ప్రథాన మంత్రి మోడి గారి చెంచా గారు పహ్లాజ్ నిహలానీ పుణ్యమా అని ఉద్తా పంజాబ్ సినిమాకు ఖర్చు లేకుండా బోలెడు ప్రచారం దక్కింది.
ఇప్పుడు విడుదల అయి ఘన విజయం సాధించటమే తరువాయి అన్నంతగా ప్రచారం పొందిన ఉద్తా పంజాబ్ కి ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లు నిన్న సిబిఎఫ్సి అధిపతి నిహలానీ ప్రకటించారు.
ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మా పని మేము చేశాం. ఇక దానిపై కోర్టుకు వెళతారా లేక అలాగే విడుదల చేస్తారా అన్నది వారి ఇష్టం” అని బింకంగా వ్యాఖ్యానించారు. కింద పడ్డా పై చేయి నాదే అని చెప్పడం అన్నమాట!
జూన్ 13 తేదీ, అనగా ఈ రోజు బోంబే హైకోర్టు నిహలానీ ప్రతిపాదించిన 89 కత్తిరింపులపై తుది తీర్పు ప్రకటించ వలసి ఉన్నది. ఇప్పటిదాకా సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వటానికి వెనకాడుతూ, మారాం చేస్తూ వచ్చిన నిహలానీ అర్జెంటుగా ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడం బట్టి ఏం అర్థం చేసుకోవాలి?
బహుశా కోర్టు తీర్పు ఎలాగూ తనకు వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి ఈ లోగా పైచేయి సాధించాలని నిహలానీ భావించినట్లు కనిపిస్తోంది. పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే తుది నిర్ణయం నిహలానీకి వ్యతిరేకంగా, నిర్మాతలకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిహలానీ ప్రతిపాదించిన కత్తెరలు, ఆయన చేసిన వెర్రి మొర్రి వ్యాఖ్యలు ఆయన కత్తెరను బాగా మొద్దు బార్చాయి. 89 కత్తిరింపులు భారంగా మారాయి. ఆ కత్తెరలు ఎలా చేయాలో కూడా తెలియని పరిస్థితి.
తన ముందుకు వచ్చిన సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇవ్వాలో నిర్ణయించడం మాని తాను మోడీ చెంచానే అనీ, ఎఎపి నుండి డబ్బు తీసుకుని నిర్మాతలు సినిమా తీశారని విన్నాననీ రాజకీయ ప్రకటనలు గుప్పించాడు. చివరికి కేంద్ర మంత్రులు జోక్యం చేసుకుని ఆయన మాటనను ఖండించ వలసి వచ్చింది.
కేంద్ర మంత్రి రఘు ప్రసాద్ యాదవ్ ప్రత్యేకంగా పూనుకుని మోడి చెంచా వ్యాఖ్యలు ఖండించటంతో ‘తాను అలా అనలేదు’ అని మాట మార్చారు మోడి గారి చెంచా గారు! ఆ విధంగా అన్నది అనలేదని నాలిక మడతేసి తాను రాజకీయ కారణాల తోనే ఆ పదవిలో ఉన్నానని నిహలాని మరో సారి స్పష్టం చేశారన్నమాట!