క్లుప్తంగా… -10/06/2016


Factory output

ఏప్రిల్ లో క్షీణించిన ఫ్యాక్టరీ ఉత్పత్తి

కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభ నెలలో ఫ్యాక్టరీ/పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి చెందటానికి బదులు కుచించుకుపోయింది. 2015 ఏప్రిల్ తో పోల్చితే 2016 ఏప్రిల్ నెలలో ఫ్యాక్టరీల ఉత్పత్తి 0.8 శాతం తగ్గిపోయిందని కేంద్ర గణాంక కార్యాలయం (CSO – Central Statistics Office) ప్రకటించింది. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఇండియా జి‌డి‌పి 7.6 శాతం వృద్ధి సాధించిందని అట్టహాసంగా ప్రకటించి రోజులు గడవక ముందే ఈ ప్రతికూల వార్త వెలువడటం గమనార్హం.

ఫ్యాక్టరీ ఉత్పత్తిని ఐ‌ఐ‌పి (Index of Industrial Production) ద్వారా కొలుస్తారు. గత సంవత్సరం ఏప్రిల్ లో అంతకు ముందు యేడు ఏప్రిల్ తో పోల్చితే ఫ్యాక్టరీ ఉత్పత్తి  3 శాతం పెరిగితే ఈ యేడు -0.8 శాతం వృద్ధి చెందింది లేదా 0.8 శాతం తగ్గిపోయింది. నెలవారీగా చూస్తే (సాధారణంగా జి‌డి‌పిని గత సంవత్సరం అదే కాలంతో పోల్చి వృద్ధి చెందిందా/ తగ్గిపోయిందా అన్నది చూస్తారు) 2016 జనవరిలో 1.6% తగ్గిన ఐ‌ఐ‌పి ఫిబ్రవరిలో 2% వృద్ధి చెందింది. మార్చిలో 0.3% వృద్ధి నమోదు చేసింది.

మాన్యుఫాక్చరింగ్ రంగం (మేక్ ఇన్ ఇండియా అంటున్నది ఈ రంగం లోనే) ఐ‌ఐ‌పి లో 75% వరకు ఆక్రమించి ఉంటుంది. అటువంటి రంగంలోని ఉత్పత్తి ఏప్రిల్ 2016 లో ఏకంగా 3.1% క్షీణించి ఐ‌ఐ‌పిని దెబ్బ కొట్టింది. గత యేడు ఏప్రిల్ లో ఇది 3.9% వృద్ధి చెందటం గమనార్హం.

పెట్టుబడులకు కొలమానం పెట్టుబడి సరుకుల (కేపిటల్ గూడ్స్) ఉత్పత్తి. సరుకులను ఉత్పత్తి చేసే యంత్రాలు, ముడి సరుకులు మొ.వి పెట్టుబడి సరుకుల కిందికి వస్తాయి.

ఈ సరుకుల ఉత్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ధనికవర్గాలు, విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్లు అర్ధం. ఈ పెట్టుబడుల కోసమే ప్రభుత్వ నేతలు అదే పనిగా కాలికి బలపం కట్టుకుని దేశాలు పట్టి తిరుగుతున్నారు.

ఈ సరుకుల ఉత్పత్తి ఏప్రిల్ నెలలో ఏకంగా ….కాస్త ఊపిరి పీల్చుకుని చందవండేం…. 24.9 శాతం పడిపోయింది. అనగా గత యేడు ఏప్రిల్ లో రు. 100 విలువ గల పెట్టుబడి సరుకులు ఇండియాలో ఉత్పత్తి కాగా ఈ ఏప్రిల్ లో రు 75.1 విలువ గల పెట్టుబడి సరుకులు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి. (గత యేడు ఇది 5.5% వృద్ధి నమోదు చేసింది.)

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారి మేక్-ఇన్-ఇండియా అనబడు పెట్టుబడుల పధకం ఇలా తగలడింది!

Udta Punjab -Hero Shahid Kapur

Udta Punjab -Hero Shahid Kapur

మీరు చేయాల్సింది సర్టిఫికేషన్, సెన్సార్ కాదు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారి చంచా గారికి బొంబే హై కోర్టు కాసింత గడ్డి పెట్టింది. సి‌బి‌ఎఫ్‌సి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్) ఉన్నది సినిమాలకు సర్టిఫికేట్ ఇవ్వటానికే గానీ సెన్సార్ చేయడానికి కాదని బోధించింది. ఒక సినిమా చూడాలో లేదో జనం తేల్చుకుంటారని జనం పని మీరు చేయనవసరం లేదని మర్మం విప్పి చెప్పింది. ఉద్తా పంజాబ్ సినిమాలో 89 కత్తిరింపులు డిమాండ్ చేసిన సి‌బి‌ఎఫ్‌సి కి వ్యతిరేకంగా నిర్మాతలు (అనురాగ్ కశ్యప్, ఏక్తా కపూర్ మొ.) కోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే.

“జనానికి ఏదైనా నచ్చకపోతే వారి చేతిలో రిమోట్ ఉండనే ఉంది. కాబట్టి సి‌బి‌ఎఫ్‌సి సినిమాలకు సర్టిఫికేట్ ఇవ్వాలే తప్ప సెన్సార్ చేయకూడదు” అని హై కోర్టు డివిజన్ బెంచి స్పష్టం చేసింది. ఒక పాత్ర యొక్క నిరాశా, నిస్పృహలను తెలియజేయడానికి (హీరో జనంపై యూరిన్ పోయటం లాంటివి) అసభ్య దృశ్యాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని సినిమా వాళ్ళకు కూడా ఒక మొట్టికాయ వేసింది. ఈ దృశ్యాన్ని తొలగించటానికి నిర్మాతలు ముందే అంగీకరించారు. జూన్ 13 తేదీన తుది ఉత్తర్వులు ఇస్తామని కోర్టు తెలిపింది. సినిమా జూన్ 17 తేదీన విడుదల కావలసి ఉన్నది.

Afghan Taliban Chief Mullah Akhtar Mansour killed in this car

Afghan Taliban Chief Mullah Akhtar Mansour killed in this car

పాక్ సార్వభౌమత్వం గౌరవించండి –చైనా

పాకిస్తాన్ కు బహుశా ఈ పాటి మద్దతు గతంలో ఎవరూ ఇచ్చి ఉండరు. అదీ అమెరికాకు వ్యతిరేకంగా. పాకిస్తాన్ లో ఉన్న తాలిబాన్ చీఫ్ ముల్లా అఖ్తర్ మన్శౌర్ ను మానవ రహిత డ్రోన్ విమానం ద్వారా బాంబు దాడి చేసి చంపినట్లు ఇటీవల అమెరికా ప్రకటించిన నేపధ్యంలో చైనా ఒక ప్రకటన విడుదల చేసింది. “ఉగ్రవాదంతో తలపడటంలోనూ, ఆఫ్ఘన్ రికన్సిలేషన్ ప్రక్రియ లోనూ పాకిస్తాన్ భారీగా కృషి చేసింది. అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్నీ, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గుర్తించి గౌరవించాలి” అని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హాంగ్ లీ అన్నాడు.

తమకు చెప్పకుండా, సంప్రదించకుండా అమెరికా తానే సొంతగా డ్రోన్ దాడితో మే 21 తేదీన పాకిస్తాన్ వాయు తలాన్ని ఉల్లంఘిస్తూ ఆఫ్ఘన్ తాలిబాన్ నేతను చంపటాన్ని పాకిస్తాన్ తప్పు పట్టింది. పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని అమెరికా ఉల్లంఘించ్చిందని ప్రకటించింది. ఈ నేపధ్యంలో వెలువడిన చైనా ప్రకటన దక్షిణాసియా ప్రాంతీయ రాజకీయాలలో ప్రాధామ్యం కలిగినది. బి‌జే‌పి-మోడి నేతృత్వంలో భారత పాలకులు అంతకంతకు ఎక్కువగా అమెరికాతో అంట కాగుతున్న పరిస్ధితుల్లో పాక్-చైనా ల మధ్య బంధం మరింత గట్టి పడుతోంది. ఇండియాను సంతోష పెట్టటానికి అమెరికా అడపా దడపా పాక్ వ్యతిరేక ప్రకటనలు చేస్తుంటే, చైనా యేమో పాకిస్తాన్ అనుకూల ప్రకటనలతో ఆ దేశాన్ని అక్కున చేర్చుకుంటోంది.

US delegation

పాకిస్తాన్ లో ఉన్నత స్ధాయి అమెరికా ప్రతినిధి బృందం

చైనా మాలిమి చేస్తున్న పాకిస్తాన్ తో సంబంధాలు మెరుగుపరుచుకునే లక్ష్యంతో అమెరికా నుండి ఉన్నత స్ధాయి ప్రతినిధి బృందం పాకిస్తాన్ లో దిగింది. అమెరికా జాతీయ భద్రతా కౌన్సిల్ లో ఆఫ్-పాక్ వ్యవహారాల సీనియర్ డైరెక్టర్ పీటర్ లావోయ్, ఆఫ్-పాక్ ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ ఒల్సన్ మొ.వారు ఈ బృందంలో సభ్యులు. ఈ బృందం పాకిస్తాన్ ప్రభుత్వం, మిలట్రీలతో చర్చలు చేయనుంది.

డ్రోన్ దాడిలో తాలిబాన్ నేతను చంపివేయటం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ పలుకుబడి పెరిగే అవకాశాలను అమెరికా తుంచివేసింది. తాలిబాన్ నేతను డ్రోన్ దాడిలో చంపటానికి కారణం ఆయన ఉగ్రవాది అవటం కాదు. ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ పలుకుబడి పెరగకుండా నిరోధించటంలో భాగంగా మాత్రమే తాలిబాన్ నేతను చంపేసింది. చైనాకు దగ్గర అవుతున్న పాకిస్తాన్ పలుకుబడి పెరిగితే అది చైనాకు ఆధిపత్య అస్త్రం అవుతుందని అమెరికా భయం.

చైనాను నిలువరించే లక్ష్యంలో భాగంగా అమెరికా ఇండియాను మాలిమి చేస్తోంది. మిసైల్ క్లబ్ గా పిలిచే ఎం‌టి‌సి‌ఆర్ (మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్) లో సభ్యత్వం దాదాపు ఖాయం అని చెప్పింది. ఎన్‌ఎస్‌జి (న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్) లో చేరటానికి మద్దతు ఇస్తోంది. మెక్సికో, స్విట్జర్లాండ్ ల చేత కూడా మద్దతు ఇప్పించింది. మోడిని పిలిచి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో మాట్లాడుకోమని చెప్పింది. వివిధ చర్యల ద్వారా ‘చైనాను దారికి తేవాలంటే అది నీ వల్లనే’ అన్న సందేశంతో ఉబ్బిస్తోంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ లో వివిధ నిర్మాణ కాంట్రాక్టులలో భాగస్వామ్యం కల్పిస్తోంది. తద్వారా ఆఫ్ఘనిస్తాన్-ఇండియాల మధ్య పాక్ వ్యతిరేక స్నేహ బంధం పెరగటానికి దోహదం చేస్తోంది.

మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ను తన పెరటి దొడ్డిగా పాకిస్తాన్ భావిస్తుంది. అనాదిగా అమెరికా మద్దతుతో సెక్యులర్ ఆఫ్ఘనిస్తాన్ ను ముల్లాల ఆఫ్ఘనిస్తాన్ గా మార్చటంలో పాకిస్తాన్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. 1980ల నుండి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు సర్వ విధాలుగా నాశనం కావటానికి అమెరికాది పెద్ద పాత్ర కాగా పాక్ ది జూనియర్ పాత్ర. అవటానికి జూనియర్ పాత్రే అయినా పాక్ కి చెప్పకుండా, వారి సహకారం లేకుండా ఆఫ్ఘన్ లో అమెరికా సాగించిన దుష్కార్యాలు తక్కువ. అలాంటి అమెరికా తన ప్రయోజనాల కోసం తనను వదిలిపెట్టి ఇండియాను దగ్గర తీయటం పాకిస్తాన్ కు రుచించటం లేదు. పైగా ఆఫ్ఘనిస్తాన్ లో తన ఆధిపత్యం దెబ్బ తినడం కోసం, ఇండియా చొరవ పెంచటం కోసం తన మిత్రులైన ఆఫ్ఘన్ తాలిబాన్ నాయకుడిని చంపేసింది!

“సమావేశం ఎజెండా నిర్దిష్టంగా అనుకోలేదు. అనేక అంశాలు చర్చిస్తాం. డ్రోన్ దాడులు, వ్యూహాత్మక రక్షణ విషయాలు, ఆఫ్ఘనిస్తాన్ లో వివిధ శక్తుల పునరేకీకరణ… మొ.న అంశాలను చర్చిస్తాం” అని అమెరికా ఫారెన్ ఆఫీస్ అధికారి ఒకరు చెప్పారని ది హిందు తెలిపింది. ఇండియాకు అమెరికా ఇస్తున్న మద్దతు వల్ల ఈ ప్రాంతంలో అస్ధిర పరిస్ధితులు ఏర్పడుతున్నాయని పాకిస్తాన్ ఆరోపించటం విశేషం. ఇన్నాళ్లూ ఆ అమెరికాతోనే ఊరేగిన అమెరికా, కొత్తగా ఇక్కడ అస్ధీరత గురించి ఆందోళన చెందటం స్వార్ధ ప్రయోజనాల కోసమే తప్ప స్ధిరత/అస్ధిరత ల గురించి పాక్ పాలకులు ఎప్పుడూ పట్టించుకోలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s