
Rupabehn Mody
రూపాబెహన్ మోడి పార్శీ కుటుంబానికి చెందిన మహిళ. గుల్బర్గ్ సొసైటీలోనే ఆమె ఇల్లు కూడా ఉన్నది. హిందూ మతం పేరుతో రెచ్చిపోయిన రౌడీ మూకల స్వైర విహారం నుండి రక్షించుకోవటానికి ఆమె తన కూతురు, కొడుకుతో కలిసి కాంగ్రెస్ ఎంపి ఎహసాన్ జాఫ్రీ ఇంటిలో తలదాచుకుంది. ముఖ్యమంత్రి మోడీకి ఫోన్ చేసి రక్షణ కోరాలని ఎహసాన్ జాఫ్రీకి చెప్పిన వారిలో రూప ఒకరు. గేటు పేల్చివేసి లోపలికి దూసుకు వచ్చిన హిందూ మూకలు ఎహసాన్ జాఫ్రీని బైటికి లాగి కత్తులతో నరకడం కళ్ళారా చూసిన రూపా బెహన్ జాఫ్రీ ఇంటిలో కూడా రక్షణ లేదని అర్ధమై మూకల కళ్ళు గప్పి కొడుకు, కూతురు తో కలిసి పరుగెత్తుకుని వెళ్ళి మరో ఇంటి డాబా టెర్రేస్ పైన నక్కింది.
ఆ క్రమంలో 4 సం.ల కొడుకుని పోగొట్టుకుంది. ఆ నాటి నుండి ఆమె ఎక్కింది గడప, దిగింది గడపగా కొడుకు కోసం వెతికింది. కొడుకుని కూడా మూకలు చంపేశాయని నమ్మటానికి ఆమెకు ఎంతో కాలం పట్టలేదు. అప్పటి నుండి ఆమె న్యాయం కోసం ఎదురు చూస్తోంది. హత్యాకాండ జరిపిన మూకలపై విచారణ జరగకుండా ముఖ్యమంత్రి నరేంద్ర మోడి సర్వ శక్తులు ఒడ్డడంతో బాధితులకు న్యాయం దుర్లభం అయింది.
చివరికి సుప్రీం కోర్టు నియమించిన సిట్ విచారణ ప్రారంభించి 2009లో నివేదిక సమర్పించగా ఆనాటి నుండి కోర్టులో ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. నలుగురు ట్రయల్ జడ్జిలు మారారు. సుప్రీం కోర్టు పదే పదే ముల్లుగర్రతో పొడిచిన నేపధ్యంలో ఎట్టకేలకు నేరం జరిగిన 14 సంవత్సరాలకు తీర్పు వెయివడింది. ఈ నేపధ్యంలో రూపా బెహన్ catchnews వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ యధాతధ అనువాదం ఇది.
రూపా బెహన్ చెప్పిన ముఖ్యమైన అంశాల్లో ఒకటి, ఎహసాన్ జాఫ్రీ అనేకసార్లు ఫోన్ చేయగా చేయగా ఎప్పటికో ఫోన్ ఎత్తిన మోడి, ఫోన్ లో జాఫ్రీని తిట్టాడని చెప్పిన విషయం. ఒక బూతు మాట వాడుతూ “నువ్వింకా చావలేదా?” అని అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రధాన మంత్రి తిట్టడం తాను విన్నానని ఆమె ఇంటర్వ్యూలో చెబుతున్నప్పుడు కాసింత వివేకం, వేడి రక్తం, సాధారణ మానవత నిండిన ఏ గుండె అయినా అమాంతం వేగంగా కొట్టుకోకుండా, రక్తం మరగకుండా, అసహ్యం వేయకుండా, కోపం రాకుండా, కసి రగలకుండా ఉండటం దాదాపు అసాధ్యం.
*********
కోర్టు 24 మందిని దొషులుగా నిర్ధారించి 36 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. మీరు ఆ విషయంపై ఏమని భావిస్తున్నారు?
అవును, 36 మందిని నిర్దోషులుగా వదిలేశారు. ఈ సంగతి నాకు మీడియా ద్వారానే తెలిసింది. మేమంతా కూడి ఈ విషయంలో ఆలోచన చేయాలి. వాళ్ళకు వ్యతిరేకంగా మేము బోలెడన్ని సాక్ష్యాలు ఇచ్చాము. పూర్తి న్యాయం జరిగిందని నేను భావించటం లేదు. కే జి ఎర్దా ని దోషిగా నిర్ధారించలేదు. అదెలా సాధ్యం?
ఎర్దా నిర్దోషిగా చెప్పటం మిమ్మల్ని ఎందుకు అంతగా బాధిస్తోంది?
దాడుల తర్వాత నేను నా కొడుకుని వెతక్కుంటూ ఎక్కింది గడప, దిగింది గడపగా (from pillar to post) తిరుగుతున్నప్పుడు ఆ ఎర్దా యే నన్ను దాడి చేసిన మూకల దగ్గరికి తీసుకెళ్ళాడు. నా ముందే వారిని ప్రశ్నించాడు. మేము అయిదుగురం అతనితో కలిసి వెళ్లాము, నా కూతురుతో సహా. నా కొడుకు ఫోటో కూడా తెమ్మని అతను నాకు చెప్పాడు.
నా ముందు అతను వాళ్ళను అడిగాడు, “Ye laal T-shirt waale ko maara to nahi?” (ఈ ఎర్ర చొక్కా మనిషిని మీరు చంపలేదు కదా?) అని. వాళ్ళలో ఒకడు చంపలేదని చెప్పాడు. ఇక అంతే. అప్పటి నుండి అతనిని మళ్ళీ ఎప్పుడూ చూడలేదు.
ఆ రోజు ఫిబ్రవరి 28 తేదీన ఏం జరిగింది?
ఆ రోజు నా కొడుకు, కూతురు నా తో ఉన్నారు. మా సొసైటీ అంతా మంటల్లో కాలిపోతోంది. నేను నా కూతురు చేయి పట్టుకోగా, తను నా కొడుకు చేయి పట్టుకుంది. మా వంట గది ఒక్కటే అప్పటికి మంటల్లో లేదు. ఆ తర్వాత వంట గదికి కూడా మంటలు వ్యాపించాయి.
మంటల్లో కాలిపోతే బూడిద తప్ప మరేమీ మిగలదు కాబట్టి మంటల్లో కాలిపోయి చనిపోవటం కంటే ముక్కలుగా నరకబడి చనిపోవటమే మేలని నేను భావించాను. అలా అనుకుని మూడో అంతస్ధులో ఉన్న మా ఫ్లాట్ నుండి బైటికి పరుగెత్తాము. మా సొసైటీలోని ఇతరులు కూడా మా లాగే రక్షణ కోసం అటూ ఇటూ పరుగెత్తుకెళ్లడం మేము చూసాము. వాళ్ళంతా ఎహసాన్ జాఫ్రీ సాబ్ ఇంటివైపు పరుగెత్తుతున్నారు. మేము కూడా మొదటి అంతస్ధులోని వాళ్ళ ఇంటికి వెళ్లాము. నా ముందే ఆయన నరేంద్ర మోడికి అనేకసార్లు ఫోన్ చేశారు.
మోడికి ఫోన్ చేయమని మేమే ఆయన్ని కోరాము. వీలయితే గూండాలు అందరికీ ఫోన్ చేయాలనీ మా అందరి ప్రాణాలను వదిలి పెట్టాలని కోరమని చెప్పాము.
చివరికి మోడి ఫోన్ ఎత్తారు. ఫోన్ ఎత్తటం తోనే జాఫ్రీని ఒక బూతుపదంతో తిట్టారు. తిడుతూ “నువ్వు ఇంకా చావ లేదా? ఈ పాటికి నిన్ను చంపేసి ఉండాలే!” అని ఆశ్చర్యపోయాడు.
ఈ లోపు మూకలు అంతకంతకూ దగ్గరకు వచ్చేస్తున్నారు. మా సొసైటీ ఫెన్సింగ్ పైకి ఎక్కడం మొదలు పెట్టారు. ఆ సమయంలో బైటికి వెళ్ళి మూకలతో మాట్లాడటానికి జాఫ్రీ నిర్ణయించుకున్నారు. తమను వదిలిపెట్టమని వారిని బతిమాలుకోవాలన్న ఆశతో బైటికి అడుగు పెట్టారు.
ఆ మూకలు ఆయన్ని లాక్కు వెళ్ళటం నేను స్వయంగా కళ్ళారా చూశాను. వాళ్ళు ఆయన్ని కత్తులతో నరికేశారు. ఆయనపై పెట్రోలు పోసి నిప్పు అంటించారు. అప్పటికి గాని మాకు అర్ధం కాలేదు, మేము వెళ్ళటానికి వేరే చోటంటూ ఏమీ లేదని. మూకలు ఆ చోటు అంతా తగలబెట్టారు. ఆ మంటలు అంతకంతకూ మమ్మల్ని చుట్టుముడుతున్నాయి. ఊపిరి పీల్చుకోవటం సాధ్యం కాలేదు.
దానితో మేము జాఫ్రీ ఇంటి నుండి కూడా పరుగెత్తి పారిపోవాలని నిశ్చయించుకున్నాము. మేము ముగ్గురం ఒకరి చేయి ఒకరం పట్టుకుని పరుగెడుతూ ఉన్నాము. నేలమీద అనేకమంది స్పృహ లేకుండా పడి ఉన్నారు. అలా పడి ఉన్న వారిలో ఒకరు నా కాలికి తగలడంతో పడిపోయాను. నా కూతురు నన్ను పైకి లేపటానికి నా కొడుకు చెయ్యి వదిలిపెట్టింది. అప్పుడే మేము తనని పోగొట్టుకున్నాము.
నేను స్పృహ తప్పి కూలిపోయానని నా కూతురు అనుకుంది. తీవ్ర భయాందోళనతో నన్ను అటూ ఇటూ కుదుపుతూ లేపే ప్రయత్నం చేసింది. నేను ఎలాగో కళ్ళు తెరిచేసరికి నా మొఖం కాలిపోయిందని గ్రహించాను. మేము ఒక ఇంటి టెర్రేస్ మీదికి పరుగెత్తుకుని వెళ్లాము. మరో ఇంటి టెర్రేస్ పైన ఒక పోలీసుని చూశాన్నేను. వాడు నా పైకి రాళ్ళు విసిరాడు.
యాసిడ్ సీసాలు, కాలిపోయిన టైర్లు, అగ్ని గోళాలు… ఇలా ఏవంటే అవి మా పైకి అన్ని వైపుల నుండీ వచ్చి పడుతున్నాయి. జనం బాధతో అరవటం, కేకలు పెట్టటం మేము వింటున్నాము. ఇళ్ళల్లో గ్యాస్ సిలిండర్లు పేలిపోతున్నాయి. ఒక చిన్న పాప స్మృహ లేకుండా పడి ఉండటం చూశాను. నేను ఆ పాపకు సాయం చేద్దాం అనుకున్నాను. కానీ నా చేతులు, కాళ్ళు కాలిపోయి ఉండటంతో చేయలేకపోయాను. నేను అసలు కదల లేని పరిస్ధితిలో ఉన్నాను. ఆ టెర్రేస్ పైన ఎవరికీ కనపడకుండా నక్కి దాకోవటానికి పూర్తిగా పడిపోయి ఉన్న పరిస్ధితుల్లో మా వాడు మా దగ్గర లేడని గమనించాను. వాడి కోసం వెతుకుదామని కిందికి పరుగెత్తబోయాను. కానీ ఆ టెర్రేస్ పైన నాతో పాటు దాగిన వాళ్ళందరూ నన్ను ఆపేశారు. మేమంతా ఆ టెర్రేస్ పైన దాగి ఉండటం మూకలకు తెలిసిపోతుందని వాళ్ళు భయపడ్డారు.
మోడీపైన అప్పుడూ, ఇప్పుడూ మీకున్న అభిప్రాయం ఏమిటి? ఆయన్ని ఇప్పుడు మీరు ఎలా చూస్తారు?
చూడండి, నాకు పశ్చాత్తాపం అనేది ఏమన్నా ఉంటే అది ఒకే ఒక్కటి! అదేమిటంటే ఎహసాన్ జాఫ్రీ ఫోన్ డైరీని నేను ఎత్తుకురాలేకపోయానే అని. ఆయన ఎంతమందితో సంబంధం కలిగి ఉన్నారో అది రుజువు చేసి ఉండేది. ఆ డైరీ ఉన్నట్లయితే జాఫ్రీ ఎవరో తనకు తెలియదని మోడి ప్రత్యేక దర్యాప్తు బృందానికి చెప్పగలిగేవాడు కాదు. ఆ నెల మధ్య నుండి జాఫ్రీ, మోడి ఇద్దరూ ప్రచారం చేస్తున్నారు. రాజ్ కోట్ పత్రికలు అన్నింటిలో వారి ఫోటోలు ప్రచురించబడ్డాయి.
కానీ మేము ఇంతటితో వదిలిపెట్టేది లేదు. ఈ రోజు నిర్దోషులుగా విడుదల అయినవాళ్ళు స్వేచ్ఛగా తిరగటానికి మేము ఒప్పుకోము. మేము మళ్ళీ శక్తుల్ని కూడదీసుకుంటాం. మునుముందు ఏం చేయాలన్నదీ మాట్లాడుకుంటాం.
[ఎహసాన్ జాఫ్రీ ఫోన్ నెంబర్ కు సంబంధించి కాల్ డీటైల్స్ రికార్డ్స్ (సిడిఆర్) తమకు ఇవ్వాలని ప్రాసిక్యూషన్ లాయర్లు పోలీసుల్నీ, ఆ తర్వాత సిట్ నీ పదే పదే ఒత్తిడి చేసి అడిగారు. అవి ఉన్నట్లయితే ఎహసాన్ జాఫ్రీ ఆ రోజు చనిపోక ముందు అనేకమంది ఉన్నత అధికారులతో అనేకసార్లు మాట్లాడారనీ, మోడీ తోనూ మాట్లాడారని వెల్లడి అయి ఉండేది. కానీ సిట్ బృందం, జాఫ్రీ కాల్ రికార్డ్ లు నాశనం అయ్యాయని చెప్పి ఊరకుండిపోయింది.]