- చైనా అప్పు అమెరికా ఎగవేయొచ్చు జాగ్రత్త!
- మహిళలపై అమానుషాన్ని ఆపండి -ఐర్లండ్ తో ఐరాస
- ఉద్తా పంజాబ్ లో తప్పేముంది? -బొంబే హై కోర్ట్
- రేపిస్టుని క్షమించి వదిలేయి, ప్లీజ్
చైనా అప్పు అమెరికా ఎగవేయొచ్చు జాగ్రత్త!
ఇది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (బ్రిటన్ సెంట్రల్/రిజర్వ్ బ్యాంక్) మాజీ గవర్నర్ మెర్విన్ కింగ్ చేసిన హెచ్చరిక!
“భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? కానీ తమ విదేశీ ఆస్తులు అన్నీ అమెరికాపైనే ఆధారపడి ఉండటం చైనా తదితర దేశాలకు ఇష్టం ఉండదు. ఆఫ్ కోర్స్, తన అప్పులను ఎగవేసేందుకు అమెరికా ఇష్టపడదనుకోండి! అయినా ఏదో ఒక పెద్ద దావానలమే (యుద్ధం అని ఆయన ఉద్దేశం) సంభవిస్తే అమెరికాలో ఉన్న చైనా ఆస్తులు (ఇచ్చిన రుణాలు) అన్నీ రద్దవుతాయి. కాబట్టి చైనా తదితర దేశాలు తమ పోర్ట్ ఫోలియోలను వివిధీకరించడం మంచిది. తద్వారా (అమెరికాపై) ఆధారపడటం తగ్గుతుంది” అని BoE మాజీ గవర్నర్ (2003-13) మెర్విన్ కింగ్ ‘గోల్డ్ ఇన్వెస్టర్’ పత్రికకు రాస్తూ చెప్పాడు.
అమెరికా, చైనాకు 1.245 ట్రిలియన్ డాలర్ల మేర అప్పు పడింది. 2009లో ఇది దాదాపు 3 ట్రిలియన్ల వరకు ఉండేది. అయితే 2008-09 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దరిమిలా అమెరికాకు ఇచ్చిన అప్పును చైనా తగ్గించుకుంటూ వచ్చింది. దానికి కారణం సరిగ్గా మెర్విన్ కింగ్ చెప్పినదే. అప్పు ఇవ్వటం అంటే అమెరికా ట్రెజరీ జారీ చేసే సార్వభౌమ ఋణ పత్రాలు (soverign debt bond) కొనుగోలు చేయటం. దేశాల ప్రభుత్వాలు ఇలాగే రుణాలు సమీకరిస్తాయి.
మెర్విన్ కింగ్ చెబుతున్నది నిజమే సుమా అన్నట్లుగా అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్ ఇటీవల అమెరికా సావరిన్ బాండ్స్ ని పెద్ద మొత్తంలో ($264 మిలియన్) అమ్మేసి, ఆ సొమ్మును ప్రపంచంలో అతి పెద్ద బంగారం ఉత్పత్తి సంస్ధ బారిక్ గోల్డ్ లో పెట్టాడు. రష్యా అయితే భారీ మొత్తంలో అమెరికా డాలర్ ఆస్తులను తెగ్గోసుకుంది. 2008లో 200 బిలియన్ లకు పైగా ఉన్న డాలర్ ఆస్తులను గత మార్చి నాటికి 86 బిలియన్ లకు తగ్గించుకుంది.
దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకల జాతర పెరుగుతూ ఉండటం, రష్యా పశ్చిమ సరిహద్దు వెంట ఉన్న తూర్పు యూరప్ దేశాలన్నింటా అమెరికా తన మిసైళ్లను, ఇతర యుద్ధ పరికరాలను మోహరించటం, రష్యా వాయవ్య మూలన ఉన్న బాల్టిక్ సముద్రంలో కూడా అమెరికా యుద్ధ నౌకలు, గూఢచార విమానాలు గస్తీ తిరగడం, అన్నింటి కంటే ముఖ్యంగా అమెరికా, ఐరోపాలలో మరోసారి ఆర్ధిక సంక్షోభంగా మారగల ఆర్ధిక మాంద్యం (రిసెషన్) పరిస్ధితులు ఏర్పడటం… ఈ కారణాల నేపధ్యంలో మెర్విన్ కింగ్ హెచ్చరిక ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
మహిళలపై అమానుషాన్ని ఆపండి -ఐర్లండ్ తో ఐరాస
మహిళలు అబార్షన్లు చేసుకోవటంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని, మహిళలను క్రూరంగా చూడటం మానుకోవాలని ఐరాస కమిటీ ఒకటి ఐర్లండ్ దేశంపై తీవ్ర స్ధాయిలో విరుచుకు పడింది. ఐర్లండ్ కు చెందిన ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐరాస మానవ హక్కుల సంస్ధ సభ్యులతో ఏర్పడిన కమిటీ ఆ దేశాన్ని విమర్శించింది. కడుపులో ఉన్న బిడ్డ బ్రతికే అవకాశాలు లేవని తెలిసినప్పటికీ ఆమె అబార్షన్ చేయటానికి ఆసుపత్రి డాక్టర్లు నిరాకరించారు. అబార్షన్ చేస్తే తీవ్ర శిక్షలు ఎదుర్కోవాలన్న భయంతో డాక్టర్లు నిస్సహాయత వ్యక్తం చేయటంతో ఆమె బ్రిటన్ వెళ్ళి అబార్షన్ చేసుకోవలసి వచ్చింది.
సరిగ్గా ఇదే కారణంతో భారతీయ మహిళ సవితకు అబార్షన్ చేయటానికి ఐర్లండ్ ఆసుపత్రి నిరాకరించటంతో ఆమె చనిపోయింది. ఆమె కడుపులో బిడ్డ చనిపోయిన సూచనలు ఉన్నప్పటికీ అబార్షన్ కు నిరాకరించటంతో రెండు రోజుల పాటు నరక యాతన అనుభవించి చివరికి ప్రాణం కోల్పోయింది. తమను తాము కేధలిక్ దేశంగా చెప్పుకునే ఐర్లండ్ ప్రజలు పిల్లలు దేవుడి వరమని, అబార్షన్ చేయడం అంటే దేవుడి ఆజ్ఞను ధిక్కరించడమే అని భావిస్తారు. చట్టాలు సైతం అవే భావాలను పొదువుకుని మహిళల పట్ల క్రూరంగా తయారయ్యాయి. పెద్ద ప్రాణాన్ని కాపాడాలా లేక ఇంకా తగిన రూపం ధరించని చిన్న ప్రాణం కాపాడాలా అంటూ ఒక కృత్రిమ వైరుధ్యాన్ని సృష్టించుకుని వాదోపవాదాలు చేసుకోవటంతోనే ఐర్లండ్ ప్రజలు, ప్రభుత్వం దశాబ్దాలు గడిపేస్తున్నాయి.
ఉద్తా పంజాబ్ లో తప్పేముంది? -బొంబే హై కోర్ట్
సెన్సార్ బోర్డ్ నిరంకుశ ధోరణిపై కోర్టు మెట్లు ఎక్కిన ‘ఉద్తా పంజాబ్’ నిర్మాత అనురాగ్ కశ్యప్ పోరాటం ఆయనకు సానుకూలంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా టైటిల్ లో ‘పంజాబ్’ పేరు పేర్కొనటం వల్ల నష్టం ఏమిటో చెప్పాలని కోర్టు బోర్డును కోరింది. మరో సినిమా ‘గో, గోవా, గాన్’ తో పోల్చుతూ అక్కడ లేని తప్పు ఇక్కడ ఎలా ఉంటుందని ప్రశ్నించింది. “ఆ సినిమాలో మాదక ద్రవ్యాలను దుర్వినియోగం చేసే స్ధలంగా గోవాను చూపినప్పుడు ఉద్తా పంజాబ్ లో పంజాబ్ ను అదే విధంగా చూపితే తప్పేమిటి?” అని బోర్డు లాయర్ ను ప్రశ్నించింది.
సినిమాలో ‘చండీఘర్, అమృత్ సర్, తరంతరన్, జషన్ పురా, మొగా, లూధియానా పట్టణాలను సూచించే మాటలను తొలగించాలన్న సెన్సార్ బోర్డ్ ఆదేశాలతో తాము సంతృప్తిగా లేమని కోర్టు స్పష్టం చేసింది. సెన్సార్ బోర్డు సూచించిన 13 మార్పులు అంతిమంగా 89 కత్తిరింపులకు దారి తీస్తున్న నేపధ్యంలో బోర్డు ఆదేశాలు “బుర్ర పెట్టకుండా ఇచ్చినవనీ, ఇష్టారీతిన ఒక కారణం, పద్ధతి లేకుండా” ఇచ్చారని వాదిస్తూ నిర్మాతలు కోర్టు తలుపు తట్టారు.
తాము బుర్ర పెట్టే కత్తిరింపులు సూచించామని బోర్డు వాదించింది. కోర్టు అడిగిన వివరణలకు బోర్డు లాయర్ల నుండి హేతుబద్ధమైన సమాధానాలు అందలేదు. “పంజాబ్, అక్కడి ప్రజలను ఉద్దేశించిన సందర్భాలు, సినిమాలో వాడిన భాష… వీటిపై తాము అభ్యంతరం చెప్పాము” అని మాత్రమే వారు చెప్పారు. ఇతర అంశాలకు సమయం కావాలని వారు కోరటంతో విచారణను కోర్టు వాయిదా వేసింది.
కాగా సెన్సార్ బోర్డు తీరు పని తీరును సంస్కరించాలని కోరుతూ మోడి ప్రభుత్వం నియమించిన కమిటీ నేత శ్యామ్ బెనెగల్ స్వయంగా సినిమా చూసి తన అభిప్రాయం ప్రకటించాడు. ఉద్తా పంజాబ్ సినిమాలో పంజాబ్ రాష్ట్రానికి వ్యతిరేకంగా తీసిన సినిమా కానే కాదని నిర్ధారించడం విశేషం. “అత్యంత బాగా రూపొందించిన సినిమా ఇది. ఒక తీవ్ర సమస్యను జనం దృష్టిలోకి తెస్తుంది. ఇది గొప్ప అభినందనీయమైన సినిమా” అని బెనెగల్ సినిమాను ప్రశంసించారు.
రేపిస్టుని క్షమించి వదిలేయి, ప్లీజ్
గుజరాత్ మారణకాండపై స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించి పలు సంచనాలను వెలికి తీసిన తెహెల్కా పత్రిక మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ మరోసారి వార్తలకు ఎక్కాడు. తన జూనియర్ అయిన మహిళా ఉద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన తరుణ్ తేజ్ పాల్ చేసినది తీవ్ర తప్పిదమే అని చెబుతూ ఆయన చేసిన ఇతర మంచి పనుల రీత్యా వదిలి పెట్టాలని కోరారు. ఆయనకు మద్దతుగా మిడ్-డే లాంటి పత్రికల్లో వ్యాసాలు ప్రచురిస్తున్నారు.
వారి విజ్ఞప్తిని బాధితురాలు తిరస్కరించింది. “తెహెల్కా, ఆ పత్రిక నిర్వహించే ధింక్ సదస్సు (conclave) లలో ‘లిబరల్ అనేది ఏమీ లేదు. ఎడిటర్ మిత్రులను వాళ్ళు బెదిరిస్తే గనక న్యూస్ రూమ్ లలో తయారయ్యే స్టోరీలు పత్రికలోకి రాకుండానే చచ్చిపోతాయి. తెహెల్కా అంత గొప్ప పత్రికె ఐతే ఎడిటర్-ఇన్-చీఫ్ కు ఢిల్లీ, గోవా, ముంబై, నైనిటాల్ లలో భారీ ఆస్తులు ఎలా సమకూరుతాయి? సంపన్నవంతులైన, పలుకుబడి కలిగిన నేరగాళ్ళు విలేఖరులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలతో “లిబరలిజం’ ముసుగులో అంతర్జాతీయ సదస్సులు జరుపుతూ ఉంటే న్యాయం దక్కుతుందన్న నమ్మకం ఎలా కలుగుతుంది?” అని ఆమె ప్రశ్నించింది.