గృహస్ధుడు & నాయకుడు: “అబ్బబ్బ! ధరలు మరీ అందుబాటులో లేకుండా పోయాయి!”
*********
ప్రజల మేలు ఏనాడూ కోరని పార్టీలు, వాటి నాయకులు ఆ సంగతి మరిపించటానికి అలవి గాని వాగ్దానాలు చేయడం, అవి తీర్చలేక (ఆఫ్ కోర్స్! తీర్చే ఉద్దేశం లేక) ఎన్నికలలో అక్రమాలకు పాల్పడటం పరిపాటి. ఎన్నికల అక్రమాలలో పేరెన్నిక గన్నవి డబ్బు పంపిణీ, మద్యం తాగబోయించటం అని అందరికీ తెలిసిన సంగతే!
కూలీనాలితో పొట్ట పోసుకునే శ్రామికులకు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలియదు. రాజకీయ నాయకులు, రాజ్యాంగం, రాజకీయ శాస్త్రం చెప్పే ప్రజాస్వామ్య సూత్రాలు వారికి అసలే తెలియవు. వారికి తెలిసిందల్లా ఎన్నికలు వస్తే ఓటు కోసం నేతలు దండాలు పెట్టుకుంటూ తమ వద్దకు వస్తారని, తమ ఓట్లను డబ్బులు ఇచ్చి కొంటారని, (తాగుబోతులైతే) నేతల ఖర్చుతో తాగి తిరగొచ్చని.
కాని ఎంఎల్ఎ లు వారి వలే రాజకీయ జ్ఞానం లేనివారు కారు. ఎంఎల్ఎ లకు రాజకీయాల పరమార్థం ఏమిటో తెలుసు. రాజ్యాంగం అంటే ఏమిటో వారికి తెలుసు. తాము ఎన్నిక అయితే ఏం చేయాలో తెలుసు. ముఖ్యంగా ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలుసు. ఓట్లు అన్నవి కొనుగోలు చేసేందుకు ఉద్దేశించినవి కావనీ, రాజకీయ సూత్రాల ప్రాతిపదికగా, తమ సిద్థాంతాలు చెప్పి సంపాదించుకోవాలనీ వారికి బాగానే తెలుసు.
కానీ ఏం జరుగుతున్నదో చూడండి! ఎంఎల్ఎలే అన్ని సూత్రాలు గాలికి వదిలేసి స్వయంగా తామే ఓటుకు డబ్బు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక జెడి(యు) పార్టీకి చెందిన ఎంఎల్ఎలు, ఇండిపెండెంట్ ఎంఎల్‌ఏలు రాజ్య సభ ఎన్నికల నిమిత్తం కోట్ల రూపాయలలో డబ్బు డిమాండ్ చేస్తూ ఇండియా టుడే ఛానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయారు. ఎంత చెట్టుకు అంత గాలి అనుకుని సరిపెట్టు కోవాలో ఏమో తెలియదు గానీ, ఆ డబ్బు పరిమాణం వింటే సామాన్యులకు కళ్ళు తిరగటం ఖాయం.
కర్ణాటక ఎంఎల్ఎ లను మాత్రమే ఛీ కొట్టి లాభం లేదు. ఎందుకు అంటే రాజ్య సభ సభ్యత్వాలను బేరానికి పెట్టి అమ్ముకోవటం పార్టీల అథిపతులకు కొత్త కాదు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు. పార్టీ పాత కాపులను వదిలి సుజనా చౌదరి లాంటి వారిని ఉన్న పళంగా రాజ్య సభకు ఎంపిక చేయడం వెనుక భారీ మొత్తంలో డబ్బు చేతులు మారిందని టిడిపి వాళ్ళే ఆరోపణలు చేయగా విన్నాం.
ఇప్పుడు వింటున్నది రాజ్య సభ ఎన్నికల ఓట్ల అమ్మకం పార్టీల నేతల చేతుల నుండి సభ్యుల వ్యక్తిగత స్థాయిలో వికేంద్రీకరణకు గురి కావటం. ఈ అంశం ఒక ముఖ్య పరిణామాన్ని సూచిస్తోంది. అది ఏమిటి అంటే బూర్జువా ప్రజాస్వామ్యం ప్రవచించే విలువలు మర్యాదకు కూడా కనపడకుండా పోవడం; బూర్జువా ప్రజాస్వామ్య సూత్రాలు అన్ని రకాలుగా -సైద్ధాంతికంగా, ఆచరణాత్మకంగా- బలహీనపడుతూ పోవటం.
ఇన్నాళ్ళూ ఎంఎల్ఎలు ఏదో ఒక సిద్ధాంతం పేరుతో పార్టీకి కట్టుబడి ఉండటం ఒక సూత్రం, నియమం, నీతి. ఈ సూత్రం కిందనే చట్ట సభలలో ఆయా పార్టీలకు చట్టబద్ధమైన విప్ లు ఉన్నారు. ఇప్పుడు వారి విధులు ఆచరణలో అదృశ్యం అవుతున్నాయి. లేకపోతే వైసిపి ఎంఎల్ఎలు వరస పెట్టి టిడిపిలో చేరిపోవటం, చంద్రబాబు అదేమీ పెద్ద విషయం కాదన్నట్టుగా బహిరంగంగానే ఆహ్వానాలు పలకటం ఏమిటి, విచ్చలవిడి రాజకీయ అవినీతి కాకపోతే?
రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఈ ఆకర్షణ పధకాన్ని ఆనాడు విమర్శించిన పత్రికలు ఈనాడు నోరు మెదపక పోగా అదో మహా యజ్ఞం అయినట్టు ప్రశంసాత్మకంగా వార్తలు గుప్పిస్తున్నాయి. తాము నెత్తిమీద పెట్టుకునే బూర్జువా ప్రజాస్వామ్య విలువలను తామే పలుచన చేస్తున్నామని వారికి తెలియదనుకోవాలా?
నిజానికి పత్రికలు ప్రత్యేకంగా పూనుకుని పలుచన చేయవలసిన అవసరం లేదు. బూర్జువా రాజ్యాంగ రాజకీయాలలో నీతిని వెతకటం నేతి బీరలో నేతిని వెతకటంతో సమానం. కాకపోతే ఇన్నాళ్లూ నివురు గప్పిన నిప్పులా ఉంటూ, వివిధ పై పై మర్యాదల ముసుగు వేసుకున్నది కాస్తా ఇప్పుడు ముసుగు విదిల్చి నిజ స్వరూపం చాటుతోందంతే!
బూర్జువా ప్రజాస్వామ్య సూత్రాలు బలహీన పడితే బూర్జువా ప్రజాస్వామ్యం పైన ప్రజల భ్రమలు సైతం క్రమంగా అదృశ్యం అవుతూ ఉంటాయి. ఆ స్ధానంలో బూర్జువా నియంతృత్వం మరింత నగ్నంగా ప్రజల ముందుకు వస్తుంది. అణచివేత చట్టాలు పదునుబారుతాయి. కొత్త కొత్త నల్ల చట్టాలు రూపుదిద్దుకోవచ్చు.
మరో వైపు బూర్జువా ప్రజాస్వామ్యంపై భ్రమలు పోయినంత మాత్రాన ప్రజలు తిరుగుబాటు వైపుకూ, ఉద్యమాల వైపుకూ దారి తీస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. వారికి నమ్మకమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తే తప్ప వారు ఉద్యమాల లోకి దూకటం ఆటోమేటిక్ గా జరగదు. ఉద్యమ పార్టీల పేరుతో, వామపక్షం పేరుతో పుట్టి పాలిస్తున్న పార్టీల పుణ్యాన ప్రజా ఉద్యమాల ప్రతిష్ట మంట గలిసిపోయిన నేపధ్యంలో ప్రజలు ఉద్యమ, పోరాటాల ప్రత్యామ్నాయం వైపు రావటానికి మహా యజ్ఞమే జరగాలి.
***
గృహస్ధుడు పెరిగే ధరల్లో పోగొట్టుకున్నది ఆయాచితంగా తిరిగి వచ్చేది కాదు. ఆయన ఒళ్ళు వంచి శ్రమిస్తే గానీ జీతం/వేతనం/ కూలి డబ్బులు చేతిలో పడవు. కానీ రాజకీయ నాయకుడి సంగతి అది కాదు. పెట్టింది రాబట్టుకోవటంతో పాటు అంతకు అనేక రెట్లు అదనంగా సంపాదించుకోగల శక్తి అతనికి సమకూరుతుంది. అందుకే ఎంతైనా ధర పెట్టి ఎంఎల్‌ఏలను కొనగలడు.
ఇండియా టుడే స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయిన ఒక ఎంఎల్‌ఏ తాను ఎన్నికల్లో రు 5 కోట్లు ఖర్చు పెట్టాను గనక ఆ రు 5 కొట్లూ రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధి ఇవ్వటం ధర్మం అని వాదించటం గమనించి తీరాలి.