- తిండి కోసం ఇసిస్ లొ చేరాము !
- పోరాటం కొనసాగుతుంది -శాండర్స్
- సౌదీలకు టార్చర్ టెక్నిక్ లు నేర్పుతున్న బ్రిటిషర్లు
- కేరళను తాకిన నైరుతి ఋతుపవనం
- రాజన్ భారతీయుడే -ఆర్బిఐ
తిండి కోసం ఇసిస్ లొ చేరాము !
మే 2014 నుండి ఇసిస్ ఆక్రమణ లో ఉన్న ఫలూజా నగరాన్ని ఇరాకీ బలగాలు విముక్తి చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇరాక్ ప్రభుత్వ బలగాలు పురోగమించే కొద్దీ స్ధానిక ప్రజలపై ఇసిస్ మూకలు సాగించిన దౌర్జ్యన్య కాండ గురించిన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇసిస్ కు నగరాన్ని అప్పగించి ఇరాకీ బలగాలు పారిపోయిన తర్వాత ఇరాక్ ప్రభుత్వం స్ధానిక ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు చెల్లించటం నిలిపివేసింది. తాము డబ్బు పంపితే అది ఇసిస్ వశం అవుతుందని ప్రభుత్వం భయపడింది.
దరిమిలా ఫలుజా ప్రజలకు ఆహారం దొరకటం గగనం అయింది. ఉన్న ఆహార నిల్వలను ఇసిస్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దానితో ఆహారం (గోధుమ పిండి, బియ్యం, వంట నూనె మొ.వి) కోసం ప్రజలు అల్లాడారు. ఇసిస్ బలగాల నుండి ఆహార పదార్ధాలు కొనుగోలు చేయటానికి భారీ మొత్తాలు చెల్లించవలసి రావటంతో కాస్తో కూస్తో ఉన్న మిగులూ హరించుకుపోయింది. ఈ నేపధ్యంలో ఇసిస్ సైనికులుగా పని చేస్తేనే అత్యవసర ఆహార సరఫరాలు అందిస్తామని ఇసిస్ ఒత్తిడి చేయటంతో తాము తప్పనిసరై ఇసిస్ లో చేరామని ఇరాకీ బలగాలు అరెస్టు చేసినవారు చెబుతున్నారు.
ఇలా బలవంతంగా ఇసిస్ లో చేరిన వారు రెంటికీ చెడ్డ రేవడు అయ్యారు. ఇసిస్ తో పని చేసినందుకు ఇరాక్ ప్రభుత్వం వారిపై చర్యలు చేపట్టనుంది.
పోరాటం కొనసాగుతుంది -శాండర్స్
2017 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా మాజీ మొదటి మహిళ, అనంతరం విదేశాంగ మంత్రి అయిన హిల్లరీ క్లింటన్ నిలబడటం దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా ప్రైమరీలో ప్రత్యర్ధి బెర్నీ శాండర్స్ పైన హిల్లరీ విజయం సాధించినట్లు తెలియటంతో హిల్లరీయే అభ్యర్ధి అని పత్రికలు నిర్ధారిస్తున్నాయి. పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు అవసరమైన ఓట్లు తనకు లభించాయని హిల్లరీ క్లింటన్ ప్రకటించింది. అయితే తన పోరాటం కొనసాగుతుంది అని సాండర్స్ ప్రకటించడం విశేషం. కాగా ప్రైమరీలు ఆరంభం కావటానికి ముందే హిల్లరీ అభ్యర్ధిత్వాన్ని సూపర్ ధనికులు ఖాయం చేశారని ఆ వైపుగా ఎన్నికలను రిగ్గింగ్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా ఇప్పటికే డోలాల్డ్ ట్రంప్ పేరు ఖాయం అయింది. అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ కట్టి వలసలు అడ్డుకుంటానని, ముస్లింలను దేశం నుండి తన్ని తగలేస్తానని, అమెరికా ఉద్యోగాలు ఇండియా తన్నుకుపోకుండా వీసా నిబంధనలు కఠినతరం చేస్తానని తీవ్ర స్ధాయి వాగ్దానాలు చేయటం ద్వారా ట్రంప్ ఇంటా, బైటా అనేకమందికి కలవరం పుట్టించాడు. ట్రంప్, హిల్లరీలలో ఎవరు బెటర్ అంటే ‘ఏ రాయైతేనేం పళ్ళు ఊడగొట్టుకోవటానికి?” అని సాండర్స్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు.

Saudi Police
సౌదీలకు టార్చర్ టెక్నిక్ లు నేర్పుతున్న బ్రిటిషర్లు
సౌదీ పోలీసులకు బ్రిటిష్ పోలీస్ కాలేజీ హై టెక్ టార్చర్ టెక్నిక్ లను నేర్పుతోందని మానవ హక్కుల సంస్ధలు వెల్లడి చేశాయి. హై టెక్ క్రైమ్ డిటెక్షన్ టెక్నిక్స్ పేరుతో బ్రిటిష్ పోలీస్ అకాడమీ నేర్పుతున్న విద్యలు ప్రజాస్వామ్య ఉద్యమకారులను టార్చర్ చేసేందుకు, చంపేసేందుకు వినియోగించే అవకాశం మెండుగా ఉన్నదని హక్కుల సంస్ధలు ఆరోపించాయి. అటువంటి పరిణామాలు సంభవిస్తే తమ శిక్షణ ప్రోగ్రాం లను సమీక్షిస్తామని బ్రిటిష్ అధికారులు హామీ ఇస్తున్నారు.
2011 నాటి అరబ్ వసంతం ఆందోళనలో పాల్గొన్న అనేకమందిపై సౌదీ ప్రభుత్వం బ్రిటిష్ పోలీసులు నేర్పిన టెక్నిక్ లను ప్రయోగించారని రష్యా టుడే తెలిపింది. డజన్ల కొద్దీ యువకుల్ని టార్చర్ చేసి అనంతరం ఉరి తీశారు. 2012లో అహింసాయుత ఆందోళనలో పాల్గొందామని స్నేహితులకు ఎస్ఎంఎస్ పంపినందుకు 17 సం.ల యువకుడిని చిత్రహింసలు పెట్టి ఆనక ఉరి తీసి చంపేశారు. ఈ సం. ఇప్పటి వరకు వివిధ కారణాలు చూపుతూ 47 మందిని సౌదీ ప్రభుత్వం ఉరి తీసింది. ఇరాక్ దురాక్రమణ అనంతరం వందల మందిని రహస్య జైళ్ళలో చిత్రహింసలు పెట్టిన చరిత్ర ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం సౌదీ పోలీసులకు శిక్షణ ఇవ్వటం ఆపేస్తే సౌదీతో భాగస్వామ్యంలో సమస్యలు వస్తాయని అది ఇంకా పెద్ద సమస్య అనీ తన చర్యలను సమర్ధించుకుంటోంది.

Thiruvanthapuram
కేరళను తాకిన నైరుతి ఋతుపవనం
భారత వాతావరణ శాఖ ఋతుపవనాల రాకను నిర్ధారించింది. నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని, లక్ష ద్వీపం దీవులను ఈ రోజు (జూన్ 8) తాకాయని ప్రకటించింది. వర్షపు చుక్క కోసం అల్లాడుతున్న అనేక కరువు పీడిత ప్రాంతాలకు ఇది తీపి కబురుగా పత్రికలు చెబుతున్నాయి. కానీ గతంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నట్లుగా ఋతుపవనాలు సమయానికి రావటం తగినంత (సాధారణ) వర్షాన్ని ఇవ్వటం దానికదే శుభ వార్త కాబోదు. ఋతుపవనాలు ప్రవేశించాక దేశ వ్యాపితంగా తగిన మొత్తంలో విస్తరిస్తేనే పంటలకు, ఆర్ధిక వ్యవస్ధకు ఉపయోగం.
ఈ యేడు సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షాలను ఋతుపవనాలు అందిస్తాయని వాతావరణ విభాగం (ఐఎండి) చెబుతోంది. 106 శాతం వర్షాలు ఇస్తాయని అంకె కూడా చెప్పేసింది. ఎల్పిఏ (లాంగ్ పీరియడ్ యావరేజ్) కంటే 106 శాతం వర్షాలు కురుస్తాయని, వాయవ్య-మధ్య-దక్షిణ భారత ప్రాంతాల్లో అధిక వర్షాలు కురుస్తాయనీ తెలిపింది. ఎల్పిఏ అంటే 1951 నుండి 2000 వరకు 50 సం.ల కాలంలో కురిసిన వర్షాలలో వార్షిక సగటు. ఇది 89 సెం. మీ అని ది హిందు తెలిపింది. దీనిలో 106 శాతం అంటే రమారమి 94 సెం. మీ వర్షపాతం నమోదు అవుతుంది.
రాజన్ భారతీయుడే -ఆర్బిఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ భారత పౌరుడే అని సెంట్రల్ బ్యాంకు ఒక ప్రకటనలో చెప్పుకుంది. ఒక దేశ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ ఆ దేశ పౌరుడే అని స్వయంగా సెంట్రల్ బ్యాంకే చెప్పుకోవలసిన దుస్ధితి వచ్చిందంటే ప్రభుత్వ పని తీరులో తప్పనిసరిగా లోపం ఉన్నట్లే. గాంధీల కుటుంబంపై అలుపు లేకుండా ఆరోపణలు చేస్తూ బిజేపి అభిమానాన్ని చూరగొన్న సుబ్రమణ్య స్వామి అదే ఊపుతో రఘురాం రాజన్ విదేశీయుడని, ఆయనలో భారత తత్వం లేదనీ ఆరోపణలు గుప్పిస్తూ ఆర్బిఐ గవర్నర్ పదవిని వార్తల్లోకి తెచ్చాడు.
భారతతనం లేని రాజన్ ను వెంటనే పదవి నుండి తప్పించాలని స్వామి డిమాండ్ చేస్తున్నా అదేమని అడగటానికి కేంద్ర మంత్రులు గానీ, ప్రధాన మంత్రి గానీ ముందుకు రాలేదు. పరోక్షంగా, అంటీ ముంటనట్లుగా స్వామి డిమాండ్ కు స్పందించటమే గానీ ‘ఇక చాలు ఆపు’ అన్నవాడు లేడు. దానితో స్వామీ రెచ్చిపోవటం వెనుక బిజేపి శక్తుల ఆశీస్సులు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గించలేదని, అమెరికా నుండి వచ్చాడనీ రాజన్ పై స్వామి ఫిర్యాదు.
భారతీయులు అమెరికాలో వీరతేజంతో వెలుగొందుతున్నారని, గూగుల్-మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలను నడుపుతోంది మనవాళ్లేననీ, అసలు ప్రపంచం అంతా విజ్ఞానాన్ని పంచింది మనవాళ్లేనని ప్రచారం చేసుకునేది మళ్ళీ ఈ అపర వీర దేశ భక్తులే. పెట్టుబడులు కావాలనీ, మీ సరుకుల్ని ఇండియా వచ్చి మేక్ చేయాలని బతిమాలుకునేదీ వీళ్ళే. అణు పెత్తందారీ గ్రూపు ఎన్ఎస్జి లో సభ్యత్వం కావాలని అమెరికాను బతిమాలేదీ వీళ్ళే. అమెరికా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ అలా చేయటమే గొప్ప రాజనీతిజ్ఞతగా జబ్బలు చరుచుకుంటూ మళ్ళీ అదే అమెరికా నుండి వచ్చాడని రాజన్ పైన విషం కక్కటం దేనికి?!
నిజం చెప్పాలంటే ఒక్క ఆర్బిఐ గవర్నర్ మాత్రమే కాదు, ఆర్ధిక మంత్రి, వాణిజ్య మంత్రి, విదేశీ మంత్రి లాంటి కీలక పదవుల్లో ఎవరిని నియమించాలి అన్నది కూడా అమెరికా నిర్దేశిస్తుందని వికీ లీక్స్ వెల్లడించిన డిప్లొమేటిక్స్ కేబుల్స్ ద్వారా తెలిసి వచ్చాక, ఈ నంగనాచి దేశభక్తి కబుర్లు ఎందుకట!
Thank you Sir for again restarting this section. We can know your views on various daily events that are happening around the world. Please continue this section.
ఇలా ఎక్కువ వార్తలు క్లుప్తంగా ప్రచురించడం బావుంది.