రెండు రోజుల క్రితం ఆర్.బి.ఐ గవర్నర్ వడ్డీ రేట్లు సమీక్షించారు. ఈ సమీక్షలో ఆయన వడ్డీ రేట్లు తగ్గిస్తారని అందరూ ఆశించారు. అయితే వారి ఆశలను వమ్ము చేస్తూ గవర్నర్ రఘురామ్ రాజన్ వడ్డీ రేట్లు కదల్చకుండా యధాతధంగా ఉంచారు.
వడ్డీ రేట్ల వ్యవహారం ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వంల మధ్య ఎప్పుడూ ఘర్షణకు దారి తీసే అవకాశం గల సమస్యగా ఉంటోంది. దీనికి ప్రధాన కారణం వడ్డీ రేట్ల చుట్టూ ఏర్పడి ఉన్న వాతావరణం. వడ్డీ రేటు ద్వారా నిధుల ప్రవాహాన్ని ఆర్బీఐ నియంత్రిస్తూ ఉంటుంది కాబట్టి వడ్డీ రేటు తగ్గింపు కోసం ఎదురు చూడటం పరిశ్రమ వర్గాలు ఒక అలవాటుగా చేసుకున్నాయి.
వడ్డీ రేటు అంటే సాధారణంగా స్వల్ప కాలిక రెపో రేటు అని అర్థం. రిజర్వు బ్యాంకు నుంచి వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకున్నపుడు ఆ రుణం పైన ఆర్బీఐ వసూలు చేసే రేటును రెపో రేటు అంటారని తెలిసిన విషయమే.
పైన చెప్పినట్లు రెపో రేటు ఆర్బీఐ తగ్గిస్తే బ్యాంకులు రిజర్వు బ్యాంకు నుండి విరివిగా నిధులు/రుణాలు తీసుకుంటాయని ఆ తర్వాత తాము బ్యాంకుల నుండి చౌకగా రుణాలు సుకోవచ్చనీ కంపెనీలు, పరిశ్రమల వర్గాలు భావించాయి.
కానీ రఘురామ్ రాజన్ అలా చేయలేదు. యధాతధంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. సుబ్రమణ్య స్వామి ఎంత అరిచి గీ పెట్టినా, రాజన్ ఏ మాత్రం లెక్క చేయకపోవడం రాజకీయ, పారిశ్రామిక పెద్దలకు, బిజెపి నాయకులు-ప్రభుత్వానికి ఒక కంటగింపు అయింది. ఆ కంటగింపును ఇలా ఏడుపు రూపంలో వ్యక్తం చేస్తున్నారని కార్టూనిస్టు ఊహ.
మింగ లేక కక్క లేక ఏడ్చే ఏడుపును ఇలాగే రిటారికల్ గా చిత్రీకరస్తారని తెలిసిందే.
రాజన్ పైన సుబ్రహ్మణ్య స్వామి ఏడుపంతా 2013, 2014 లలో వడ్డీ రేట్లు పెంచుతూ పోయారన్నదే.
ప్రస్తుతం చమురు ధరలు బాగా తగ్గాయి. నైరుతి రుతుపవనాలు సమయానికి వస్తాయని వాతావరణ శాఖ జోస్యం చెప్పింది. ఎల్.పి.ఎ కంటే 106 శాతం వర్గాలు అధికంగా కురుస్తొయని చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఐనా రెపో రేటు తగ్గించక పోవటంతో బాధితులు (గా భావిస్తున్న వారు) గుక్క పెట్టి ఏడుస్తున్నారన్న మాట!