష్యాకు దగ్గర కావటం లాంటి కొన్ని చర్యలు చేపట్టింది.
దానితో సౌదీ అరేబియాకు హెచ్చరికగా 9/11 దర్యాప్తు నివేదికలో దాచి పెట్టి ఉంచిన అంశాలను వెల్లడి చేయడానికి అనుమతి ఇచ్చే బిల్లును అమెరికా కాంగ్రెస్ సభ్యులు చర్చకు తీసుకున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే 28 పేజీల భాగాన్ని చూసే అవకాశం 9/11 దాడుల మృతులకు లభిస్తుంది. 9/11 దాడులకు కారణం అయిన సౌదీ అరేబియాపై నష్టపరిహారం కేసు వేసే అవకాశం కూడా దక్కుతుంది. దర్యాప్తు నివేదికలోని 28 పేజీలను జాతీయ భద్రత, జాతీయ ప్రయోజనాల పేరుతో ‘క్లాసిఫైడ్’ గా వర్గీకరించి అమెరికా ఇంతవరకూ వెల్లడి చేయలేదు. ఇందులో దాడుల వెనుక సౌదీ అరేబియా నిర్వహించిన పాత్ర గురించి వివరాలు ఉన్నాయని పశ్చిమ పత్రికలు ‘అభిజ్ఞ వర్గాల’ పేరుతో చెబుతున్నాయి. సౌదీ ప్రభుత్వం ఆదేశాలతో దాడి జరిగిందని కూడా పరోక్షంగా నివేదిక పేర్కొన్నదని కొన్ని పత్రికలు చెప్పాయి.
దానితో సౌదీ అరేబియా నిర్వహించే పత్రికలు, ఛానెళ్లు అసలు గుట్టును విప్పే పనిలో పడ్డాయి. అప్పటి అమెరికా ప్రభుత్వంలోని కొందరు పెద్దలు, కంపెనీలతో చాటు మాటుగా జరిగిన ఒప్పందం మేరకే దాడులు జరిగాయని అసలు డబల్యూటిసి టవర్లపై దాడి అమెరికా పాలకుల పనే అని కూడా సౌదీ పత్రికలు కధనాలు వెలువరిస్తున్నాయి. అనగా అమెరికా పాలకులు, తమ సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇరాన్, లిబియా, సిరియా మొదలైన చోట్ల తమ తొత్తు పాలకులను నిలబెట్ట దలిచారు. అందుకు ఉన్న ప్రభుత్వాలు కూల్చేయాలి. పచ్చిగా దాడి చేసి కూల్చేస్తే అంతర్జాతీయ చట్టాలు అడ్డం వస్తాయి. కాబట్టి దాడికి కారణం కావాలి. ఒక బలమైన కారణం కావాలి. ఆ కారణమే 9/11 తేదీన టవర్లపై జరిగిన దాడి అని సౌదీ మీడియా వెల్లడి చేస్తోంది.
అదే తరహాలో లోన్ వోల్ఫ్ అటాక్ పేరుతో అడపా దడపా అమాయకులను మూకుమ్మడిగా చంపివేస్తున్న ఘటనలు కూడా అమెరికా గూఢచార సంస్ధలు చేస్తున్న ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ అని వివిధ స్వతంత్ర మీడియా సంస్ధలు ఆయా సందర్భాల్లో వివరించాయి. అధికారిక కధనాల్లో లొసుగులను ప్రధాన స్రవంతి మీడియా ద్వారానే పసి గట్టి వెల్లడి చేశాయి.
పల్స్ గా పిలవబడుతున్న గే నైట్ క్లబ్ విషయం తీసుకోండి. ఒకే ఒక్క వ్యక్తి, ఒక హ్యాండ్ గన్, ఒక అస్సాల్ట్ తరహా రైఫిల్ ధరించి ఏక బిగిన కాల్పులు జరిపినా 49 మందిని చంపేయటం, 53 మందిని గాయపరచటం సాధ్యమేనా అన్నది పరిశీలించవలసిన విషయం. ఈ ఘటనపై మునుముందు మరిన్ని వాస్తవాలు వెల్లడి అయితే పూర్తి దృశ్యంపై ఒక అవగాహనకు రావచ్చు. కానీ ఇప్పటి వరకూ వెల్లడి అయిన వివరాలను బట్టి ఒర్లాండో క్లబ్ దాడి నిందితుడు ఎఫ్‌బిఐ, సిఐఏ నిఘాలో ఉన్నాడు. 2013 సం.లో 10 నెలల పాటు ఎఫ్‌బిఐ, మాటీన్ పైన నిఘా నిర్వహించింది. అనంతరం అతని వల్ల భయం లేదని చెప్పి విడుదల చేసింది. అసలు 10 నెలల పాటు నిఘా పెట్టి మటీన్ గురించి నిఘా సంస్ధలు ఏం తెలుసుకున్నాయి? 2 సార్లు ఇంటర్వ్యూ చేసి భయం లేదని వదిలి పెట్టిన మటీన్ దాడిలో 49 మందిని కాల్చి చంపటం ఎలా సాధ్యపడింది?
ఈ వాస్తవాల నేపధ్యంలో ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ ఎంత హాస్యాస్పదంగా ధ్వనిస్తుందో ఎవరికి వారు అర్ధం చేసుకోవచ్చు. లేదంటే అమెరికా శాంతియుత/శాంతి కాముక దేశం ఎప్పుడు అయింది? ఈజిప్టులో మిలట్రీ నియంతృత్వాన్ని ప్రవేశపెట్టి, లిబియాపై దేశ వ్యాపితంగా బాంబు దాడులు చేసి రోడ్లు, వంతెనలు కూల్చివేసి, సిరియాలో కిరాయి మూకలను ప్రవేశపెట్టి కిరాయి తిరుగుబాటును నిర్మించిన అమెరికా శాంతియుత దేశం ఎలా అయింది? ఇరాక్ బాలలకు పాల డబ్బాలు అందకుండా ఆంక్షలు విధించిన అమెరికా, ప్రపంచ దేశాలపై నిత్యం నిఘా వేసి ఆధిపత్యం కోసం ప్రయత్నించే అమెరికాకు పౌర హక్కులను హరించివేసేలా అతిగా చొరకుండా అమెరికా గూఢచార, భద్రతా బలగాలు అత్యున్నత సృజనాత్మకత ప్రదర్శించాలని ఏ ధైర్యంతో బోధిస్తుంది?
‘లోన్ వోల్ఫ్ అటాక్’ ధోరణిని వాస్తవానికి ప్రవేశ పెట్టింది అమెరికా భద్రతా సంస్ధలు తప్ప మరొకరు కాదు. ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ల కోసం దూకుడు ప్రదర్శించే ముస్లిం యువతను అధికారిక ఉగ్రవాద కార్యకలాపాల కోసం రిక్రూట్ చేసుకుని దాడులకు ప్రేరేపించడం అమెరికా గూఢచార, భద్రతా బలగాలకు సాధారణ కార్యకలాపం. అక్కడ ఒక దాడి, ఇక్కడ ఒక దాడి చేయించటం ద్వారా -ఇండియాలో హిందూ టెర్రరిస్టు దాడులకు మల్లెనే- దేశంలో ప్రజలు భయాందోళనలతో బతికే విధంగా వాతావరణాన్ని సృష్టించటం వారి లక్ష్యం తద్వారా నల్ల చట్టాలకు, విదేశీ దాడులకు దేశంలో మద్దతు సమకూర్చుకునే ప్రయత్నాలు పాలక పార్టీలు నిర్వహిస్తున్నాయి. ఇంతటి భారీ భౌగోళిక రాజకీయ ఎత్తుగడను కేవలం ‘సరికొత్త ఉగ్ర వాస్తవకిత’ గా పేర్కొనటం అసలు సమస్యను తక్కువ చేసి చూపటమే అవుతుంది.
http://theantimedia.org/read-this-before-the-government-uses-the-orlando-shooting-to-start-another-war/
పై link లో చాలా ‘వాస్తవాల’ చిట్టా ఉన్నది, వాటి విషయం లో మీ ఈ post చదివాక నాకో స్పష్టత ఏర్పడింది, ధన్యవాదాలు.
చాలా ఆసక్తికరమైన సమాచారం ఇచ్చిన వ్యాసం.
ధన్యవాదాలు.