
The House
గుల్బర్గ్ హత్యాకాండ బాధితులకు చివరికి తీరని శోకం, అసంతృప్తి, వేదన, నిస్పృహ మాత్రమే దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు ఎహసాన్ జాఫ్రీతో సహా 69 మంది ముస్లింలను ఊచకోత కోసిన కేసులో 24 మందిని మాత్రమే దొషులుగా ట్రయల్ కోర్టు తేల్చింది.
ఆ 25 మందిలో కూడా 11 మంది మాత్రమే హత్యలకు బాధ్యులుగా కోర్టు గుర్తించింది. పోలీసులు మొత్తం 60 మందిపై అభియోగాలు మోపగా 36 మందిని కోర్టు నిర్దోషులుగా తీర్పు చెప్పింది. కేవలం 11 మంది వ్యక్తులు గుల్బర్గ్ సొసైటీలో నివశిస్తున్న 69 మందిని చంపగలిగారని కోర్టు భావించిందని తీర్పు ద్వారా అర్ధం అవుతోంది.
హిందూ మతం పేరుతో ఉన్మాదం నరనరాన నింపుకున్న వందల మంది రక్తం రుచి మరిగిన మూకలు గుల్బర్గ్ సొసైటీ గేటును పేల్చివేసి జాఫ్రీపై ఇంటిమీద దాడి చేశారు. హిందూ మూకల స్వైర వివాహారంతో భయభ్రాంతులైన సొసైటీ నివాసులు రక్షణ లభిస్తుందన్న ఆశతో జాఫ్రీ ఇంటిలో దాగారు.
పొరపాటున మనిషి పుటక పుట్టిన మూకలు జాఫ్రీ ఇంటిని చుట్టుముట్టి, ఇంటికి నిప్పు పెట్టటంతో లోపల ఉన్నవారు కాలి బుగ్గైపోయారు. జాఫ్రీ ఆనవాళ్ళు కూడా అక్కడ దొరకలేదు. జాఫ్రీని మూకలు ఇంటి బైటికి లాగటం చివరిసారి చూశారాని కోర్టు వాదనల ద్వారా తెలిసింది. ఆయనను నరికి చంపారని అనంతరం శవం మాయం చేశారని భావించారు/భావిస్తున్నారు.
ఇంత రాక్షస కాండకు కేవలం 11 మంది పూనుకుని పూర్తి చేశారని కోర్టు తేల్చేసింది. “సరిపోయినన్ని” సాక్షాలు లేవన్న సాకుతో 30 మందిని వదిలి పెట్టింది. వారిలో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు, జాఫ్రీ ఇంటికి వచ్చి కూడా రక్షణ ఇవ్వని పోలీస్ ఇనస్పెక్టర్ కూడా ఉండటం బాధితులను మరింతగా వేధిస్తున్న విషయం.
జీవిత చరమాంకంలో భర్త, బంధువుల క్రూర హత్యకు న్యాయం దక్కటం కోసం పోరాటం చేస్తున్న జకీయా జాఫ్రీ తీర్పుపట్ల తీవ్ర అసంతృప్తి ప్రకటించారు. “నా పోరాటం ఇంకా కొనసాగుతుంది” అని ప్రకటించడం ద్వారా కోర్టు తీర్పుపై నిస్పృహ వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడిని వెంటాడిన కేసు కూడా గుల్బర్గ్ హత్యాకాండ కేసే కావటం గమనార్హం. గుజరాత్ మారణకాండపై విచారణకు సుప్రీం కోర్టు నియమించిన ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్), నేరంలో మోడికి ఏ మేరకు పాత్ర వహించారన్న అంశంపై కాకుండా ‘నేరంలో ఆయనకు ఎలాంటి పాత్రా లేదు’ అని సర్టిఫై చేయటానికే, ఈ నిర్దిష్ట కేసులో, ఆద్యంతం దర్యాప్తు నడిపించిందని బాధితులు, పలువురు విశ్లేషకులు విమర్శించారు.
రక్షణ కోసం తనను ఆశ్రయించిన వారితో పాటు తన కుటుంబాన్ని కూడా హిందూ మూకల నుండి రక్షించుకునే నిమిత్తం ఎహసాన్ జాఫ్రీ పలుమార్లు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసినప్పటికీ పోలీసులు రక్షణకు పూనుకోలేదు. ‘ఇదిగో వస్తున్నాం, అదిగో వస్తున్నాం’ అనటమే కానీ అక్కడికి వచ్చిన పాపాన పోలేదు. హత్యాకాండకు ముందు, పూర్తయిన తర్వాతా ఒక ఇనస్పెక్టర్ మాత్రం అక్కడికి వచ్చిపోయారని అనంతరం వెల్లడి అయింది. ఆ రావటం రక్షణ కోసం కాకుండా మూకలు తలపెట్టిన కార్యక్రమం ముగిసిందా లేదా చూసేందుకే వచ్చాడని స్వచ్ఛంద సంస్ధలు ఆరోపించాయి.
ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఆదేశాల మేరకు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లో తిష్ట వేసి కూర్చొని సహాయం ఆర్ధిస్తూ వచ్చిన ఫోన్ కాల్స్ కు పోలీసులు అటెండ్ కాకుండా కాపలా కాసారని ‘కమ్యూనలిజం కాంబాట్’ లాంటి పత్రికలు ససాక్షరంగా వెల్లడి చేశాయి. తన భర్త ముఖ్యమంత్రి మోడికి కూడా ఫోన్ చేశారని, మోడి ఇస్తాడనుకున్న ‘సహాయం’ ఎన్నటికీ రానే లేదని జకీయా జాఫ్రీ అనేకసార్లు వెల్లడించారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి నుండి ఆదేశాలు అందిన మాట వాస్తవమేనని, ముఖ్యమంత్రి నిర్వహించిన అత్యున్నత సమావేశానికి తానూ హాజరయ్యానని పోలీసు అధికారి సంజీవ్ భట్ సిట్ ముందు సాక్ష్యం చెప్పినప్పటికీ ఆయన సాక్ష్యాన్ని ‘నమ్మదగని సాక్ష్యం’గా సిట్ కొట్టివేసింది. మోడి పాత్రను సూచించే ప్రతి సాక్ష్యాన్ని, కారణాన్ని వివిధ కుంటిసాకులు చూపిస్తూ సిట్ కొట్టివేసింది. మోడిని విచారించటానికి కావలసిన సాక్షాలు ఉన్నాయని సిట్ నివేదికలోనే ఉన్నాయని సుప్రీం కోర్టు నియమించిన అమికస్ క్యూరీ రాజు రామచంద్రం సైతం నిర్ధారించారు.
మరీ ఘోరం ఏమిటంటే తన ఇంటిని చుట్టు ముట్టిన మూకలపైకి తుపాకితో కాల్చటం ద్వారా ఎహసాన్ జాఫ్రీ, హత్యాకాండకు తానే పురి గొల్పరని సిట్ అనుమానం వ్యక్తం చేయటం! బాధితుడినే నేరస్ధుడిగా మార్చే ప్రక్రియకు అత్యున్నత దర్యాప్తు బృందమే పూనుకున్నాక ఇక న్యాయం జరగటం ఎలా సాధ్యం?
అయితే సిట్ పేర్కొన్న ‘తుపాకి’ వాదన ట్రయల్ కోర్టు విచారణలో ఏ సమయంలోనూ ప్రస్తావనకు నోచుకోలేదు. ఏ తుపాకి వాదన వినిపించి దర్యాప్తు బృందం ‘చర్య – ప్రతి చర్య’ సిద్ధాంతంతో హత్యాకాండ నెపాన్ని బాధితుల మీదికే నెట్టివేశారో ఆ తుపాకి ప్రస్తావన వాదనలలో ఎందుకు వినపడలేదు? ఎందుకంటే అది నిజం కాదు కనుక. అందుకు సాక్ష్యాలు లేవు కనుక!
సిట్ నెత్తికి ఎత్తుకున్న ‘చర్య – ప్రతి చర్య’ వాదననే ఇప్పటి ప్రధాని, అప్పటి గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడి పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ వినిపించారు. ఎహసాన్ జాఫ్రీ తుపాకితో కాల్చటం ‘చర్య’ అనీ, మూకలు ఇంటిపై దాడి చేసి హత్యాకాండకు పాల్పడటం ‘ప్రతి చర్య’ అనీ మోడి అభివర్ణించారని జీ న్యూస్ తెలిపింది. గోద్రా రైలు దహనానికి ప్రతీకారంగానే ముస్లింలపై మారణకాండ జరిగిందని ‘చర్యకు ప్రతి చర్య ఉంటుందని’ మోడి అన్నారని జీ న్యూస్ తెలిపింది. తాను అన్నది అలా కాదని, తన మాటలను సందర్భం నుండి ఎత్తివేసి ఉల్లేఖించారని మోడి చెప్పుకున్నారు. ఆ విధంగా ‘అన్నది వాస్తవమే’ అని పరోక్షంగా చెప్పారు.
మోడి నిరాకరణ నిజం కాదని సిట్ నిర్ధారించింది. ‘చర్య – ప్రతిచర్య’ సిద్ధాంతాన్ని మోడి పేర్కొన్నది వాస్తవమే అని సిట్ నివేదికలో పేర్కొంది. ఈ విధంగా:
“In his interview, the chief minister has clearly referred to Jafri’s firing as ‘action’ and the massacre as ‘reaction’. It may be clarified here that in case late Ehsan Jafri fired at the mob, this could be an immediate provocation to the mob which had assembled there to take revenge of Godhra incidents from Muslims.”
అయినా గానీ మోడి పైన ఎలాంటి అభియోగం నమోదు కాలేదు. కాకుండా సిట్ జాగ్రత్త పడిందని వచ్చిన విమర్శలు గాలికి కొట్టుకుపోయాయి. మోడి వ్యాఖ్యలకూ, మూకల స్వైర విహారానికి మధ్య స్పష్టంగా కనిపిస్తున్న సంబంధాన్ని చూసేందుకు సిట్ గుడ్డిగా నిరాకరించిందన్న విశ్లేషకుల అభిప్రాయాలూ మాత్రం మిగిలాయి, ఎందుకూ కొరగాకుండా!
ఏయే మూలల నుండి, ఏయే తీరాల ఆవలి నుండి, ఏయే ప్రయోజనాల కోసం ఏయే శక్తులు తెరవెనుక పని చేసాయో తెలియదు గానీ ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’, ఆ “ఒక్కరిని” బైటపడవేసేందుకే కృషి చేసిందని సిట్ నివేదికను చదివిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆ విధంగా కంట్రోల్ రూముల్లో, ఆదేశాలిచ్చిన స్ధానాల్లో తిష్ట వేసిన అసలు దోషులు ‘అందలాలు’ ఎక్కితే, వారి ఆదేశాలు అమలు చేసిన మూకలు శిక్షలు అనుభవిస్తున్నాయి. మూకలకు శిక్ష పడటం వాంఛనీయమే కానీ, అసలు ఆదేశాలు ఇచ్చినవారికి శిక్ష పడనంత వరకు గుజరాత్ మారణకాండ మృతులకు, బాధితులకు ‘ముగింపు’ (క్లోజర్) భావనకు రావటం సాధ్యం కాదు.