
Pulse -Orlando, Florida
[ఈ రోజు -జూన్ 14- ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ “America’s new terror reality” కు యధాతధ అనువాదం]
–o0o–
గ్లోబల్ జిహాదీ ఉగ్రవాదం, విచ్చలవిడి తుపాకీ నియంత్రణ చట్టాలు, వినాశకర హోమో ఫోబియా… ఈ మూడు విష శక్తులు ఆదివారం రాత్రి మూకుమ్మడిగా ఒర్లాండో, ఫ్లోరిడా లోని నైట్ క్లబ్ పైన విరుచుకుపడ్డాయి. ఫలితంగా, అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ సామూహిక హత్యాకాండ చోటు చేసుకుంది. ఆఫ్ఘన్ వలస దంపతులకు అమెరికాలో జన్మించిన ఒమర్ మటీన్, ఒక హ్యాండ్ గన్, ‘లాంగ్ గన్’ గా పిలిచే ఎఆర్-15 తరహా అస్సాల్ట్ రైఫిల్ లను ఉపయోగించి 50 మందిని చంపేశాడు; మరో 53 మందిని గాయపరిచాడు. బారక్ ఒబామా అధ్యక్ష పాలనలో 16వ సామూహిక హత్యాకాండ గా నమోదు అయిన ఈ రక్తపాతం శాంతియుత అమెరికా సమాజాన్ని వేధిస్తున్న ఒక సమస్య గురించి చెబుతోంది: రెండవ సవరణ కింద రాజ్యాంగ రక్షణ పొందుతున్న తుపాకుల వ్యాప్తి, కేపిటల్ హిల్ (అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉన్న స్థలం) లో నిండు జేబుల సంపన్న నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్‌ఆర్‌ఏ) తమ పలుకుబడితో సాగించే లాబీయింగ్. గతంలో గే (స్వలింగ సంపర్కులు) లను దూషించినట్లుగా చెబుతున్న మటీన్, స్వలింగ సంపర్కుల గురించి సమాజంలో లోతుగా పాతుకుని పోయిన దురభిప్రాయాలను ప్రతిబింబిస్తూ గే నైట్ క్లబ్ ను అతి శ్రద్ధగా పరిశీలించి మరీ టార్గెట్ చేశాడు. సంవత్సరం క్రితం అమెరికా సుప్రీం కోర్టు మైలు రాయి లాంటి నిర్ణయం ద్వారా వివాహాల సమానత్వాన్ని సమర్ధించ్చినప్పటికీ ఈ దురాగతం చోటు చేసుకుంది. తాజా దాడి, LGBT (లెజ్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్) సమూహానికి వ్యతిరేకంగా సాగుతున్న విద్వేషపూరిత నేరాలు మరియు తుపాకి నియంత్రణ సంస్కరణలకు సంబంధించినంత వరకు వార్షిక సంఘటనలలో ఒక నిష్టుర అంశంగా నిలుస్తుంది. కాగా ఈ ఘటనలో కొట్టవచ్చినట్లు కనపడే అంశం, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) తో సంబంధం ఉన్న ‘ఒంటరి తోడేలు దాడుల’ (ఒకే వ్యక్తి మారణాయుధాలతో భారీ విధ్వంసం సృష్టించటం) భూతం భయానకంగా తొంగి చూస్తుండడమే అనడంలో సందేహం లేదు.
ఈ తరహా దేశీయ ఉగ్రవాదం చుట్టూ రాజకీయ వేడి ఉన్నత స్ధాయిలో చెలరేగుతుందనడానికి ఖాయమైన సంకేతం అధ్యక్ష పదవి అభ్యర్ధులుగా భావిస్తున్న ఇద్దరు -రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ ల తక్షణ ప్రతిస్పందనల నుండే అందింది. ఇద్దరూ రాజకీయంగా ఎక్కువ పాయింట్లు సంపాదించడంపై దృష్టి కేంద్రీకరించగా, ఇరువురిలో ఎవరూ నానాటికీ అధికం అవుతున్న ‘ఒంటరి దాడుల’ లక్షణాన్ని ఎలా ఎదుర్కోవాలో పేర్కొనలేదు. ఆదివారం నాడు 911 అత్యవసర (పోలీసు) విభాగం వారికి ఫోన్ చేసిన మటీన్ తాను ఐఎస్ విధేయుడినని చెప్పాడు. అటువంటి ప్రతిజ్ఞ ఐఎస్ “ప్రోటోకాల్” లో ఒక కీలకమైన అంశంగా పరిగణించబడుతోందని నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ 2015లో కాలిఫోర్నియా, శాన్ బెర్నార్దినో లో ఈ తరహా దాడులు చేసేవాళ్ళు అదే విధంగా విధేయత ప్రకటిస్తూ ఫేస్ బుక్ లో ప్రతిజ్ఞను పోస్ట్ చేశారు. మే 2015లో టెక్సాస్ లో మహమ్మద్ ప్రవక్త బొమ్మలను ప్రదర్శిస్తున్న ఒక కార్టూన్ ప్రదర్శన వద్ద కాల్పులకు తెగబడిన వ్యక్తి కూడా ఇలాగే ఐఎస్ కు విధేయత ప్రకటిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ లు పోస్ట్ చేశాడు. ఒక హింసాత్మక దాడికి ముందు వెలువడిన ఇలాంటి బహిరంగ ప్రతిజ్ఞలు, ‘పవిత్ర రంజాన్ మాసంలో అమెరికా, ఐరోపాలలో అమాయకులను చంపేయండి’ అంటూ తన మద్దతుదారులకు ఇటీవల పిలుపు ఇచ్చిన ఐఎస్ ప్రతినిధి అబు ముహమ్మద్ ఆల్-అద్నాని ప్రేరేపణలను భయానకంగా తలపిస్తున్నాయి. పౌరహక్కులను హరించి వేసే రీతిలో అతిగా చొరకుండా అమెరికా గూఢచార మరియు భద్రతా పరికరాల యంత్రాంగం ఉన్నత స్ధాయి సృజనాత్మకతతో స్పందించి ఇలాంటి ఒంటరి దాడులను ఎదుర్కోవాలి. గుర్తించదగిన విషయం ఏమిటంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మటీన్ ను రెండు సార్లు ఇంటర్వ్యూ చేసి అతనికి ఉగ్రవాదంతో సంబంధాలు లేవని నిర్ధారించింది. ప్రతి మనిషికి ఒక తుపాకి ఉన్న నేలలో ఒక ఉన్మాద పూరిత, మూఢ మత విద్వేషక లేదా ఇతరత్రా అస్ధిర మనస్కులైన వ్యక్తులు జీహాది ఉగ్రవాద భావాలను కలిగి ఉంటే అమెరికాలో తమ నమ్మకాలకు అనుగుణంగా చాలా సులువుగా చర్యలకు పాల్పడగలరు.
***
[ఎడిటోరియల్ పై విమర్శ, విశ్లేషణ తర్వాత ఆర్టికల్ లో చూడగలరు. -విశేఖర్]
http://theantimedia.org/read-this-before-the-government-uses-the-orlando-shooting-to-start-another-war/
ఈ పై link లో వచ్చిన వ్యాసం …Orlando గురించి మాట్లాడుతోంది, దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక ఇక్కడ కామెంట్ గా రాస్తున్నాను, వ్యాసానికి సంబంధించని విషయమైతే మన్నించండి.
కళ్యాణి గారు ఈ లంకెను వీలయితే దీని తర్వాతి ఆర్టికల్ కింద వ్యాఖ్యగా ఇవ్వగలరు. అక్కడ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. (ఈ ఆర్టికల్ తో కూడా మీ లింక్ కు సంబంధం ఉన్నది.)