
French workers clashe with police on May 27, 2016
[శనివారం, జూన్ 11 తేదీన “Growing unrest in France” శీర్షికన ది హిందులో ప్రచురితం అయిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. అనువాదం అనంతరం సంపాదకీయంపై విమర్శను చూడవచ్చు. -విశేఖర్]
———
సమ్మెలకు ఫ్రాన్స్ కొత్త కాదు. కానీ సోషలిస్టు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షంవైపు మొగ్గు చూపే కార్మిక యూనియన్లు వారాల తరబడి సాగిస్తున్న అలజడి మున్నెన్నడూ ఎరగనిది. మే 17 తేదీన సమ్మె ప్రారంభించిన యూనియన్లు ఫ్రాన్స్ లోని కఠిన కార్మిక చట్టాలను సంస్కరించడానికి తయారు చేసిన బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే లేదా డిక్రీ ద్వారా అమలులోకి వస్తే, ఆర్ధికంగా కష్టాలు ఎదుర్కొంటున్న కాలంలో తమకు అవసరం అని తోస్తే కార్మికుల సంఖ్యను యజమానులు తగ్గించుకోగల అవకాశం లభిస్తుంది. తెగతెంపుల చెల్లింపులు చేసి కార్మికులను తొలగించవచ్చు. 35 పని గంటల గరిష్ట వారాన్ని అమలు చేయవచ్చు. ప్రభుత్వం యేమో ఉపాధి కల్పన కోసం కార్మిక చట్టాలను పూర్తిగా మరమ్మతు చేయాలనీ, ఇది ఆర్ధిక వృద్ధిని ముందుకు నెట్టే సంస్కరణలలో ఇది ఒక భాగం అనీ చెబుతోంది. ఆర్ధిక వృద్ధి 1 శాతం వద్ద స్తంభించిపోయింది. నిరుద్యోగం 10 శాతం పైనే చక్కర్లు కొడుతోంది. ఇది జర్మనీ నిరుద్యోగానికి రెండు రెట్లు అధికం. యువత నిరుద్యోగం అత్యధిక స్ధాయిలో 25 శాతం వద్ద మొండిగా నిలబడి ఉన్నది. ఆధునిక ఫ్రాన్స్ లో అత్యంత ప్రజావ్యతిరేకత మూట గట్టుకున్న అధ్యక్షులలో ఒకరుగా ప్రతిష్ట పొందిన ఫ్రాంష్ ఒలాండే వచ్చే యేడు అధ్యక్ష ఎన్నికల లోపు ఆర్ధిక వ్యవస్ధను సంస్కరణల ద్వారా ముందుకు దూకించాలని భావిస్తున్నాడు.
కానీ, నాలుగేళ్ల క్రితం తాను అధికారంలోకి రావడానికి దోహదం చేసిన యూనియన్లను వ్యతిరేకం చేసుకుంటూ ఒలాండే ఇది సాధించగలరా లేదా అన్నదే అసలు ప్రశ్న. 2012 ఎన్నికలకు ముందు ఒలాండే తనను తాను శ్రామిక ప్రజలకు మిత్రుడుగా చెప్పుకున్నాడు. ఫ్రాన్స్ యొక్క సమ సమాజ వ్యవస్ధను కాపాడేందుకు సంపన్న వర్గాలను పిండేస్తానని ఒట్టు పెట్టాడు. కానీ అధికారం లోకి వచ్చిన వెంటనే ఆయన వ్యాపార-మిత్రుడుగా అవతరించాడు. దానితో ఆయనను ఎన్నుకున్న వర్గాలు తాము మోసపోయామని భావిస్తున్నారు. సమ్మె వల్ల ఇప్పటికే ఫ్రాన్స్ లో కొన్ని చోట్ల ఇంధనం పంపిణీపై ప్రభావం చూపింది. అయినప్పటికీ సంస్కరణల పధకాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే యూనియన్లు తమకు ప్రజా మద్దతు ఉన్నదని గత రెండు నెలలుగా నిరూపించుకున్నది. మార్చి 31 నుండి వేలాది మంది ఫ్రెంచి పోరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. అలాగే, పాలక సోషలిస్టు పార్టీలోని ఒక సెక్షన్ ప్రభుత్వ ఆర్ధిక విధానాలను వ్యతిరేకిస్తోంది. చట్టం విషయంలో ఏక పక్షంగా ముందుకు వెళితే పార్టీలో అంతర్గత కలహాలను తీవ్రం చేయడమే కాక మరింత ప్రజా అలజడిని రెచ్చగొట్టవచ్చు. ఈ నిరసనలు ఫ్రాన్స్ కు ప్రత్యేకమైన సున్నిత కాలంలో వచ్చాయి. దేశం ఇప్పటికే ‘అత్యవసర పరిస్ధితి’ లో ఉన్నది. గత నవంబర్ నాటి ప్యారిస్ దాడుల రీత్యా ఆ దేశం అత్యున్నత స్ధాయి అప్రమత్తతలో ఉన్నది. శుక్రవారం ప్యారిస్ లో యూరోపియన్ ఫుట్ బాల్ టోర్నమెంటు ప్రారంభం అయింది. అది విజయవంతం కావాలంటే ఫ్రాన్స్ కార్మికులు, భద్రతా బలగాల సహకారం అవసరం. అటువంటి పరిస్ధితుల్లో ప్రభుత్వానికి, కార్మికుల మధ్య బహిరంగ కొట్లాట, దేశం కోరుకునే అంశాల్లో చివర మాత్రమే ఉంటుంది. అంతిమంగా రాజీ పడటం తప్ప ఇరు పక్షాలకు మరో అవకాశం లేకపోవచ్చు. ఆధిపత్యం, ఏకపక్ష నిర్ణయాలకు ఉన్న పరిమితులను ప్రభుత్వం గ్రహించవలసి ఉండగా ప్రభుత్వము మరియు యూరోపియన్ యూనియన్ సబ్సిడీలతోను, ప్రభుత్వ నిధులతో నడిచే సంక్షేమ వ్యవస్ధ వల్లా రగులుతున్న ఫ్రెంచి ఆర్ధిక వ్యవస్ధ, స్తంభించబడిన స్ధితిలో నిలబడలేదని యూనియన్లు గుర్తించాలి.
*********
ఈ మధ్య కాలంలో ది హిందు వరస పెట్టి ప్రచురిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక సంపాదకీయాల్లో ఇది ఒకటి. ఫ్రాన్స్ ప్రభుత్వం/ఒలాండే తల పెట్టిన కార్మిక సంస్కరణలు వాటికవే వైరుధ్యపూరితమైనవి. మోసపూరితమైనవి కూడా. కార్మికులను, ఉద్యోగులను ఇష్టానుసారం తొలగించుకునే హక్కును కల్పించే చట్టం చేస్తూ అది ఉపాధి కల్పిస్తుందని ఎలా చెప్పగలరు? ఉపాధిని తగ్గించి నిరుద్యోగాన్ని పెంచే చట్టం ఉపాధి కల్పిస్తుందని ఫ్రెంచి ప్రభుత్వం చెబుతుంటే దానికి ది హిందు వత్తాసు రావడం ఏమిటో బొత్తిగా అర్ధం కాకుండా ఉంది.
అక్కడికి జిడిపి వృద్ధి చెందితే చాలు, సమస్యలన్నీ వాటికవే పరిష్కారం అవుతున్నట్లు! జిడిపి అంకెలు పెరిగితే ఆటోమేటిక్ గా జనం సమస్యలు పరిష్కారం అవుతాయని పెట్టుబడిదారీ ధనిక వర్గాలకు కొమ్ము కాసే ప్రభుత్వాలు చెబుతాయి. అందులో ఆశ్చర్యం లేదు. ఆ వాదనను ది హిందు నెత్తికి ఎత్తుకుని కార్మిక వ్యతిరేక చట్టంతో రాజీ పడాలని ఫ్రెంచి కార్మికులకు బోధించటం ఫ్రెంచి ప్రజలకు ఏ మాత్రం మేలు చేయదు.
పోనీ ఆర్ధిక వృద్ధి జరగాలి అనుకుందాం. అది ఎలా జరుగుతుంది? ఆర్ధిక వృద్ధి అంటే జిడిపి లేదా స్ధూల జాతీయోత్పత్తి పెరగటం. ఉత్పత్తి పెరగాలంటే కార్మికులు, ఉద్యోగులు పని చేయాలి; పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టాలి. కార్మికులు పని చేయాలంటే మొదట వారు పనిలో ఉండాలి. అనగా వారికి ఉపాధి కల్పించాలి. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి. కొనుగోలు శక్తి పెరిగితే (ఉపాధి ద్వారా తమ వద్ద వేతనం/డబ్బు సమకూరితే) ప్రజలు సరుకులు కొంటారు. జనం సరుకులు కొంటే మరిన్ని సరుకులను ఉత్పత్తి చేసేందుకు పెట్టుబడిదారులు సుముఖంగా ఉంటారు. అనగా మరింత ఉత్పత్తి జరుగుతుంది. అనగా ఉత్పత్తి పెరుగుతుంది. కనుక జిడిపి పెరగటానికి మూలం ప్రజల (కార్మికుల & ఉద్యోగుల) కొనుగోలు శక్తి పెరగడం లేదా ప్రజలకు ఉపాధి అవకాశాలు దండిగా అందుబాటులో ఉండటం.
ఫ్రెంచి సంస్కరణలు చేయబోయేది ఇది కాదు. దొడ్డి దారిలో -కార్మికుల ఉపాధి తద్వారా కొనుగోలు శక్తి పెంచకుండా- పెట్టుబడిదారులకు లాభాలు పెంచేందుకు సంస్కరణలను రూపొందించారు. ఎలాగోలా లాభాలు పెరిగితే కంపెనీలు ఉత్పత్తి పెంచుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
లాభాలు రెండు రకాలుగా పెంచుకోవచ్చు. మొదటిది రాజమార్గం: పెట్టుబడులు పెట్టి, ఉపాధి పెంచి ఉత్పత్తి పెంచటం ద్వారా లాభాలు పెంచుకోవటం. ఇది నెలలు, సంవత్సరాల మీదుగా వ్యాపించి ఉంటుంది. కానీ పెట్టుబడిదారీ వర్గం, కార్మిక వర్గం ఇరువురూ తగిన విధంగా లబ్ది పొందుతారు. ఇది వాస్తవంగా జరగవలసినది. దేశంలో అన్ని వర్గాల కోసం పని చేయాలి అని కనీసం భావించే ప్రభుత్వాలు చేసేది.
రెండవది దొడ్డి దారి: ఈ దారిలో కొత్తగా ఉత్పత్తి కార్యకలాపాలు పెంచటం పెట్టుబడిదారీ వర్గం సుముఖంగా ఉండదు. కానీ వారి లాభాలు పెరగాలి. కొత్తగా ఉత్పత్తి తీయకుండా, ఉపాధి పెంచకుండా లాభాలు పెంచడం ఎలా సాధ్యం? అందుకు ఒకటే దారి -కార్మికులు, ఉద్యోగులు పొందుతున్న వేతన-సౌకర్యాల భాగంలో మరింత వాటాను పెట్టుబడిదారీ వర్గానికి తరలించటం. ఒకరి జేబులో నుండి తీసి మరొకరి జేబులో పెట్టడం. అది సంస్కరణల చట్టాల ద్వారా ప్రభుత్వాలు చేసి పెడతాయి. అనగా దొడ్డి దారి అన్నది ప్రజలందరూ ప్రభుత్వానికి సమానులే అని భావించదు. కార్మికులు, ఉద్యోగుల కంటే సంపన్న పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనాలే ఎక్కువ ప్రధానమైనవిగా భావిస్తుంది.
ఫ్రెంచి ప్రభుత్వం దొడ్డి దారిని ఎంచుకుంది. ఒక్క ఫ్రాన్స్ మాత్రమే కాదు. అమెరికా, పశ్చిమ దేశాలతో పాటు ఇతర ప్రపంచ దేశాలన్నీ -ఇండియాతో సహా- దొడ్డి దారినే ఎంచుకుని అమలు చేస్తున్నాయి. 1990ల నుండి మూడో ప్రపంచ దేశాలలో ఇవి తీవ్రం అయ్యాయి. పశ్చిమ పెట్టుబడిదారీ దేశాలలో సోవియట్ రష్యా విచ్ఛిన్నం దరిమిలా మెల్లగా ప్రారంభమయిన సంస్కరణలు 2008 సంక్షోభం నుండి వేగంగా అమలవుతున్నాయి. ఐరోపాలో ఋణ సంక్షోభం సాకుగా చూపుతూ సంస్కరణలు వేగిరమ్ చేశారు. అందుకు అనువైన సామాజిక వాతావరణాన్ని, ఆమోదాన్ని ఇసిస్ టెర్రరిస్టు దాడులు ద్వారా సంపాదిస్తున్నారు. ప్యారిస్ దాడులను చూపి ఎమర్జెన్సీ విధించిన ఫ్రెంచి ప్రభుత్వం పనిలో పనిగా కార్మిక చట్టానికి సంస్కరణలు చేపట్టింది.
వాస్తవం ఇది కాగా ఫుట్ బాల్ టోర్నమెంట్ అనీ, ప్యారిస్ దాడులనీ చెబుతూ ప్రజల ఉపాధినీ, కొనుగోలు శక్తిని హరించి వారిని మరింత పేదవారిగా మార్చే సంస్కరణలతో రాజీ పడాలని చెప్పడం అంటే వాస్తవాలను విస్మరించమని చెప్పటమే.
ఆసక్తి ఉన్నవారు ఫ్రాన్స్ కార్మిక చట్టాల సంస్కరణలపై ఏప్రిల్ 29 తేదీన రాసిన ఆర్టికల్ ని కింద లంకె లో చూడగలరు.
ఇసిస్ బూచిగా ఫ్రాన్స్ లో కార్మిక వ్యతిరేక సంస్కరణలు